23, అక్టోబర్ 2015, శుక్రవారం

పిడికిట్లో పూలు

బస్ దిగి రేడియో స్టేషన్ వైపు అడుగులు వేసాను . గేట్ ప్రక్కనే  కొబ్బరి బొండాల బండి.   దాహంగా ఉందని అటువైపు అడుగులు వేసాను
ప్రక్కనే  కమలాలు అమ్ముతున్న సైకిలిస్ట్.
లోపలినుంచి  ఇద్దరు మహిళలు వచ్చి  "కమలాలు  ధర ఎంత ?" అడిగారు
" కేజి నలబై రూపాయలండీ"
 " అంతకన్నా తక్కువకి రావా ?"
"ముప్పై తొమ్మిదికి కూడా రావండీ ! "
"చూడు..  జనం ఎంత డిమాండ్ గా ఉన్నారో ! ఛీ .. మనకే  ఏమి చేతకాక చస్తున్నాం . తెల్లవారుఝామునే లేచి  రోడ్డున పడొచ్చి డ్యూటీలు చేసినా నాలుగైదునెలలకి కూడా  జీతాలు పడవు. అందులో పది శాతం కటింగ్" నిసృహగా అంది పచ్చ చీరామె
అలా వెళ్ళి క్యాంటిన్లో కూర్చుందాం పద .. అంటూ అటువైపు అడుగులేసారు. నేను కలవాల్సిన వ్యక్తి  కూడా అక్కడికే వచ్చి కలుస్తానని చెప్పడంతో   నేను వారి వెనుకనే క్యాంటిన్ లోకి వెళ్ళాను. వాళ్ళు  మూలగా ఉన్న ఓ టేబుల్ ని వెదుక్కుని కూర్చున్నారు 
వినాలని కాకపోయినా కాలక్షేపం కోసం వారి మాటల్ని వినడంపై దృష్టి పెట్టాను .
 "అవును మరి ! తోటోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలన్నట్టు..  ప్రెవేట్ చానల్స్ తో పోటీ పడి ఈ 04:53 కి ప్రసారం మొదలెట్టినా వారితో దీటుగా విషయాన్ని అందించే విషయంలో వెనుకబడే ఉన్నామన్నది  మనవాళ్ళకెప్పుడర్ధం  అవుతుందో ! వార్తలు తప్ప రెండు గంటలు పాటు భక్తి గీతాలు వినలేక చస్తున్నామని శ్రోతలు చెప్పే అభిప్రాయం  ఎవరికి కావాలి ? ఎయిర్ లోకి ఏదో ఒకటి వెళ్ళిందే లెక్క " అంది ఎల్లో చుడీదార్ వేసుకున్నామె
"ఆ రజని చూడు... ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ మీద ఎంత దైర్యంగా కంప్లైంట్  చేసిందో  గుర్తుకొస్తే  ముచ్చటేస్తుంది. మనకంత దైర్యం ఎక్కడ చచ్చింది ? "  " మనం కంప్లైంట్ చేస్తే  విచారణ చేస్తున్నామంటూనే డ్యూటీలకి దూరం చేస్తారు, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారు . చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతుందని వాడి చేష్టలని తప్పని సరై భరించేవారిలో మనమూ  ఉన్నాం "
  “అవును పైకి చెప్పుకోవడమూ సిగ్గు చేటు కూడా అన్నట్లు “
"ఆ పోగ్రాం ఎగ్జిక్యూటివ్  రిటైర్ అయ్యే వయసులో కూతురి వయస్సు ఉన్న వారితో కూడా అసభ్యంగా ప్రవరిస్తాడు. స్టేషన్ డైరెక్టర్ మేడమ్ కూడా అన్నీ తెలిసి మౌనం వహిస్తారు. తోటి  ఆడవాళ్ళ బాధలని ఆమె కూడా అర్ధం చేసుకున్నట్లు ఉండదు, రజని ఎంత బాధపడిందో . ఆఖరికి వేరే సెక్షన్ కి మార్చమని కూడా రిక్వెస్ట్ చేసింది  అయినా ప్రయోజనం లేదు .  ఆఖరికి ఉద్యోగం మానేసి వేరే ఊరుకి మారిపోయింది  ప్చ్ పాపం ." 
