22, ఏప్రిల్ 2018, ఆదివారం

మొదటి మరణం


ఫోటో ఆల్బం చూస్తున్న వసంత ఒక్కసారిగా త్రుల్లిపడింది.
ఆరెంజ్ పింక్ కలనేత బెనారస్ పట్టు చీర మోచేతి  దాకా తొడిగిన జాకెట్ తో అలంకరించినది అరువు నగలతో అయినా సహజమైన అందంతో పెళ్ళి కూతురిగా మెరిసిపోతూన్న హేమ ఫోటోని అబ్బురంగా చేతితో తడుముతూ యెంత బాగుంది యీమె అనుకుంది. దుర్మార్గుడు చేతిలో పడి పదునెనిమిదో యేటనే  అఘాయిత్యం చేసుకుందీ పిల్ల. పువ్వులా వుండే పిల్ల జీవితం అట్టా ఆగమాగం అయిపోయిన రోజులని గమనం చేసుకుంటూ ముప్పై రెండేళ్ళ కాలాన్ని గిర్రున్న యెనక్కి తిప్పేసింది.   
 ************
ఆ ఇంట్లో పిల్లనిస్తే  సుఖపడుద్ది. పైగా చెల్లెలికి కూతుళ్ళు కూడా లేకపోయే,బాగా చూసుకుంటుంది కూడా  అని తీర్మానించేసి పదిమంది బంధువులు కలిసి చెల్లెలి౦టికి పోయి  పూట పూటా యిందు భోజనాలు చేస్తూ .. అబ్బో యేమి పంట యేమి పంట ? నాలుగరకల సేద్యం, ట్రాక్టర్ బండి,స్కూటర్, పైగా పిల్లగాడు  కృష్ణ మంచి చదువు చదివి టవున్ లో వుజ్జోగం కూడా చేస్తావుండే! బావ కాళ్ళు యేళ్ళు పట్టుకుని అయినా సరే సంబందానికి వొప్పించాల్సిందే అని నాలుగు దినాలుండి అడిగినాటికన్నిటికీ తలూపి సంబంధం ఖాయం జేసికోస్తిరి.
హేమా ! మంచి సంబంధం. ఆడపిల్లనిచ్చేచోట అన్నీ బాగా చూసుకోమని చెప్పారు పెద్దోళ్ళు. అదృష్టం కొద్దీ అట్టాంటి సంబంధమే దొరికింది. వాళ్ళు పిల్లని చూసుకోవడానికి వచ్చారు రా ..పోదాం రా  అని క్లాస్ లో కూచున్న హేమని  తీసుకొచ్చి వాళ్ళ ముందు కూచోబెట్టింది పెదనాయన కూతురు కుమారి. వాళ్ళు  హేమని పరీచ్చగా చూసి పిల్ల నచ్చింది,  మంచిది చూసి లగ్గాలు పెట్టుకుందాం అని చెప్పేసి పోయాక "నేను పెళ్ళి చేసుకోను, బాగా చదువుకొని డాక్టర్ నవ్వాలని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే అంత చదువులు చదివిచ్చే వోపిక వుందా, మీ నాయన అన్నీ అప్పులు చేసుకుని కూర్చుని వుండాడు. నీ యెనక యింకో పిల్ల వుంది. నువ్వు మొండికేసుకు కూర్చుంటే యెట్టా, మీ అమ్మని చూడు వొకతూరి అని మందలిచ్చింది కుమారి. తల్లి వొంక చూసింది, గుడ్ల నీళ్ళు గుడ్ల కుక్కుకుంటూ తనేపే చూస్తున్న తల్లి, రోజూ తాగొచ్చి గొడవజేసే తండ్రిని గుర్తుచేసుకుంటూ సరే మరి అంది ఉదాసీనంగా .
హేమకి పిల్లాడిని చూపించకుండా, చూసాక పిల్లకి నచ్చకుండా ఈ పెళ్ళి చేయడానికి ఈల్లేదు అని రెండో మేనమామ  ప్రయాణమవుతూ తేల్చి చెప్పాడు.పువ్వంత మెత్తగా వుండే మేనకోడలికి సరైన జోడీ కాదనిపించింది ఆయనకీ.
