19, ఏప్రిల్ 2012, గురువారం

కరుణక్క కూతురు

సన్నగా చినుకులు పడుతున్న చైత్ర మాసపు తొలివారం. వేసవి వేడిమితో అలమటిస్తున్న  భాగ్య నగర వాసులకు అంత కన్నా భాగ్యం మరొకటి ఉండదేమో అన్నట్లు ఆ చినుకుల  తడిని ఆస్వాదిస్తూ విరిసిన దరహాసాలతో, కులాసా కబుర్లతో ట్యాంక్ బండ్  ప్రాంతమంతా కోలాహోలంగా ఉంది.

తన ముందు కూర్చున్న బావ వేణుతో బైక్ పై వెళుతూ పల్లెటూరి కబుర్లు చెబుతున్నశ్రీను. అకస్మాత్తుగా మాటలు ఆపేసి వారి ప్రక్కనే వస్తున్న బైక్ పై దృష్టి సారించాడు. ఆతను అంత హటాత్తుగా ఎందుకు మాటలు ఆపాడో అర్ధం కాక ..ఏమిటి బావా! అంత లోనే మాట్లాడ కుండా ఆగిపోయావ్? అనడిగాడు. 

ఏం లేదు బావా! మా వూరి అమ్మాయి "సుధ" ఎవరో పిల్లాడితో కలసి బైక్ ఎక్కి వెళుతూ కనబడింది. ఆ అమ్మాయా కాదా ? అని చూస్తున్నాను. 

ఆ అమ్మాయే అయితే నీకేమిటి అభ్యంతరం ? అడిగాడు. 

మా పల్లెటూర్లో  ఇట్టాంటివి గిట్టవు. అయినా ఆ సుధ వాళ్ళమ్మ కరుణక్క ఆ పిల్లని యెంత కష్టపడి   చదివించింది. కొద్దిగా అయినా బుద్దిజ్ఞానం ఉండొద్దూ! పెళ్లి కాకుండా ఆ పరాయి  మగ పిల్లలతో ఆ తిరుగుళ్ళు ఏమిటీ! మాటల్లో కోపం .
"ఇక్కడ ఇలాటివన్నీ మామూలే బావా! పెద్దగా పట్టించుకోకు"  

అది కాదు బావా! ఆ పిల్ల మన వూరి నుండి ఖమ్మం పోయి చదువుకున్నప్పుడు యెంత పద్దతిగా ఉండింది, ఇప్పుడు చూడు ఎలా ఉందో !ఖరీదైన బట్టలు,ఫోన్లు, జుట్లు విరబోసుకోవ డాలు , యెంత నాగరికం నేర్చింది. అక్కడ ఆ పిల్ల అమ్మ పొద్దస్తమాను  యంత్రం తిరిగినట్టు మిషన్ చక్రంతో  తిరుగుతూ పని చేస్తూ నే ఉంటుంది. వాళ్ళ అబ్బ సచ్చినోడు వొట్టితాగుబోతు. అయినా తన కష్టం పిల్లకి రాకూదడనుకుని చదువు చెప్పిచ్చింది. ఈ పిల్ల ఉద్యోగంకని వచ్చి ఇక్కడ ఇలా తిరుగుతుంది అన్నాడు బాధగా .

ఆ అమ్మాయి ఏం చదివింది? అడిగాడు వేణు

ఏదో కంప్యుటర్ కోర్స్ చదివింది. వాళ్ళమ్మ పెళ్లి సంబంధాలు  చూస్తుంది. నాకు పెళ్లి వద్దు,ఉద్యోగం చేయాలని పట్టుబట్టుకు కూర్చుంది.  ఇక్కడ చూస్తే  ఇలా ! కాస్త బాగానే విచార పడ్డాడు.శ్రీను.

ఇక ఇంటికి వెళ్ళేదాకా ఈ విషయమే మాట్లాడతాడనుకుని ఏవో  మాటలు చెప్పి టాపిక్ మార్చేశాడు వేణు.

