29, జనవరి 2015, గురువారం

దుఃఖం కావాలనిపిస్తుంది




|| దుఃఖం కావాలనిపిస్తుంది ||

ఎవరికైనా ఇంతేనా ...

చెప్పలేని దిగుళ్ళు ఏవో కమ్ముకొస్తుంటాయి
మోడు మీద మొలిచే చిగురుల్లా
రుచించని వాక్యాలేవో నెట్టుకుంటూ వస్తుంటాయి
రాపిడితో గొంతు మండిస్తున్నాసరే

కాస్త దుఃఖం కావాలనిపిస్తుంది
నన్ను నేను సేదదీర్చుకోవడానికి
దుఃఖాన్నితోడుకోవాలి
చేద అరువు తీసుకునయినా

ఎంతకీ రాని దుఃఖం ..
ఎన్ని ఆరాటాలని,పోరాటాలని మాటేసిందో..
కనురెప్పల మాటున ఎన్ని స్వప్నాలని కాజేసిందో ..

మా అక్కలు, మేనత్తలు, వారి మేనత్తలు
అందరూ అంటూ ఉండేవారు
మన నుదుటిమీద దేవుడు దుఃఖాన్ని రాసిపెట్టాడని
బహుశా వారికి తెలిసి ఉండదు
దుఃఖపు నదిని ఈదటం ఎలాగో అన్నది
దేవుడిపై నింద వేసేసి.. తీరిగ్గా దుఃఖిస్తూ ఉండేవారు
దుఃఖాల వారసత్వాలని మోయాలనిలేదు నాకు
అయినా దుఃఖం కావాలనిపిస్తుంది

నదిని ఈదిన నన్ను  సముద్రం సవాల్ చేస్తుంది
 సవాళ్లు ఎదుర్కోవడమన్నా, దుఃఖం రంగన్నా
నాకిష్టం అయినందుకేమో

దుఃఖాన్ని ప్రేమగా హత్తుకొవాలనిపిస్తుంది
హృదయ కల్మషాలని కడిగేసుకోవాలనిపిస్తుంది
అవును ...  నాది కాని నిలువెత్తు దుఃఖాన్ని
ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. దుఃఖం కావాలనిపిస్తుంది

( తన కోసం కాకుండా ఇతరుల కోసం దుఃఖించేందుకు మనసుండాలి అన్న వ్యాఖ్య కి స్పందనగా )

29/01/2015. 

11, జనవరి 2015, ఆదివారం

ఎవరన్నారు వ్రాయడంలేదని ?





ఎవరన్నారు .. వ్రాయడం లేదని?
అస్పష్టమైన భావాలతో.
అనల్పాక్షరాలలో...
అసంపూర్తి కథనంలో ..
నిత్యం నాతో నాకే  ఘర్షణ

గుండె గానం గొంతు దాటనంటుంది
భావరాగం పెదవి పలకనంటుంది
వ్రాతవైనం  అక్షరాలలో కుదరనంటుంది
ఆత్మజనిత వాక్యమేదో జ్వలిస్తూనే ఉంటుంది
వ్రాయనందుకు శపిస్తూనే ఉంటుంది

ఎవరన్నారు  వ్రాయడం లేదని !

అక్షరాల పుష్పవనంలో
సీతాకోక చిలుకల ఆట మొదలైంది
భ్రమరాల దాహం తీరనట్లుంది
గాలిపాట ప్రవహిస్తోంది
కథానికో , కవితో  సంయోగం చెందుతున్నాయి .