"మనందరం చూడలేదా, పిల్లాడికి యేమి తక్కువ. అత్త ముగ్గురు కొడుకుల్లోనూ మధ్యనోడే చక్కనోడు" అని రూడీగా చెపుతూ "పిన్నమ్మ పుట్టింటాళ్ళకి మనేపాళ్ళు  యే౦ చేసినా వొంకలు పెట్టడమే సరిపోయే " అనేసరికి  "సరే మరి, మీ ఇష్టం " అనేసింది గాబరాగా, గొడవలు యిష్టం లేక.
 పెళ్ళి జరిగి మణుగునుపులుకి తన వూరికి పొయ్యోచ్చాక పెదనాయన కూతురు జయక్క అడిగింది. ఆ అమ్మాయి యెక్కడు౦న్డింది అని. ఏ అమ్మాయక్కా అని అడిగింది అమాయకంగా . అప్పుడు పెద్దమ్మ వైపుకి చూసి ఈ అమ్మికి సంగతి చెప్పాలా అంది. చిన్నాయనకి పిన్నమ్మకే చెప్పినాము. ఇప్పుడు తెలిసాక మేమ్మాత్రం యే౦ చేయగలం? ఆ అమ్మి రాత యెట్టుంటే అట్టా తెలారుద్ది. పీటల మీదకి వొచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే యెంత నామర్దా మాకు అని ముక్కు చీదుకుని గుండెల్లో బాధ కప్పెట్టుకుని ముఖాన గింత నవ్వు పులుమ్కుని పెళ్ళి అయిన్దనిపిస్తిరి.
అమ్మా! మీ వరుస యేమీ బాగాలేదు.  అమ్మికి చెప్పకుండా ఎట్టా చేస్తిరి. పెళ్ళికి వచ్చినోళ్ళందరూ యితనికి బంగారంలాంటి పిల్లని ఎట్టా ఇస్తున్నారని చెవులు కొరుక్కుంటిరంట గదా ! నేనుంటే ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు. ఆడపిల్లకాయల గొంతులు కోస్తన్నారు. అయినపొయినాళ్ళే ఇట్టా చేస్తే యెట్టబ్బా! అని వాళ్ళమ్మని కసురుకుంటూ "ఇదిగో హేమా మీ ఆయన పెళ్ళికి ముందే ఒకమ్మాయిని  లేవదీసుకుపోయి  ఆడేడో మునిపల్లెలో కాపురం పెట్టాడు. పెళ్ళి రేపనంగా కదా అతనిని  యెతికెతికి పట్టుకొచ్చింది. దానికి యిద్దరు బిడ్డలు కూడా వుండారు" అని చెప్పేసరికి పెళ్ళి పందిరికి వేసిన గుంజకి ఆనుకుని గుంజలా నిలబడిపోయింది హేమ.
 అమ్మానాయన   బిడ్డని పెళ్ళి పేరుతో  వూబిలోకి దించుతూ  విధిరాతని నెట్టేయడం యెనుక వున్న కారణమేందో యిట్టే గ్రహించేసింది.హేమకి పెళ్ళి కోసం బయలుదేరి వచ్చే రోజున జరిగిన సంగతి గమనం చేసుకోసాగింది. పెళ్ళికి రెండు  రోజులుందనంగానే హేమని తీసుకుని పెళ్ళి జరగబోతున్న వూరికి బయలు దేరారు. రైలు స్టేషన్ కి రిక్షా బండి  కట్టించుకుని వొస్తుంటే తండ్రికి బాకీ యిచ్చిన వడ్డీల వీరాస్వామి రిక్షా బండికి అడ్డం నిలుచుండి నా బాకీ తీరకుండా పిల్లకి పెళ్ళి ఎట్టా చేస్తారో చూస్తాను అని యాగీ చేసాడు.