ఇంటికి వచ్చాడు అన్నమాటే గాని ఎప్పుడెప్పుడు తన చెల్లెలు "హేమ" కి సుధ విషయం చెప్పాలా అన్నట్టు కాసుకు కూర్చున్నాడు శ్రీను. 

రాత్రి భోజనాలు అయ్యాక చెల్లెలకి సుధ ని చూసిన విషయం చెప్పాడు. 

"అన్నయ్యా! పల్లెటూరిలో ఆడపిల్లలు ఎవరు ఏమనుకుంటారో అన్న భయంతోనో, కొన్ని కట్టుబాట్లు మధ్య పెరుగుతారు. చదువు పేరిట బయట ప్రపంచంలోకి అడుగిడగానే వాళ్ళల్లో ఆధునికంగా ఉండాలన్న కోరిక బలపడుతుంది. దానికి కారణం లేకపోలేదు. పట్టణాలలో పిల్లలు పల్లెటూరి నుంచి వచ్చిన పిల్లలని విలేజ్ గాళ్స్ అని చులకన చేస్తారు. వాళ్ళు చదువుల్లో పట్టణాలలో చదువుకున్న పిల్లలకన్నా ప్రతిభ ఉన్నవాళ్ళు అయినా సరే.. పల్లెటూరి నుంచి వచ్చిన పిల్లలంటే చిన్న చూపు. వాళ్ళ చులకన భావం తట్టుకోలేకనో,లేదా అధునాతనంగా కనిపించాలనే అణగారిన కోర్కె నిద్ర లేచి,తల్లి దండ్రుల కట్టడి నుండి బయట పడి ఒక్కసారే లభించిన స్వేచ్చతో అమ్మాయిలూ మారిపోతున్నారు. 

మేకప్ కిట్  కి, బ్యూటి పార్లల్ కి, ఇంకా బాగా చెప్పాలంటే బాడీ వాక్స్ కి  కూడా బాగా ఖర్చు చేస్తున్న కాలం ఇది.
 .ఆ పిల్ల 'సుధ' ని నేను రోజు చూస్తుంటాను. ఏదో చిన్న పాటి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ వేరు. straightening hair ,ఆ ultra modren dresses .. తరచుగా మారిపోయే boy  friends .. ఆ పిల్ల పద్దతి మారింది. అని చెప్పింది. 

"వాళ్ళ అమ్మ యెంత గుట్టుగా ఉంటుంది,మరి  ఈ పిల్లకి ఏం పోయే కాలం ఇలా తయారయి చచ్చింది" అని తిట్టాడు శ్రీను.

"అన్నయ్యా ! నువ్వు మన వూరు వెళ్ళాక ఈ సంగతి ఎవరితో అనకు". 

"లేదమ్మా! నేను కరుణక్కకి ఈ విషయం చెపుతాను" అన్నాడు ఆవేశంగా. 

ఎవరి పిల్లలు  పై వాళ్లకి నమ్మకాలు ఉంటాయి. తల్లి దండ్రుల దృష్టిలో పిల్లలు ఎప్పుడూ అమాయకులే! పోయినసారి నేను సంక్రాంతి పండకి వచ్చినప్పుడు.. కరుణక్క సుధ గురించి చాలా బాధ పడింది. "దానికి  చదువు తప్ప వేరే లోకమే లేదు. తిండి కూడా సరిగా తినదు.దానికి ఏం కావాలో దానికి తెలియదు. ఎలా బ్రతుకుతుందో" అని చెప్పి బాధ పడింది.  ఆ పిల్ల ఊర్లోకి వస్తే అలాగే ఉంటుంది. నాసి రకం బట్టలు కట్టుకుని,జడ వేసుకుని ఉంటుంది. ఇక్కడ చూస్తే మొహం కూడా కనబడకుండా వంటి నిండా బట్టలు చుట్టూ కోవడం ఏమిటో!ఎవరు గుర్తు పట్టకుండా ఏమో ! అక్కసుగా,అసహ్యంగా అన్నాడు శ్రీను.

"సర్లే ! ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఎవరికి కూడా మంచి మాటలు చెప్పే కాలం కాదిది. కరుణక్కకి అసలు చెప్పకు" అని మాట తీసుకుంది. అందుకు అయిష్టంగానే ఒప్పుకున్నాడు శ్రీను. 

