14, జులై 2012, శనివారం

మురికి మనసు


ఈ రోజు వుదయం పదకొండు గంటలప్పుడు నా రెగ్యులర్ కస్టమర్స్ వచ్చారు.

వారిని కస్టమర్స్ ఆనే కంటే  ఫ్రెండ్స్ అంటే బావుంటుందనుకుంటాను నేను.
వారి ఇద్దరి పేర్లు వాణి గారు,విజయ గారు.

వాణి గారు వాళ్ళ అమ్మాయికి ఒక పట్టు చీర కొని వర్క్ చేయాలని కోరారు. మీకు  నచ్చిన చీర కొని తెచ్చుకుంటే వర్క్ చేసి యినని చెప్పాను. వారు అందుకు వొప్పుకోలేదు. సెలక్షన్ చేయడానికి మీరు రావలసినదే అన్నారు.

గత నవంబర్ లో వాణి గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తే.. అమ్మాయికి కావాల్సిన పెళ్లి చీరల్లో వొక్క చీర కూడా బయట షాపింగ్ చేయకుండా నేను డిజైన్ చేసిన చీరలే తీసుకున్నారు. ఒక్కో చీర వెల ఇరవై వేల పై మాటే! అది వాళ్ళ నమ్మకం.

నేను ఘర్ కా దుకాన్ క్లోజ్ చేసుకున్నా వాళ్ళకి  మాత్రం నా సెలెక్షన్స్ పైనే నమ్మకం.  సరే హడావిడిగా వంట ముగించి 12 గంటలకి సిటీ లోకి షాపింగ్ కి వెళ్ళడానికి రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్లాం. ముగ్గురుం కాబట్టి నా వాహనం తీయలేదు బస్ యెక్కి వెళ్ళాలనుకుని దగ్గరగా వున్న బస్ స్టాప్ కి వెళ్లి నిలుచున్నాం.


వాతావరణం మేఘాలు క్రమ్మి వున్నా వొకటే వుక్కపోతగా వుంది.అప్పుడప్పుడు వురుముల మోత.ఎక్కడో వర్షం కురుస్తున్నట్లుగా. 


రోడ్డు ప్రక్కన మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నారు. ముగ్గురం  తలా వొకటి  తీసుకుని  వూర్లోనుండి వస్తున్న పదవ నెంబర్  బస్ యెక్కేసి తింటూ బస్ అని కూడా చూడకుండా  కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసి బీసెంట్ రోడ్డులో దిగేసాం. అలా నడుచుకుంటూ విండో షాపింగ్ చేస్తూ రెగ్యులర్ గా వెళ్ళే షాప్ కి వెళ్లాం.

ఆషాడం సందర్భంగా డిస్కవుంట్స్ సేల్స్ వైపు తొంగి చూడకుండానే   రెండు గంటలు సేపు వెతికి  వో మూడు చీరలు కోసం  పదకొండు వేలు ఖర్చు పెట్టి మెటీరియల్స్ కొన్నాము. డిస్కవుంట్స్ యివ్వడం కుదరదన్నా కూడా 35 % డిస్కవుంట్స్ ని అడిగి యిప్పించుకుని కాస్తంత గర్వంతో వొడలు విరుచుకుని  షాపులో నుండి బయటపడ్డాం. కాస్త అలా వెళ్లి ఆ మోడరన్ పుడ్స్ లో ఒక కర్రీ పఫ్ఫ్,ఒక సమోసా,బాదం పాలుతో మరి కాసిని కబుర్లు చెప్పుకుని వేరు వేరు బస్ స్టాప్ లోకి నడచి యెవరి దారికి వాళ్ళు విడిపోయాం.