వూళ్ళో పెద్దమనుషులు ఆడు ఆడి డబ్బులు పెట్టి చేస్తన్నాడా యే౦ది ? బంధువులాయన, పెళ్ళికొడుకు మేనమామ నా యింకో కూతురనుకుని మా యింటి ముందట ఆ నాలుగక్షింతలు వేయిస్తామంటే   పెళ్ళికి తరలి పోతున్నారు. ఇప్పుడిట్టా ఆపడం పద్దతి కాదు, ఆడి దగ్గర డబ్బే ఉంటే లగ్గాలు పెట్టుకున్న పెళ్ళి ఒకతూరి ఆగి పోయి వుండేదా ? మళ్ళీ సంవత్సరానికి కదేసిమెలేసి యెట్టాగొట్టా జరుగుతున్న పెళ్ళి, యిప్పుడైనా సక్రమంగా జరగనీయ్  అని నచ్చజెప్పపోయారు.
"అయ్యన్నీ నాకు తెలియదు. ఆయన భార్య పేరున వున్నవొకటిన్నర యెకరా కయ్యి నాకు బాకీ కింద జమ చేయిస్తానని హామీ యివ్వండి అప్పుడు పెళ్ళికి కదలనిస్తా అన్నాడు. పెళ్ళి అవగానే వచ్చీరావడంతోనే కయ్యి నీ పేరున రాసిస్తా. బిడ్డ పెళ్ళికి అడ్డం రాబాకయ్యా అని చేతులెత్తి దణ్ణం పెట్టింది రాజేశ్వరి. అంత  అగుమానం తట్టుకోలేక అందరి ముఖాలు నెత్తురు చుక్కలేకుండా తెల్లబడ్డాయి. అన్నట్టుగానే కూతురిని అల్లుడ్ని మూడు నిద్రలకి తీసుకెళ్ళిన మర్నాడే తాలూకాఫీసుకి పోయి వీరాస్వామి పేరున కయ్యి రాసిచ్చి వొచ్చి తెరిపిన పడింది.
    అత్తారింటికి వచ్చిన అల్లుడు కృష్ణ   అట్టా టౌన్ దాకా పోయి నా ఫ్రెండ్ ని కలిసి వొస్తా అని పోతుంటే తలూపింది హేమ. పోయే అల్లుడు కూతురి చేతి ఉంగరం అడిగి తీసుకుపోయాడని గమనించి నీ చేతి ఉంగరం యెందుకిచ్చావ్ అని తిట్టింది రాజేశ్వరి.  యియ్యకూడదని నాకేం తెలుసు అడిగాడు ఇచ్చేసా అంది హేమ. అట్టా పోయినల్లుడు మూడోనాటికి గానీ తిరిగి రాలేదు. కొత్తల్లుడుని చూద్దామని వచ్చినాల్లందరికి కొత్త ఉజ్జోగానికి ఇంటర్యూ ఉందంట. మెడ్రాస్ పోయినాడు అని చెప్పడం యెందుకో అర్ధమైపోయింది.  పుట్టింటాళ్ళు పెనిమిటి చేతులకి తొడిగిన  రెండు ఉంగరాలతో పాటు తన వుంగరం యేమై వుంటుందనే  సంగతి  గ్రహింపుకి వచ్చిందిపుడు హేమకి. పేరుకి మూడ్నిద్రలు జరిగాయి. కొత్త బిందె నిండా చలిపిండి పెట్టి హేమని అత్తారింటికి పంపిచ్చారు. పెళ్ళి అరుగు చూసి అత్తారింటికి పోవాలని చెబితే లగ్గం జరిగిన యింటికి వచ్చారు. తెల్లారే చెప్పా పెట్టకుండా హేమని అక్కడే వొదిలేసి ఇంటికి పోయాడు కృష్ణ. పెళ్ళికి ముందూ యెనకా జరిగిన సంగతులు గుర్తు తెచ్చుకుంటూ అట్టే నిలబడిన హేమ దగ్గరికి  అత్త  వొచ్చి యింటికి పిలుచుకుని పోయింది .