ఏమిటీ? మీ అన్న ఇంకా ఆ..సుధ ..విషయం జీర్ణం చేసుకోలేక పోతున్నాడా? అని నవ్వుతూ అడిగాడు వేణు అక్కడికొచ్చి.
"ఆ అమ్మాయే కాదు.. చదువుకున్న అమ్మాయిలే నాకు నచ్చడం లేదు " అన్నాడు. శ్రీను. 

"అలా అంటే మీ చెల్లెలు కూడా నాకు  నచ్చకూడదు " అన్నాడు ఉడికిస్తూ వేణు. 

"అలా అనబాకు వేణు బావా !మా చెల్లెలిని  యెంత పద్దతిగా పెంచామో! " అన్నాడు రవంత కోపంగా. 

ఒక  పాతిక ఇరవయ్యి ఏళ్ళ క్రితం..అమ్మాయిలూ ప్రేమ అంటేనే భయపడేవారు. ఒకవేళ ప్రేమించినా ఆ ప్రేమ ఒకరితోనే అనుకుని వీలయితే పెళ్లి చేసుకుని,లేకపోతే మనసులోనే ప్రేమని చంపేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని కాపురం చేసుకునేవాళ్ళు. అంటూ చెప్పుకొచ్చింది హేమ.

ఇప్పటి కాలంలో చదువుల పేరిట ,ఉద్యోగాలు పేరిట బయట ప్రపంచం తెలియడం రకరకాల ఆకర్షణకి లోనై  ఒక  ప్రేమ కాదు ఎన్నో సార్లు ప్రేమలో మునిగి పోతున్నారు. లవ్ కి లస్ట్ కి తేడా తెలియ కుండా పోతుంది.కొంత మంది సినిమాలు షికార్లు కోసం,కొంత మంది షాపింగ్ లలో బాగా ఖర్చు బెట్టించి తమకి కావాల్సింది కొనిపించడం కోసం కొంత మంది.. కాలక్షేపం కోసం ఇలా ప్రేమలు మొదలెట్టారు. ఒకో అమ్మాయికి పొద్దున్నే ఒకరు, సాయంత్రం వేరొకరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నా ఫ్రెండ్ ఒకడికి అర్ధరాత్రి అమీర్ పేట ఉమెన్స్ హాస్టల్ నుంచి ఒక అమ్మాయి అర్ధరాత్రి పోన్ చేసి"ఒరేయ్..రామ్.. నా మొబైల్ చార్జెర్ కనబడటం లేదురా! అర్జంట్ గా చార్జెర్ తెచ్చి ఇవ్వవా..ప్లీజ్ ! అని కాల్ చేసి అడగ గానే.. పది పదిహేను మైళ్ళు  ఆ అర్ధ రాత్రి ప్రయాణించి ఆ అమ్మాయికి ఫోన్  చార్జెర్ ఇచ్చి వచ్చాడు.రిటన్ వచ్చాక ఆ అమ్మాయి నంబర్కి కాల్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ నిరంతరం  ఎంగేజ్.  చూడు నాకోసం బకరా గాడు ఎలా బలి అయ్యాడో అని ఒకటే నవ్వులని ఇంకో అమ్మాయి తెల్లవారి చెప్పేదాకా వీడికి  ఆ సంగతి తెలియలేదు. 