-వనజ తాతినేని 11/01/2015 

8, జనవరి 2015, గురువారం

ఓపెన్ హార్ట్





నేనంటే... ఏమిటీ  అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా !? సరే .. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారా !? 
నన్ను ఒకరు అడిగారు .. ఇదే ప్రశ్న. 
అవసరమైన ప్రశ్న అనిపించింది కూడా !  
ఎక్కడా ఆత్మవంచన లేకుండా వ్రాసుకున్నా . .. మీరు కూడా అలా వ్రాసుకోండి. ఇలా ప్రకటించుకోలేక పోయినా పర్లేదు . 
*************************************************
నేనంటే ... నాకు చాలా అయిష్టం 
నాకు ఇతరులంటే ... చాలా అయిష్టం. ఆ అయిష్టాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం మరీ ఇష్టం  
నా తత్త్వం : బోల్డ్, నిర్మొహమాటం, క్షమించేయడం  
నాలో నాకు నచ్చేది... ప్రశ్నించే గుణం, ఎట్టి పరిస్థితుల్లోను మారని నా స్టైల్
నేను ఎక్కువగా ప్రేమించేది.   స్వచ్చమైన గుణాన్ని, ప్రేమించే హృదయాన్ని  
ఇతరులలో నాకు నచ్చనిది... నమ్మించి ద్రోహం చేయడం 
నా ఇష్టదైవం : శివుడు (ఏకోపాసన)
నాకు నచ్చిన రంగు : నలుపు తెలుపు
నాలో నాకు నచ్చనిది ... ఇతరులేం అనుకుంటారోనని నాకు నేను అన్యాయం చేసుకోవడం,  ఇతరులకి సాయం చేస్తూ నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడం 
నేనంటే ...  బ్యూటీపార్లర్, మేకప్ కిట్లు  లాంటివి లేకుండానే   ఆత్మవిశ్వాసంతో ఉండటం 
నా డ్రెస్ సెన్స్ : ఎక్కువ సార్లు సింపుల్ గా ,  చాలా సార్లు హుందాగా , అతి తక్కువ సార్లు ఆడంబరంగా  :) 
వైవాహిక దృక్పథం : శ్రీరామ చంద్రుడే ఆదర్శం 
వగచిన క్షణాలు : ఒక తప్పు కప్పి పుచ్చుకోవడానికి రెండో సారి అదే తప్పు చేయడం, అందుకు శిక్ష నేనే అనుభవించడం 
అన్నిటికన్నా ఎక్కువ ప్రేమించేది :  నా కొడుకు, పుస్తకాలు, స్నేహితులు  
నా మైనస్ లు :  అవసరమైన చోట కూడా చొచ్చుకుని పోలేకపోవడం, ఉదాసీనత . 
నా ప్లస్ లు : ఎక్కడైనా గెలుస్తాను, ఓడి నేనే గెలుస్తాను 
నా ప్రాపంచిక దృష్టి : కులం ,మతం , జాతి,దేశం, లింగ,పేద ,ధనిక  బేధం లేకుండా మనిషిని మనిషిగా  చూడటం 
 నాకు అయిష్టతనిచ్చే అంశం : డబ్బుని అవసరానికి మించి దాచుకోవాలనుకోవడం
అన్నింటికన్నా భయం కల్గించే విషయం : గ్లోబల్ వార్మింగ్, అవినీతి , బ్యూరోక్రసీ 
జుగుప్స కల్గించే విషయం : తోటి మనిషిని మనిషిగా చూడక పోవడం. పరుష పదజాలంతో మాట్లాడటం 
అతిగా అసహ్యించుకునేది  : ఆడవాళ్ళ పట్ల చులకన భావం ఉండే వాళ్ళంటే.
ఎప్పటికి తీరని కోరిక : రహస్యం (మనిషికి తనకంటూ రహస్యాలుండాలి)
 బాధాకరమైనవి : అత్యంత బాధాకర క్షణాలు ఎన్నో... ఎన్నెన్నో ! 
మర్చిపోలేనిది : ఆత్మహత్య దాకా వెళ్లి క్షణంలో బయటపడిన క్షణాలు 
ఎప్పుడు రాకూడదని కోరుకునేది : ఇతరుల ముందు దేని కోసం కూడా అభ్యర్ధించకుండా బ్రతకగల్గడం 
మరో జన్మ ఉంటే...మనిషి జన్మే కావాలని కోరుకుంటాను 
గర్వ పడేది ... నన్ను చూసుకుని నేనే  ! :) 
నాలో ఎప్పటికి చావనిది : నేను అన్న అహం. 
   ఎస్ . .  ఐ యాం "వనజ" 
(ఎవరిని వారు ప్రేమించుకున్నప్పుడే  ఇతరులని ప్రేమించగలరు  మనని మనం ప్రేమించుకోవాలంటే లోకం గురించి మనకక్కర్లేదు కానీ మనం లోకంలోనే బ్రతుకున్నాం కాబట్టి లోక విరుద్దంగా ఏ పని చేయలేం, అందుకే యండమూరి చెప్పినట్టు ఐ యాం నాట్ ఓకే - యు ఆర్ నాట్ ఓకే ) 

