31, అక్టోబర్ 2013, గురువారం

క్రొత్త నీటిని కలుపుకునే "సంస్కారం" సారంగ లో

మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి తమని  ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత అని . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకం కి చెందిన మనిషి కావడంతో .. మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకిన్చినవారే    ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు. 

ఈ కొత్త నీరు పాత నీటిలో... ఎలా కలసిపోతుందో...  మత స్వేచ్చ కి అర్ధం ఏమిటో ... చెప్పాలని ప్రయత్నించిన కథ 




"సంస్కారం"  సారంగ లో ఈ వారం 

చదివి మీ అమూల్యమైన స్పందన అందిస్తారని ఆశిస్తూ..  

అన్నట్టు  ఇది నా "యాబై"  వ కథ.  

29, అక్టోబర్ 2013, మంగళవారం

పురుషార్ధాల కోసమే "సాహిత్యం"

ఆ పాత మధురం  సంగీతం,  ఆలోచనామృతం సాహితం అని అన్నారు .   సంగీతం ఆహ్లాదాన్ని ఇవ్వాలి,  సాహిత్యం ఆలోచనని  పెంచాలి అన్నది ఎవరికీ వారు స్వానుభవంతో తెలుసుకోవలసిన విషయమిది .

మన ప్రఖ్యాత  ప్రాచీన కవులందరూ  మంచి యితి వృత్తాలని ఎన్నుకుని   అందరూ ఆదర్శంగా  వుండేవిధంగా తలఛి ఇతిహాసం వ్రాసినా, పురాణం వ్రాసినా, నాటకం వ్రాసినా సంఘ శ్రేయస్సుకు వెలుగుబాటగా ఉండాలని తలచి రచనలు చేసేవారు    వారి బాటలోనే నడచిన మన మహా కవులందరూ సాంఘిక వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలనే తలంపులతోనే కావ్యాలు రచించారు . ఆ తర్వాతి కాలంలో   అజ్ఞానపు  చీకట్లు అలుముకుని   మూఢ నమ్మకాలతో, దురాచారాలతో మ్రగ్గిపోతున్న  మానవజాతి వికాసంతో మెలగాల్సిన అవసరం గుర్తించిన సంఘ సంస్కర్తలు మరింత చైతన్యం నింపుకుని రచనలు చేసారు.

పురుషార్ధం కోసమే  చతుర్విధ పురుషార్ధాలనే అంతర్లీన సూత్రంని క్రోడీకరిస్తూ  ఉదాత్తంగా వ్యవహరిస్తూ అనేక రచనలు చేసారు . ఏ కాలానికి ఆ కాలంలో కొంత విమర్శలు చోటు చేసుకునే ఉంటాయి . ఉత్తమ సాహిత్యం అంటూ ఎవరూ  ముద్ర వేయదగిన విధంగా సాహిత్యం ఉండలేదన్నది అక్షర సత్యం . అయితే ప్రజాదరణ పొందినదే ఉత్తమ సాహిత్యం గా లెక్కించడం ఉంది.   నలుగురికి చేరువ కాలేని వెలుగులోకి రాని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. అంత మాత్రంచేత అది సాహిత్యం కాకుండాను పోలేదు  .

అసలు ఉత్తమ సాహిత్యమంతా రాజనీతి కోసమే పుట్టిందని సాహిత్య మర్మజ్ఞులు అంటారని ఓ  ..ప్రముఖ కవి వ్రాస్తే నేను చదివాను రాజనీతి పూర్వకాలంలో రాచరికం నెరిపినవారికే కావచ్చు . చాణుక్యుడు అర్ధ శాస్త్రం రచించినా ఆ.. రచన  ఆనాటి కాలంకి అద్దం  పడుతూ ఉంది . తర్వాత  రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది  కాలానుగుణంగా యీనాడు పాలకులు యెట్లా వుండాలో , ప్రజలు యెట్లా వుండాలో ,  ఉద్యోగులు యెలా  ఉండాలో ఆర్ధిక , రాజకీయ సామాజిక, వాణిజ్య, సైనిక,అంతర్జాతీయ నీతి  యెలా వుండాలో చెప్పేది కూడా రాజనీతి అంటారు . రాజ్యపాలకులే అవినీతి పరులైతే ఇక ప్రజల సంగతి యే౦  కాను?

ధర్మార్ధ కామమోక్షాలలో ఆఖరిదాని గురించి ఆలోచించకుండా మొదటి మూడు ప్రతి ఒక్కరికి అత్యసరమైనవె కదా ! అయితే మొదటిది వదిలేసి అర్ధ,కామాల కోసమే మానవ జీవితం ఉన్నట్టు ఈ రెండింటి చుట్టూ పరుగులెత్తే జనావళి కోసం అలాంటి సాహిత్యం వస్తుందని దిగులు పడే వారిని చూస్తున్నాం.  అందుకే ధర్మం ఎవరికీ అవసరం లేదు. అందరికి అర్ధకామాలే ముఖ్యం   

