10, ఫిబ్రవరి 2014, సోమవారం

బిర్యానీ



బిర్యానీ 

"అమ్మా !  అయ్యగారు వచ్చారమ్మా, వొకసారి బయటకి రండమ్మా " వరండాలో నుండి పిలుపు . 

నన్నెవరలా పిలుస్తారు  అనుకుంది రాధ. ప్రక్క యింటిలో నుండి వినబడుతున్న మాటలేమో!  

"అడుగు కూడా ఖాళీ వదలకుండా ప్రక్క ప్రక్కనే యిళ్ళు కట్టడం వల్ల యెవరు యెవరితో మాట్లాడుతున్నారో, యెవరిని వుద్దేశ్యించి మాట్లాడుతున్నారో అర్ధమై చావదు "  మనసులో విసుక్కుంటూ పని చేసుకుంటూనే వుంది 

"అమ్మా,  అయ్యగారు వేచి చూస్తున్నారు,  బయటకి రండమ్మా " మళ్ళీ పిలుపులు . 

"నా కోసం వేచి  చూసే అయ్యగారెవరబ్బా  " చేస్తున్న పని వొదిలేసి చిన్ని టవల్ తో చేతులు తుడుచుకుంటూ  "యెవరూ " అనుకుంటూ వచ్చి తలుపు తీసి తెరని ప్రక్కకి నెట్టి చూసింది 

ఎదురుగా ఓ విప్రుడు. వెనుక యింకొకతను. ఇద్దరూ త్రిపుండములు ధరించి వున్నారు . రాధ గౌరవంగా చూస్తూ  "చెప్పండి,యేమిటి పని " అడిగింది. కాస్త పెద్దరికంతో వున్నాయన యేమి మాట్లాడలేదు.  

 వెనుక వున్తను  ముందున్నతనిని   పరిచయం చేస్తూ "అయ్యగారు సత్యనారాయణ పురం లో వుంటారు . దైవజ్ఞులు. ఎప్పుడు భగవంతుని ద్యాస, సేవ తప్ప యేమి సంపాదన లేదు . నలుగురు ఆడపిల్లలు . రెండో అమ్మాయి వివాహం చేయదలచారు. మరో నాలుగు రోజులలో వివాహం జరగనున్నది. మీ లాంటివారు నలుగురు సాయం చేస్తే అమ్మాయి పెళ్ళి జరుగుతుంది " చెప్పాడు. 

పాపం, సంపాదించడం చేతకాని బ్రహ్మణునిలా వున్నాడు. ఈ రోజుల్లో  చాలామంది పౌరోహిత్యం పేరిట  నోటికొచ్చిన నాలుగు మంత్రాలు  చదివి బ్రహ్మాడంగా సంపాదిస్తున్నారు. ఇక్కడ సాయిబాబా గుడిలో  వుండే పూజారి గారు అమెరికా వెళ్లి బోలెడంత  సంపాదించి  పంపుతున్నాడు. అలా అమెరికా వెళ్ళే అవకాశం  యితనికి వస్తే  బావుండును. మిగిలిన అమ్మాయిల కన్యాజీవితానికి   విముక్తి కల్గుతుందేమో. పోనీ..అలా కూడా  సంపాదించడం యిష్టం లేదేమో యీ సాదు బ్రాహ్మణుడుకి.   ఇలా సాయం చేయమని అడిగేవాళ్ళని చూడటం కూడా  అరుదు. అతనికి నోరు తెరిచి అడగటానికి కూడా అభిమానం అడ్డొస్తుందిలాగుంది.  అందుకే వేరొకతను సహాయంగా వచ్చాడు.  అయినా  ఆడపిల్ల పెళ్ళి అంటున్నాడు కదా ! ఏదో కొంత  సాయం చేస్తే ఫలితం అయినా దక్కుతుంది, పైగా విశేషమైన కార్తీక మాసం కూడానూ  మనసులో అనుకుంటూ .. 

