30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

చరణ్ వాళ్ళమ్మ

పెళ్లి అనేది రెండు మనసులని కలిపే యేక తాళం మాత్రమే కాదు.రెండు కుటుంబాలని కలిపే వంతెన కూడా..అనిపించిన సందర్భం ఒకటి.


మరునాడు వుదయమే నిశ్చితార్ధం జరుగబోతుండగా  చరణ్ ఆ రోజు  వుదయాన్నే  కాబోయే అత్తవారింటికి వచ్చాడు. 

ఆ ఇంట్లో ఆశ్చర్యం. ఏమిటీ యీ   అబ్బాయి యిలా వచ్చాడు అని. మధ్యవర్తితో మాట్లాడిన విషయాలు కాకుండా యింకా  యేమైనా మాట్లాడాల్సినవి  వు న్నాయా? ఏం లిస్టు వినిపిస్తారో యేమిటో!గుండెల్లో గుబులు అమ్మాయి తల్లి దండ్రులకు.

అమ్మాయి పెళ్లి అంటేనే మధ్య తరగతి కుటుంబాలలో మోయలేని బరువు. ముందు అమ్మాయి చదువుకుని వుంటే  చాలు అంటారు.తర్వాత కట్నం యేమీ  అక్కర్లేదు,అయినా వాళ్ళ అమ్మాయిని  వాళ్ళు వొట్టి చేతులతో పంపుతారా యేమిటీ.?.  ఉన్నది యిద్దరేగా!  యెలాగూ ఆస్తి హక్కులు వచ్చాయి గా..మేము ప్రత్యేకంగా అడిగేది యేముంది అంటారు. తర్వాత మేము కట్న కానుకలు అడగలేదు కదా, పెళ్లి మాత్రం ఘనంగా  చేయాలి అంటారు. పెట్టుపోతలు,సారె,చీరలు అన్నీ ఘనంగా జరపాలి. లేకపోతే కట్నం యెలాగునూ  లేదు. మరీ యేమి పెట్టలేని బీదవారి అమ్మాయిని  చేసుకుంటున్నారని బంధుమిత్రులలో వెలితి పడాలి అంటారు. ఈ మాటకే అమ్మాయి తల్లిదండ్రులకి  పెళ్లి ఖర్చులు తడిసి మోపెడయి  లక్షలలో  కనబడతాయి.

ఇలా ఆలోచిస్తూ టిఫిన్,కాఫీ మర్యాదలు అయ్యాక .. చరణ్ యిలా అన్నాడు. "ఆంటీ.. మీ  అందరితోను  వొకసారి మనసు విప్పి మాట్లాడాలి.  పల్లవిని  కూడా పిలుస్తారా? 

పల్లవి వచ్చాక అందరు కూర్చున్నాక.. ఇలా మీతో మాట్లాడాలని రావడం మీకు భయం కల్గించవచ్చు. మొన్న పెళ్లి చూపులప్పుడు అంతా హడావిడి..యెక్కువ మాట్లాడలేకపోయాం. ఇప్పుడు అసలు విషయంలోకి  వస్తాను . 
మా కుటుంబంలో అందరు వ్యవసాయ దారులు,వ్యాపారాలు చేసుకునేవారే. మా కుటుంబం నుండి ఈ తరంలో..నేను అన్నయ్య మాత్రమే బాగా చదువుకుని యెల్లలు దాటి  వుద్యోగాలు చేస్తున్నాం. 

మా అన్నయ్యది ప్రేమ వివాహం అని మీకు తెలిసే వుంటుంది. వదిన కూడా వుద్యోగం చేస్తుంటుంది.  రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. మా వదిన వారి తల్లిదండ్రులు,బందువర్గం అంతా విద్యాధికులు. ఉద్యోగాలు చేస్తున్నవారు. 

