5, జులై 2016, మంగళవారం

నెలవంక నవ్వింది

రషీద్ ... యెలా వున్నావు బేటా ! 
నువ్వెందుకో  ఫోన్ లో మాట్లాడటానికి కూడా దొరకడం లేదు. మీ అబ్బాజాన్ షెడ్ కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తావేమో నని కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్లి మీ అబ్బాజాన్ కి ఫోన్ చేస్తుంటే ఆయన విసుక్కోవడమే సరిపోయే ! వాడు ఫోన్ చేయగానే నేను పక్కింటి ఆయేషా కి ఫోన్ చేసి చెపుతానని చెప్పాను కదా, యె౦దుకు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసుగున పెడతావ్ అని కోప్పడుతున్నాడు. తల్లి ప్రేమ ఆయనకేమి తెలుసు ? అక్కడ రోటీ, చావల్ దొరకడం లేదని చెపుతూ వుంటివి.  సరిగా భోజనం చేస్తున్నావా ?  డబ్బు యెక్కువ కూడబెట్టాలనుకుని మీ యజమానురాలు యిచ్చే నిల్వ అన్నం తిని ఆరోగ్యం పాడు చేసుకోకు. కొద్దిగా వోపిక చేసుకుని వంట చేసుకో.  నీ యజమాని  తను ఫోన్ చేయగానే మాట్లాడటానికి వీలుగా స్నానం చేసేటప్పుడు కూడా టాయ్లెట్ లోకి కూడా ఫోన్ తీసుకుని వెళ్ళాలి అని అన్నాడని చెప్పావు కదా ! మరి మీ అబ్బాజాన్ ఫోన్ చేసినా నువ్వు యె౦దుకు ఫోన్ తీయడం లేదు. నాకు భయంగా వుంది బేటా ! యెట్లా ఉన్నావ్ ?

మన చుట్టుపక్కల వాళ్ళు  గల్ఫ్ కి పోయినవాళ్ళ కష్టాలు కథలు కథలుగా చెప్పుకుంటా వుండారు . నువ్వు క్షేమంగా వుండాలని దువా చేస్తున్నా ! తమ్ముళ్ళు ,చెల్లెలు అందరూ బాగున్నారు. అందరూ రోజా పాటిస్తున్నారు.  ఇఫ్తార్‌  సమయాన అందరూ నిన్ను తలుచుకుంటూ వుండారు. నువ్వు సౌదీకి వెళ్ళాక వొక రంజాన్ అయిపొయింది వొక దీపావళి అయిపొయింది . నువ్వు వెళ్ళడం నాకు యిష్టం లేకపోయినా నువ్వు వెళ్ళావ్ . నీకు వత్తాసు మీ అబ్బాజాన్ . దేశాలు తిరగాలి . బతకడం యెట్టాగో తెలుస్తుంది అని . మీ యజమాని సహృదయుడు కాదని చెప్పావు . ఆ విషయం గురించే నా దిగులంతా . ఇంట్లో పనిచేసే వొక కేరళ ఆమె అతని అనుమతి లేకుండా భర్తతో మాట్లాడిందని యజమాని ఆమెని చేయి చేసుకున్నాడని చెప్పావ్ . పక్కింటి వాళ్ళతో మాట్లాడవద్దని యజమానురాలు ఆంక్షలు. ఇవ్వన్నీ నీ మాటల్లో విన్నప్పుడు నా దిగులు యింకా ఎక్కువయ్యేది. యజమాని అంటే పనివాళ్ళ పట్ల దయతో ,ప్రేమతో ఉండాలి . కానీ  మీ యజమానికి అవేమీ లేనట్లు ఉన్నాయి. అందుకే భయపడుతున్నాను.   