నవరసాలలో రసరాట్టు శృంగారం  అంటారు . సకల ప్రాణ కోటి కోరుకునేది . సకల ప్రాణ కోటిలో ఉత్తమ శ్రేణికి చెందినవాళ్ళం అనుకునే మానవులు ఆ రసాన్ని మనసారా,ఉదాత్తంగా ఆస్వాదించాలి. బాహ్య ప్రపంచం నుండి విడివడి ఆత్మలు సంయోగం చెందినట్లు మమేకం కావాలి. అది తప్ప మరింకేం లేదు అన్నట్టు అచ్చంగా ఆ రసం రంగరించి రాసేవారున్నారు. ఆ రచనలకి పట్టం కట్టేవారు ఉన్నారు. ఇప్పుడొస్తున్న సినిమా పాటలు ఇలాంటివే.   
.
ధర్మరహితమైన అర్ధ,కామాలు విభృజించి  అత్యంత పాశవికంగా ప్రక్కవారిని పూడ్చేస్తున్నాయి . ధనాంద కారం క్రమ్ముకుని కొందరు , కామ ప్రకోపాలతో కొందరు  విషనాగుల వలే పొంచి.. వారి  వారి  కాటుకు కొందరి జీవితాలని బలి చేస్తున్నాయి. ముసుగు వేసుకుని కొన్ని, అవకాశం చూసుకుని కొన్ని,  ఆయాచితంగా లభిస్తున్నాయని కొన్ని ఇలా జవజీవాలని తోడేసుకుంటూ పోతున్నారు. వీళ్ళ తాకిడిలో  సామాన్యులు యెటువైపు  కొట్టుకుపోతున్నామో తెలియకుండా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు.

 ఎంత కష్టపడినా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కష్టంగా ఉన్న పరిస్థితులు, కష్టపడకుండా  ప్రక్కవాడికి ఆయాచితంగా  లభంచే అన్ని సౌకర్యాల పట్ల ఈర్ష్య , విలాస జీవితం పట్ల వ్యామోహం.  కాలక్షేపం కోసం చూసే కార్యక్రమాల ప్రభావం, నేరం ఇలా చేయాలని చూపిస్తున్నట్లు ఉన్న ప్రసార మాధ్యమాలు ఒకటేమిటి అన్ని రకాలగా  నాశనమయ్యే  కాలంలో మనం జీవిస్తున్నాం . వినాశకాలే విపరీత బుద్ది  అంటారు కదా!   విలువలు లేని సాహిత్యం కూడా మనిషిని నాశనం చేస్తుంది. మన బ్లాగ్ లోకం కూడా అందులో చేరిపోయింది .. అందుకు విచారిస్తూ .. యీ పోస్ట్ వ్రాయక తప్పలేదు మరి

మనం యే౦  చదువుతున్నాం,  యేమి వింటున్నాం , యే౦ చూస్తున్నాం ..  యేమి  వ్రాస్తున్నాం ? మన మానసిక స్థితి ఎలా ఉంది ? ఇవన్నీ ఆలోచించుకోవలసిన విషయాలు .   ఆ ఆలోచనే మనకి కావాల్సింది యిస్తుంది. మనకి మనని మిగులుస్తుంది..

రాజుకి కావాల్సింది   వందలమంది వందిమాగధులు, భట్రాజు పొగడ్తలు కాదు కావాల్సింది. ప్రజారంజకంగా పాలించడం , దర్మబద్దంగా  వ్యవహరించడం.  అది రచనలకి కూడా వర్తిస్తుందనేది అక్షర సత్యం/.

 సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించే.. గుణాన్ని  ఇచ్చిన జ్ఞాన సరస్వతి పాదారవిందాలకి ప్రణమిల్లుతూ..  ఈ.. ఆపాత మధురం (అ పాత మధురం) ఆలోచనామృతం

బ్లాగ్ వ్రాయడానికి బద్దకిస్తూ  చదువుకోవడంలోనే మునిగి ఉన్న నాకు .... బ్లాగ్ లోకంలో నేను చదవని చూడనివి  కొన్ని పోస్ట్ లని ఓపికగా నా కోసం ఏరి నా కోసం అందించే ఓ .. మిత్రురాలికి ...   ధన్యవాదాలు చెపుతూ ఈ పోస్ట్ .            

24, అక్టోబర్ 2013, గురువారం

సోలః సింగార్


Mohra  చిత్రంలో  నాకిష్టమైన  "Na  kajre ki dhar Na  Mothian  ki  haar  "   పాట  వింటున్నాను .

Singaar tera yovan, yovan hi tera gehna అన్న సాహిత్యం వినగానే సోలః  సింగార్  గుర్తుకు వచ్చింది 

అసలు సోలః  సింగార్ ఏమిటీ అని  చూస్తే  స్త్రీల  అలంకరణలో భాగాలైన ఇవన్నీ గుర్తుకు వచ్చాయి . కొన్ని తెలుసుకోవడానికి  గూగులమ్మ సహాయం చేసింది .

మన భారతీయ సంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది . వివాహ సమయానికి ముందు వివాహ సమయంలోను , వివాహం తర్వాత అనేక ఆనవాయితీ లు ఉన్నాయి .

వివాహ  సమయంలో  ఎక్కువగా అందరి దృష్టి  వధువు పైనే ఉంటుంది. వధువు యొక్క రూపురేఖలుతో పాటు ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలు , అలంకారం పైనే ఆసక్తి చూపుతారు .

వధువు అలంకరణ  పూర్తీగా ఉండాలంటే  పదహారు విధాలుగా ఉండాలని పూర్వీకుల కాలం నుండి నిర్ణయించారు . ఉత్తర,  దక్షిణ భారత దేశ వివాహ పద్దతులలో కొద్దిపాటి తేడాలున్నప్పటికీ వధువు అలంకరణ అంతా  అన్నిచోట్లా ఒకే విధంగా ఉంటుంది . "సోలః సింగార్" గా అభివర్ణించే ఈ అలంకరణ ఇలా ఉంటుంది .

