19, మార్చి 2014, బుధవారం

ఎన్ని వైరుద్ద్యాలు?

నిన్న మధ్యాహ్నం.. మా వర్కర్స్  చేస్తున్న పనిని గమనిస్తూ వారి దగ్గర కూర్చున్నాను . వారు బెంగాలీలైనా పొద్దస్తమానూ  హిందీ పాటలు వింటూ ఉంటారు. నేను వారికి దగ్గరలో కూర్చుంటే హోరెత్తించే శబ్దాల్నినియంత్రించుకోవాలి.. అది వాళ్ళకిష్టం ఉండదు. అది తెలిసి నేను లోలోపల నవ్వుకుంటూనే సూచనలు ఇచ్చేసి .. లోపలికి  వచ్చేస్తాను .

 వందల మైళ్ళ దూరం నుండి పొట్ట చేత బట్టుకుని ఇక్కడి చేరిన వారందరూ దాదాపుగా బంధువులూ  లేదా ఒకే ఊరికి, ఒకే ప్రాంతానికి చెందిన వారే అయి ఉంటారు . ఒకోసారి వాళ్ళలో వారికే విబేధాలు. ఒకరు హిందీ పాట కావాలంటారు, ఇంకొకరు బెంగాలీ పాటలో లేక ఘజల్స్ వినాలని కోరుకుంటారు . చిన్న చిన్న గొడవలు పడుతుంటారు . ఆ గొడవలు లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఇయర్ పోన్స్ పెట్టుకుని ఎవరికీ నచ్చిన పాట వారిని వినమని చెప్పేదాన్ని . ఒకోసారి అందరూ కలసి కాంప్రమైజ్ అయిపోయి మా వరండాని 70 MM  ఆడియో ధియేటర్   చేసేసేవారు . ఈ రోజు నేను  వారి దగ్గర కూర్చున్నప్పుడు ఒకతనికి కాల్ వచ్చింది . అతని సమీప బంధువుల కుర్రాడొకడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడట . కారణం వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులని అడిగితే వారతనిని తీవ్రంగా అవమానించారని ఆ అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్ళి నిర్ణయించారని తెలిసీ  అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి పెద్దబిడ్డ . చదువుకుని ప్రయోజకుడై కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుంటే ప్రేమలో విఫలమై   కన్నవాళ్ళకి కన్నీరు మిగిల్చాడు .

 మా వర్కర్ ఒకరి ప్రతిస్పందన చూసి  నాకాశ్చర్యం కల్గింది . ప్రేమించినప్పుడు  " కులం తక్కువని, మతం వేరని అబ్బాయి మాత్రమే ఎందుకు చావాలి.?  ప్రేమించినందుకు  ఆ అమ్మాయి కూడా చావాల్సిందే ! అన్నాడు . చనిపోయిన అబ్బాయి  మేనమామ హై కోర్ట్ లో వకీలు గా చేస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులని వదిలే ప్రసక్తి లేదు వాళ్ళ పని బడతాం " అంటూ  ఆవేశాన్ని ప్రదర్శించి  మా వర్కర్ అప్పటికప్పుడు కలకత్తాకి ప్రయాణమయ్యాడు.

అప్పుడు నేనన్నాను .. ప్రేమించిన అమ్మాయికి తను ప్రేమించిన వాడిపై నమ్మకం లేనప్పుడు ఒకవేళ అంత నమ్మకం ఉన్నా కూడా తల్లిదండ్రులని ఎదిరించలేక మౌనంగా ఉంటారు. జీవితంలో ప్రేమనే అధ్యాయాన్ని మూసేసి తల్లిదండ్రుల మాట వింటారు. ప్రేమించేటప్పుడు కులం,మతం, అంతస్తులు, కుంటుంబ ఆచారవ్యవహారాలు దృష్టిలోకి రావు. పెళ్ళి అనుకున్నప్పుడు కదా అవన్నీ అవసరం అనిపిస్తాయి . ఏమైనా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం ..
అంటూనే ..

మీరందరూ పాటలు వినడంలోనే ఐక్యత లేకుండా గొడవలు పడుతుంటారు. పెళ్ళి పేరిట  రెండు వేరు వేరు మతాల వారు రెండు కుటుంబాలు ఆచార వ్యవహారాలు కలవడం అంత సులభమా..? అందుకే ప్రేమించుకున్న వాళ్ళు జీవితాన్ని సఫలం చేసుకోవాలంటే .. పెద్దలతో పని లేకుండా పెళ్ళి చేసుకుని ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఓ చోట బ్రతకాల్సింది .

" ఈ లోకంలో ప్రేమికులందరూ చేసే పని ప్రియుడిని / ప్రియురాలిని నమ్మి మోసపోతారు . వారు నమ్మాల్సింది ప్రేమని . "

ఆ ప్రేమ బలీయం కాకపోబట్టే... ఈ అర్ధాంతపు మరణాలు .

జీవితం పాటలా సాగాలంటే మాటలా.. ? అనుకోవడమే కాదు.. పాటలు వినాలనుకుంటే కూడా మాటలా....?

ఎన్ని వైరుద్ద్యాలు?   వీటన్నింటి మధ్యా ... అన్నింటా మనమే!



3 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

డబ్బుల్లేకనీ, తినడానికి తిండిలేకనో జరిగే ఆత్మహత్యలు అతి తక్కువట. చాలవరకు ఆత్మహత్యలు రిలేషన్‌షిప్స్ లో వచ్చే సమస్యలవల్లే జరుగుతాయని సర్వేలు చెప్తున్నాయి. సరిగ్గా ప్రశ్నించారు..
"ఆ ప్రేమ బలీయం కాకపోబట్టే... ఈ అర్ధాంతపు మరణాలు .

జీవితం పాటలా సాగాలంటే మాటలా.. ? అనుకోవడమే కాదు.. పాటలు వినాలనుకుంటే కూడా మాటలా....?"

హితైషి చెప్పారు...

బావుంది. పోలిక బాగా చెప్పారు. ఆత్మహత్యలు, పరువు హత్యలు చూస్తుంటే ప్రేమంటే విముఖత కల్గుతుంది. ఎవరో ఒకరు చావడమా ప్రేమంటే?

Meraj Fathima చెప్పారు...

ప్రేమని బ్రతికించటానికి ముందుగా ప్రేమ మీద నమ్మకం కావాలి, కానీ నమ్మిన ప్రేమికుడు(రాలు) మోసగించారూ అంటే వారు ప్రేమించలేదనే అర్దం.
"ప్రేమికులెప్పుడూ పిరికివారు కాకూడదు, పిరికివారెప్పుడూ ప్రేమించకూడదు."
ఆ అత్మహత్యలు బందుత్వాలలో వచ్చే సమస్యను చేదించలేక జరుగుతాయి.