నేను బస్ స్టాప్ లోకి రాగానే మళ్ళీ పదవ నంబర్ బస్సు  వచ్చింది. ఖాళీగా వుందని  యెక్కేసాను. మధ్యాహ్న సమయం కాబట్టి పెద్దగా రష్ లేదు. ఎక్కగానే సీట్ దొరికింది. విండో సీట్ లో కూర్చుని అలా మారిన మహాత్మా గాంధి రోడ్డు అందాలని అవసరమైన గుర్తులని బుర్ర లోకి యెక్కించుకునే   ప్రయత్నం చేస్తూ ఎఫ్ ఎమ్..రేడియో పాటలు వింటూ అలా కళ్ళు మూసుకున్నాను.

పి.డబ్లు యూ గ్రవుండ్స్ బస్ స్టాప్ లో బస్ ఆగింది. బిల బిల మంటూ వొక  పది మంది యెక్కేసారు. వాళ్ళ వైపు అప్రయత్నంగానే చూసాను.

అందులో కొంత మందిని వో పదేళ్ళ క్రితం చూసి వుంటానేమో అయినా వాళ్ళని గుర్తించాను.

వాళ్ళేమి గుర్తుంచుకోవాలసిన వ్యక్తులు కాదు. బహుశా వారి దైన్యం,పేదరికం,అందరి కన్నా భిన్నంగా వుండనేమో వాళ్ళంటే చులకన భావం. నాకే కాదు చుట్టూ వున్న ప్రపంచం లోని 90 % మందికి అదే భావం.

అసలు నేను నాతో  పాటు అందరూనూ  యెవరైనా  విభిన్నంగా  కనబడతారేమో అని చూస్తాను. ఊహు..అందరు అంతే నాతో  సహా.  


బస్ లోకి యెక్కిన పది మంది పిల్లలు,స్త్రీలు. వారు యెక్కడ  సీట్లు ఖాళీ వుంటే అక్కడ సర్దుకుని కూర్చున్నారు. వాళ్ళు తమ ప్రక్కన కూర్చోగానే సీట్లలో కూర్చున్న ప్రయాణికులు మొహం చిట్లించుకున్నారు. అసహ్యంగా వారికి దూరంగా జరగడానికి ప్రయత్నించారు. వారు తగిలితే యెక్కడ మైల పడతామో అన్నట్లు..ముడుచుకుని సర్దుకుంటున్నారు.

మరి బస్ యెక్కిన పది మంది.. శుభ్రమైన బట్టలు ధరించలేదు. కనీసం చింపిరి చింపిరిగా వున్న జుట్టుని దువ్వడం చేసి నెలలు కూడా అయి వుండవచ్చు.వాళ్ళ శరీరాల నుండి చెమట కంపే కాదు, ఒక రకమైన ముంజు వాసన. వాంతి తెప్పించే వొక రకమైన దుర్గంధం. పాపం గాలికేం తెలుసు, వారి వైపు నుండి పయనించి ప్రక్కనే కూర్చున్న నాగరికుల వైపు పయనించ కూడదని.


పాపం వారికి కడుపు నిండా తినడానికే లేదు. ఇంకా  పరిమళాలు వెదజల్లే సబ్బులతో స్నానం చేయగలరు?


పాపం వాళ్లకి త్రాగడానికే మంచి నీరు కరువు. ఇంకా శరీరాలని శుభ్ర పరచుకోవడానికి నీరు యెక్కడ?.

వారు వొంటి నిండుగా బట్ట కట్టుకునే ప్రయత్నమే చేసారు. కానీ ఆ బట్టలకి అన్నీ చిరుగులే! ఆ బట్టలు వుతుక్కునేందుకు మార్చుకునేందుకు వేరే బట్టలే లేవు. ఏ దయాశీలురో పాత బట్టలని వస్త్రదానం చేసినా కడుపు నింపు కోవడానికి పదికో పరకకో..ఆ వస్త్రాలని అమ్మేసుకుని పొట్ట నింపుకుంటారు.