కొత్తకోడల్ని  చూసి పోయేదానికి వచ్చిన వాళ్ళ  గుసగుసలు  హేమ చెవిన పడతానే ఉండేయ్.
"నాగుబాములాంటి జడ, మప్పిదమైన పిల్ల. చూత్తేనే కడుపు నిండుద్ది. ఈ హెచ్చరకారికి ముంతలకొద్దీ తాగేతోడికి యెట్టా ఇచ్చారబ్బా”"ఆ నీల సంగతి తెలియదేమో,యెవురన్నా వుప్పందించకుండా  ఉంటారంటావా? వొదినా అని యింకొకరు."దగ్గిర బంధువులేనంట. అందుకే మరి బొక్క బోర్లా పడ్డారు బంగారంలాంటి పిల్ల గొంతు కోసేసినారు"
అంతగా ఆమెనిష్టపడినప్పుడు నన్నెందుకు చేసుకున్నావ్, ఆమెతోనే వుండొచ్చును కదా అని అడిగింది కృష్ణ ని .
"రంభని యెతుక్కుని యెతుక్కుని  తీసుకోస్తిరి. నువ్వుకూడా  నన్నే చేసుకుంటానని అన్నావంట కదా ! అంత యిష్టపడి చేసుకున్నప్పుడు నేను  యే౦చేసినా గమ్మున ఉండాలి, రచ్చలు రావెళ్ళు చేస్తే నా దగ్గర కుదరవు యిరగదీస్తా" అన్నాడు తర్జనగా వేలు చూపిస్తూ.
నాల్గు దినాలు జరిగాకా " మునిపల్లె పోయి రావాలి, మళ్ళీ వస్తానని జెప్పి ముఖం  చాటేసి వచ్చా. అది అక్కడ తినడానికి తిండి లేక యెన్ని అవస్థలు పడుతుందో, నీ చేతికి ఉన్న యింకో వుంగారం యియ్యి "అన్నాడు.
" నా దగ్గర లేదు. వస్తువలన్నీ తీసుకుని మీ అమ్మ బీరువాలో దాపెట్టింది"
రెండు రోజులు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ హేమపై కస్సు బుస్సులాడుతూ వుంటే జాలేసి  సూట్కేస్ లో  దాపెట్టుకున్న యెనిమిది వందలు తీసి యిచ్చింది. అత్తారింటికి పోయోస్తామని యింట్లో చెప్పి హేమ నొక్కదాన్నే  బస్ యెక్కించి నీల కాడికి పోయేదానికి  అటుపోయే రైలెక్కి నాక ఇటువచ్చే రైలు దిగింది ఆమె . మోజు తీరిందాకా వాడుకుని  అక్కడే వొదిలేసి వచ్చాడని అర్ధమయ్యి  వూరికి రావడానికి దారి ఖర్చులకి  కూడా లేకుంటే  మంచం కంచం అన్నీ అమ్ముకుని  వచ్చానని చెప్పుకుంటే యిరుగుపొరుగు కృష్ణ  పెళ్ళి చేసుకున్నాడని చెప్పి ఇక నీ బతుకు బస్టాండ్ లెక్కే నే అమ్మీ అని  యెగేసారు కూడా!  మద్దేనం పూట నీల  వొచ్చి    ఇంటి ముందరగా  వీధిలో నిలబడి  దుమ్మెత్తి పోస్తూ తిట్టి పోయిందని యింటి మాలతి చెప్పింది. మీ అత్త బయటకి కూడా రాలే, మీ ఆయన దాన్ని యేమన్నాడో తెలుసా ! నువ్వేమన్నా పత్తిత్తు ముండవంటే, పిల్లలు నాకే పుట్టారని గేరంటీ యే౦టి? వీధిలో రోలేసి పెట్టావు అందరూ పోటేసినట్టే నేను వొక పోటేసి పోయా " అన్నాడు. అది మీ ఆయన ముఖాన ఖాండ్రించి ఉమ్మేసి పోయింది" అని జరిగిన ఇషయాలన్నీ చెప్పింది.