చెల్లి బాగా చదువుకుంటుంది. స్కాలర్ షిప్ కూడా అందుతుంది. ఉదయం సాయంత్రం కరాటే క్లాసులకి వెళుతుంది. మన వాళ్ళ౦దరూ తప్పు పడుతూ  వుంటే మీ అబ్బాజాన్ వాదించాడు . రోజులెట్లా వున్నాయి ఆడపిల్ల కాలు బయట పెడితే బతకనిచ్చేతట్లు లేదు. ప్రతి చోటా పోలీస్ పోయి సాయం చేయగలడా? అందుకే ఈ విద్యలు నేర్వాలి అన్నాడు.  లోకం చాలా పాడై పోతుంది బేటా ! తల్లిదండ్రులు, గురువులు, మత గ్రంధాలు అందరూ మంచే చెబుతారు. మరి చెడు యెక్కడి నుండి వస్తుందని ఆలోచించాలి. మన మధ్య సైతానులు వున్నారు. బూతు చిత్రాలు, సినిమాలు చూపించి  పిల్లలని చెడగొడుతున్నారు. మన పేదరికాన్ని ఆసరా చేసుకుని అరబ్ షేక్ లు మన ఇండియాకి వచ్చి చిన్న చిన్న పిల్లలని పెళ్లి చేసుకుని సరదా తీర్చుకుని వదిలేసి పోతుంటారు, యెన్ని వినలేదు మనము . అలాంటిది వాళ్ళ యింటి ఆడవాళ్ళపై యెవరి చూపు  పడినా  నరికి పారేస్తారు యిక్కడ.అంత క్రూరంగా వుంటారు. ఒక మతం అన్నమాటే కానీ తోటి వాళ్ళని ముఖ్యంగా మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళని బానిసల కన్నా హీనంగా చూస్తారని నువ్వు చెప్పాక ఎన్నో రాత్రులు నిద్ర పట్టక  అటు ఇటు పక్క మార్చుకోవడమే సరిపోయేది. నా ఆలోచనలన్నీ మీ అబ్బాజాన్ కి చెప్పేదాన్ని కాదు . ఆయన నాకన్నా దైర్యంగా వున్నప్పుడు యిలాంటి విషయాలన్నీ చెప్పి ఆయన్ని కూడా దిగులు పడేటట్టు చేయడం యె౦దుకని. 


ఏ యింటికి  ఆ యింటికే సమస్యలు వున్నట్టు యే దేశానికి ఆ దేశానికే సమస్యలు వుంటాయి.సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన వివేకానందుడు అంటే నీకెంతో యిష్టం కదా ! ఆయన స్పూర్తి నీలో నిండుకుని వుంది. అందుకే మంచి చెడుని విచక్షణ తో చూడగల్గుతున్నావని నాకర్ధమైనప్పుడు గర్వంతో పొంగిపోతాను. అంతా నా పోలికే అని మీ అబ్బాజాన్ మురుసుకుంటాడు. హిందువుల అమ్మాయిని.  మీ అబ్బాజాన్ ని  నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడే నా గురించి అన్నీ మర్చిపోయాను. అలాగే మీ అబ్బాజాన్ మూఢ విశ్వాసాలనీ యింటి గడప తొక్క కుండా వూడ్చి పారేసాడు . మన యింట్లో రెండు పండగలు.  మన చుట్టూ పక్కల వాళ్ళ హితమే మన హితం. ఎదుటి వాళ్లకి యేమి జరగాలని కోరుకుంటామో అదే మనకి దక్కుతుంది అంట. అందుకే మాకు దైర్యం . నువ్వు యెక్కడ వున్నా మంచిగానే వుంటావని. 

నీ యజమాని ఫోన్ కి ఫోన్ చేస్తున్నాం . అతను ఫోన్ కట్ చేస్తున్నాడు . నీకు వీసా యిప్పించిన హైదరాబాద్ మనిషికి ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఆ యజమాని దగ్గర వీసా కాన్సిల్ చేసుకుంటున్నాడు అని చెప్పాడు . నీకు అసలే కోపం యెక్కువ. మీ యజమాని అవమానంగా మాట్లాడితే అసలు వోర్చుకోలేవు.ఏమైనా గొడవ జరిగిందా ? నీ ఫోన్ యేమైంది ? భయంగా వుంది  బేటా!   నువ్వు నీ వర్క్ వీసాని రద్దు చేసుకుని వచ్చేసేయి.. నీ దగ్గర డబ్బు యేమీ లేకుంటే  అస్సలేమీ సిగ్గు పడవద్దు . మీ అబ్బాజాన్ తో పాటు నేను టైలరింగ్ చేస్తూ  కొద్దిగా సంపాదించి చెల్లి పెళ్ళికి వుంటుందని కూడబెడుతున్నానని నీకు తెలుసు కదా  . ఆ డబ్బు పంపుతాను .  