ముందుగా వస్త్ర సాంప్రదాయం . మన దక్షిణాది ప్రాంతంలో పట్టుచీర జాకెట్  ధరిస్తారు. ఉత్తరాదిన లేహంగ చోళీ ధరించి  అందంగా డిజైన్ చేయబడ్డ  మేలిముసుగు ని కప్పుతారు.

వధువు ముఖం చూడగానే మనకి కనిపించే ముఖ్యమైన అలంకారం నుదుటన ధరించే తిలకం . మన ప్రాంతాలలో "కళ్యాణ తిలకం " ని దిద్దుతారు . ఉత్తర భారతంలో "బింది" లేదా బిందియా అని వ్యవహరిస్తూ ఉంటారు . ఈ బిందీ ఎరుపు రంగులో ఉండి శుభ చిహ్నంగా ఉంటుంది.

ఇక మూడవది కన్నుల కాటుక "కాజల్ " అని వ్యవహరిస్తారు . కళ్ళకి కాటుక ఇచ్చే అందం ఇంత అని చెప్పనలవి కాదు.  ఇప్పుడంటే కాటుక పెట్టుకోకపోవడం ప్యాషన్ , అయినప్పటికీ మేకప్ లో భాగంగా "ఐ "లైనర్ వాడటం మామూలైపోయింది . అలాగే కనురెప్పలు మరింత నల్లగా,దట్టంగా ,పొడవుగా కనబడటానికి "ఐ లాష్ " ఉపయోగించడం చేస్తున్నారు     కాటుకని స్త్రీల అలంకారంలో చాలా ముఖ్యం అని ఒప్పుకోవాల్సిందే మరి .

ఇక నాలుగవది .. ముక్కెర .  స్త్రీ జీవితంలో వివాహం తర్వాత ధరించే ముఖ్య చిహ్నం .  సంప్రదాయ ముక్కెర ముక్కు  నుండి   రింగుల లింక్ ల ద్వారా చెవి వరకు సాగుతూ  ఉంటుంది . . ఇప్పటి తరం అయితే వారి వారి అబిరుచిని బట్టి ముక్కెరని , లేదా పుడకని ధరిస్తున్నారు .

ఇక ఐదవ అలంకారం బంగారు ఆభరణం  "పాపిట బిళ్ళ " ఉత్తర భారతంలో ఈ ఆభరణం ని "మాంగ్ టిక్కా"    గా వ్యవహరిస్తారు . జుట్టుని రెండు భాగాలుగా విడదీసిన నిలువు పాపిడి పొడవునా నుదుటిపై వ్రేలాడుతూ వధువుకి వింత శోభని కల్గించే అలంకారం ఇది .

ఆరవది కర్ణాభరణం.... వ్రేలాడే జుంకీలు ధరిస్తారు .

.ఏడవది "హారం" మెడకి ధరించే బంగారు ఆభరణం ఇది . ఇది చాలా ప్రత్యేకంగా తయారుచేయించుకుంటారు .

 ఎనిమిది ..  గాజులు ..  మన సంప్రదాయంలో కుడి చేతికి 21 గాజులు,ఎడమ చేతికి 19 గాజులు ధరిస్తారు . వధువు ధరించే గాజులు రంగు రంగుల  మట్టి, మెటల్  గాజులతో పాటు బంగారు గాజులు తప్పనిసరిగా ధరిస్తారు .  " "చుడియాన్"  గా వ్యవహరించే  ఈ గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు .

తొమ్మిదవ  అలంకారం " బాజు బాండ్ "  అంటారు . మన వాళ్ళు  'అరవంకీ" అని అంటారు. లేదా "భుజ కీర్తులు" అని కూడా అంటారు .

పదవది..  అంగుళీయకాలు  లేదా  వేలి ఉంగరాలు .  విడి విడిగా అన్ని వ్రేళ్ళకి ధరించడం  లేదా  అన్ని వ్రేళ్ళకి ధరించిన ఉంగరాల నుండి గొలుసుల ద్వారా  ముంజేతి వరకు  సాగి బ్రాస్లెట్ లా అలంకరించుకునే ఆభరణం .. దీనిని "అరసి" గా వ్యవహరిస్తారు .

పదకొండు  మెహందీ ..  ఎండిన గోరింట పొడిలో   నిమ్మ పులుసుని  చేర్చి వధువు కాళ్ళకి, చేతులకి చక్కని డిజైన్స్ తో  గోరింటని ఎర్రగా పూయిస్తారు.  ఈ అలంకరణ పూర్తయిన తర్వాతనే మిగతా అలంకరణ చేస్తారు . మన ప్రాంతంలో   అదివరకు   పారాణి  పెట్టి వారు. ఇప్పుడంతా మెహందీ డిజైన్స్ సాధారణం అయిపోయింది  .

పన్నెండవది.. నడుమకి ధరించే ఆభరణం .. "వడ్డాణం"

.పదమూదవది. కేశాలంకరణ.    అభ్యంగ స్నానంచేయించి  సాంబ్రాణి తో ఆరబెట్టి  వింత పరిమాళాలని వెదజల్లే కేశాలని అందంగా ముడి గా అమర్చి  ఆ ముడిని పూలతోను, ఆభరణాలతోనూ అలంకరింపజేస్తారు. మన ప్రాంతంలో "పూల జడ " చాలా ఫేమస్ . ఇప్పుడు ముత్యాల జడలు , బంగారు జడలు కూడా చోటు చేసుకుంటున్నాయి .