వారు ప్రతి నిత్యం సూర్యుడి కన్నా ముందే నిద్ర లేస్తారు. వీధి వీధిలోని చెత్త కుండీలలో మనకి పనికి రాని వస్తువు లని అపరాధ పరిశోధకులగా మారి చెత్త నుండి విడగొట్టుకుని భద్రంగా భుజాన ఉన్న గోనె సంచీలో సేకరించి అమ్ముకుంటారు. వారికి పనికి వచ్చే వస్తువులతో పాటు పాచిపోయిన ఆహార పదార్ధాలని అపురూపంగా యేరుకుని పొట్టబోసుకుంటారు


సాయంత్రం వరకు యేరుకుని వాటిని అమ్ముకుని వచ్చిన తృణమో,పణం తోనో.. ఆహారాన్ని కొనుక్కుని  అర్దాకళ్ళతో  పడుకుంటారు. మరి వారికి వంట తయారీ సామాగ్రి లేదు, బియ్యం నూకలు కరువు.


వాళ్ళకి పూరి గుడెసైనా లేదు. మా వూరి హై స్కూల్ ప్రహరీ గోడకి ఆనించి వేసిన వెదురు బొంగులపై యెరువుల మందుల సంచులని పరదాలగా మార్చి యె౦డ వానల నుండి రక్షణ పొందుతారు. రాత్రి సమయాలలో స్కూల్ వాచ్ మెన్ దయతలచి లోపలి ప్రవేశం యిస్తే వరండాలో పక్కలు పరచుకుంటారు.

పదునాలుగు యేళ్లకే ఓ పసుపు తాడు కట్టి పెళ్లి అయినదనిపించుకుంటారు. ఓ పిల్ల తల్లి వొడిలో మరో పిల్ల. ఓ పదునైదు యేళ్ల అబ్బాయి తండ్రిగా మారతాడు. వారి జీవన విధానం అదే .వాళ్ళంతా వీధి బాలలు,వీధి తల్లులు-వీధి తండ్రులు. వారసత్వం కాపాడుకుంటున్నట్లు గా.

స్థానికులు ఓ ఏబై  యేళ్లలో మూడు తరాలు చూసామని చెపుతుంటారు

పదేళ్ళ క్రితం నేను చూసిన పిల్ల వొడిలో నేడు వో..పిల్ల. నాకు ఆశ్చర్యం. ఆ తల్లి యే బిడియం లేకుండా మురికి కారుతున్న పైట తొలగించి .బిడ్డకి స్తన్యం అందించింది. వారినే చూస్తున్న కొన్ని కళ్ళు. జాలిగా చూసే కొన్ని కళ్ళు. అందరి చూపులు వారి పైనే. వారిని బస్ దిగిపోమ్మనే అధికారం యెవరికీ లేదు. ఎందుకంటే వారు మాకు లాగా తొమ్మిది రూపాయలు చెల్లించి టికెట్టు కొనుక్కుని ప్రయాణించే వారే!


వారిని తమ ప్రక్కన కూర్చో వద్దని అడ్డుకునేందుకు దమ్ములేదు. వారికి హక్కు ఉంది కదా! అందుకే ముక్కులు మూసుకుని బలవంతంగా భరిస్తున్నారు. .


వారిని మన ప్రక్కన కూర్చుని ప్రయాణం చేయడాన్ని అసహ్యించుకుంటున్నాం. మనం నాగరికులం. అది గమనించేమో, తమ వారి ప్రక్కన సీట్లు ఖాళీ కాగానే వారే వారి వారి దగ్గరకు సర్దుకుంటున్నారు.మన నాగరిక మురికిని మనకే వదిలేసి అన్నట్లుగా వాళ్ళు వాళ్ళ పిల్లలు కబుర్లతో, గట్టి నవ్వులతో. వెనుక సీట్లు నుండి ముందు సీట్లకి ప్రవహింపజేసే కేకలతో, సందడితో గమ్య స్థానం చేరుకుంటారు.

అది వారి రోజు వారి దిన చర్య. అది అలా సాగుతూనే ఉంది. మారనే మారదు అన్నట్లు. మార్చడం యెవరి వల్ల కాదన్నట్లు. ఎవరు కాదనే ప్రసక్తే లేదు.

వారిని చూస్తే నాకు యిలా అనిపిస్తుంది.