"ఎంతైనా అక్కడ స్కిల్స్ పేరిట అగ్రకులాల వారికి పెద్ద పీట వేయడం, తతిమా వారిని అణగద్రొక్కడం ఇప్పటిదా ఏమిటీ ? అరవై ఏళ్ళకి పైగా జరుగుతున్నదే! అది ఇప్పుడూ జరుగుతుంది అందులో కొత్తేముందే? "
" అవును .. పేరెన్నిక గల కార్యక్రమాల నిర్వహణంతా వాళ్ళ వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది. ఎక్కడన్నా చూడు.. ఆ కులం వాళ్ళకే పట్టం కడతారు   ఇవి  మనలాంటి  కాజువల్ ఉద్యోగస్తుల కష్టాలు మాత్రమే కాదు. డైరక్ట్ గా రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకి కూడా ఈ బాధ తప్పడం లేదు  కులం పేరిట, మతం పేరిట వాళ్ళని వెనక్కి వెనక్కి నెడతారు కదా !" 
"అసలు ఆ కృష్ణ  ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాడు . డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ! కమర్షియల్స్ కూడా వెళ్ళవు ఒకోసారి.  వరుసలో పాటలు పెట్టేసి క్యాంటీన్ లోనూ, గేటు వెలుపల ముచ్చట్లు పెడతాడు  అతని మీద ఎలాంటి యాక్షన్ ఉండదు  " 
ప్రసారమయ్యే  కార్యక్రమాలలో ఉన్నంత  ఉన్నత బాషా సంస్కారం  వారి మాటల్లో కాగడా పెట్టి వెతికినా కనబడదు , వారి క్రింది ఉద్యోగాల చేసే వారిపై అశ్లీల పదజాలం తో చేసే కామెంట్స్.. వినకూడదనే అనుకుంటాం కానీ వినక తప్పదు ఏం చేస్తాం ఖర్మ కాకపొతే ! 
 "వాడి ప్రవర్తన రోజురోజుకి శృతి మించిపోతుంది.  ఏం చేయాలి ? డ్యూటీ చేసేటప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుంటాడు, ఈవెనింగ్ డ్యూటీ అయిన తర్వాత పైన ఆఫీస్ గదిలోకి రా ! నేను అక్కడే ఉంటాను అంటాడు నేను ఏదైతే అదవుతుందని  వెళ్ళకుండానే వెళ్ళిపోయాను  మొన్నటికి మొన్న కాంట్రాక్ట్  పెట్టడానికి వెళ్ళినప్పుడు  పై నుంచి  క్రింది దాకా చూసి  " బాగున్నావ్ " అన్నాడు.
 ఈ రోజు  ఎదురుగా వచ్చి కూర్చుని  గంట సేపు  కూర్చుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెపుతూ  తినేసేటట్లు చూస్తూ .."మన పరిచయమయ్యి ఏడాదయ్యింది నా అప్లికేషన్ సంగతి పట్టించుకోవడం లేదు" అంటూన్నాడు. ఇంతకన్నా అడ్వాన్స్ అయితే చూస్తూ ఊరుకోను . తగిన బుద్ధి చెపుతాను అంటున్న చుడీదార్ అమ్మాయిని వారిస్తూ   "కూల్  కూల్ . ఆ పని చేయడం వల్ల నువ్వు అల్లరి పడటం తప్ప ఏమి ఉండదు . ఉద్యోగం చాలా అవసరం కదా ! " పచ్చచీరామె.
"ఇది కళలకి నిలయమే కాదు ఈర్ష్యా ద్వేషాలకి, కుతంత్రాలకి, కుయుక్తులకి, ఆడవాళ్ళని చెరబట్టే  వేదిక  కూడా అనుకుంటే సబబుగా ఉంటుంది "
ఇలా  వేదన కలబోసుకున్న వాళ్ళ మాటలు వినడంలో మునిగి పోయాను . తర్వాత తేరుకుని   " అబ్బో .. ఇక్కడ కూడా ఇలాంటివి  చాలానే ఉన్నాయే ! " అనుకున్నాను. కాసేపటి  తర్వాత వారిద్దరూ  బై  చెప్పుకుని వెళ్ళిపోయారు . నేను ఎదురుచూస్తున్న మనిషి రానే లేదు.  రిసెప్షన్ లోకి వెళ్లి కనుక్కుంటే .. ఆ రోజు రికార్డింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని రేపు రమ్మని చెప్పారు . 
