18, జూన్ 2012, సోమవారం

కాళ్ళ చెప్పు కరుస్తాది

ఇరవయ్యి రోజులపాటు ఉత్తరభారత దేశ  తీర్ధయాత్రలు చేసి  ఆ రోజే ఇంటికి తిరిగి వచ్చారు సుగుణమ్మ.
ఆమెనింటికీ తీసుకురావడానికి రైల్వే స్టేషన్ వరకు ఎదురెళ్ళలేదు కాని తిరిగి తిరిగి వచ్చిన ఆమెకి ఏ పని భారము మోపకుండా కాస్త విశ్రాంతినిచ్చి ప్రయాణాల అలసటని తీర్చుకోనిచ్చేద్దాం అనుకుంది కోడలు.

ఇంట్లోకి అడుగు పెడుతూనే హాల్లో ఆమెకి కనిపించిది ఓ పెద్ద పనస కాయ.

ఒక దుప్పటిని ఎక్కువ మడతలు వేసి నేల తగలకుండా జాగ్రత్తగా పెట్టారే  అనుకుని "పనసకాయ ఎక్కడిది.? కొన్నారా? ఎంత తీసుకున్నారు " అడిగింది కోడలు హేమ ని .

"కొనలేదు అత్తయ్య గారు ..సురేష్ వచ్చాడు, వాడు తెచ్చాడు." చెప్పింది హేమ.

"సురేషా !? ఎవరు వాడు?"  అడిగింది..గుర్తుకు రానట్లు,

"అదేనండీ.. మన ఇంట్లో పని చేసేవాడే..ఆ సురేష్.." అని చెప్పింది హేమ.

"వాడా..దిబ్బాడా? వాడెప్పుడు వచ్చాడు? ఎంత పెద్ద పనస కాయ తెచ్చాడు? మన చేలో చెట్టుకి  కాసిన కాయా..? " ఆశ్చర్యంగా అడిగింది.

"అవునంట అత్తయ్యగారు. మొన్న మదర్స్ డే రోజు వచ్చాడు.ఓ..రెండు గంటలు కూర్చుని వెళ్ళిపోయాడు. పెద్దామె  .. ఉంటే బాగుండేది..ఆమెని చూసి చాలా ఏళ్లయిందని చాలాసార్లు అనుకున్నాడు కూడా "  చెప్పింది హేమ.

"అవునా..!" అంటూ  మొహం చేటంత చేసుకుందావిడ.

"ఎంతైనా అక్కడ వాళ్ళందరికీ మనమంటే చాలా అభిమానం" ..అని చెప్పిఅంతలోనే  "ఇటువైపు ఎందుకొచ్చాడంట దిబ్బోడు? అంది ఆరాగా.

"వాడిప్పుడు కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడంట. వాడు పని చేసే ట్రావెల్ ఏజన్సీ నుండి బాడుగకి ఒక కారు ఈ టౌన్ కి వచ్చిందట. ఆ రోజు మద్రాస్ కి పోవాల్సి ఉన్నా కూడా ఆ డ్యూటీకి నేను వెళతానని సురేష్ ఇటువైపు వచ్చాడట. వాడిప్పుడు ..ఎంత దర్జాగా ఉన్నాడో! చక్కటి మాట తీరు ..చూస్తే వాడెక్కడో..మారు మూల పుట్టి పెరిగాడనుకోరు." అంది హేమ.

"అంతేగా మరి ప్రపంచం చూస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయో! ఈ ఇరవయ్యి రోజులు తిరిగితేనే  నాకు బోలెడు తెలిసింది అట్టాంటిది వాడు రోజు ఊర్లేమ్మట తిరుగుతుంటే ఎందుకు నేర్చుకోడు" అంది.

 మళ్ళీ మాటాడుతూ "మన వూర్లో అందరు బాగున్నారటనా!? ఏం కబుర్లు చెప్పాడు దిబ్బోడు? "అడిగింది.

"మీరు వాడినింకా "దిబ్బోడు" అనడం మానరా? వాడు వింటే ఇప్పుడింకా బాధపడతాడు.." చెప్పింది.

"చచ్చాడులే!ఎలా పిలిస్తే ఏమైంది? వాళ్ళు లేబరోళ్ళు, లేబర్ ని లేబర్ గానే చూడాలి, నెత్తి కెక్కించు కోకూడదు " అని విసురుగా అంది.

"ఇక్కడంటే అన్నారు గాని  ఇంకెక్కడైనా  ఇప్పుడు మీరన్న మాటని నలుగురిలో అన్నారనుకోండి.చాలా ఇబ్బందులు వస్తాయి "..అని భయం ప్రదర్శించింది.

"ఎందుకనను! ఎక్కడైనా, ఎప్పుడైనా అంటాను " అంది డంకా మోయిన్చినట్లు.

అత్త గారిని మార్చడం నావల్ల కాదని మనసులో అనుకుని "సరే స్నానం చేసి రండి. భోజనం చేసి కాసేపు పడుకుంటే బాగుంటుంది మీకు  " అంది

భోజనం తిన్నాక అత్తగారిని కాసేపు పడుకోమని చెప్పి ..ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చుంది.