" ఇప్పుడే  వస్తానుండండి "  అని చెప్పి  లోపలకి  వెళ్లి తన పర్స్ తీసుకుని తెరచి  చూసింది . ఎన్ని అరలు వెతికినా  అంతా కలిపి వంద రూపాయలు కూడా లేవు. ఇంత తక్కువిస్తే యే౦ బావుంటుంది అనుకుంటూ ఆలోచించింది.  

వెంటనే  ప్రొద్దున్నేభర్త బయటకి వెళుతున్నప్పుడు అడిగి తీసుకున్న డబ్బు సంగతి గుర్తొచ్చింది .. ప్రిజ్ద్ కవరులో వేసిన అయిదొందల రూపాయల కాగితం  తీసి తన దగ్గరున్న చిల్లరతో కలిపి .. అక్షరాల అయిదొందల  పదహారు రూపాయలని తాంబూలంలో పెట్టి  అతనికిచ్చి నమస్కారం చేసింది . 

అతనేమో దీవించడం కూడా మొహమాటంగానే దీవించి శిష్యుని వంక చూసాడు . "అమ్మా  అమ్మాయికి ఒక చీర రవికెల గుడ్డ కూడా యిస్తే బావుంటుంది. మీ చేతి చలవ"  అన్నాడు .

"ఇప్పుడేమి అలాంటివేవి యివ్వలేనండి  వెళ్ళిరండి అని చెప్పి లోపలి వచ్చేసి యిక పని తొందరగా అవాలని హడావుడి పడాల్సిన పని లేదు. మార్కెట్ కి వెళ్ళే పనిలేకుండా పోయింది. పాపం  రూప! ఇవాళ కూడా స్పెషల్ యేమి తీసుకువెళ్ళనందుకు చిన్నబుచ్చుకుంటుంది. ప్రెండ్స్ మధ్య  తనకి  చాలా అవమానంగా వుందని గొడవ పెడుతుంది . ఈ రోజు కూడా  యేదో విధంగా సర్ది చెప్పాలనుకుని యింట్లో ఉన్న  అలమారాలన్నీ వెతికి  దసరా పండగప్పుడు కొన్న గులాబ్జామూన్ మిక్స్   పేకెట్ తీసి ఆ వంటకం చేసే ప్రయత్నం మొదలుపెట్టిన  రాధ తమ పరిస్థితిని తరచి చూసుకుంది.  

మధ్య తరగతి బ్రతుకులు.  ఉన్న ఒక్క పిల్లకి మంచి చదువులు అబ్బాలని చిన్నప్పటి నుండి కాన్వెంట్ చదువులు , ఇంటర్మీడియట్ కి వచ్చాక కార్పోరేట్ కాలేజీలో చేర్పించడం వల్ల యెప్పుడూ డబ్బుకి వెలితి పడటమే!  కుటుంబ అవసరాలు కూడా తీరక కొనాల్సినవన్నీ  వాయిదా వేసుకుంటూ  అతి ముఖ్యమైనవి మాత్రమే కొని అవసరాలు నెట్టుకొచ్చే స్థితిగతులు. ఏం చేద్దాం ?   రూప చదువయ్యి యేదో ఒక మంచి వుద్యోగంలో చేరేదాక యిలా అవస్థలు పడక తప్పదు. ఆశతో కాలం నెట్టేయక తప్పదు అనుకుంది. 

 అయినా రూపకి తమ పరిస్థితులు అర్ధమయ్యే టట్లు చెప్పాలి. ప్రతి నెలా కొత్తబట్టలు కొనమని,  అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో సినిమాలకి, కెసిఎఫ్ కి వెళ్లాలని అడుగుతూ ఉంటుంది.  వద్దంటే అలుగుతుంది. నా ఫ్రెండ్స్ అందరూ చూడు యెలా వున్నారో ! వాళ్ళ పేరెంట్స్ అడిగినవన్నీ కొని తెస్తారు . మీరే నేనేమిడిగినా వెంటనే కాదనేస్తారంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది . 