  "నీల వొచ్చి తిట్టి పోయిందంట, నువ్వన్న  మాటలు కూడా యిన్నానులే, అసహ్యమేసింది" అంది హేమ.
"అది తిడితే నేను వూరుకుంటానేంటి, దాన్ని చంపి పారేయాలని దానింటికి వెళ్ళా. ముఖం మీద గోనె సంచి కప్పి వూపిరాడ కుండా చేసి చంపేద్దామనుకున్న, దానికి మెలుకువ వచ్చి కుదిరిచావల" అన్నాడు విసుగ్గా. అరికాళ్ళలో నుండి వొణుకు పుట్టుకొచ్చింది హేమకి. ఆడాళ్ళని హింస పెట్టకూడదు,వాళ్ళ ఉసురు తగులుద్ది,నీలని యేమి చేయబాకు ఆమె తిట్టిందంటే నీ తప్పు కూడా వుండబట్టే గా" అంది.  ఆ రాత్రంతా  పెద్దపులి  ప్రక్కన పడుకున్నట్టే వుండి చెమటలు పట్టుకొచ్చాయి.
 నాల్గున్నెల్లు  తిరిగొచ్చేసరికి  మొగుడు  యెట్టాంటాడో యెరికయింది హేమకి. అమ్మాయిలతో  సంబంధాలు కృష్ణ కి కొత్తేమి కాదు. ఇద్దరి బిడ్డల తల్లి నీల అయితేనేమి ఆమె కన్న ఒక బిడ్డకి తండ్రైతేనేమి ? అతన్ని చూడగానే రంగురంగుల పువ్వుల చుట్టూ జుయ్ మని  శబ్దం చేస్తూ తిరిగే తుమ్మెద గుర్తొస్తుంది.లచ్చిమి, కన్య, సంపూర్ణ, వసంత అందరూ పూలే.
దీపాల అమాస యెల్లినాక కూతురిని చూడటానికి వచ్చింది రాజేశ్వరి.  తల్లి కాడ తన గుండెల్లో  దాపెట్టుకున్న దుఃఖాన్ని యాష్టని బయటకి తోడిపోసింది  "మిమ్మల్ని పెళ్ళి చేయమని  నేనడిగానా, నా పాటికి నేను చదువుకుంటానే వుంటిని కదమ్మా! పోనీ మగపిల్లకాయలతో సావాసం జేసి ప్రేమా దోమా అని తిరుగుతూ మీకేమన్నా తలొ౦పులు తెచ్చానా ? గుండెల మీద కుంపటిని అనుకుని నిండా కాలే కొలిమిలోకి పారేసి పోయారు. ఇంతకన్నా పీక పిసికి చంపేయకపోయినారా"
బిడ్డమాటలకి తల్లి గుండె బ్రద్దలైపోయింది.తల్లీ అంటూ బిడ్డని కావిలిచ్చుకుని భోరున యేడిసేసింది. "నగలు పెట్టలేదని, రొక్కం యివ్వలేదని, పెళ్ళి చేయడానికి గతి లేదని యెన్నెన్నిమాటలు అంటా ఉండారో, మా అత్త కొడుకుని బయటకిపోనీయకుండా కాపలాలు కాసి రూమ్ కి బయట బీగాలు పెట్టి బలవంతంగా కాపరం చేయించాలని చూస్తది. రాత్రుళ్ళు బయటకి పోనీయలేదని చూడు నన్నెట్టా హింస పెడుతున్నాడో" అని తల్లికి చేతులు ముందుకి జాచి చూపెట్టింది. ముంజేతి బొమికలపై పచ్చగా నెత్తురు గూడు కట్టుకున్ననరాలు, గుండెలపై యెర్రగా నల్లగా కదుములు. హేమ అడిగే  ఒకో మాటకి  ఆమె అత్తకి  బాకులు గుచ్చినట్టు అనిపిస్తే తల్లి మాత్రం కదిలి కదిలి  కన్నీరైంది.