ఆ సాయంత్రం పనసకాయని బయటకు జేర్చి ..పదునైన చాకుకి నూనె పట్టించి పనస కాయని కోసి తొనలు తీసి ఓ..గిన్నెలో వేస్తూ సురేష్ ని గుర్తు చేసుకుంది.

అప్పుడు వాడికప్పుడు పదేళ్ళ వయసు . హేమ వాళ్ళింట్లో పనికి కుదిరాడు. మూడవ తరగతి చదువయిపోయిన తర్వాత సెలవల తర్వాత వచ్చిన ఏరువాక పౌర్ణమికి పనికి వచ్చాడు.

వాడిని చూసి వీడు.. మరీ చిన్న పిల్లవాడు. తమ ఇంట్లో పని చేయ గలడా!? అనుకుంది. అయినా పాపం చదువు మానిపించి పనిలో పెట్టడం ఏమిటీ ? అని అనుకుంది.   అంతా చిన్న వాడు పని చేయడం హేమకి నచ్చలేదు.

వాడిని ఏం పేరు..అడిగింది ..హేమ.. "సురేష్..అమ్మా..! చెప్పాడు. చిన్న చిన్న పనులు చెప్పడం మినహా వాడికి పెద్ద పెద్ద పనులు చెప్పడం నచ్చేది కాదు. వాడు మాత్రం పశువులకి నీళ్ళు పెట్టడం, మేత వేయడం, పేడ దీయడం తో పాటు.వాకిళ్ళు ఊడ్చి కల్లాపు చల్లడం,పంపు కొట్టి  తొట్లలో నీళ్ళు నింపడం,అంట్లు తోమడం పనులుతో పాటు ఆ పనులు అయ్యాక .. పచ్చి గడ్డి కోయడం కూడా చేయాల్సి వచ్చేది.అలా పోద్దస్తమాను పనులు చేయడంతో పాటు..రాత్రి ఎనిమిది తొమ్మిది దాక ఉండి..ఇంట్లో మగ వాళ్ళందరికీ పొయ్యి పై నీళ్ళు కాసి బకెట్లతో నీళ్ళు తోడి బాత్ రూమ్లలో పెట్టడం కూడా వాడి వంతే !

పాపం చిన్న బిడ్డ! వాడికి ఎంత పని భారం అనుకునేది. వాడికి పని సాయం చేస్తుంటే.. పని వాళ్ళని పని చేయనీయకుండా "ఇదే సగం పని చేసి వాళ్ళని పని చేయనీయకుండా నేర్పుతుంది" ఇంకెందుకు అన్ని పనులు నువ్వే చేయి..వాడిని పనిలో నుండి తీసి పారేస్తే సరి" అంటూ  భర్త,అత్తా గారు కలసి మాటలాడుకునే వాళ్ళు.

"మన బిడ్డ మీద ఒక అయిదారేళ్ళు పెద్ద. పాపం వాడు అన్ని పనులు చేయడం కష్టం కదూ!" అనేది.

సురేష్ ని అందరు "దిబ్బోడా" అని పిలిచే వాళ్ళు. ఆ పేరు తో పిలిచి నప్పుడల్లా వాడికి కోపం వస్తున్నట్లు తోచేది. వాడికి సురేష్ అని పేరు ఉంది. అయినా ఎవరు ఆ పేరు తో పిలిచే వాళ్ళు కాదు.

వాళ్ళ అమ్మకి అయిదుగురు కొడుకులు.సురేష్ మూడవవాడు.వాడి పుట్టుకప్పుడు..వాడి అమ్మ నొప్పులు పడుతూ బహిర్భూమికి వెళ్లాలని బయటకి వచ్చి ఎరువు దిబ్బ దగ్గరకి వెళ్ళేటప్పటికి ..అక్కడే వాడు పుట్టడం వల్ల వాడికి దిబ్బాడు అన్న పేరు స్థిరపడిపోయింది. స్కూల్ లో వేసిన తర్వాత అటెండెన్స్ పిలిచే టప్పుడు అయ్యవారు వాడిని పేరుతొ పిలవడం,లేదా వాడితో మాట్లాడే టప్పుడు పేరు వాడటం వాడికి పరమానందంగా ఉండేది.

ఇప్పుడు హేమ కూడా వాడిని దిబ్బోడా.. అని పిలవకుండా సురేష్..అని పిలవడం చేస్తుంటే..ఆ పిలుపు విన్నప్పుడల్లా వాడి కళ్ళల్లో కాంతులు కనబడేవి హేమకి.

తన నాలుగేళ్ల కొడుకు కూడా తమ ఇంట్లో అందరిలా వాడిని దిబ్బోడా అని పిలవడం చేస్తుంటే.."తప్పు వాడిని అలా పిలవకూడదు. వాడి పేరు సురేష్.. నువ్వు వాడిని సురేష్ అని పిలవాలి" అని చెప్పేది.

రాత్రి ఏడు గంటలవుతున్నప్పుడు కథల పుస్తకాలు,బొమ్మల పుస్తకాలు కొడుకు ముందు పరచి తనకి చదువు నేర్పుతుంటే సురేష్ ఆసక్తిగా చూసేవాడు. వాడికి నాలగవ తరగతి పుస్తకాలు తెప్పించి ..చదువుకోమని చెప్పేది. వాడు ఆ పుస్తకాలు చదవడం మానేసి చిన్న బాబుకి చెప్పే రైమ్స్,కథలు ఆసక్తిగా వినేవాడు.