వేరే చోట వుద్యోగం కోసం ప్రయత్నం చేయవద్దు . వెంటనే వచ్చేసేయి . మనము వుండేచోట పని లేకపోలేదుగా . పెద్దమ్మ కొడుకు షఫీ చెప్పాడు ఎయిర్ పోర్ట్ కి వెళ్లి వస్తే పదకొండు వందల రూపాయలు యిస్తున్నారు అంట. అక్కడ నీ జీతంతో పోల్చుకుంటే యిక్కడ కూడా తక్కువేమీ కాదు. ఆడుతూ పాడుతూ ఆల్టింగ్ డ్రైవర్ గా వెళ్ళినా ఆరు వందలు సంపాదించుకోవచ్చు. నువ్వు అక్కడ వుండవద్దు వచ్చేసేయి. మన పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి సౌదీ నుండి వచ్చింది. నేను నీ సంగతి చెపితే యేమీ అవదు. భయపడవద్దు. వర్క్ వీసా వుంది కదా అని చెప్పింది. ఆమెకి యిచ్చే యీ వుత్తరం పంపుతున్నాను. మన వూరి టైలర్ అక్కడ వున్నాడు కదా! అతని దగ్గరికి ఈ ఉత్తరం అందుతుంది. అతను సెలవు రోజున నీ దగ్గరికి వెళతానని నాకు మాట యిచ్చాడు.ఈ ఉత్తరం అందగానే ముందు ఫోన్ చేయి . నువ్వు క్షేమమగా వుంటేనే .. యిక్కడ మా అందరికి  రమదాన్ పండుగ. ఉన్నదానిని నలుగురితో కలిసి పంచుకుని తినడమే కదా పండుగ . నువ్వు అక్కడ యెన్నో యిబ్బందులు పడి డబ్బు పంపితే మాత్రం నేను పాయసంలో జీడి పప్పులేసి అందరికి తినిపించగలనా! బతికి వుంటే  బలుసాకు తిని బ్రతకవచ్చు . ఇంటికి వచ్చేయి బేటా ! 

అమ్మ ప్రేమలో అతి ప్రేమ శంక వుంటాయట అని మీ అబ్బాజాన్ అంటున్నాడు. నాకవన్నీ తెలియదు. బిడ్డకి యేదో యిబ్బంది వుంది అని మనసు చెపుతుంది.   దోసెడు కన్నీటితో నా బాధ తరిగిపోయేది  కాదు. నిన్ను కళ్ళార చూసి గుండె నిండుగా హత్తుకుంటే తప్ప అన్ని దిగుళ్ళు,భయాలు పోవూ. త్వరగా వచ్చేయి బేటా!  అమ్మ యెదురు చూస్తుంది పండగ యింటికి నడచి వస్తుందని . 

ప్రేమతో ..అమ్మ .







3 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఈ కధ అసలు బాగా లేదు.సంభాషణలు కృతకంగా ఉన్నాయి. నాకు తెలిసి ముస్లిం లు అరబ్ కంట్రీ కి వెళ్ళామని బాధ పడరు.ఆడవాళ్ళు కూడా సంవత్సరానికి నెల రోజులు ఇండియా వచ్చి వెళ్ళినా అదే గొప్పగా భావిస్తుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు. మనలో సాయంత్రం కొద్దిగా లేటయితేనే భార్యని పట్టించుకోడని పోట్లాడుతూ ఉంటారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నీహారిక గారు మీ అభిప్రాయానికి ఆహ్వానం. ధన్యవాదాలు .

hari.S.babu చెప్పారు...

@neehaarika
అరబిక్ ముస్లిములు అంటే వెస్టెర్న్ ముస్లిములు ఇండియన్,పాక్,మరియూ బాంగ్లా అంటే ఈస్టర్న్ ముస్లిముల్ని చాలా హీనంగా చూస్తారు.అమెరికాలో నల్లవాళ్ళని నిగ్గర్లు అన్నట్టు!కాబట్టి హెచ్చుతగులూ,అవమానం ఉన్నచోట బాధ కూడా ఉంటుంది,ఉండదా?అలాంటి పట్టింపులు వదిలేస్తే బానిసత్వం/రెండవ తరగతి సామాజిక స్థానం/వలస కాలనీల్లో పరాధీనత - ఇలాంటివి ఎన్ని వున్నా డబ్బొస్తే చాలు, స్వర్గమే!