"ఏం వొదినా , అయినపోయినదానివని, బిడ్డని బాగా చూసుకుంటారని నీ యింటో బిడ్డని యిస్తే  ఇట్టా  చేయడానికి మనసెట్ట వొప్పుతుంది? యిస్తానంత కాకపోయినా అందులో సగమైనా రెండెకరాల కయ్యి అమ్మి పేరున రాసిస్తిమి గందా, ఏందో మీ తమ్ముడు నష్టాల పాలై బిడ్డకి నగానట్రా పెట్టలేకపోయినాం కానీ యిచ్చేయన్నీ యిస్తిమి కందా !అసలు  అన్నీ బాగుంటే పిల్లని మీకెందుకు యిచ్చేటోళ్ళం. బాగా సదివిచ్చి మంచి పిల్లగాడికి యిచ్చి వుండేవాల్లమి"   అంది ఉక్రోషంగా.
"బిడ్డలు మంచి వాళ్ళుగా ఉండేది తల్లిదండ్రి సేతుల్లోనూ, మొగుడు మంచోడు అనిపిచ్చుకునేది పెళ్ళాం సేతుల్లోనూ వుండే పనైతే యియన్నీ యె౦దుకుంటై మరదలా ! అన్నట్టు నీ నగలన్నీ మా తమ్ముడు  వుంచుకున్నవాళ్ళ వొంటిపై కులుకుతా వుంటాయని, రోజూ తాగొచ్చి రచ్చ చేస్తాడని మన బంధువులే చెబుతావుండారు , యింటికొకళ్ళు వుంటారు యిట్టాంటి వ్యసనపరులు. ఆడాళ్ళు రాత యింతే అని సర్దుకోవాలి, నువ్వు సర్దుకోవట్లా" మాటకి మాట వొప్పజెప్పి ఆడ నుంచి లెగిసిపోయింది.
 "చూసావా, గురువెంద నలుపు యెరగదు అన్నట్టు దెప్పిపొడిచింది. నేనడిగింది యేమిటి ఆమె అనింది యేమిటీ ? ఇంత అన్యాయంగా మాట్లాడే ఆడమనిషిని నేనేడా చూడలా "
"ఎన్ని బాధలైనా పడతాకానీ మొగుడితో గొడవపడి పుట్టింటికి రాను లేమ్మా, యెనకాల చెల్లెలు కూడా వుంది  పెళ్ళికి.చిన్నతనం నుండి నిను చూస్తూనే వుండానుగా,నీకుమల్లేనే వోర్సుకుంటాలే" అంది కన్నీళ్ళతో. పెళ్లైన ఆరుమాసాలకే కూతురు యింత యెదిగిపోయిందా పేరుతో సహా మారిపోయిందా  అన్నట్టు చూసి అసలు ఆడోళ్ళకి  మూడొంతులు కష్టాలన్నీపెళ్ళితోనే మొదలు గదా అనుకునింది మనసులో. ప్రయాణమై పోతూ అల్లుడితో "అమ్మి ని బాగా చూసుకోయ్యా" అని మాత్రమే అనగల్గింది.
బంధువుల యింటిలో పెళ్ళికని యింటో అందరూ బయలెల్లి పొతే కృష్ణ హేమ మాత్రం యింట్లో ఉండారు ఆరోజు. తెల్లారి మసక చీకటిలో  పాలు పిండుతూ ఉండగానే మొగుడు కాళ్ళు కడిగి ఇంటిలోనికి  వెళ్ళడం గమనించింది.చాకలోళ్ళ లక్ష్మయ్య  రావడం కనబడింది. దూడనిప్పి పాలబిందె తెచ్చి వరండా అరుగుమీద పెట్టి కాళ్లుచేతులు కడుక్కోవడానికి పంపుకాడికి పోయింది హేమ.  ఇంటో మైలు పెట్టెలో వున్న బట్టలెయ్యమ్మా! కరెంటు పోయ్యేలోపు అన్నీ వుతికేసి మోటార్ కాడ జాడిచ్చేయాలి. కరెంట్ గనక పొతే  పంపులో నీళ్ళు కొట్టి జాడించడం నా వల్ల కాదు.పెద్దామె ఒకో గుడ్డని మూడుసార్లు జాడిచ్చమంటది అనుకుంటూ  బాత్ రూమ్లో గుడ్డలు తెచ్చుకోను పోయాడు. హేమ లోనికి వచ్చి మంచం పై పడుకున్న భర్త దగ్గరగా వచ్చి 'కాఫీ యియ్యనా " అని అడిగింది. వూ అన్నాడు కళ్ళ మీదకి కప్పుకున్న దుప్పటిని తీయకుండానే.