రామ్ తో నాలుగైదు నెలల నుంచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించి వీడికి హ్యాండ్ ఇచ్చింది. 
వాడు తన జీతం అంత ఇలాగే తగలబోస్తాడు.  ఇంటికి ఒక్క పైసా పంపడు. వాడే కాదు,చదువుకుంటున్న మగ పిల్లలు అందరు అంతే! తల్లి దండ్రులు కష్ట పడి సంపాదించి వీళ్ళు ఇక్కడ ఏం ఇబ్బంది పడతారో అన్నట్టు పొట్ట కట్టుకుని మరీ డబ్బు పంపిస్తే..వీళ్ళు ఇక్కడ ఐ మాక్స్ దియేటర్ లో సినిమాలు, అమ్మాయిలతో ట్యాంక్ బండలపై విహారాలు, పార్టీలు. అంతా విచ్చల విడి తనంగా ఖర్చు పెట్టడం చేస్తున్నారు. కొంచెమైనా భాద్యత లేదు. ఎందుకు వచ్చారో,ఏం చేస్తున్నారో అన్న వివేకం లేదు.వీళ్ళకి ఎవరు చెప్పినా తలకి ఎక్కదు.ఒకటి రెండు చేదు అనుభవాలు అయితేనే కాని నిజం ఏమిటో..గ్రహించరు. 

ఇంకో విషయం కూడా వీళ్ళు ఇలా అనేక మంది అమ్మాయిలతో కాలక్షేపపు తిరుగుళ్ళు తిరిగి రేపు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పై మనసు లోతుల్లో అనుమానం పెనుభూతం. ఈ అమ్మాయి ఇంకా వర్జిన్ గానే ఉందా? ఇన్నేళ్ళు   ఎవరు బాయ్ ఫ్రెండ్ లేకుండానే ఉందా? అనే అనుమానపు దోరణి మొదలై నిత్యం మానసిక అశాంతితో నలిగి పోతున్నారు. మా ఆఫీసులో పనిచేసే రమేష్ అలాగే చేసాడు. 
ఓ..పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదివింది. ఒక్కటే కూతురు. బాగా ఆస్తిపరులు. మంచి ఉద్యోగం ఉందని రమేష్ కి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. ఆ రమేష్ భార్యతో మాట్లాడిన తొలి మాట .."యెంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదే నీకు తొలి అనుభవమా! నిజం చెప్పు ? అని అడిగాడట. ఆ అమ్మాయి వెంటనే ఆ గదిలోనుంచి బయట పడి పెద్ద వాళ్ళతో చెప్పింది. "జీవితాంతం ఇలాగే అనుమానిస్తాడు. ఆతను నాకొద్దు " అని చెప్పిందట ఆ అమ్మాయి. మూడో రోజుకల్లా వివాహం రద్దు చేసుకున్నారు.అని చెప్పాడు వేణు దీర్ఘంగా నిట్టూరుస్తూ .

అన్నయ్యా.. నేను ఎక్కువ చెపుతున్నాననుకోకు, లోపం ఎక్కడుందో తెలియడం లేదు. తొలివలపు తీయదనం బ్రతుకు అంతా తీయం గా మిగిలిపోవాలి కానీ ఇప్పటి స్పీడ్ యుగపు పిల్లలకి ఏవి అవసరం లేదు. అంతా స్వేచ్చ కావాలి. అది ఇచ్చినా కష్టమే! ఇవ్వక పోయినా నష్టమే! చదువులు,ఉద్యోగాలు,సంపాదనలు ఇవి తప్ప ఏమి వద్దు. నైతిక విలువలు..ఏవి అవసరం లేదు. అంతా ఎంజాయ్మెంట్. అంతే!

ఆడ పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల దగ్గర ఖరీదైన గిఫ్ట్ లు ఉన్నా ఇది ఎక్కడిది..అని పట్టించుకోవడంలేదు. ఏ లవ్ ఎపైరో..బయట పడినప్పుడు, లేదా తల్లిదండ్రులు పెళ్ళికి అంగీకరించనప్పుడు ఇంటి నుండి వెళ్లి పోయినప్పుడో, అవాంచిత గర్భం ధరించినప్పుడు తప్ప బయట పడని విషయాలు ఇవి. 
వీటన్నిటి మధ్య బుద్దిగా చదువుకుంటున్న అమ్మాయిలకి ఇబ్బంది ఉంది.కొందరిని చూసి అందరిని ఒకే గాట కట్టే పరిస్థితుల్లో.. అమ్మాయిల భవిష్యత్  గురించి  ఇంట్లో తప్పని సరి దిగుళ్ళు ఉంటున్నాయి. 