ఆ రోజు వెళ్ళిపోయి .. మరుసటి రోజు తొమ్మిదింటికల్లా రేడియో స్టేషన్ కి వెళ్ళి రిసెప్షన్ లో కూర్చున్నాను . నిన్న నేను చూసిన అమ్మాయిలలో చుడీదార్ వేసుకున్న   అమ్మాయి .. అటు ఇటు తిరుగుతూ రెండు సార్లు కనబడింది . ఎవరామె ? అని అక్కడే కూర్చున్న ఇంకొకామెని అడిగాను  "ఇప్పుడు FM లో డ్యూటీ చేస్తున్నారు కదా ! రీతూ అంటే ఆమే ! వండర్ఫుల్ వాయిస్ " అని అడ్మైరింగ్ గా చెప్పింది .
"ఓహ్.. ఆమె ఈమేనా ? మనిషికి వాయిస్ కి సంబంధమే లేదు "  అన్నాను .
కొత్త ఆర్జేస్ ఎంపిక జరుగుతుందంటే  నేను  అప్లై చేసాను  ఆడిషన్ టెస్ట్ కి వచ్చాను  ఎవరెవరో వస్తున్నారు .. రికార్డింగ్ రూమ్ లోకి వెళుతున్నారు, వస్తున్నారు. ఇంకా నా వంతు రావడం లేదు  విసుగ్గా ఉంది . అయినా సరే వేచి ఉండక  తప్పదు . చిన్నప్పటి నుండి కలలు కన్న  ఉద్యోగం . ఒక్క  ఆడిషన్ టెస్ట్ లో  సెలెక్ట్ అయితే  చాలు ..తనకున్న మాటల చాతుర్యం,  ఆంధ్రాంగ్ల  జాతీయ భాషల్లో ఉన్న పాండిత్యంతో  ఆర్జే సీట్ లో కూర్చుంటే చాలు  దున్నేయనూ ... అనుకుంటూ ఓపికగా కూర్చున్నాను. పదకొండు గంటలయింది .
రీతూ ...స్టూడియో లో నుండి బయటకి వస్తున్నారు . వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకున్నాను . మళ్ళీ మనసు మార్చుకుని నేను కూడా ఆర్జే  అయిన తర్వాతనే కో ఆర్జే గా  గర్వంగా పరిచయం చేసుకోవాలని ఆగిపోయాను.
అనుకున్నట్టుగానే .. నేను ఆడిషన్ టెస్ట్ లో పాస్ అయ్యాను . మూడు నెలల ట్రైనింగ్ పిరియడ్ అయిపోయిన తర్వాత  నేను కలగన్నట్టు ఆర్జే అయ్యాను . 
 రీతూ తో నాకు బాగానే పరిచయం పెరిగింది. అప్పుడప్పుడూ ఆమె రిలీవ్ ఆయే టైం నేను డ్యూటీ లో కి వెళ్ళేసమయాలప్పుడు  ఓ అరగంట సేపైనా మాట్లాడుకునేవాళ్ళం , ఆర్జే గా  పదేళ్ళ  అనుభవం ఉన్న ఆమె ఎన్నో మెలుకువలు , తెలియని విషయాలు చెప్పేవారు . ఎంతో నిబద్దతతో పని చేస్తున్న ఆమె నాకు బాగా నచ్చేసింది కూడా .  ఒక రోజు చెప్పులు లేకుండా స్టూడియోలో అటు ఇటు తిరుగుతున్న ఆమెని చూసి" రీతూ గారు  ".... అని పిలిచాను. దగ్గరకి రాకుండానే .. చెయ్యి ఊపి హాయ్ చెప్పింది . నేనే దగ్గరకి వెళ్ళి.. ఏంటీ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు ? అన్నాను .
"చెప్పు తెగింది" అంది నవ్వుతూ
ఎవరినయినా పంపి కొత్త చెప్పులు తెప్పించుకోకూడదా ?
ఏమైందిలే! ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా ! కొనుక్కుంటాను అంది .