కుంపటిపై పాలు పెట్టి మైలు పెట్టెలో వేసి ఉంచిన బట్టలన్నీ తీసి వేస్తూ జాగ్రత్తగా లెక్కపెట్టుకుంది.  వాటిని మడుచుకుంటూ  "యేమ్మా వొకేసారి మూడు కొత్తచీరలు యేసి పెట్టావు " యాడికైనా పోయినావా యేమిటీ అన్నాడు.  కొత్త చీరలేంటి అంది  హేమ అర్ధం కాక. అదేనమ్మా బాత్ రూమ్లో  తీగ మీద వేసి వుంచినావు గందా, ఆ చీరలు సంగతి అడుగుతుండా ! ఆటిని నన్ను వుతకమంటావా వద్దంటావా, మీరే వుతుక్కునే పనైతే మూటలో కట్టుకోకుండా ఆడనే పడేసి పోతా అన్నాడు. ఆ చీరలు ఇటు పట్రా, చూడనిదే నేను వుతుక్కునేయా నీకేసేయా అని  యెట్టా చెప్పేది అంది. ఇయిగో ఈ చీరలు అంటూ తీసుకొచ్చి కుంపటికి యివతలగా   హేమ ముందు పడేసాడు లక్ష్మయ్య. వాటిని చూడగానే మనసులో సవాలక్ష సందేహాలు పుట్టుకొచ్చాయి ఆమెకి.  ఏమి సమాధానం చెప్పాల్నో తోచక  ఈ కాఫీ తాగు, ఈ లోపు  దుప్పట్లు, దిండు గలీబులు తెచ్చి పడేస్తా అంటూ కాఫీ తీసుకుని లోపలికి పోయింది.
కాఫీ గ్లాస్ చేతికిచ్చి  "ఏం బావా ! చీరలు పట్టుకుపోతివి,మళ్ళీ వెనక్కి తెస్తివి, యేమైంది" అని అడిగింది.
ఆ అమ్మికి నచ్చలేదంట, ఈ సారి ఎప్పుడైనా కొత్త చీరలు తీసియ్యి  అనింది, అందుకే వెనక్కి తెచ్చేసా ! అన్నాడు.
అయ్యి కొత్త చీరలే గందా ! పెళ్ళికి కొన్న చీరలే ! అందులో వొక చీర యిప్పటికి కట్టలేదు కూడా '' అనంటూ తను కప్పుకున్న దుప్పటి దిండు గలీబు తీసుకెళ్ళి లక్ష్మయ్య కిచ్చి ఆ చీరలు కూడా ఉతికేయి పో  అన్జెప్పి కాఫీ గ్లాస్ తెచ్చుకుని భర్త ముందు కూర్చుని "ఇయ్యి ఇయ్యి అన్నావ్,  ఇయ్యకుంటే ఇచ్చే మనసు లేదని తుస్కారంగా మాటలు, తీరా ఇచ్చాక మళ్ళీ వెనక్కి తెచ్చావ్, యేమీ, ఆ దొరసానికి యీ కొత్త చీరలు అంత తీసిపారేసినవిగా కనబడినాయా? " అంది ఉక్రోషంగా.