 పద్నాలుగవది .. కాళ్ళకి ధరించే కడియాలు , లేదా "పాయల్ " మువ్వల పట్టీలు . వధువు నడుస్తున్నప్పుడు చిరు ధ్వనులు చేస్తూ శుభసూచకంగా నిలుస్తాయి.

పదిహేనవది   తాంబూల సేవనం చేసి .. పరిమళద్రవ్యంని జల్లుకుని సువాసనలు చిందిస్తూ ఉంటారు .

పదహారవది ... వివాహానికి ముందు  బుగ్గన చుక్క  వివాహం తర్వాత సిందూర్, మట్టెలు  ధరించడం .ఆనవాయితీ

ఈ పదహారు అలంకరణలు (సోలః సింగార్ ) చేసుకున్న మన భారతీయ స్త్రీ  సౌభాగ్యవతిగా, ఇంటికి దీపంలా కళ కళ లాడుతూ ఉంటారు .



ఇదండీ .. సోలః  సింగార్ . కొన్ని తెలిసిన సంగతులు ,కొన్ని తెలియని సంగతులు ఆసక్తిగా తెలుసుకుని ఇలా ఒక పోస్ట్ వ్రాసేశాను . :)



22, అక్టోబర్ 2013, మంగళవారం

చలం "ఊర్వశి "



వెళితే వెయ్యేళ్ళు  వెదుకుతావ్ ! చలం ఊర్వశి  పురూరవుడితో అన్న మాటలివి . ఒక స్త్రీ పురుషుడితో అన్న ఈ మాటలు బాగా నచ్చాయి

"పురూరవ" చలం విరచిత రేడియో నాటకం  వింటున్న ప్రతిసారి ఏవో కొత్త అర్ధాలు స్పురిస్తాయి. చలం రచనలు కూడా అంతే! పాఠకులు  వారి రచనలు పరిచయం లేకున్నా సరే ...  ఆయనేదో విచ్చలవిడి శృంగారం  గురించి వ్రాసాడట . ఆ పుస్తకాలు చదవడం దండగ అనేమాట ఎక్కువ వింటాం .

అసలు చలం రచనలు అందరూ చదవతగినవి కాదా ? అనే అనుమానంతోనే చదవడం ప్రారంభించి .. కొంత విసుగు తోచి అక్కడ పడేయడం మళ్ళీ చదవాలనిపించడం చదివినదే చదువుతూ ఆలోచించడం మొదలెడతాం .

మిగతా రచనల గురించి ప్రక్కన పెడితే  పురూరవ  గురించి నేను చదివి, విని  తెలుసుకున్న దానికన్నా .. నాకు  చలం   విరచిత "పురూరవ ' బాగా   నచ్చింది . పురూరవ ని నవలా రూపంలో చదవలేదు,. రేడియో నాటకం వినడం మాత్రమే  జరిగింది.



 చంద్రవంశం లో ప్రసిద్దుడైన పురూరవ చక్రవర్తి గురించి ఇంద్ర లోకంలో చెప్పుకోవడం విన్న ఊర్వశి  అతనిపై మోహం పెంచుకుని అతనిని తలపులలో నింపుకుని నాట్యం సరిగా చేయని కారణంగా గురువు భరతముని చేత శపిం పబడి   పురూరవుడిని వెదుక్కుంటూ మనుష్య లోకంకి  వస్తుంది.  ఈ రేడియో నాటకం ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది.

. పురూరవుడిని దగ్గరికి వెళ్లి  బిడియం లేకుండా తన ప్రేమని తెలియజేస్తుంది . అతని  తిరస్కారానికి గురయి  వెళ్ళిపోతుంది . వెళ్ళిన ఆమె కోసం వనమంతా , గుహ గుహ వెదుకుతాడు. ఆమెని కాంచి సంతోషపడతాడు

 "నీ అవసరాన్ని నీకు గుర్తించేటట్టు  చేసేందుకు...  నేను వెళ్ళిపోయాను    ".నువ్వెవరో నీకు తెలిపేందుకే వచ్చాను" అని

  "  స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని  నువ్వు ఏం  తెలుసుకున్నావ్ ? ఏం జీవించావ్ ? ఎంత అల్పుడివి నువ్వు " అంటుంది

ప్రేమంటే నీం తెలుసు    . నీ దృష్టి . విశాలం కాకుండా ఉంటుందా ?నిజంగా ప్రేమిస్తే....  