స్కూళ్ళు తెరిచే రోజులు వచ్చేసాక ..ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఉన్న ఒకే ఒక అయ్యవారు.. ఇంటింటికి తిరిగి పాత వాళ్ళని బడికి రమ్మని పిలవడం, కొత్త వాళ్ళని చేర్చడం తో పాటు.. రోజు బడికి రాని వాళ్ళని వెదుక్కుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం బడికి రాని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి..పిల్లలని సరిగా పంపి చదువుకోనివ్వమని హిత బోధ చెయ్యడం చేసేవారు.

ఆయనలో మంచితనం, బాధ్యత తో కూడిన ఉద్యోగ నిర్వహణ చూసి ఆ అయ్యోరంటే హేమకి చాలా గౌరవం ఉండేది.

"ఏం సార్.. ఓపికగా వూర్లో పిల్లకాయల్ని వెదికి  వెదికి బడికి తోలుకుని పోతా ఉండారు.." అనేది హేమ.

"అమ్మా! ఈ మాత్రం అయినా పిల్లల వెంటబడి చదువు చెప్ప కుంటే ఈళ్ళ బతుకులు మారేదేట్టాగా తల్లీ.. తీసుకునే జీతం రాళ్ళకి న్యాయం చేయడమే కాదు..అజ్ఞానాన్ని తరిమేయడం కోసరం మన వంతు మనం ఏమైనా చేయాలి కదమ్మా.." అనేవారు.

మారు మాట్టాడకుండా నమస్కారం పెట్టి తలవంచి అభివాదం చేసింది హేమ.

"సురేష్ ని కూడా బడికి తీసుకుపోండి సార్.." అని చెప్పింది.

"నేను చెప్పి చూసాను హేమమ్మా.. అందుకు వాళ్ళ అమ్మ ఇట్టా చెప్పింది "అయ్యవారు.. వాడు పనికి పోకపోతే వాడి కూడు పెట్టె పరిస్థితి  మా ఇంట లేదయ్యా. మా ఆయన ఏ పని పాట చేయకుండా సోమరిగా మంచాన్ని అంటిపెట్టుకుని పడుకుంటే నేనేడ తెచ్చిపెట్టేది!? ఏటా బాలింతని..చూలింతని..అని చెప్పిందమ్మా ! ఇంక మాట్లాడే దానికి ఇషయం ఏముందమ్మా ! కనీసం ఇకనైనా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిచుకునేందుకు అయినా ఒప్పించినా నయం. కడుపుకింత కూడు,ఒంటికి ఇంత గుడ్డ, ఆలోచించడానికి నాలుగచ్చరాలు లేని సంతతిని దేశం మోసే పరిస్థితులు నుండి కాపాడిన వాళ్ళమయినా అవుతాం "అని చెప్పారు..

చాలా కాలం వరకు ఆ అయ్యోరు చెప్పిన మాటలే గుర్తొచ్చేవి హేమకి.

డ్రాప్ ఔట్స్ ఎందుకు ఉంటున్నారో.. తెలిసి కూడా ఏ విధమైన చర్యలు చేప్పట్టలేని ఆసక్తతకి బాధ కల్గేది. పేరుకి  మాత్రమే ఉన్న విద్యా కమిటీల తీరు తెన్నులు ఏ పాటివో కూడా తెలుసు. మన వంతు మనం ఏం చేస్తున్నాం ? అని ప్రశ్నించుకునేది. 


తమ ఇంట్లో అందరు చదువుకున్న వాళ్ళే! పదేళ్ళు ఉన్న పసి వాడిని పనికి పెట్టుకోకూడదు, పెట్టుకున్నా వాడి చేత అడ్డమైన చాకిరి చేయించకూడదన్న ఇంగిత జ్ఞానం లేనందుకు బాధపడేది. . .

పదేళ్ళు కూడా నిండని సురేష్ చదువుని పని రాక్షసి మింగేస్తునా ఎదురు చెప్పలేని ఇల్లాలితనం హేమది. కనీసం వాడి చదువుకి బ్రేక్ పడకుండా ఉండాలని చూసేది.

రాత్రి పూట అందరూ టీవి చూస్తుంటే వాడి దృష్టి టీవి మీదకి మళ్ళ కుండా నాలుగవ తరగతి పుస్తకాలు చదవించాలని విఫల ప్రయత్నం చేసేది.

వాడు పుస్తకాలు ముందేసుకుని మూసుకు పోతున్న కళ్ళని బలవంతంగా తెరుచుకుంటూ.. చదువుతూ ఆలాగే పడి నిద్ర పోయే వాడు. రాత్రి తొమ్మిదవుతుండగా సురేష్ తండ్రి వచ్చి వాడిని నిద్ర నుండి లేవదీసుకుని పోయేవాడు.ఒకోసారి అక్కడే వదిలేసి పోయేవాడు.

హేమ అత్తగారయితే..వాడు అక్కడే పడి నిదరపోయినా మరుసటి రోజు పనిలోకి ఆలస్యం కాకుండా ఉదయాన్నే పని చేయడం మొదలెడతాడు కదా అని చూసి చూడనట్టు ఊరుకునేది.