వదిన అన్నయ్య పెళ్ళికి ముందు ప్రేమించుకుని  పెళ్లి నిర్ణయాలు తీసేసుకుని యింట్లో తెలియజేసారు. అందుకు  అమ్మ-నాన్న యేమి నోచ్చుకోనులేదు. మనఃస్పూర్తిగానే వొప్పుకున్నారు. అమ్మకి ఆడపిల్లలు లేకపోవడం వలన మా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కోడళ్ళకి యేమేమి చీరలు పెట్టాలి,యెలాటి నగలు చేయించాలి అనే వొక సుందరస్వప్నం వుంది. ఆమె కోరికకి ఆలోచనలకి అనుగుణంగానే.. తన వడ్డాణం ని పెద్ద కోడలికి యివ్వాలని నిశ్చితార్ధం చేసుకున్న రోజు వదినకి పట్టు చీరతో పాటు ఆ ఆభరణాన్ని ఆమెకి బహుమతిగా ఇచ్చింది. అమ్మ పెట్టిన చీర, వడ్డాణం తో సహా   మా వదిన కుటుంబంలో వారికెవరికి  అవి నచ్చలేదు. పైగా వాళ్ళు మాకు యే విదమైన  సారె , చీరల ఆనవాయితీలు లేవు అని తెలివిగా  తప్పించుకున్నా కూడా  మాది పల్లెటూరు కనుక లగ్న పత్రిక పంపారని చెప్పి తనే మిఠాయిలు తయారు చేయించి గిఫ్ట్లు కొని అందరికి పంచింది అమ్మ .

ఇక వివాహ సమయానికి కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి యెన్నో సార్లు వదినని పిలిపించినా ఆమె రాలేదు సరి కదా.. ఆమె తరపు వాళ్ళతో కలసి వెళ్లి తనకి కావాల్సిన చీరలు  కొనుక్కుని ఆ షాపింగ్ తాలూకు బిల్లుని అమ్మకి పంపించారు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి కట్టే తలంబ్రాల చీరతో సహా  మంగళసూత్రం గొలుసు,నల్లపూసలు అన్నీ వాళ్ళే కొనుక్కుని అమ్మకి కనీస మర్యాద యివ్వకుండా చేయడం..మా అందరిని ఎంతో భాదించింది.ఏమైనా మాట్లాడితే.. అన్నయ్య ప్రేమ వివాహం చేసుకుంటున్నాడని  యిష్టం లేకనే వొంకలు పెడుతున్నారని అంటారని మౌనం వహించాము. 

అమ్మ ఎంతో..సెంటిమెంట్గా పెట్టిన వడ్డాణం కూడా పాత మోడల్ అని  పెళ్లి సమయానికి మార్చేసారు. అది మా నాన్న గారిని చాలా భాదించింది.తర తరాలుగా  కోడళ్ళకి బహుమతిగా ఇస్తున్న ఆభరణం అది. ఆఖరికి పెళ్లి సమయంలో అన్నయ్య కట్టుకునే బట్టలు తో సహా వాళ్ళే నియంత్రిన్చేసి మధు పర్కాలు బదులు షేర్వాని వేయించారు. ఒక్క మంగసూత్రం  మాత్రమే  మేము మా వదిన కోసం తయారు చేయించాం..అంటే ఆశ్చర్య పోవద్దు. 

పెళ్లి సమయంలో మా బందువర్గాన్ని పల్లెటూరి గబ్బిలాయాలని, వూరి వాళ్ళు అని, ముతక మనుషులని  నానా రకాల  మాటలతో , చిన్న చూపుతో బాధపెట్టారు. 

మూడు నిద్రలలో వొక్కరోజు తప్ప వదిన యిప్పటికి మా యింట్లో  నిద్రించిన రోజే లేదు. ఈ కాలపు అమ్మాయిలూ చాలా మంది అంతే! భర్త చదువు-సంద్యలు,ఆస్తి-పాస్తులు అన్నీ పెళ్లి అయ్యి  అవగానే  వాళ్ళకే సొంతం అయిపోవాలి.అతని కుటుంబం మాత్రం అవసరం లేదు అన్నట్టు వేరు చేసేసి,పక్కకు నెట్టేసి నిర్దాక్షిణ్యంగా కొంగుముడితో భర్తను కట్టేసుకుని వెళ్లిపోవాలి. పుట్టింటి వైపు బంధువులు కావాలి. అత్తింటి వారు అవసరం లేదు అన్నట్టు ఉంటారు. 