సామాజిక పరమైన సమస్యలు కొన్ని, కొని తెచ్చుకునే సమస్యలు కొన్ని. వీటన్నిటి మధ్య యువతరం పరుగులు పెడుతుంది. ఆకర్షణ,ప్రేమ,మొహం,విలాస వంతమైన జీవన విధానం,కాలక్షేపపు ప్రేమ,నిజమైన ప్రేమ ఏమిటో..ఈ గడబిడ. ఎక్కడికో ఈ పరుగులు ? ఏం సాదించాలనో అర్ధం కావడం లేదు అంది హేమ. 

శ్రీను హేమ వంక ఆశ్చర్యంగా చూసాడు."యెంత ఎదిగింది..నా చిట్టి చెల్లెలు" అనుకున్నాడు.

అందరూ  మౌనంగా ఉండిపోయారు. 

ఏవేవో ఆలోచనలతో పక్కపై దొర్లుతూనే ఉన్నాడు శ్రీను. తెల్లవారిన తర్వాత తన ఊరికి తిరిగి వెళ్ళాడు . సుధ విషయం  కరుణక్క కి చెప్పాలని నోటి వరకు వచ్చి  చెల్లెలకిచ్చిన మాట గుర్తుకు వచ్చి  ఆగి పోయాడు. 

కొన్నాళ్ళకి.."సుధ" ప్రేమించిన వాడు  పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేసి మోసం  చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని   ప్రేమించినతని ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న విషయాన్ని  ప్రత్యక్ష ప్రసారాలలో చూసి ఆశ్చర్య పోలేదు కానీ.. కరుణక్క ..నా కూతురు  వొట్టి అమాయకురాలు అని ఏడవడం చూసి జాలి పడ్డాడు శ్రీను.

యెంత ప్రేమించినా అమ్మాయిలు ఆ విషయం లో  జాగ్రత్త పడొద్దూ ! అని ఊర్లో జనం అనుకుంటుంటే పట్టణ పిల్లల వన్నీ పిదప బుద్దులు , ఆ రహస్యాలు తెలియకుండా పల్లె నైనా కాస్త స్వచ్చంగా ఉండనీయాలి అనుకున్నాడు శ్రీను    అది సాధ్యం కాదని అనుమానం ఉన్న సరే !  


14 వ్యాఖ్యలు:

పల్లా కొండల రావు చెప్పారు...

సమకాలీన సమస్య ఇది. దీనికి అసలు కారణం ఏమిటి? అనేది విశ్లేషిస్తే సమగ్రత వచ్చేది. కుటుంబ వ్యవస్త దెబ్బతినడం. ప్రపంచీకరణ నేపధ్యం లో కన్స్యూమరిజం పెరగడం , విచ్చలవిడితనాన్నే స్వేచ్చ అని భ్రమ పడడం అనే అంశాలకు వివరణ ఉంటే బాగుండేది. ఆధిపత్యప్రదర్శన కోసం అమ్మాయిలు - అబ్బాయిలు కుటుంబ విలువలను మంటగలపడం - తల్లి దండృలను వారి ఆశలను వమ్ము చేయడం అనేవి చక్కగా చెప్పారు వనజ గారూ !

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

నేటి తరాన్ని కంటికి కనపడేలా చెప్పారు అండి... మీరు చెప్పిన ప్రతివాఖ్యం రోజు చూస్తున్నదే... చాలా బాగుంది అండి...

జ్యోతిర్మయి చెప్పారు...

తరం మారుతున్నది...నడవడికలో మంచి చెడుకు మధ్యనున్న గీత చెరిగిపోతోంది..,తెలిసుకునే రోజు వస్తుంది...చూడడానికి మనవుండం...అంతే తేడా.

SNKR చెప్పారు...

ప్రస్తుతం జరుగుతున్న వాస్తవాలు చెప్పారు, హూ.. నిజమే.

పల్లా గారు చెప్పినట్టు ప్రపంచీకరణ, దోపిడిదారీ, బూర్జువా దారీ విధానాలే అందుకు కారణమయివుండచ్చు. :)

వనజవనమాలి చెప్పారు...