నిజంగానే కాలేజీలో చదివే అమ్మాయిల తల్లిదండ్రులు  ప్రతి ఆదివారం వందల మైళ్ళు ప్రయాణం చేసొచ్చి  మరీ  బిడ్డల కోసం కాలేజీ ఆవరణలో పడిగాపులు  పడతారు. పిల్లలకిష్టమైన వంటలు, వుతికిన బట్టలు, కావాల్సిన పుస్తకాలు అన్నీ వేసుకునొచ్చి పిల్లలని చూడటానికి కళ్ళల్లో వొత్తులేసుకుని యెదురుచూస్తూ ఉంటారు.  ఏం  చదువులో,  పిల్లలకి, పెద్దలకి కూడా కష్టాలే అని తలపోస్తూ గులాబ్ జామూన్ చేసేసింది. తీరిగ్గా బయలుదేరి లంచ్ అవర్ కన్నా ముందుగానే రూప చదువుకునే కాలేజ్ లోకి అడుగుపెట్టింది రాధ 

అమ్మా ! అంటూ సంతోషంగా తల్లి దగ్గరకి వచ్చింది రూప . కూతురిని ప్రక్కనే కూర్చో బెట్టుకుని బాగా చదువుకుంటున్నావా, ఈ వీకెండ్ టెస్ట్ లో యెన్ని మార్కులొచ్చాయి, హైయెస్ట్ నీకే  వచ్చాయా ? ఆత్రుతగా అడిగింది . 

బాగానే వచ్చాయిలే, నీకెప్పుడూ మార్కుల గోలే తప్ప యింకొకటి పట్టదు .  ఇక్కడ ఫుడ్  పరమ వరస్ట్ గా పెడుతున్నారు తినబుద్ది కావడంలేదు. తినడానికి యే౦  తెచ్చావ్ ? 

గులాబ్ జామ్, ప్రూట్స్ తెచ్చాను. అటు వైపు  వెళ్లి  కూర్చుని తింటావా? 

అదేంటమ్మా ! ఫ్రెండ్ బర్త్ డే  అని చెప్పాను కదా ! నాన్ వెజ్  బిర్యానీ  చేసుకు రమ్మని చెప్పాను కదా! తెస్తావని నేనెంతగా  ఎదురు చూస్తున్నానో, ఛ.. నువ్వెప్పుడూ యింతే, నేనేది  అడిగినా కాదనే అంటావ్, వారం  వారం  ఫ్రెండ్స్ పేరెంట్స్ తెచ్చిన స్పెషల్స్  అన్నీ మెక్కి తింటున్నాను. ప్రెండ్  బర్త్ డే కదా, తన పేరెంట్స్  యీ వారం రావడం వీలవలేదు  కాబట్టి నిన్ను స్పెషల్ చేయమని అడిగాను. ఇంకా నయం దానికి ముందు చెప్పలేదు. చెప్పి వుంటే  నా పరువు పోయుండేది నిరాశగా, కోపంగా అంది రూప. 

సారీ తల్లీ ! నువ్వడిగిన నాన్వెజ్ బిర్యానీ చెయ్యాలనే అనుకున్నాను . మీ నాన్న గారు అయిదొందల రూపాయలు యిచ్చారు కూడా  మార్కెట్ కి వెళ్లి అన్ని తెద్దామనుకునేంతలో   ఒక పేద బ్రహ్మణుడు  వచ్చి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి  సాయం  చెయ్యమని అడిగాడు . కార్తీక మాసం కదా!  సాయం చేసినట్టు వుంటుంది, పుణ్యమూ  దక్కుతుందని   ఆ డబ్బు వారికి యిచ్చేశాను  సంజాయిషీగా చెప్పింది 

" పూజా సామాగ్రి కి,  దానాలు చేయాలంటూ  బాగానే ఖర్చు పెడతావ్ ! నా చిన్న చిన్న సరదాలు తీర్చడానికి  మాత్రం యెప్పుడూ యేదో వొంక  చెపుతావ్. ఇంకెప్పుడైనా నిన్ను యేమన్నా అడిగితే  వొట్టు. తెచ్చినవేవో యిలా  నా మొహాన పడేసి యిక నువ్వెళ్ళు  "  అని విసుక్కుంది రూప.