అన్నయ్య పెళ్లి అయిన తర్వాత ఒక నెలలోపే భార్య తీసుకుని విదేశాలకి వెళ్ళిపోయాడు. అమ్మ పోన్ చేసినప్పుడు 
 యెప్పుడైనా కోడలితో మాట్లాడతాను వొకసారి ..పోన్ యివ్వరా అంటే.. తన ప్రక్కనే  ఆమె వుండి కూడా లేదని చెప్పేవాడు.  ఒకసారి ఆమె మీ అమ్మ.. ఆమెతో నీకు మాటలుంటాయి కానీ నాకేం మాటలుంటాయి. నేను మాట్లాడను బాబు..అనడం అమ్మకి విన బడింది.అప్పటి నుండి ఆమె యెప్పుడూ కోడలితో మాట్లాడాలని అనుకోదు.

అమ్మతో నాకున్న సాన్నిహిత్యం వల్ల  అమ్మ మనసులో యేముందో నాకు తెలుసు. అందుకే..అమ్మ కి నచ్చిన అమ్మాయినే  చేసుకోవాలనుకున్నాను. నా యెంపిక కన్నా అమ్మ యెంపిక నాకు మంచిదవుతుంది అని నా అభిప్రాయం. అయిదుగురు మేనత్తల మధ్య మా అమ్మ ఆ యింటి  కోడలిగా యెన్ని భాద్యతలు మోసిందో యెన్ని మంచి చెడులుకి మధ్య వారధిగా   నిలిచిందో  మా మండువా లోగిలి చెపుతుంది. రెండు తరాల పెద్దవారిని రోగాలు నొప్పులు సాక్షిగా  అమ్మ స్వయంగా సేవ చేసి ముక్తులని చేసింది.  అలాటి మా అమ్మకి మంచి చెడు  విషయం తెలియంది కాదు. 

ఈ రోజు సాయంత్రం తన కాబోయే చిన్న కోడలకి వడ్డాణం,చీర  కొనుక్కోమని మీకు డబ్బు పంపాలని అనుకుంటుంది. దయచేసి ఆమెని అపార్ధం చేసుకోకండి. జరిగిన విషయాలతో అమ్మ మనసు నొచ్చుకుని యెవరి యిష్ట  ప్రకారం వారికి నచ్చినవి కొనుక్కుంటారు.మనది పాత తరం మనకి నచ్చినది వాళ్ళకి నచ్చాలని లేదుగా.. పట్టుదలకి పోయి మనమే తీసుకు వెళ్ళినా వాళ్ళు పెట్టుకోవడానికి యిష్టపడకపోతే..అదో బాధ.డబ్బుకి డబ్బు పోయే..మనస్సులో బేధాభిప్రాయాలు పెరుగుతాయి అంటుంది.  కాబట్టి  ఆమెని మీరు అర్ధం చేసుకుని అమ్మతోనే షాపింగ్ చేయించండి. ఆమెకి మనసులో వున్న  కోరికలని తీర్చుకునే ఆవకాశం ఇవ్వండి. పల్లవీ.. మీకు అమ్మ సెలక్షన్ నచ్చకున్నా సరే.. ఆమె యెంపిక  చేసినవాటిని  ఓకే చేయండీ! మీకు నచ్చిన వాటిని ముందు ముందు నేను కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాను..అని చరణ్  వివరంగా చెప్పిన తీరుకి ..ఆ ఇంటిల్లపాది ముఖాల్లో చాలా సంతోషం కనిపించింది. 

పెళ్లి అంటే రెండు మనసులని కలిపే యేక తాళం మాత్రమే కాదు రెండు కుటుంబాలని కలిపే వంతెన కూడా.. 

చాలా విషయాల్లో భిన్నాభి ప్రాయాలు తలెత్తి ఆగర్భ శత్రువుల్లా మెలిగే వియ్యపురాళ్ళని  చూసాను నేను. అలా మన కుటుంబాలు వుండకూడదని  నా కోరిక. ఇక మీతో యిలా వచ్చి ఈ విషయం చెప్పినందుకు మన్నించాలి. అరమరికలు లేకుండా చెప్పడం మంచిదని చెప్పాను.. తప్పైతే క్షమించండి అన్నాడు. 

చాలా సంతోషం బాబు.మీ అమ్మ గారి గురించి మీ కుటుంబం గురించి విని వున్నాం. ఇప్పుడు మీ మాటల్లో మరింత  తెలుసుకున్నాం. మీకు యే విధమైన లోటుపాట్లు జరగకుండా అనీ సవ్యంగా జరుపుతాము. మిమ్మల్ని యే మాత్రం నొప్పించం..అంది పల్లవి తల్లి. 