కొండలరావు గారు.. మీరు చెప్పినదానితో..నేను ఏకీభవిస్తున్నాను. యువత పెడ దోరణి గురించి విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. నేను ఈపోస్ట్ ఒక కోణం ని నేను చూపే ప్రయత్నం చేసాను. మరి కొన్ని పోస్ట్ లలో.. వీటి గురించి వ్రాసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

బాలు గారు .. వాస్తవాలని అంగీకరించని యువత ..నా పై దండెత్తకుండా ఉంటె చాలు. వీలైనంత వరకు ..మంచి -చెడు తెలియాలంటే..తల్లిదండ్రుల మాట ని వినడం మంచిదేమో..కూడా. ఆలోచించి చూడండి.

అమ్మాయిలూ కూడా కొన్ని సరిహద్దు రేఖలని దాటడం.. చేటు చేస్తుందని గుర్తించడం లేదు. ఈ దేశానికి మంచి యువశక్తి ఉంది. దానిని నిష్ప్రయోజనం చేసుకోవడం గమనించడం లేదు ..గమనించండి అని చెప్పడమే నా ఈ పోస్ట్.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు..మార్పు రావాలనే ఆశిద్దాం. చెప్పడం,అవగాహన కలిగేలా చెప్పడం మన భాద్యత అనుకుంటాను నేను. ధన్యవాదములు.

@ SNKR గారు ప్రపంచీకరణ నేపధ్యంలో.. చాలా మారిపోతున్నాయి.కాదనము.కానీ మన జీవన విధానం లో ఇలాటి మార్పులని అంగీకరించలేక తలెత్తిన సంఘర్షణలు .ఇవి. మన యువత వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు..అన్నది వాళ్ళు తెలుసుకుంటే.. బాగుంటుంది అనేది నా ఉద్దేశ్యం.

స్పందించి నందులకు ధన్యవాదములు.

శ్యామలీయం చెప్పారు...

పెద్దవాళ్ళు యువత పెడధోరణి అని నిరసిస్తారు.
చిన్నవాళ్ళు పెద్దల సంకుచితత్వం అని నిరసిస్తారు.
తరాల అంతరం!

కాని ప్రకృతిధర్మాల గురించీ, నైతికవిలువల గురించీ, వివాహవ్యవస్థను గురించీ పాఠశాలల్లో చెబుతున్నారా? పిల్లలకు తలిదండ్రులు శ్రధ్ధ తీసుకుని బోధిస్తున్నారా?

ఆకర్షణల వెంబడి పరుగులెత్తటం పిల్లల తప్పుకాదు. అది సహజం. విలువల గురించీ, జీవితం గురించీ బోధించటాన్ని నిర్లక్ష్హ్యం చేయటం అసహజం. అది పెద్దల పెద్ద తప్పు.

సినిమా హీరోలూ, క్రికెట్ వీరులూ మన యువతరానికి ఆదర్శం అవుతుంటే నిశ్శబ్దంగా చూస్తున్నాం. నిజమైన ఆదర్శవ్యక్తుల గురించి మనం వారికి పరిచయం కూడా చేసేంత తీరిక లేకుండా ఉన్నాం.

ఒక ఛానెల్‍లో వివేకానందుడి జీవితమూ కృషీ గురించి ఫీచర్ ప్రోగ్రాం వస్తున్నది. మరొక ఛానెల్‍లో ఒక క్రేజీ హీరోగారి హిట్ సినిమా వస్తున్నది.

పిల్లలు యేది చూస్తారు?
పెద్దలు యేది చూస్తారు?

నిజానికి నేటి పిన్నాపెద్దా అంతా సినిమాయే చూస్తారు.

ముందు యెవరు సిగ్గు పడాలి? ముందు యెవరు బాగు పడాలి? తమకే అంతగా తెలియని, పట్టని ఆదర్శవ్యక్తుల గురించి పెద్దలు పిన్నలకెలా చెబుతారు? యెలా యేమని మార్గదర్శకత్వం చేస్తారు.