4, జనవరి 2015, ఆదివారం

తిరిగొచ్చిన ఇంద్రధనుస్సు




ఆ తోటలో సుతి మెత్తని పదధ్వనుల మధ్య 

పావురాళ్ళు  స్వేచ్చగా ఆడుకుంటున్నాయి 

ఓ పిల్ల తెమ్మెర  మోయలేక 

పూలపరిమళాలని  జారవిడిచి వెళ్ళినట్లుంది 

జాబిలీ తల్లి వెన్నెల పిల్లని పారేసుకుంది 

ఓ రాతిరి బద్దకంగా ఇక్కడే ముసుగేసింది 

చక్కని పాప  ఆడి ఆడి అలసిపోయింది 

మళ్ళీ నిద్రలేచి....  

తన ఇంద్రధనుస్సుని ఎవరో ఎత్తుకుపోయారని 

ఏడిస్తే నేనేం చేయగలను ?

స్వచ్చతని ఎలా నిలుపుకోవాలో తెలియని నేను 

ఎవరో నా కలలని  అలాగే ఎత్తుకుపోయారని 

మరెవరో నా కలంలోకి నెత్తుటి చుక్కలు

కన్నీటి పాత్రలు ఒంపారని చెప్పడం తప్ప. 


నా కన్నీటిని తన లేలేత చేతులతో తుడుస్తూ ...

ఎందుకేడుస్తావ్ ? అనడిగింది 

ఇక్కడ నొప్పిగా ఉంది 

గుండెపై తన చేయి పెట్టి చూపిస్తూ అన్నాను . 

ఇంద్రధనుస్సు పోయిందనా ? 

ఏడవకు ... మళ్ళీ రేపోస్తుందిలే... అంది  హామీ ఇస్తున్నట్లుగా 

జ్ఞాన బోధతో ఆత్మావలోకనం 

ఈసారి నవ్వులో కన్నీళ్ళు చిట్లాయి

ఆ బిందువు పై పడిన నవ్వు కిరణమై  

ఇంద్రధనుస్సై తోటంతా విరిసింది. .  


వనజ తాతినేని  04/01/2015










3, జనవరి 2015, శనివారం

కొత్త ఆశలా !




కొత్త  ఆశలా ! ఇంకా పాతవే తీరలేదు.
కేలండర్   మారబోతుంది. ఏదో కావాలని, రావాలని మది నిండా ఎన్నో ఆశలు ఆకాంక్షలతో 2015 లో అడుగుపెట్టాను కానీ ఏవీ తీరనే లేదు ..

"ఈ మది  గది ఉంది చూసారూ .... ఇదో పెద్ద బంగాళాఖాతం. ఇంకా చెప్పాలంటే  ఇదో   అగ్ని గుండం  ఎన్ని  వేసినా స్వాహా చేసేస్తుంది ఇంకా ఇంకా అంటూ ఉంటుంది" అని లోలోపల అనుకుంటూ ఉంటాను .

నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరం ఎలా గడిచిపోయిందో ఏమీ చెప్పలేను . ఆ సంవత్సర కాలంలో చెప్పుకోదగిన విశేషాలు ఏవీ లేవు . ఎన్నో అనుకున్నాను. అవేమీ జరగలేదు. ఆ నిరాశతోనే మళ్ళీ ఇంకో సంవత్సరంలో అడుగుపెడుతున్నాను .  కేలండర్ మారినంత త్వరగా  మన మనసు, మన ఆలోచనలు, మన స్వభావం ఏవీ అంత త్వరగా మారవు. సమూహంలో ఉన్నా ప్రతి  మనిషి ఒంటరి. ఎవరి వ్యక్తిగత ఆకాంక్షలు, ఎవరి ఆలోచనలు, ఎవరి లక్ష్యాలు. ఎవరి విజయాలు వారివి . వైఫల్యం మాత్రం సమూహానిది .

మనుషులమధ్య సంబంధ బాంధవ్యాలు, ఆర్ధిక ఒత్తిడులు, సామాజిక ఒత్తిడులు, సాంస్కృతిక ఒత్తిడిలు ( సోషియల్ లాగ్ ) మనిషిని ఒంటరిని చేస్తున్నాయి. మనిషి కుదేలై పోతున్నాడు తనని తానూ రక్షించుకోలేని వ్యవస్థ లో తనలో తనే కన్నీరు కారుస్తున్నాడు . ప్రపంచం మారినంత త్వరగా పైకి కనిపించినంత వేగంగా  మనిషి వేగవంతం కాలేకపోవడం మనిషిని కృంగదీస్తుంది
అందులో నేనూ ఉన్నాను
నావరకూ నాకు ఈ సంవత్సరంలో నా కొడుకుని సమీపంగా చూసుకోవాలని, వాడికిష్టమైనవన్నీ వండి పెట్టుకోవాలని, ఇంకా పెళ్ళి చేసి కోడలిని తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. బిడ్డని ఒక అడుగు దూరంలో స్క్రీన్ పై చూసుకోవడం తప్ప  ప్రేమగా దగ్గరకి తీసుకునే క్షణం రానివ్వని పరిస్థితులని చూస్తే దుఃఖం కల్గుతుంది. కొందరి ధనాశ,పరిస్థితులు ఏవైనా అపజయాన్ని అంగీకరించని నా బిడ్డ ఒంటరి పోరాటం, తనకి అండ కాలేని నా ఆసక్తత నన్ను మానసిక బలహీనతలోకి నెట్టేసాయన్నది నిజం. మీకేమిటి.. మీ అబ్బాయి అమెరికా లో ఉన్నాడు  హాయిగా ఉండక ఎందుకు దిగులు పడటం అంటారు కొందరు. డాలర్ల తో చాలా... కొనుక్కోలేము. ముఖ్యంగా సంతోషాన్ని. డాలర్లు సంపాదించడానికి వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడతారో, జీవితంలో ఎన్ని సంతోషాలకి దూరం అవుతారో ! కానీ డబ్బు తెర తోనే మనుషులని విభజించే  మనుషుల మధ్య మనిషి ఒంటరి అవుతున్నాడని నాకిప్పుడు బాగా తెలుస్తుంది. చాలా మందికి సుఖానికి సంతోషానికి తేడా తెలియక సాలె గూడులో  సాలె పురుగులా ఉండిపోతూ ఉన్నారు. ఆధునిక జీవన శైలి కూడా అలాంటిదే !