చెత్త కుండీల నుండి వ్యర్ధాన్ని యేరుకుని అర్ధంగా బ్రతుకుతున్నట్లు అనిపిస్తున్న వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం కప్పుకున్న ముసుగులు తొలగించాలి. అవును చదువు-సంస్కారం,ధనం,హోదాల సంగతి మర్చిపోయి వారిని మనలో కలవనీయ గల దైర్యం ఉందా!?

నాకైతే లేదు అనిపించింది.


ఎందుకంటే నా పుట్టుక లో అహం, నా స్థాయిలో కనబడే బేధం, నా కులం, నా మతం, నా ఇల్లు, పరిశుభ్రత. ఇంకా నాకున్న విద్యార్హత, నాకున్న ఆర్ధిక స్తోమత కూడా.

వారు నా ప్రక్కన కూర్చుని ప్రయాణించడానికి నా మనసేమాత్రం  అంగీకరించదు.

భగవంతుడా! ఎందుకు వీరికి యిలాటి స్థితిని ప్రసాదించావు? ఎందుకు వీరిని ఆ మురికి కూపం నుండి బయటకి రానీయ కుండా చేస్తావు? వారికి మాలా బ్రతికే హక్కు నేర్చుకోమని యె౦దుకు చెప్పవూ?    వాళ్ళ జీవితాలు మారావా? వాళ్ళని మారనివ్వవా? తరతరాలు వారివి వీధిబాలల, చెత్త కుప్పల బ్రతుకేనా? .అని అనుకుంటూనే దేవుడిని ప్రార్దిస్తూనే అంతలోనే యేహ్యం ప్రదర్శిస్తాను.

అమ్మో! వాళ్ళది యే౦  పుట్టుక  రా బాబూ! ఏం దరిద్రం పెంపకం? అపరిశుభ్రత భరించడం నావల్ల కాదు.

యాక్.. తలచుకుంటేనే వాంతి వస్తుంది. ఇంకా నా ప్రక్కన కూర్చుంటే భరించడ
మా? నెవ్వర్.   రోజూ  వొక పూట పస్తుండి అయినా ఓ యిద్దరికైనా కాస్త అన్నం పెడతాను కానీ, వాళ్ళని తోటి మనిషిగా చూడటమా!? అనుకున్నాను.

అవును నాలో మనిషి తనమే కాదు మానవత్వం లేదు.


వారిని మనిషిగా చూడ గల్గిన వాళ్ళు, వాళ్ళ దీన గాధలకి, వారి బాధలకి,దయనీయ జీవన విధానానికి జాలి తలచిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. విశ్వ మాతా .. మదర్ ! నీ ప్రేమ తత్వానికి,నీ జాలి గుండె స్పందనకి, నీ దయార్ద్ర హృదయానికి శత కోటి వందనాలు. నీ సేవా బావానికి,  కరుణామృత హృదయానికి మనసా వాచా ప్రణమిల్లుతాను తల్లీ!

నాలో మనిషి గుణం,మానవత్వం లేనందుకు మన్నించు తల్లీ! నేను ఒక మామూలు మనిషినే! ప్రక్కనే ప్రాణం ఉన్న ఓ.. మనిషి మనిషిగా చూడటం చేతకాని పాషాణాన్ని! నన్ను క్షమించు తల్లీ!!. అనుకుంటూ.. వారి ప్రయాణం సాగుతుండగానే నేను దిగాల్సిన స్టాప్ వచ్చి నేను బస్ దిగిపోయాను.


ఇంటికి రాగానే చికాకుగా అనిపించి స్నానం చేసేసి శరీరపు   మురికితో పాటు మురికి ఆలోచనలు కడిగి వేద్దాం అనుకున్నాను.


ఊహు నా వల్ల కాలేదు. చింతాల్ సబ్బు నా శరీరపు  మురికిని, రిన్ ప్రెష్ నా బట్టలకి అంటిన మురికి వాసనని పోగొట్టాయేమో కాని.