బలీయమైన , అజేయమైన ప్రేమ బంధం వల్ల  కాకపొతే  ఎందుకు నిన్ను వరిస్తాను ... అంటుంది పురూరువుడితో

ఎప్పటికి  గ్రహించవలసింది ... ఇంకొకరు చెప్పడం వల్ల ఎన్నడూ అర్ధం కాదు, క్రమంగా కాలంలో సొంత  అనుభవం  బోధించాల్సిందే ! మాటలతో నేర్చుకునే విషయాలు  చాలా అల్పం . ఎదుగు  విశాలంగా.. తెలుస్తాయి .  .
 తెలియడమంటే అర్ధం  ఏమిటి ?  అనుభవించే అర్హత కలగటం   అనుభవంతో తప్ప వికాసం  లేదని సూత్రమే  లేకుంటే  ఈ ప్రపంచమే అనవసరం ఆ అనుభవాన్వేషనే   మీ లోకంలో ఖేదానికి అసలు కారణం అంటూ అసలు నిజం బోధిస్తుంది

 స్వేచ్చా ప్రణయం గురించి, ఆనందం గురించి, స్త్రీ లాలిత్యం గురించి  ఇలా ఎన్నో విషయాలని పురూరవుడికి బోధిస్తుంది.    పురూరవుడి కోరిక మీదట అతనితో కలిసి రాజ్యానికి వచ్చి అతనితో కలసి  జీవిస్తూ తన ఆజ్ఞ కి బందీని చేస్తుంది  పురూరవుడు   భార్యని పోగొట్టుకుని ,రాజ్యాన్ని తనయులకి అప్పగించి  ఆమెతో కలసి వనాలకి వెళ్లి  తన్మయత్వంతో  మునిగిపోయి .. ఇరువురు  ఆత్మ సంయోగం ని అనుభవించాక .. ఊర్వశి  ఆజ్ఞా ని ధిక్కరించి వెళ్ళిన పురూరవుడికి  తనవేరో చెప్పి   ఆతనిని వీడి  ఈ లోకం నుండి నిష్క్రమిస్తుంది.

ఈ రచన చాలా చాలా నచ్చింది . ఊర్వశి  పాత్ర ని మలచిన తీరు  చాలా నచ్చింది .

పురుషుడు యుద్దంలో చూపే నేర్పు , రౌద్రం , శౌర్యం యుద్ధం చేయనప్పుడు కూడా కనబడకపోతే అవన్నీ నీలో చాలా అల్పం అన్నమాట . లేదా నేను చాలా అందురాలిని అన్నమాట ..

ఈ హర్మ్యాలు ,ఈ వనాలు వీటిని నిర్మించిన నీ  సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిల్లో కనబడితే నిన్నెవరు ప్రేమిస్తారు ?  తమ భర్తలలో ఈ విశాలత్వం ,దర్పం, ఘనత కనబడకనే స్త్రీలు భర్తలని కాక వారి ఐశ్వర్యాలని, వారి కీర్తి ప్రతిష్టలని  ప్రేమిస్తారు అన్న నిజం చెపుతూనే .. కార్య శూరత్వం  మనిషికి నైతికాభి వృద్దిని ఇవ్వాలి అప్పుడే నీవు జయించిన చక్రవర్తుల కిరీట మణులు నీ కళ్ళల్లో  మెరుస్తాయి..  అని ధర్మబోధ చేస్తుంది .

స్త్రీలు అనవసరమైన బేల తనం ప్రదర్శించి మగవాడిని బందీని చేయడం కన్నా ఆత్మాభిమానం ,జ్ఞానం కల్గి ఉండటమే గౌరవం కల్గి ఉంటుందని చెప్పడానికి ..ఇలా అంటుంది ..  

 " స్త్రీలలో వుండే హాని లేని నటనలు, గౌరవించడాలు, చనువులు,వగలు, ప్రణయ కోపాలు ఇవన్నీ నాకు తెలియక కాదు; ఇన్నేళ్ళూ వాటిననుభవించి అంతకన్నా గౌరవమైన ఉజ్జ్వలమైన ప్రేమకి అర్హుడివైనందునే నా స్నేహార్హత కలిగింది నీకు. నిన్ను లాలించడానికి కాదు; నిన్ను కాల్చి, కరిగించి, శుభ్రపరచి దేవత్వాన్ని ఇవ్వడానికి శపించారెవరో నన్ను"  - అని చెపుతుంది 

ఇక చలం రచనలలో కనబడే కవిత్వానికి ఇది ఒక మచ్చు తునక .. 

ఎంతకూ రాని కాంతి కై మౌనంగా పూరెక్కలమీద కన్నీరు కార్చే రాత్రి వలె నా విరహంలో నేనే అణగి పోతాను. 
_ అంటుంది  ఊర్వశి.

ఎన్నో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ క్రొత్త అర్ధాలు ఏవో స్పురింపజేస్తూ ఉండే ఈ నాటకం మీరూ వినండి . 
 విని ..  ఊర్వశి  పాత్ర ద్వారా స్త్రీ అంతరంగాన్ని ఉన్నతంగా చెప్పిన చలం గారి పై విపరీతమైన అభిమానం పుట్టుకొస్తుంది .

జీవితానుభావం అనంతం , నిరంతర సుందర ప్రయాణం , ఎప్పుడూ చివరనేది లేని ఆనంద అనుభం .. పురూరవ  పాత్ర ద్వారా చెప్పించిన .. ఆ మాటలు  నిజంగా ఎవరికీ వారు అనుభవ పూర్వకంగా  తెలుసుకోవలసినవే!

(ఈ పోస్ట్ లో చిత్రం గూగుల్  సేకరణ  రాజా రవివర్మ చిత్రం ఇది )

21, అక్టోబర్ 2013, సోమవారం

పరువు హత్యలు

హాయ్ ఫ్రెండ్స్ .. బావున్నారా? 

వ్రాయడానికి బద్ధకం ఎక్కువైంది . వ్రాసేందుకు విషయాలు అయితే చాలానే ఉన్నాయి.  ఈ మధ్య కాస్త మిత్రులతో కాలక్షేపం  ఎక్కువైంది . అనేక మంది అనుభవాలు విన్నాను .