వృద్ది ఆరాటాలు, పోయినవాటి పట్ల నిరాశ, ప్రతి క్షణం యుద్ధం.. యుద్ధం  మనిషి మనసుతో చేసే యుద్ధం.    పోయింది ఏదైనా దొరికేనా ఎన్నటికైనా అన్నది కాలం విషయంలో అందరికి వర్తించే  చేదు నిజం

ఎవరు ఎవరితోనూ మన్నసు విప్పి మాట్లాడుకోవడంలేదు.అంతా పొడి పొడి మాటలు, ఆరోపణలు ,  నిష్టూరాలు,  అందరి మధ్యకనిపించని  ఏవో ఇనుప తెరలు. అసలు ఎవరితోనైనా మాట్లాడాలన్న భయం వేస్తుంది. మాట్లాడినప్పుడో, తర్వాతనో గాయం తగులుతూనే ఉంటుంది. అందుకే మౌనాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది.  చాలా మంది  అకారణంగా ఇతరులపై  ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటారు.వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకుంటూ ఉన్నారంటే ఓర్వలేనితనం ఎక్కువైపోయింది.  ప్రక్క వాడు కొంచెం బావుంటే చూడలేరు వాళ్ళు  కష్టాలలో ఉంటే, ఏడుస్తూ ఉంటే.. సానుభూతి చూపిస్తూ "అయ్యో ! " అనడటంలో  వాళ్ళకి ఎనలేని సంతృప్తి. ఎల్లప్పుడూ ప్రక్క వాడు తమ మీద ఆధారపడినట్లు ఉండాలని, వీళ్ళ సహాయ సహకారాలు ఆశిస్తూ ఉంటే  వీళ్ళు జాలి కురిపిస్తూనే మొండి చేయి చూపుతూ ఒక విధమైన పైశాచిక ఆనందంతో   కొందరు ఉంటారు. ఇవన్నీ కూడా మనిషి అనుభవిస్తున్న హింస.

ఒకటో తారీఖు వస్తే  "అమ్మో ! ఇంటద్దె కట్టాలి, పాల వాడు , ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ బిల్లులు వీటన్నింటి మధ్య చిక్కిపోయే వంటింటి సరుకులు పెరుగుతున్న ఖర్చులకి భయపడి ప్రయాణాలు మానుకోవడం, తప్పనిసరై ప్రదర్శించాల్సిన ఆడంబరం, వెనక్కి నెట్టేసే ఆరోగ్య పరీక్షలు.. ఇవన్నీ కూడా మనిషి పై కనబడని హింస..  

వీటన్నింటి మధ్య  మాయమవుతున్న మనని మనకి పరిచయం చేసే పుస్తకాలు, సంగీతం , మిత్రుల ఆలింగనం, కొన్ని చిన్న  సరదాలు, సంతోషాలు
వీటితో నా ప్రయాణం .. ఇంకో సంవత్సరంలోకి  అడుగిడుతూ ..
వనజ తాతినేని .  

1, జనవరి 2015, గురువారం

చెలిని చేరలేక(ఖ)

 నూతన సంవత్సరం .. సంతోషంగా ఉన్నారందరూ ...

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . 

విహంగ లో .. నా కథ   చెలిని చేరలేక (ఖ) 


ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు ,  అన్నీ ఉన్నా కూడా  అణువణువునా నిరాశ నింపుకున్న స్త్రీలు ఆవేశంలో క్షణికంలో నిర్ణయాలు తీసుకుని  జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆ బాట వైపు  నీ చూపు పడనేకూడదు. తగిలిన గాయాలని  గేయం చేసుకుని పాడుతూ సాగిపోవాలి తప్ప గాయం తగులుతుందని శరీరమే లేకుండా చేసుకోవడం ద్రోహం కదా !

ఆవేదనా భరితమైన లేఖ . తప్పక చదవండి . చాలా మంది స్త్రీలు మరణం అంచు వరకు వెళ్ళి  కూడా బ్రతికి ఉంటారు .. ఆ బ్రతకడంలో  జీవం ఉండదు. అవమానంమాత్రం మిగిలే  ఉంటుంది.. ఆ అవమానం ఏమిటో ... ఎందుకు స్త్రీలు బాధపడతారో .. ఆ పరిస్థితులు రాకుండా మనమేం చేయాలో చేస్తే బావుంటుంది. అందుకే ఈ కథ వ్రాసాను .  చదివి మీ స్పందన తెలుపుతారు కదా !