ఒకోసారి వాడు హాల్లో అలా నిద్రపోతుంటే నడిచేటప్పుడు కాళ్ళకి అడ్డుపడుతున్నాడని వాడిని కాలితో తట్టి లేపేది. అది చూసి హేమకి చాలా కోపం ముంచుకోచ్చేది వాడు ఏమన్నా పశువా.. లేదా ప్రాణం లేని బండా? కాలికి అడ్డం వచ్చిందని కాలితో తన్ని పక్కన తోయడానికి అనుకునేది. ఆడవాళ్ళలో సున్నిత హృదయం ఉంటుందంటారు. నలుగురు బిడ్డలని కన్న తల్లి. వేరొక బిడ్డని కాలితో తన్నే కరకుతనం ఈమెకి ఎలా వచ్చిందోనని  ఆశ్చర్యం,అసహ్యం రెండు కల్గేవి హేమకి. మనిషి తనం, మనసు తనం లోపించి..కరకురాతి గుండె  అత్త గారిది అనుకుంది  


ఆమెని చూసో లేక వాళ్ళ ఇంట నిమ్న కులస్థుల పట్ల అలాటి వివక్ష ఉండేదో..కాని ఇంట్లో అత్తగారు ఆమె కొడుకులు అలాగే ప్రవర్తించే వాళ్ళు. హేమ భర్తతో పోట్లాడేది. నోటితో చేసే పనికి మీరు కాళ్ళు ఉపయోగిస్తారు అది ఎంత తప్పో మీకు తెలియదా? అని అడిగేసేది.

"అవును మరి మీ ఇళ్ళల్లోలా పని చేసేవాళ్ళని పిన్నమ్మా అని, అత్తా అని పిలిచే అలవాటు మాకు లేదు"  అని ఎగతాళి చేసేవాడు భర్త.

హేమ వాళ్ళ పుట్టింట్లో..బట్టలుతికే చాకలమ్మని పిన్నమ్మా అని పిలవడం,పక్కింటి గౌడ కులస్థులామెని అత్తా అని పిలవడం అలవాటుగా ఉండేది. తమకన్నా పెద్దవాళ్ళని పేర్లతో పిలవలేక వరసలు పెట్టి పిలవడం చేసే వాళ్ళు అది చాలా పల్లెల్లో అలవాటు కూడా. ఆ విషయాన్ని పోల్చి చెప్పి ఎగతాళి చేస్తున్నారని అర్ధమై వాళ్ళతో వాదించడం దండుగ అనుకుని మౌనంగా ఊరుకునేది.

హేమ కొడుకు దిబ్బోడా ..అని పిలుస్తుంటే తప్పని ఒక్క సారి చెప్పింది .మళ్ళీ ఎప్పుడు అలా పిలవనే లేదు. 


తల్లి ఏది నేర్పితే పిల్లలు అదే నేర్చుకునే తీరతారు.తమ మాట విన్నా వినకపోయినా మంచి మాట చెప్పడమయినా చేయక పొతే ఎలా? తల్లికి ఏం తెలుసు, తల్లి చెపితే పిల్లలు వింటారా అనుకుంటే ఎలా..? పిల్లలకి  మంచి చెడు వివరించి చెప్పడం తల్లి యొక్క భాద్యత మొక్కగా ఉన్నప్పుడే వంచే ప్రయత్నం చేయలేదు కాబట్టే తన భర్త కాళ్ళతో ముఖం పై కొట్టి తన వికృత్వాన్ని ప్రదర్శించేవాడు. ఇదంతా అహంకారం కాక ఇంకేమిటి తల్లికి తగ్గ తనయులు అనుకునేది.

ఇక సుగుణమ్మ అయితే అంట్లు శుభ్రంగా తోమలేదని,వాకిలి శుభ్రంగా చిమ్మలేదని వాడిని తిట్టిపోసేది. గిన్నెలు విసిరి కొట్టి మళ్ళీ చేసిన పనినే చేయించేది. చద్దన్నం,పచ్చడి మాత్రమే వాడికి ఎల్లప్పుడూ వేసేది. హేమ వాడికి అన్నం పెట్టినప్పుడు మాత్రం ఇంట్లో చేసినవి అన్ని వేసి కడుపు నిండా భోజనం పెట్టేది. అది గమనించి "నువ్వుసలు వాడికి అన్నం పెట్టబాకు"  అని కసిరేది. కొడుకుకి పిర్యాదు చేసేది. ఒరేయ్ అబ్బాయి.. లేబర్ వాళ్ళని నెత్తికి ఎక్కించుకోవద్దని నీ పెళ్ళాం కి చెప్పు. అప్పుడకది.. బాగా పెట్టేది..నేను పెట్టకుండా మాడ్చేదాన్ని అయ్యానా..! అని సాధించి పెట్టేది.

హేమ అవన్నీ పట్టించుకునేది కాదు. అలా నాలుగేళ్ళు పాలేరుగా పని చేసి.. తర్వాత సురేష్ రావడం మానేసాడు.

హేమకి తెలుసు సురేష్ తండ్రి తను చేసిన అప్పు తీర్చడం కోసం వేరే చోట ఎక్కువ జీతానికి పనికి కుదిర్చాడని.. పోన్లే!వాడికి కొత్త చోటులో కాస్త పని భారం అయినా తగ్గుతుంది..అనుకుంది.