బాగా కదిలించిన ఒక సంఘటన .కరీంనగర్ ప్రాంతంలో జరిగిందని విన్నాను.

వేర్వేరు కులాలకి సంబంధించిన యువతీ యువకుల ప్రేమని ఆమోదించని పెద్దల దురహంకారాన్ని ప్రదర్శించి వారిని గదులలో పెట్టి హింసకి గురిచేసారట. అవకాశం దొరికే దాకా వేచి చూసి పెద్దలని  ధిక్కరించి  పెళ్లి చేసుకుని అదే వూరి మధ్యలోఇరువురు కలసి విషం  త్రాగి  చావు కూడా వారిని విడదీయలేదని  చెపుతున్నట్లుగా   ఆత్మ హత్య చేసుకుని మరణించారు .

ఆ తర్వాత ఆ పెద్దలు వారిరువురి కాయాలకి కలిపి చితినంటించి తర్వాత వారి జ్ఞాపకారం సమాధులని కట్టి సంతాప సభ ఏర్పాటు జేసి విందు భోజనాలు పెట్టి వీలైనంత కన్నీరు కార్చారట. ఇలా ప్రేమికులు మరణించకుండా ఉండాలంటే అసలు ప్రేమ జోలికి పోకూడదు అని తీర్మానించి .. ఆ వూరి మధ్యలో రచ్చబండ దగ్గర , వీధుల్లో  అక్కడక్కడా " ప్రేమిస్తే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త " బోర్డులు పెట్టారంట .  

ఈ విషయం వింటే అసహ్యం వేసింది . బిడ్డల పట్ల తల్లి దండ్రులు  వ్యవహరించే తీరులో నియంతృత్వం కనబడుతుంది . యుక్త వయసులో ఉన్న బిడ్డల ప్రేమలు పెళ్ళిళ్ళు పట్ల వారికి విముఖత ఉండటం సహజమే ! కానీ సున్నితంగా వ్యవహరించాల్సిన ఇలాంటి విషయాలలో మూర్ఖంగా వ్యవహరించి  వారిని నియంత్రించాలని అనుకోవడంతో యువతీ యువకులు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు . ఇలా వెళ్ళే వారిలో మైనర్ బాలికలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది . వారిని ఇంటికి  తీసుకు వచ్చి పరువు  పోయిందన్న కారణంతో వారిని హత్య చేయడానికి కూడా  తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. పరువు హత్యలు పేరిట చేస్తున్న హత్యలలో ఉన్న పరువు ఏ  పాటిదో  అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంది .

పుట్టుక  మరణం మధ్య   మిగిలిన ముప్పాతిక జీవితం ఎలా గడపాలో అన్న నిర్ణయం తమంతట తాము తీసుకుంటే .. పెద్దలు ఎలా నిరంకుశంగా వ్యవహరిస్తారో తెలుసుకుంటూ కూడా ప్రేమ అనే ఊబిలో పడి పెద్దల చేతిలో పరువు హత్యల కి గురవడం ఉత్తరాది రాష్ట్రాలలోనే కాదు  .. మన రాష్ట్రం లోను మొదలయ్యాయి .

"చందు" అనే తమ్ముడు ఈ విషయం చెప్పాక .. " ప్రేమిస్తే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త " ఇలాంటి సన్నివేశం  మన తెలుగు సినిమాలలో ఇంకా కనబడలేదు .. ఎందుకని ? అని అడిగాను .

  ఎప్పుడో వచ్చే ఉంటాయి మనం చూడలేదు అంతే! అని .. "అక్కా .. ఈ విషయం నీ బ్లాగ్ లో వ్రాయి . సినిమాలలో కన్నా బయట ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి .  పెద్దవాళ్ళు మారరా? ప్రేమించుకున్నవాళ్ళు చావాల్సిందేనా ? అని బేతాళ ప్రశ్న  వేసాడు .  :)  

18, అక్టోబర్ 2013, శుక్రవారం

రుబాయీలు రెండు

ఉమర్ ఖయ్యాం రుబాయీలు .. రెండు .
చలం గారి అనువాదం .
బాగా నచ్చాయి . ప్రతి ఒక్కరూ .. అన్వయించుకోదగ్గవి కూడా . 


ఈ పురాతన సత్రానికి రెండే వాకిళ్ళు
రాత్రింబవళ్ళు
ఆ ద్వారాలలోంచి సుల్తాను తర్వాత సుల్తాను ప్రవేశించి
పరిపాలించాడు, అనుభవించాడు
ఏ గుర్తూ లేకుండా వొచ్చిన దారినే పోయినాడు

***********************

వారితో కలసి జ్ఞాన బీజాన్ని నాటి మొక్క మొలిపించాను
కష్టించి పోషించి దాన్ని పెంచి పెద్దదాన్ని చేసాను
ఆ వృక్షం నుంచి నేను కొని తెచ్చుకున్న ఫలం ఏమిటంటే ...
"నేను వీళ్ళమల్లే ఈ లోకంలోకి వచ్చాను
గాలి మల్లే ఈ లోకం లోంచి పోతాను"  అని ..

15, అక్టోబర్ 2013, మంగళవారం

ఫీలింగ్స్....