"ఏమో బాబు! మీకేం నామోషీ అనిపించడంలేదా? నేనైతే  చెప్పుల్లేకుండా ఒక్కడుగు కూడా బయట పెట్టను. అదీ ఇలా ఆఫీస్ లో అయితే అసలు తిరగను " అన్నాను .
 "అచ్చాదిత శరీరాన్ని అనచ్చాదితం చేసి చూసే చూపుల తాకిడికన్నా  అనచ్చాదిత పాదాలు భూమిని తాకడటంలో  ఉండే ఇబ్బంది చాలా తక్కువ.  ఇందులో  ఎంతో  ఆనందం,  ఈ   స్పర్శ చాలా  బావుంది  తెలుసా ? "  నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అనుభవమవుతుంది "అంది.
ఆమె మాటల్లో ఏదో విషయం స్పురించింది .
"ఇంతకీ చెప్పు ఒకటే తెగిందా రెండు తెగాయా? వివరంగా చెప్పాలి " ఉత్సాహం అడిగాను 
"ఒక చెప్పు తెగిందా... రెండు చెప్పులు తెగాయా అన్నది ప్రశ్న కాదు . ఏ చెప్పు తెగినా నడకకి ఇబ్బందే కదా ! " అంటూ  స్టూడియోలోకి వెళ్ళిపోయింది.
ప్రోమోస్ చేస్తూ ఉన్నప్పుడూ దొరికిన గాప్ లో .. ఏం జరిగిందో చెప్పకూడదా .. అంటూ ఆసక్తిగా అడిగాను .
ఆమె నవ్వేసి ఊరుకుంది కాని చెప్పలేదు
ఈ లోపు  అసలేం జరిగి ఉంటుందో  అన్నది ఊహించుకుంటూ  ఉన్నాను.  ఆ  ముసలి నక్క పోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఈ రోజు కూడా FM సెక్షన్ లోకి వెళ్ళి కూర్చుని వాడి పైత్యం అంతా వెళ్ళగ్రక్కిందే  కాకుండా అడ్వాన్స్ అయి ఉంటాడు . అప్పుడు రీతూ అతనిని కాలికున్న చెప్పు తీసుకుని ఎడా పెడా బాదేసి ఉంటుంది. అందుకే చెప్పు తెగి ఉంటుంది .. ఇలా ఊహించుకుంటేనే కానీ నాకు  మనసు శాంతించలేదు .
ప్రోమోస్ రికార్డింగ్ పూర్తయ్యాక "రండి నా బండి  మీద చప్పల్ షాప్ కి వెళదాం , తర్వాత  బసేక్కి వెళ్ళిపోదురుగాని " అంటూ పిలిచాను.  
 "మనం పుట్టినప్పుడు చెప్పుల్లేవ్, నడక నేర్చినప్పుడూ చెప్పులు లేకుండానే నడక మొదలెట్టాం . మన కాళ్ళకి రాళ్ళు , ముళ్ళు గుచ్చుకోకూడదని అమ్మ,నాన్న చెప్పులేసి రక్షణ ఇస్తారు కానీ  చెప్పులు లేకుండా నడవడం కూడా నేర్పి ఉంటే ఆ నడకలో ఉన్న విలువ నీకీపాటికి తెలిసి ఉండేది . నాకు అలా నడవడం అలవాటేలే ! " అని నవ్వి ముందుకు నడిచింది. నా కర్ధమయింది  ఇక ఆమె తన ఆర్జే జాబ్ కి బై చెప్పేసిందని.
మరుసటి రోజు పేపర్లో అనధికార మహిళా ఉద్యోగులని వేధిస్తున్న అధికారి, లైంగిక వేధింపులు భరించలేక ఆర్జే ఆత్మహత్యా ప్రయత్నం.