  బిర్యానీ దేముంది  యిప్పుడు తినకపోతే యింకో వారం తినవచ్చు. ఇతరులకి  చేతనైనంత సాయం చేయాలి, డైనింగ్ హాల్ కి వెళదాం పద, మీ ఫ్రెండ్ యెక్కడుంది ? తనని విష్ చేసి కాసేపుండి వెళతాను అంది. 

" ఏమి  వద్దులే! కురిపిచ్చిన ప్రేమ చాల్లే ! నువ్విక బయలుదేరు. నీకు మార్కులేగా కావాల్సింది యీ సారి కూడా క్లాస్ హైయెస్ట్ మార్క్స్ నాకేలే  "అంటూ తల్లి చేతిలో వున్న సంచీని లాక్కుని  విసురుగా  వెళ్ళిపోయింది  రూప.  

మనసు కలుక్కుమంది. ఈ పూజలు,దానాలు  యెవరి కోసం చేస్తాను . నీ కోసమే కదా ! నువ్వు చల్లగా వుండాలని  అనుకుంటూ మెల్లగా బస్ స్టాప్ కి వచ్చి తను ఎక్కాల్సిన   బస్ కోసం  యెదురు చూస్తూ  నిలబడింది . 

 ఆ కాలేజ్ క్యాంపస్ ఆనుకునే నాలుగైదు హోటల్స్, మూడు బార్ అండ్  రెస్టారెంట్స్ వున్నాయి  . అక్కడ బిర్యానీ  చాలా బావుంటాదని పేరు. అందుకే  ఆ చుట్టూ ప్రక్కలంతా బిర్యానీ వాసనతో  ఘుమ ఘుమ లాడుతూ ఉంది.  భోజనాల  సమయం కాబట్టి ఆ ప్రాంతం అంతా కిక్కిరిసి  కూడా వుంది. అలా చుట్టూ చూస్తూ తన ప్రక్కనే నిలబడి వున్న వారి  మాటలు వింటూ  ప్రక్కకి తిరిగి చూసి  యీ యిద్దరినీ యెక్కడో చూసినట్లుందనుకుంటూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది 

" బిర్యానీ సూపర్ గా వుంది బావా!  ఫైవ్ స్టార్  హోటల్స్ లో కూడా యిలాంటి థమ్ బిర్యానీ తిని వుండం. డబ్బుండాలే గాని రోజూ యిక్కడికొచ్చి  తిని వెళ్ళవచ్చు. ఇంటికి  పట్టుకెళ్ళవచ్చు  " యేమంటావ్? 

"అవునురా బావా! రెండు పూటలా  రెండు పెగ్గులేసి  వో బిర్యానీ పేకెట్ తినేస్తూ  హాయిగా యె౦జాయ్  చెయొచ్చురా కార్తీక మాసమడ్డం  పెట్టుకుని "  అంటూ యింకొకరు.

" ప్రొద్దునే కదా వీళ్ళని చూసింది ! అరె ! వీళ్ళు యిలా వున్నారేమిటి ? త్రిపుండాలేవీ,  మెడలో జంధ్యమేది " తెల్లబోయింది రాధ.

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

Climax adirindi.

Niru చెప్పారు...

Expected climax...but painful truth....but for people who are in real need are the actual losers because of such people....can't help but shun them away.....

కిరణ్ కుమార్ కే చెప్పారు...

ఇలాంటివి గుర్తొచ్చే ఎవరికైనా తెలియని వారికి సాయం చెయ్యాలంటే మనసొప్పదు.