అయ్యో..నేను మిమ్మల్ని యిలాగే చేయండి అని చెప్పడానికి రాలేదండి. ఒకరి మనసులో మాట యింకొకరితో అనుకుని పెళ్లి పనులకి  పూనుకోండి అని చెప్పడానికి మాత్రమే వచ్చాను అన్నాడు చరణ్.

"అలాగే బాబు.."అన్నారు పల్లవి తల్లిదండ్రులు. 

అతను అన్నట్టుగానే ఆ రోజు  మధ్యాహ్నానికి  బంధువు   వొకాయనతో..  డబ్బు పంపి కోడలికి యిష్టమైన నగ, చీర కొనుక్కోమన్నారండి అన్న విషయం చెప్పి పంపారు. 

మేము కొనుక్కోవడం యేమిటండీ.. కాబోయే అత్తగారు ఆమె కోడలికి యే౦ పెట్టాలనుకుందో.. అవన్నీ స్వయంగా యెంపిక చేసి కొని  పెట్టమనండి. ఆమెకి తెలియదా ఆమె కోడలికి యే౦ బాగుంటాయి అన్నది అని సర్ది చెప్పి  వచ్చిన బంధువుని  వెనక్కి పంపారు. 

మళ్ళీ   ఒక గంటలో..చరణ్ తల్లి నుండి పోన్.. అమ్మాయిని తీసుకుని షాపింగ్ కి రండీ అంటూ.
పల్లవి.. మీ యిష్టం అండీ..అయినా నాకు అంత బరువైన,విలువైన నగలు వద్దండీ అని చెప్పింది.
అమ్మాయికి యే౦ నగలు వున్నాయి " యే౦ లేవు..  యే౦ కావాలి అలాటి విషయాలతో..వో అరగంట మాట్లాడి అన్నీ  తెలుసుకుని కావాల్సినవి అన్నీ కొని తెల్లవారేటప్పటికి బ్లౌస్ తో సహా అన్నీ  రెడీ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు.  చూసిన వారందరూ ఆమె సెలక్షన్ ని మనఃస్పూర్తిగా మెచ్చుకుంటుంటే.. యేమో అనుకున్నాను. మా అత్తయ్య గారి టేస్ట్ కి తిరుగు లేదు అంది పల్లవి. 

చూడ చక్కని ఎంపికతో.. సంప్రదాయంగా అన్నీ పెట్టి తాంబూలాలు మార్చుకుని పెళ్ళికి తేదీని నిర్ణయించుకుంటూ..  కళ్యాణమండపాలు అవీ బోలెడు ఖర్చు,ఆడంబరాలు, భోజనాల సమయంలో నిలబడి తినడాలు.వెనుక నిలబడి కాచుకు కూర్చోవడాలు సంతోషం లేకుండా చేస్తున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని మా యింటికి  పంపితే   విశాలమైన స్థలంలో మా ఇంటిముందుపెళ్ళి చేసుకుంటాం అన్నారు. మీ ఆలోచన బాగుంది.నేను అమ్మ నాన్నలని వొప్పిస్తాను అని పల్లవి హామీ ఇచ్చేసి.. తల్లిదండ్రులని వొప్పించింది పెళ్లి ఖర్చులకి గాను కొంత డబ్బు  అమ్మాయి తరపు వాళ్ళు యిస్తారు ఆ డబ్బుని పుచ్చుకోవాలి  అన్న  మాట తీసుకుని ఆ  వొప్పందం  తోనే అమ్మాయి తరపు వాళ్ళు   పెళ్లి  జరపడమనే వేడుకని  చరణ్ వాళ్ళ పల్లెటూరికి మార్చేసారు. 

ఆ పెళ్ళిలో  పెళ్లి కూతురికన్నా  యెక్కువ అలంకరణతో..యెబ్బెట్టుగా విచిత్రమైన వస్త్రధారణతో వున్న పెద్ద కోడలిని  అందరూ విచిత్రంగా చూస్తుంటే.. సంస్కారం తెలియని నాగరికత తెలియని మూర్ఖులు అని తిట్టుకుంటా.. పల్లవిని చూసి మూతిముక్కు విరుస్తూ.. ఆపసోపాలు పడింది పెద్ద కోడలు. ఆమె తరపు బంధువులు పల్లవి పుట్టింటి వారిని కడు బీదవారుగా వర్ణించి పెళ్లి  చేసే స్తోమత కూడా లేదని హేళన చేయడం చూసి.. 