ఒక పిల్లవాడు లేదా పిల్ల మంచి మంచి రాంకులు తెచ్చుకోవాలీ, పెద్ద పెద్ద చదువులు ప్రఖ్యాతి గల సంస్థలలో చదవాలీ అనే పెద్దల యావ. పిల్లలకు తమదైన దేశం, భాష, సంస్కృతి వంటి వాటి గురించి యేమీ తెలియకపోయినా పెద్దలకు నేడు పట్టటం లేదు.
బాగా చదివేసి యువతరం కాస్తా అమెరికాకు అమ్ముడుపోతే ముందు మురిసి ముక్కలైపోయేది యీ పెద్ద తరమే. (వారికి వృధ్ధాప్యం వచ్చాక పిల్లల విలువ అవసరం తెలుస్తుంది కాని పిల్లలకు వీళ్ళ విలువ అవసరం యేమీ ఉండదు, తెలియదు! అలా పెంచారు మరి)

ఎంతసేపూ డబ్బుల మొక్కల్లాగా యంత్రాల్లాగా పెంచుతూ అలా పెరిగే పిల్లలను మనమే సాంస్కృతికంగా వెనకబడిపోతున్నారని వాపోవటం భావ్యమా?

పరిమళం చెప్పారు...

ప్చ్ ....చేదుగా ఉన్నా వాస్తవమే!

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం..గారు మీరు చెప్పిన విషయాలు.. తో నేను ఏకీభవిస్తాను. తరం -తరం కి ఆలోచనా విధానంలో మార్పు సహజం గానే ఉంటుంది. అందుకు ఎవరు ఏం చేయలేకున్నా.. పిల్లలకి మంచి విషయాలు బోదిన్చాకుండా ఉండలేరు కదా! స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

@ అజ్ఞాత గారు.. ఇంతకూ ముందు కూడా చాలా మంది ఈ విషయం పై వ్రాసి ఉంటారు. చదివి ఎవరైనా ఆలోచించి ఉంటారో లేదో నాకు తెలియదు. విషయాన్ని సీరియల్గా కొనసాగించే ఉద్దేశ్యం నాకు లేదు. మీరు ఇంతకూ ముందు వ్రాసిన వారి అభిప్రాయాలు చదివి ఉంటారు కదా! మరి నా బ్లాగ్ లోకి ఎందుకు అడుగిడి..ఇలా ఫేక్ ID తో వ్యాఖ్య చేయడం ఎందుకండి? ఫేక్ ID తో..వ్రాసిన వారి వ్యాఖ్యలు కి నా బ్లాగ్ లో స్థానం లేదు. అయినా కూడా ధన్యవాదములు. ఇంకొకరు ఇలా ఫేక్ ID తో వ్రాసినా ప్రచురించను..అని చెప్పడానికే.. ఈ సమాధానం.

వనజవనమాలి చెప్పారు...

తెలుగు పాటలు బాలు గారు.. మీ వ్యాఖ.. పొరబాటున డిలేట్ అయింది. సారీ..అండి.

@ పరిమళం గారు.. టపా చదివి వ్యాఖ్య వ్రాసినందులకు ధన్యవాదములు.

సమాజంలో పోకడలు గమనించి మన పిల్లలని అయినా జాగ్రత్తలు తీసుకుంటూ..వాళ్ళకి అవగాహన కల్పించాలని.. చిన్న ప్రయత్నం.

జలతారువెన్నెల చెప్పారు...

వనజ గారు, ఇప్పుడే చదువుతున్నానండి మీ పోస్ట్... చాలా బాగా రాసారండి.
సుధ అయినా, సుధామ అనే అబ్బాయి అయినా తల్లి తండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళు లెఖ చెయ్యకుండా జీవితాన్ని ఒక పద్దతి లేకుండా గడిపితే ముగింపు సుఖాంతం అవ్వదు కదండి.

Harinath Mallepally చెప్పారు...

It is bound to happen like this because of the sudden changes and flow of money. World is more open now. The way I see is that parents need to be more friendlier and also discuss and explain pros and cons of the so called taboo things. More restrictions and sudden freedom and peer competition are resulting in situations like this