నాలో ఉన్న మురికి హృదయం మారదు గాక మారదు. నేను మనిషినే!

ఏ మాత్రం గొప్పదనాన్ని అపాదించుకోవాలని ప్రయత్నించినా కూడా  అది  యేమాత్రం అంటని మామూలు మనిషిని. మురికి మనసుని .    

11 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
చాలా మంచి విషయాలు చెప్పారండీ

ప్రతి ఒక్కళ్ళం గొప్పభావాలను బయటికి ప్రెజెంట్ చేస్తుంటాము కానీ మన మనసుకే తెలుసు మనమేమిటొ...

ఇప్పుడు నా ఈ అభిప్రాయానికి సరైన అర్ధం "the tree -- BHASKAR"
గారి బ్లాగ్ లో నాకు దొరికింది..

""వ్యక్తిత్వం నిర్మల ఆకాశమేమి కాదు,
ముసుగు మబ్బుల క్షేత్రమది"".

ఐనా మీలో మానవత్వం లేదు అంటారేంటండీ
""రోజు.. నేను ఒక పూట పస్తుండి అయినా ఓ..ఇద్దరికైనా కాస్త అన్నం పెడతాను అన్నారు కదా"" అది చాలు కదా వాళ్ళకి

సాటి మనిషిగా భావించి వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకుంటేనే మానవత్వం ఉన్నట్లు కాదు కదా...

కాయల నాగేంద్ర చెప్పారు...

వాళ్ళు ఇలా ఉండటానికి మన ప్రభుత్వాలే కారణం. ఓట్లకోసం 2 రూపాయలకే కిలో బియ్యం, ఉచిత కరెంట్ అంటూ ప్రచారం చేసుకుంటున్న పాలకులకు రోడ్ల పైన తిరిగే పేద ప్రజలు కనిపించరు. మిమ్మల్ని మీరు నిందించుకుంటూ, పేదల పట్ల జాలి చూపుతూ చాలా బాగా రాసారు వనజ గారు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీ ఆవేదన చాలా మందికి వుంది.వారికి ఏమైనా చేయగలమా అని.ఎక్కడో ఒక చోట మొదలవాలండి.మీరిలా ఆలోచించారంటే ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారో కదా!
excellent presentation.మీ ప్రశ్నలు సమాజపు ఎదలో పిడిబాకులై దిగుతాయి.

Unknown చెప్పారు...

వనజ వనమాలి గారూ,
చాలా స్వఛ్ఛంగా మీ మనసులోని భావాలని రాశారు, ఇలాంటి వాళ్ళని మనిషి గా చూడగలిగే హృదయాలు మీరన్నట్టు విశ్వమాతలే అవుతారు, నిజమే నిత్యం ఇలాంటి దయనీయ జీవులని మన మధ్యే రోజూ చూస్తాము, మీలా వాళ్ళ పక్కన బస్ లో కూచున్నప్పుడు మన మనసులు కాసేపు వాళ్ళ దయనీయతని మరచిపోయి ఆ మురికి ని అసహ్యించుకుంటాయి, ముసుగులు లేని వాళ్ళ నడవడికని కూడా...
మీ మనసు వాళ్ళని గురించి ఆలోచించ గలిగింది చాలు. కనుక ఆ మనసు మురికీ పోయినట్టే...

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, మీలో స్వచ్చమైన ఆలోచన ఉంది, న్యాయమైన విశ్లేషణ ఉంది, మన పెంపకం మనం పెరిగిన వాతావరణం మనల్ని ఇలాంటి విషయాలకు దూరంగా ఉంచుతున్నాయి. మీఎరు శారీరకంగా బస్సు దిగారు కానీ మాసనసికంగా వారితోనే ఉండిపోయారు. మార్పు ఒక్కరోజులో రాదు. మీలాంటి వారే సేవాతత్పరులు అవుతారు. మీలో కలిగిన వేదన వంటిదే ఇంకొంచం ఎక్కువ స్తాయిలో ఉంటుంది ఒక్కోమారు, ఆ గుండెమంట నుండే ఏదైనా చేయాలి అనే భావన మొదలౌతుంది, మనం విన్నా మహానుభావులు, మదర్ లాంటివారూ వారి జీవితంలో చూసిన ఎన్నో సంఘటనలే వారి సేవకు కారణంగా చెప్పారు. స్పందించే మనసు ఉంటె చాలు, మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లే, నిష్కల్మషంగా చెప్పిన మిమ్ము ప్రశంసిస్తున్నాను.