కవిలోని భావుకత్వాన్ని. గళం లోని మాధుర్యాన్ని , ప్రవర్తనలోని సున్నితత్వాన్ని
మాటలో చురుకుదనాన్ని, కల్మషంలేని నవ్వులని
నడకలో ఠీవిని, స్వార్ధంలేని ప్రేమలని
స్నేహ గుణంలో ఉన్న స్వచ్చతని
ఏ మాత్రం సంకోచం లేకుండా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది
వ్యక్తులని కాదు గుణాలని ప్రేమించాలనిపిస్తుంది
అందుకనేమో .. మనకి ఇష్టమైన జాబితాలో ఎంతోమంది చేర్చ బడుతూనే ఉంటారు



8, అక్టోబర్ 2013, మంగళవారం

ఖుర్భానీ..

ఖుర్భానీ.. కి సిద్దమవుతున్న జీవాలు
మనసంతా బాధతో నిండిపోతుంది . జంతుబలులు నిషేధం  అంటారు కానీ  నిత్యం ఇలాంటివి చూస్తూనే ఉంటాం .
ఎంతో ప్రేమగా పెంచి మరీ ప్రాణం తీసేయడం బాధాకరం.








4, అక్టోబర్ 2013, శుక్రవారం

పూచిన కొమ్మ "అమ్మ "

నిత్య జీవితంలో..సమస్యలతో,చికాకులతో..అతలాకుతలం అయిపోతున్న మనిషికి..ఆహ్లాదం ని ఇచ్చి..మనసుకి సేద దీర్చే  శక్తి.. సంగీతానికి తప్ప వేరోకదానికి లేదు.అందుకే  ..నాదం లోనే మోదం ఉంది..అంటారు..కదా..!   అందుకే ఇప్పుడు మనకి  చిన్నా పెద్దా అందరు    పరవశించి  పోవడానికి , వినడానికి పాట ఒక సాధనం   పాట.. వినోదాన్ని  పంచి గాలి అలలపై తేలియాడించడమే కాదు,ఆలోచింపజేస్తుంది కూడా..  పాట.. వినోదాన్ని  పంచి.. .   గాలి అలలపై.. తేలియాడించడమే కాదు.. ఆలోచింపజేస్తుంది కూడా..

కొన్ని పాటలు   వింటూ ఉంటే అరటి పండు ఒలిచిపెట్టినట్లు ఉంటుంది . శ్రావ్యమైన సంగీతం,  వింటున్నపుడే అర్ధమయ్యే సాహిత్యం తో మరల మరల వినాలనిపిస్తూ ఉంటుంది . అందులో సందర్భానికి తగినట్లు ఉండే సాహిత్యం పాత సినిమా పాటలలో మనకి బాగా నచ్చే అంశం . ఇప్పటి పాటలు చూస్తుంటే అసలు పాటేందుకు వస్తుందో తెలియక తలా తోక లేని వ్యవహారంలా  ఉండి భారంగా తలలు పట్టుకు కూర్చునే బాధ అప్పటి తరం వారికి ఉండేది కాదు. పాట  పంచామృతం లా ఉండేది . పంచామృతం అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు . చక్కని దృశ్యీకరణ , వినసొంపైన  సంగీతం, విలువలతో కూడిన సాహిత్యం, గాత్ర మాధుర్యం , నటీనటుల హావభావాలు అన్నీ కలబోస్తేనే ఆ పాట  పంచామృతం అనిపించుకుంటుంది 

పాట  అంటే చెవి కోసుకునే వారికి అలాంటి  ఆణిముత్యం లాంటి పాటలని పరిచయం చేయాలని  .. ఈ చిన్ని ప్రయత్నం.     మంచి పాటలెన్నో ఇక్కడ పరిచయం చేసుకుంటూ  మన మనసులు వినీల గగనంలో విహంగంలా నాట్య మాడాలని కోరుకుంటూ ..

మొదటగా .. రావు బాల సరస్వతి దేవి గారి పాట .  ఆగస్ట్ 29 న ఆమె పుట్టినరోజు . ఆమె గురించి తెలియని వారు ఎవరు ఉండరు .  ఆ సందర్భంగా ఆమె పాటలని గుర్తు చేసుకుంటూ ఉంటే  జగమెరిగిన ఈ చిత్రం గుర్తుకు వచ్చింది "మంచి మనసుకు మంచి రోజులు"  చిత్రం లో పాట  1958 లో వచ్చిన చిత్రం ఇది . అబ్బా.. ఇంత పాత పాట  గురించి చెప్పబోతున్నారా ? అని ముఖం చిట్లించుకోవద్దు. నేను ఈ పాట  చాలా  పాత కాలం నాటి పాట  అని చెప్పగానే .. వద్దు, వినిపించ వద్దనే వద్దు .అని గొడవ చేసాను . మనలో చాలా మందికి పాత పాటలు నచ్చవు ..  నేను  పుట్టక ముందు  ఎప్పుడో వచ్చిన చిత్రంలో పాటని    పిచ్చ బోర్ .. అని కూడా  కొట్టి పడేసాను . కానీ తర్వాతెప్పుడో యధాలాపంగా ఆ పాట  విన్నప్పుడు .. ఆరే ! ఈ పాత ఇంత బావుందేమిటీ? నేనెందుకు వినడంలో నిర్లక్ష్యం వహించాననుకుని మళ్ళీ మళ్ళీ విన్నాను .