 " పొద్దున్నే మొదలు పెట్టింది నస. ఇదొక రాణి, దీనికి  పుట్టింటోళ్ళు పెట్టిన  నాలుగు పెట్టెల కోకల్లోంచి దయతలచి ఇచ్చినట్టు కోతలు కోస్తా వుండావ్. మేము కొన్న చీరల్లో నుంచేగా నువ్విచ్చింది " వెటకారంగా అన్నాడు లేచి  వెళుతూ.  చప్పున  కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి హేమకి. "మీరు పెట్టిన చీరలని,నాకు నచ్చనివని  ఆమెకి ఆ చీరలు  ఇవ్వలేదు. నువ్వే  బీరువా తెరిచి  మడతల్లో పెట్టినవన్నీ కెలికి కావాల్సినవి యేరుకుని పోయావు, ఇంకెప్పుడూ  మా వాళ్ళనేమీ అనకు . అంతకు తిండికి గతిలేక నీకేమీ పిల్లనీయలా " అంది రోషంగా
"మరి మహా రోషగత్తె వయ్యే నువ్వు. నీల కూడా అంది  " నేను ఇడిసిపెట్టిన యెంగిలి మనిషికి ఆశ పడి వచ్చిన మనిషి నీ పెళ్ళాం.  యెంగిలి కూడు ఆమె తింటుందేమో కానీ ఆమె కట్టి  ఇడిసేసిన చీరలు నేను కట్టను  అని యిసిరికోట్టింది" అన్నాడు. పక్క దులిపేస్తున్న హేమ  చేతిలో దుప్పటి అలాగే జారిపోయింది.
అయిదు నిమిషాలు గడిచాక లక్ష్మయ్య వచ్చి అమ్మా ! సబ్బు అయిపొయింది,  మంచి సబ్బు ఇయ్యమ్మా కొత్త చీరల్నిండా బురద మరకలు కూడా ఉండాయి. అట్టాగే ఆ చేత్తో గంజి కూడా ఉడకపెట్టి ఉంచు. నేను బిన్నా పోవాలి అంటూ గుమ్మం ముందు నిలబడ్డాడు. లోపల్నుంచి సమాధానం లేదు. టప్ మని యేదో పడిన చప్పుడు యినబడి హేమమ్మా  పలకవేంటి తల్లీ ! అంటూ వరండాలోకి వెళ్లి హాలు లోపలికి తొంగి చూసాడు. తెరిచిన తలుపుల్లో నుంచి ప్యాన్ కి వేలాడుతున్న హేమ శరీరం కనబడి"ఓయమ్మో  బిడ్డ వురేసుకుంది" అని గట్టిగా అరిచి వీధిలోకి ఒక్క గెంతు గెంతి  "నాయుడోళ్ళ కోడలు ఉరేసుకుంది. చప్పున రండి" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హేమ రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని  వూపిరి ఉన్నట్టా లేనట్టా  అని కన్నీళ్ళతో చూస్తూ నిలబడ్డాడు.
**************
అమ్మా !  పెళ్ళి ఫోటోలు చూసుకుంటున్నావా ? యేదీ నన్ను చూడనీ అని కొడుకు అంటుంటే ఉలికిపడి బయటపడింది వసంత. కుర్చీ జరుపుకుని తల్లి కెదురుగా కూర్చుని  తన భార్యతో చెపుతున్నాడు "మా అమ్మని జూడు పెళ్లప్పుడెంత బాగుందో ఓల్డ్ హీరోయిన్ లెక్క న." అని.

(మనం మకుటం ఆదివారం సంచికలో ప్రచురితం 22/04/2018) 






2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

కథ బాగుందండీ. మంచి మాండలికం వాడారు సందర్భోచితంగా.

కథలో‌ ప్రథానకాలం ముఫైరెండేళ్ళ క్రిందటిది అని చెప్పారు. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఇంకా దారుణాతిదారుణంగా ఉందని అనిపిస్తోంది స్త్రీల సంబంధించిన మంచిచెడ్డల విషయాల్లో. పేపర్లలో టీవీల్లో‌ వార్తలంటే‌నే భయపడే‌ పరిస్థితి.

శిశిర చెప్పారు...

హ్మ్. ఎన్ని జీవితాల్ని చదివుంటే ఇలా రాయగలరూ.