పెళ్లి అవుతుండగానే చరణ్ తల్లి  వొక విషయాన్ని ప్రకటించారు. 

ఈ పెళ్లి ఖర్చుకి గాను  పల్లవి తల్లిదండ్రులు అక్షరాల ఐదు లక్షల రూపాయలని బలవంతంగా తన చేతికి ఇచ్చారని ..ఆ మొత్తాన్ని వారి పేరిట ఒక అనాధ శరణాలయానికి విరాళంగా యివ్వడం జరిగిందని చెప్పారు. ఆ శరణాలయం నుండి అతిదిగా హాజరైన వ్యక్తి  వెంటనే.. వేదిక పైకి వెళ్లి ఆమెకి కృతజ్ఞతలు తెలుపుతూ.. 

పెళ్ళిళ్ళకి,పుట్టిన రోజులకి,శుభకార్యాలకి  స్తోమతని మించి ఖర్చు పెట్టడం అవి  మిగిలి పోయి చెత్త కుండీల పాల్జేయడం కన్నా కూడా  ఆర్తులకి, అన్నార్తులకి వుపయోగ పడే విధంగా పెద్ద మనసుతో వ్యవహరించాలని అభ్యర్ధించడం అందరిని ఆలోచింపజేసింది. 

ఈ పెళ్ళికి నేను వెళ్లాను.  చరణ్ తల్లి గారు మా వద్దకు వస్తూ ఉంటారు. ఆమె ఆలోచనా పరురాలే కాదు ఆచరణీయురాలు కూడా.   మీ  ఫోటో యివ్వండీ వొక  పరిచయం యివ్వాలి   అని అడిగితే నవ్వుతూ  సున్నితంగా తిరస్కరించి.. నా ఆలోచన పంచుకోవాలి కానీ నేనెవరు, యెలా  వుంటానో అందరికి చూపించడం ముఖ్యం కాదుగా అన్నారు. అందుకే ఆమె పేరు  చెప్పలేదు  కానీ  ఆమె పేరు చరణ్ వాళ్ళమ్మ. 
  

8 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

కథేమో అనుకుని చదివాను. చరణ్ కి వారి అమ్మగారికి అభినందనలు. 'పెళ్లి రెండు కుటుంబాలను కలిపే వంతెన' ఈ అవగాహన లేక ఎన్ని జంటలు మధుర స్మృతుల్ని కోల్పోతాయో! ఇంత మంచి విషయాన్ని పంచుకున్నందుకు వనజ గారూ థాంక్ యు

ravi చెప్పారు...

thanks for sharing about a great person

buddhamurali చెప్పారు...

వనజ వనమాలి గారు చరణ్ కు నా తరపున అభినందనలు తెలపండి . అతనిలో వయసుకు మించిన పరిణితి ఉంది . మంచి విషయాన్ని అందరి దృష్టికి తెచ్చారు

రసజ్ఞ చెప్పారు...

చాలా అబాగుందండీ ఇలా ఏ విషయాన్నయిన నిస్సంకోచంగా చెప్పగలిగితే అసలు గొడవలకు తావే ఉండదేమో! చరణ్-పల్లవిలకి శుభాకాంక్షలు. చరణ్ వాళ్ళ అమ్మగారు ఎందరికో మార్గదర్శకురాలు.

శ్రీ చెప్పారు...

చాలా మంచి సంఘటన ను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండీ!
చదివిన వారికి ఖచ్చితంగా ప్రేరణాదాయకంగా ఉంది.....@శ్రీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you very much Sreenivas gaaru.

opikagaa chadivi mee abhipraayam telipinanduku chaalaa santosham.

hari.S.babu చెప్పారు...

కధ బాగుంది, అల్లాంటి పెళ్ళికొడుకు తల్లులకి జయహోలు చెప్పాలి. కానీ తలకట్టు(Title) మాత్రం - ఒక బెయిలు రెండు రాష్ట్రాలు - అనే మాటని గుర్తు చెసింది :-)

rajachandra చెప్పారు...

elanti vallu inka unnanduku... chala happy ga undi..