ఆ తర్వాత ఒక ఏడాదికి అక్కడి నుండి వేరొక చోటుకి హేమ వాళ్ళు దూరంగా వచ్చేసారు.

అప్పుడప్పుడు ఎవరి ద్వారా నయినా పల్లెలో కబుర్లు తెలుస్తూ ఉండేవి. సురేష్ ఇళ్ళలో పాలేరు పనులు చేయడం మానేసి ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడని ..నెమ్మది నెమ్మదిగా కారు డ్రైవర్ గా మారాడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో.. సంతోషంగా ఉన్నాడని

ఒక రోజు ఇంటి అడ్రస్స్ వెదుక్కుని మరీ వచ్చాడు సురేష్. వాడిని చూసి హేమకి చాలా సంతోషం కల్గింది.
ఒరేయ్..ఎంత ఎదిగి పోయావురా..? నాకు నిన్న మొన్నటి సురేష్ లాగానే ఉన్నావంటూ వాడిని ఆత్మీయంగా భుజం మీద చరచి తన సంతోషాన్ని ప్రకటించింది.

"అమ్మా.. చాన్నాళ్ళ నుండి రావాలనుకుంటున్నాను. ఇదిగో ఇప్పటికి కుదిరింది. అబ్బయ్య బాగున్నాడమ్మా! నాయుడెక్కడి వెళ్ళాడు? పెద్దామె ఏది? కనబడలేదు  అంటూ వరుస ప్రశ్నలు.

"అన్ని ప్రశ్నలు ఒకేసారికి అడుగుతా ఉంటే.. నేను జవాబు చెప్పేది ఎట్టాగురా..!? నువ్వేమి మారలేదు "అంటూ నవ్వి " అందరు బాగున్నాం రా! నాయుడు నెల్లూరు లోనే కదా ఉండాడు. పెద్దామె యాత్రలకి వెళ్ళింది. ఇక అబ్బయ్య వేరే దేశంలో  చదువుకుంటున్నాడు కదా ! " అని చెప్పింది.

"ఏమిటిరా ! మన వూరి కబుర్లు. అందరూ  ఎలా ఉన్నారు..? అంటూ పేరు పేరునా అడిగి తెలుసుకుంది.అప్పుడప్పుడు మన ఊరిని చూస్తుంటానురా" అని చెప్పింది. "ఈ మధ్యన నువ్వు మన వూరికి రానేలేదు కదా..ఎట్టా చూసినావు అమ్మా.."అడిగాడు.

ఇదిగో చూడు అంటూ.. ఇంటర్ నెట్ ఓపెన్ చేసి .గూగుల్ మాప్ లో వాళ్ళ ఊరుని చూపించింది. మీరు డాబా ఇల్లు కట్టుకున్నారు కదూ ! అంటూ ఇదిగో .ఇదేనా అంటూ చిత్రం ని పెద్దది చేసి చూపింది. అంత చిన్న పెట్టెలో తన ఇల్లు కనబడటం చూసి  సంతోషిస్తూ "ఇప్పుడు పోన్ ల లో కూడా ఈ మాదిరి కనబడుతుంది కదమ్మా.."   అన్నాడు సురేష్.

"అవును రా.. గుప్పిట్లో ప్రపంచం కనబడుతుంది "అని నవ్వింది. "అబ్బయ్యతో మాట్లాడతావా..? "అంటూ.. కొడుకు కి పోన్ కలిపి.. "మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు!" అంటూ పోన్ సురేష్ కి ఇచ్చింది.వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నాక "మనం మళ్ళీ మాట్లాడుకుందాం "అని కొడుకుకి చెప్పి ..సురేష్ కి  ఇంట్లో ఉన్న డబ్బాలు అన్ని వెదికి వెదికి తినే దానికి పెట్టింది. "నువ్వు ఇవి తింటా ఉండు. నేను వంట చేస్తాను "అంటూ పనిలో పడింది.

సురేష్ హేమ వెంట వంట ఇంటి గుమ్మంలోకి వచ్చి నేల మీద చతికిల బడ్డాడు.

"చెప్పరా ..ఏమిటి విశేషాలు? " అని అడిగింది.

"అమ్మా.. అబ్బయ్యని బాగా పెంచినావు. ఈ పాలి నన్ను సురేష్ అని కూడా పిలవలేదు.." ఏమి అన్నా బాగున్నావా? అని అడిగినాడు" అని చెప్పాడు.

"పల్లెల్లో అయితే బేధాలు ఉంటాయి కాని చదుకున్న వాళ్లకి అవన్నీ ఏముంటాయి రా..? "అని చెప్పింది. 


"అమ్మా..అందరూ బిడ్డలని మీకులాగా సాకరు కదమ్మా.. నేను మన ఇంటికాడ పని మానేసాక సుధాకర్ రెడ్డి ఇంట్లో పని చేసినా,శ్యాం అన్న ఇంట్లో పని చేసినా..కానీ ఎవరు నీ అంతా మంచిగా చూడనూలేదు.. మంచిగా ఉండాలని చెప్పలేదు. నన్ను చిన్నాడు అని కూడా చూడకుండా అరవ చాకిరి చేయించారు. ఒక్కళ్ళు కూడా సురేష్ అని పేరు పెట్టి పిలిచినాళ్ళు లేరు. అందరు దిబ్బోడా..అని పిలిచినాళ్ళే ! ఎక్కడా మా కులపోళ్ళకి ఇలువే లేదు. మా ఇళ్ళల్లో పిల్లకాయలు ఎక్కువే! కూటికే లేకపోయే! ఇంక చదువులు ఏడ చదువుకుంటాం!మేమింకా కాపోళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాంటి వాళ్ళమే అనుకుంటా ఉంటారు. పెద్దామె, నాయుడు కూడా .   వాళ్ళు ఇద్దరూ కాలితో తన్నిన సంగతి కూడా నేనింకా  మర్చిపోలేదమ్మా! చెప్పులు కూడా ఒకోతూరి వేసుకున్న కాళ్ళని కరుస్తాయి. కాలం ఒకే లాగ ఉంటాదా! మేము అయిదుగురు అన్నదమ్ములుంటిమి. పనులు చేసో, కయ్యలు మగతాలకి జేసో  మేము కయ్యలు కొనుక్కున్నాం. మాకాడ ఇప్పుడు అయిదెకరాల కయ్యి ఉంది ..ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటూన్నాం. మా పిల్ల కాయలని బడి పంపుతున్నాం. మా నాయన చేసిన తప్పులని మేము చేయడం లేదులేమ్మా..అని చెప్పాడు ఆవేశంగా.

""మనుషుల అహంకారం అట్టాగే ఉంటుంది లేరా..!నువ్వు అనుకున్నట్టు అందరూ  అట్టాగే ఉండరు ..అని చెపుతూ వాతావరణం ని తేలిక చేసాను అనుకుంది. "ఇప్పుడిప్పుడు  మీరు చాలా తెలుసుకున్నారు. అది సంతోషమే కదరా ..సురేష్." అంది హేమ.

మనసులో బెరుకుగానే ఉంది తను చనువు కొద్ది ఏరా అన్నా కూడా ఏమైనా అనుకుంటాదేమోనని సంశయించింది కూడా.

"ఆడ పిల్లలకి చదువెందుకు అనుకోకుండా నీ పిల్లలని చదివించు " ..అని చెప్పింది హేమ.

"మా పిలకాయలని బడికి పంపుతున్నానమ్మా.."అని చెప్పి.. "ఒక సారి .. నట్టింట్లోకి రామ్మా.. " అని పిలిచాడు.

"ఎందుకురా..? కాసేపాగు ..వంట అయిపోయాక పోదాం" అంది. "లేదమ్మా ..నువ్వు అర్జంటుగా ఓ పాలి..ఇటురావాలి .." అని పిలిచాడు.

స్టవ్ మంట తగ్గించి చేతులు తుడుచుకుని హాల్లో కొచ్చి నిలబడింది .."ఇటు..కూర్చోమ్మా!"  ..అంటూ కుర్చీ ముందు జరిపాడు. హేమ కూర్చుంది

"అమ్మా.. ఇయి తీసుకో ! "అంటూ.. ఓ..కవరు చేతికి ఇచ్చి "నన్ను దీవించమ్మా.!" అంటూ హటాత్తుగా వంగి హేమ కాళ్ళకి దణ్ణం పెట్టాడు.

"ఒరేయ్! ఏమిటిరా ఇది.. నా దీవెనలు ఎప్పుడు నీకుంటాయి. అయినా ఏమిటి ఇవన్నీ? " అడిగింది.

"అమ్మా.. ఈ రోజు మదర్స్ డే..అంట కదమ్మా.. నిన్నటేల నుండి టీవి లలో ఎక్కడ చూసినా అవే చెబుతుండారు నాకు నిన్ను చూడాలనిపించింది ..అందుకే వచ్చేసాను.."  అని చెప్పాడు.

సురేష్ ఇచ్చిన కవరు ప్రక్కనే ఉన్న టేబుల్ పై పెట్టింది.

"అమ్మా..కవరు తీసి చూడమ్మా..నీ కోసం ఒక చీర తెచ్చాను" అని చెప్పాడు. నవ్వుకుంటూ కవరు లోనుంచి చీర తీసి చూసి "చాలా బాగుందిరా..నువ్వు చీరలు బాగానే సెలక్ట్ చేస్తున్నావే!"అని ఒక మొట్టికాయ వేసింది..నవ్వుతూ. ..వాడి అభిమానానికి కళ్ళు చెమర్చగా

"ఇదిగోనమ్మా..మనం నాటిన  పనస చెట్టు కాయ.." అంటూ తెచ్చి హేమ ముందు పెట్టాడు. పెద్ద పనస కాయ. ఆ కాయని చూస్తూ.  చాలా పెద్ద కాయలు కాస్తున్నాయి..కదా! అంది సంతోషంగా  


అవునమ్మా ! అక్కడెవరూ  మనం ఉన్నప్పుడు సేద్యం చేసినట్టు చేయడం లేదు. అప్పుడు ఉండే కళాకాంతులే లేవమ్మా.. కయ్యలన్నీ బోసిగా, బీళ్లుగా మారిపోయి  ఖాళీగా ఉండి..పోనాయి" బాధగా  చెప్పాడు.

"మనకి ప్రాప్తం లేదు, అందుకే అమ్ముకోవాల్సి వచ్చింది "  అంది హేమ బాధగా..

ఆ కబుర్లు ఈ కబుర్లు చెపుతూ ఓ..గంట పైగానే ఉండి..భోజనం చేసి.. "అమ్మా..భద్రం అమ్మా!..అబ్బయ్య కూడా భద్రంగా ఉండాలి .. ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాను." అని చెప్పాడు అభిమానంగా. 

అలాగే! తప్పకుండా వస్తూ ఉండరా! పెద్దామె కూడా నిన్ను చూసి సంతోషిస్తుంది" 
 "అబ్బయ్య పెళ్ళికి నన్ను మర్చిపోకుండా పిలవాలి" అంటూ పోన్ నెంబర్ ఇచ్చి ..హేమ దగ్గర  అందరి నెంబర్లు తీసుకుని వెళ్ళాడు..

పనస కాయ కోస్తూ..ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంది. వెట్టి చాకిరీ చేసే వాళ్ళందరూ ఈ పనసకాయ పై భాగంలాంటి వారు, లోపలున్న  మధురమైన తొనలు తినేవాళ్ళందరూ భూస్వాములు అని పోలిక ఇచ్చుకుంది హేమ.

తీయని సువాసన వెదజల్లుతున్న పనస తొనలు తింటూ "ఎంతైనా దిబ్బోడు మన సొమ్ము తిని పెరిగిన వాడు .అది మర్చిపోలేక ..మనమంటే ఉన్నఅభిమానం ఇలా చూపించాడు"  అనుకుంటుంది సుగుణమ్మ.

"అవును మరి! అగ్రకులం, భూస్వామి తనం అనే పెత్తనంతో  మనం  చూపిన  ఆదరణ మర్చిపోయేటట్లు ఉంటే  కదా! వ్యంగంగా అనుకుంది హేమ తన మనసులో. ఆమె ఇప్పటికీ అత్త చాటున  ఓ కోడలే!


14 కామెంట్‌లు:

సామాన్య చెప్పారు...

వనజ గారూ కథ ఎంత బాగుందో .ఎంతో సహజంగా ,సరళంగా మనసుకు హత్తుకునేట్లు వుంది.నాకు చాలా నచ్చింది .ఇంత మంచి మనసూ ,ద్రుక్పదమూ వున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు .నైస్ స్టొరీ అండీ నిజంగా .ఇవాళ అవసరమున్న కథలు ఇవి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు.. కథ మీకు నచ్చినందుకు... థాంక్ యు ..థాంక్ యు వేరి మచ్!!

పల్లా కొండల రావు చెప్పారు...

మంచి పోస్టు .

పల్లెల్లో సహజం గా కనిపించే మనస్తత్వాలను కల్లకు కట్టినట్లు చెప్పారు.

లేబర్ అనే పదాన్ని ఇప్పటికీ చాలా చీప్ గా వాడడం చూస్తూనే ఉన్నాము.

లేబర్ అంటే శ్రమ . శ్రమే జగతికి మూలం . సమస్త ఉత్పత్తికి - మానవాళి మనుగడకు శ్రమే మూలం.

అలాంటి శ్రమ జీవులను భూస్వామ్య అహంకారం తో కొందరు అవమానించడం , పెట్టుబడి దారీ స్వభావం తో లాభలకోసం దోచుకోవడం మీరు పనసపండును ఉదహరించినట్లు నిత్యం చూసేదే.

అయితే సమాజం లో మార్పుకు తల్లి పాత్రను సుగుణమ్మ - హేమ పాత్రల ద్వారా చెడు మంచి భావాలు ఎలా వ్యాప్తి చెందుతాయో చక్కగా ఉదహరించారు.

అందుకే తల్లిని మించిన దైవం లేదు - శ్రమను మించిన త్యాగం లేదు.

మీరు కులం గురించి కూడా గతం లో ఇలాంటి పోస్టు ఒకటి వ్రాసినట్లున్నారు.

ఇలాంటి పోస్టులు మరిన్ని వ్రాస్తారని ఆశిస్తూ అభినందనలు.

శ్రీలలిత చెప్పారు...

మానవతయొక్క గొప్పదనాన్ని అచ్చతెలుగుపదాల నుడికారంతో అందంగా అల్లిన మీ కథ హృదయాన్ని హత్తుకుంది. అభినందనలు...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ లలిత..గారు కథ నచ్చినందుకు,మెచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.
@ కొండలరావు గారు.. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.
కుల వివక్ష,శ్రమదోపిడి గురించి మనం ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ కథలో అత్తా-కోడలు పాత్రలు రెండు సజీవ పాత్రలే! అయితే మార్పు ని కూడా కథ సూచించింది. అదే మనకు కావాల్సింది. పల్లెటూర్లలో బాలకార్మికులు,డ్రాప్ ఔట్స్..ఎందుకు ఉంటారో మనకి తెలిసిన విషయమే కదండీ.
"హేమ"నా పెవరేట్ పాత్ర అండీ! ఏ కథ వ్రాయబోయినా ఇంకో పేరు పెట్టలేను.అందుకే మరిన్ని కథలలో హేమ ని చూస్తారు కూడా! :)
మీ అభిప్రాయాలని తెలిపి నన్ను ప్రోత్సహిస్తున్న మీకు మరొకమారు ధన్యవాదములు.

కాయల నాగేంద్ర చెప్పారు...

గ్రామీణ ప్రజల మనస్తత్వాలను మంచి కథగా తయారు చేసి మాకు అందించినందుకు ధన్యవాదాలు వనజ గారు! ఇప్పటికీ పిల్లలచేత పనిచేయించడం , శ్రమజీవులను చులకనగా చూడటం జరుగుతోంది. అలాంటివారికి ఈ కథ కనువిప్పు.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ కథ బాగా వ్రాశారు...సన్నివేశాలు కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించాయి.

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

కథ చాలా బాగుంది వనజా గారు..మనుషుల మధ్య ఆప్యాయతలను...అదే సమయంలో కులమత అడ్డుగోడలను కథలోని పాత్రలతో చక్కగా వ్యక్తీకరించారు. అభినందనలు!

జలతారు వెన్నెల చెప్పారు...

కథ చాలా బాగుందండి వనజ గారు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

సురేష్ కష్టాలు చదువుతుంటే ఎంత బాధేసిందో :(

హేమలాంటి మంచి మనసుగల మనుషులు కొంతమందే ఉంటారు. సుగుణమ్మలైతే బోలెడు మందున్నారు!

పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాంటివే నేర్చుకుంటారు. నాకు హేమ, అబ్బయ్య బాగా నచ్చారు.

చదువుకోడంయొక్క అవసరం గురించీ, అతికసంతానంవల్ల వచ్చే కష్టాల గురించీ, సోమరితనంవల్ల పిల్లల భవిష్యత్తెలా పాడవుతుందన్నదాని గురించీ (సురేష్ తండ్రి పాత్ర), నాలుగుప్రదేశాలు తిరిగితే మెరుగుపడే ఆలోచనా విధానం గురించీ, చేసే ఉద్యోగం ఎప్పుడు ఆత్మ సంతృప్తి ఇవ్వగలదన్నదాని గురించీ (స్కూల్ మాస్టారు పాత్ర) ఇలా పలుకోణాల్లో ఆలోచింపజేసే మంచి కథ రాశారు వనజ గారూ. ధన్యవాదములు.

శశి కళ చెప్పారు...

భలే వ్రాసారు.డ్రాప్ ఔత్స్ గూర్చి మీకెలా తెలుసు ?
అసలు తరాల అంతరాలు యెంత బాగా చూపారు.
అవును పిల్లలు మన పెంపకం బట్టి ఉంటుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు..కథ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదములు.మన చుట్టూ ఉన్న వారి జేవితాలలో ఉన్న సంఘర్షణ,సమస్యలు ఇవే సృశించే కథాంశాలు. థాంక్ యు వెరీ మచ్!
@కాయల నాగేంద్ర గారు..మీకు మరీ మరీ ధన్యవాదములు.మీ వాఖ్య చాలా సంతోషం కల్గించింది.

నిరంతరమూ వసంతం సురేష్ గారు..కథ నచ్చినందుకు మరి మరీ ధన్యవాదములు
@జలతారు వెన్నెల గారు. మీకున్న సమయంలో వీలు చూసుకుని మరీ కథ చదివి అభిప్రాయం చెప్పినందులకు కథ మెచ్చినందుకు ధన్యవాదములు.

అవినేని భాస్కర్ గారు కథ లో నిబిడీకృతమైన అంశాలు ని గుర్తించి.. కథ ని అర్ధం చేసుకున్న తీరుకి మరీ మరీ ధన్యవాదములు.మీకు కథ నచ్చింది అంటే..నా మీద నాకు నమ్మకం కుదిరింది.:)ఈ కథలోని పాత్రలు అన్నీ సజీవ పాత్రలు. నాకు ఈ కథలో అయ్యోరు ( టీచర్ ) పాత్ర అంటే ఇష్టం.
@శశి కళ గారు డ్రాప్ ఔట్స్ ఎందుకు ఉంటారో తెలుసు. బ్రిడ్జ్ స్కూల్స్ ఎంత వరకు సఫలం అవుతాయో కూడా తెలుసు. మండలస్థాయిలో విద్యా కమిటీల పాత్ర ఎంత అన్నది కూడా తెలుసు. అక్షర జ్యోతి లో విద్యా వాలంటీర్ గా పనిచేసాను (స్వచ్చందంగా) అన్నిటికి మించి మన విద్యా విధానంలో ఎలాటి మార్పులు వస్తే బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను. కథ నచ్చినందుకు థాంక్ యు టీచర్ గారు. !.
ఫ్రెండ్స్ మీ అందరి ప్రశంసలు ..ఈ కథ ని టైపు చేసేటప్పటి శ్రమని మరపించాయి. నాకు "ఒలిని "అవసరం లేని ఈ రోజుకి కారణం మీరే మీరే ఫ్రెండ్స్ ..:) ధన్యవాదములు.
.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

<<>>

ఈ విషయం కథ చదివేప్పుడే అర్థమైపోయింది వనజ గారూ :-)

Kathi Mahesh Kumar చెప్పారు...

బాగుంది.