భాస్కర్ కె చెప్పారు...

manalni choosi alaa cheedarinche vallu untaarandi, adi gurthunchukonte konthanna marpu vasthundi manalo.
keep writing.

జలతారు వెన్నెల చెప్పారు...

ముందుగా మీకు వందనాలండి. అసలు మీరు ఎంత బాగా రాసారో ఈ టపా మీకు తెలుసా? మనసులో ఉన్న ఫీలింగ్స్ ఉన్నది ఉన్నట్టుగా ఇలా ఇంత బాగా చెప్పారు. మీరు ఫీల్ అయినట్టె నేను కూడా వాళ్ళని చూస్తే ఫీల్ అవుతానేమో!! మీకు hats off అండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..మీ స్పందన కి ధన్యవాదములు. మీ మాటతో నాకు కొంత ఊరట కల్గింది. థాంక్ యు!!
@కాయల నాగేంద్ర గారు.. ధన్యవాదములు. మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను.
@ఒద్దుల రవిశేఖర్ గారు.. ధన్యవాదములు.దాదాపు పద్నాలుగు ఏళ్ళగా చూస్తున్నాను. వారి జీవితాలు అలాగే ఉన్నాయి. కనీసం వారిని అసహ్యించుకోవడం కాదు కాని.. ఎనుడుకో మనిషిగా చూడటం లో నాకు భయం కల్గుతుంది. ఆ భయమే.. ఆలోచన. ఎందుకు ఇన్ని తారతమ్యాలు అనిపిస్తుంది..అండీ. :(
@చిన్ని ఆశ గారు.. మీ స్పందనకి మీరు చెప్పిన అభిమాన పూర్వకమైన మాటకి ధన్యవాదములు.
@మేరేజ్ ఫాతిమా గారు.. మనలా స్పందన కాదండి. వారి జీవితాలు మారే అవకాశం లేనందుకు బాధ,
మా సిటీలో.. పేరాశ కల్గిన వాళ్ళే కనబడతారు. స్వచ్చంద సేవా సంస్థల ముసుగులో ఏ మాత్రం సేవాతత్పరత లేని వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. సామాన్యులం మన మాట వినిపించి వాళ్ళలో మార్పు తెగలమంటారా? వాళ్ళు బ్రతకాలని వారు కోరుకోవాలి తప్ప.ధన్యవాదములు అండీ!!
@ ది ట్రీ భాస్కర్ గారు..మీరు చెప్పింది నిజమే!ధాంక్ యు..వెరీ మచ్..అండీ!!
@జలతారు వెన్నెల గారు.. మీ స్పందనకి.. మీ అభిమానానికి ధన్యవాదములు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పాపం గాలికేం తెలుసు!? వారి వైపు నుండి పయనించి ప్రక్కనే కూర్చున్న నాగరికుల వైపు పయనించ కూడదని.

గాలి యెగతాళి చేసెను
పాలసులగు నాగరకుల ప్రకృతిని - భువిలో
పలువురు దుర్భరబ్రతుకుల
కలవడుటకు మీరు గాద కారణమనుచున్ .
-----సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వెంకట రాజారావు గారు.. మీ వ్యాఖ్య కి ధన్యవాదములు అండీ!!
నిజానికి గాలికి ఆ బేధం లేదు.. కానీ తన గొప్పదనంతో.. మురికి మనసులని తెలియ జెప్పింది. .

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

మనసును తట్టి లేపిన పోస్ట్...మీ మనసులోని కలిగిన భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచినందుకు అభినందనలు వనజా గారు!