అంతగా నాకు నచ్చిన అంశం  ఏమిటంటే .. పాట  యొక్క సాహిత్యం . ఎంత బావుందో .. మీరూ గమనించండి ..
మగువ జీవితానికి మాతృత్వం ఒక వరం అంటారు అది నిజం కూడా ! ఆ మాతృత్వంలోని ఆనందాన్ని ,అనుభూతిని అనుభవిస్తే కాని ఆ విలువ తెలియదు .

మీకు బిడ్డలు ఎంత మంది అని అడుగుతారు కాని మీకు ఎంత ఆస్తులున్నాయని అడగరు కదా ! అందుకే .. అమ్మ గురించి చెపుతూ ఈ పాట  సాగుతుంది

భూమి కి తనపైన ఉండే కొండ భారమా ? ఆ కొండపై ఉన్న చెట్టు ఆ కొండకి భారమా ?  ఆ చెట్టుకి కాసిన కాయ ఆ చెట్టుకి భారమా? అలాగే నవమాసాలు మోసి కన్నతల్లికి పుట్టిన బిడ్డ భారమా? అని ప్రశ్నిస్తూ సాగుతుంది ఈ పాట.  .  ఆస్తికులు బిడ్డల కోసం ఎన్నో మ్రొక్కులు మ్రోక్కుతారు గుడులు చుట్టూ తిరుగుతారు , అలాగే వైద్యశాల ల చుట్టూ తిరుగుతారు.  .  ఎన్నో నోములు నోచి ఆ ఫలమే బిడ్డలు అనుకుంటారు. బిడ్డలు లేకుంటే పూయని కొమ్మ అనే అపవాదు వస్తుందని చింత పడతారు . తల్లి మనసు తలపోసినందు కేమో ఒడి నిండి తల్లినయ్యానని గర్వపడతారు . ఎన్నో ప్రయాసలకోర్చి బిడ్డలని  కంటారు . ఇంకా చాలా ప్రయాసలకోర్చి బిడ్డలని పెంచుతారు. బిడ్డలకి ఆపదలు వస్తే తల్లి బెదిరిపోదు పిల్లలు ఏడుస్తున్నా తల్లి విసుగు చెందదు  పైగా బిడ్డకి ఏమైనదో అని తల్లడిల్లిపోతుంది. పిల్లలు కనగానే   ఆమె భాద్యత తీరి పోదు ఆ పిల్లలని  ప్రేమతో,అనురాగంతో  బాగా పెంచడం  కూడా ఆమె భాద్యత అనుకుంటుంది .. తల్లి విలువను చెపుతూ ఎంతో  హృద్యంగా సాగుతుందీ పాట . ప్రతి స్త్రీ మూర్తి జీవితంలో బిడ్డల కోసం కరిగిన క్షణాలే అత్యద్భుత క్షణాలేమో అనిపిస్తుంది . అలాగే బిడ్డలు కనలేని స్త్రీమూర్తులలో కన్నతల్లిని మించిన ప్రేమ పొంగిపోర్లడం చూస్తే .. అమ్మగా అరిగిపోవడానికే  ఈ స్త్రీ మూర్తులు పుట్టారా ! అందుకే జీవించి ఉన్నారా ? అనిపిస్తూ ఉంటుంది

ఈ పాటలో నటియించిన స్త్రీ మూర్తి .. జయచిత్ర  గారి తల్లి ."అమ్మాజీ"  (జయశ్రీ ) గారట ఆమె రోజులు మారాయి చిత్రంలో ANR  గారి చెల్లెలుగా నటించారు . అలాగే రాజు -పేద చిత్రంలో  పేదబ్బాయి చెల్లెలుగా కూడా నటించారట .

పుట్టీ పుట్టగానే మురికి కాలువలు , చెత్త కుప్పలు పాల్జేసే తల్లులని తలచుకుంటే .. వారికి ఈ పాటని పదే  పదే  వినిపించాలనిపిస్తూ ఉంటుంది .

చూడండి వద్దు వద్దు అంటూనే ..  ఆణి ముత్యం లాంటి పాట  విన్నాను . ఆ పాట  గురించి ఉత్శాహంతో పరిచయం చేసేసాను . ఈ పాత పాట  మగువలందరికి , మనసున్న మహారాజులందరికి బాగా నచ్చింది కదా !
మరో మంచి పాటతో .. ఇంకోసారి కలుసుకుందాం .

song Audio  link : http://www.divshare.com/download/24445215-6e7
song video link : http://www.youtube.com/watch?v=PhtI3pyeuHo


పల్లవి:
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: 1
మును నే నోచిన నా నోము పండగా
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక - 2
తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: 2
ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - (2)
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా ?
ఈ పాట  కి సాహిత్యం అందించిన వారు సముద్రాల జూనియర్
సంగీతం :ఘంటసాల

2, అక్టోబర్ 2013, బుధవారం

నా గీత మాల ఆమనీ ...

ఓ..ప్రియా..ప్రేమ భాష ఎప్పుడు సగమే.. నీ మనసులో కోరిక కూడా సగంగానే ఉండనీ..నేను భావనని గాంచి ప్రేమ వర్షంలోసగం తడచిన అరమోడ్పు కన్నులతో..సగం మూసి సగం తెరచి..నిన్ను చూస్తూ..నా నీ..ఈ మాటలు,కలయిక ఆగిపోకూడదని కోరుకుంటున్నాను. అంది ఆమె..


నా గీతమాల ఆమనీ ..   మరొక మారు ..ఇక్కడ..