త్వర త్వరగా ఆ హెడ్డింగ్ క్రింద ఉన్న వార్తా వివరాలన్నీ చదివాను. ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి రీతూ ఏమో అనుకున్న నాకు  ఆవార్త మా కేంద్రంలో పని చేస్తున్న అమ్మాయికి సంబంధించినది కాదని తెలియడం కొంత రిలీఫ్ నిచ్చింది కానీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఆరోజు  సీనియర్ ఆర్జేల మాటల్లో  ఇలాంటి వేదింపుల మాటలు చాలానే విన్నాను. ఇక్కడ ఒక్క చోటనే కాదు  అన్ని చోట్లా అంతే ! కనబడని హింస. అభద్రత మధ్య ఉద్యోగం చేయాల్సిందే !   ఎందుకు ఆడపుట్టుకనిచ్చావ్ భగవంతుడా ?  మగవాడి చేతుల్లో నలిగి పొమ్మనా ?  " కౌంట్ లెస్ ప్లవర్స్ క్రషుడ్ ఫరెవర్"
డ్యూటీ చార్ట్ చూసుకోవడానికి వెళ్ళాను. అక్కడ అందరూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్జే గురించే మాట్లాడుకుంటున్నారు
"ఈ నిమ్న కులాలు వాళ్ళున్నారు చూడండి! ... వారికి మనపై ఎప్పుడూ ఏడుపే ! ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వార్తలలోకి వెళతారు . తర్వాత డబ్బు పుచ్చుకుని కేస్ విత్ డ్రా చేసుకుంటారు . నా సర్వీస్ లో ఎన్ని చూడలేదు ఇలాంటివి ..  అంటూ ఒక సీనియర్ అనౌన్సర్ అసహ్య వ్యాఖ్య వింటుంటే ఒళ్ళు మండిపోయింది 
వాళ్ళు పొతే పోయారండి. ముందు వీళ్ళకి వస్తుందిగా తిప్పలు .. తీసుకెళ్ళి ఎక్కడో మూలాన వేసేస్తారు . అర్ధాంతరంగా మారిన దానికి ఫ్యామిలీ ఎంత సఫర్ అవ్వాలి పిల్లల  చదువులు అన్నీ డిస్ట్రబ్ అవుతాయి ..అని ఇంకొకరు 
ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటే అలా చేసుంటుంది? బ్రతకడం కష్టం అంటున్నారు. తన డైరీ లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు  ఎన్నో వ్రాసి ఉన్నాయట. ఆమె తమ్ముడు ఆ డైరీని చానల్ వారికి చూపుతున్నాడు... సాక్ష్యం అంత బలంగా ఉంటే.. కాదంటారేమిటండి.. అని ఇంకొకరు.   
ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ  ప్రక్కకి వెళ్లాను "వూస్తున్న ఉరికొయ్యల సాక్షిగా ...ఈ దేశంలో ఆడదాని భయం మగవాడి అహంకారం రెండు చిరంజీవులే ! " ఒక కవి వాక్యం గుర్తుకొచ్చింది.  ఇలా ఆత్మహత్య చేసుకోవడం  కంటే   వేధించేవాడిని  దైర్యంగా  కొట్టి  రోజుకొక  చెప్పు తెగ కొట్టుకున్నా తప్పు లేదు  కసిగా  అనుకున్నాను .  
పదకొండింటికి జరిగిన స్టాఫ్ సమావేశంలో మా ఎస్ డి  పేపర్లలో న్యూస్ చూపించి ఆ పేపర్ ని విసిరి కొడ్తూ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగినిల వల్ల మన స్టేషన్  పరువు గంగలో కలసి పోతుంది. అన్నీ తప్పడు ఆరోపణలే ! "
ఆమె అలా  వెనకేసుకుని రావడం చూస్తే అసహ్యం కల్గింది. "స్టూడియోలో ఉన్న అన్ని గదుల్లోనూ  సి సి కెమారాలేర్పాటు చేయిస్తే ఎవరు నిజం చెపుతున్నారో, ఎవరు అబద్దం చెపుతున్నారో తెలిపోతుంది కదా..మేడమ్" అన్నాను  నేను .
ఆవిడ చురుక్కున నా వంక చూసింది. 
"కొందరికి అంతరాత్మనే కళ్ళు మూసుకుపోయినా కెమెరా  మాత్రం కన్ను కప్పుకోదు మేడమ్! రీతూ గారు  ఇక్కడెందుకు జాబ్ చేయడం మానేసారో , విరిజ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అలాంటి వాటన్నింటికి సాక్ష్యాలు  అవే చూపుతాయి కదా  ".. నాకెంతో ఇష్టమైన  ఉద్యోగం  ఉంటుందో లేదోనని కూడా ఆలోచించకుండా అడగాల్సిన నాలుగు మాటలడిగి బయటకి  వచ్చేసాను.
(సమాప్తం )

కామెంట్‌లు లేవు: