26, జులై 2013, శుక్రవారం

సర్వం వ్యాపార మయం



భక్తి వ్యాపారం అయిపోయిన కాలం ఇది. శ్రీశైలం అంటే ఎంతో ప్రశాంతమైన ప్రదేశం అని అందరూ అనుకుంటూ ఉంటాం. తిరుమల క్షేత్రం తో పోల్చుకుని శ్రీశైల  భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి  క్షేత్రం ని అభివృద్ధి చేయాలనుకుని వ్యాపార మయం చేస్తున్నారనిపిస్తుంది.

దేవస్థానం యొక్క  అధికార గణం ఎప్పుడు పడితే అప్పుడు దర్శన సమయాలని, నియమ నిబంధనలని మార్చేస్తున్నారు. ప్రతి నిత్యం  మల్లి కార్జున స్వామి వారికి సుప్రభాత సేవ , ప్రాతఃకాల అభిషేకం,మంగళ హారతి తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్ కొనుకున్న భక్తులని  మూలవిరాట్టుకి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తారు. 05:00 to 06:30 గంటల వరకు 250 టికెట్ల వరకు ప్రవేశం కల్పిస్తారు తర్వాత అభిషేకం  కోసం  600  రూపాయల  టికెట్ కొనుక్కున్న భక్తులకి ప్రవేశం కల్పిస్తారు. రోజు వారి పద్దతి అది

ప్రత్యేకదినాలలో ప్రముఖుల దర్శనాలతో, దేవస్థానం ఉద్యోగుల రికమండేషన్ లతో నేరుగా అంతరాలయంలోకి వెళ్ళే భక్తులతో  మిగతా భక్తులకి గంటల తరబడి వేచి ఉండాల్సివస్తుంది. ఎంతో శ్రమకి ఓర్చి గంటల తరబడి క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుని స్వామి దర్శించుకోవాలనుకునే వారికి పడిగాపులు తప్పడం లేదు. మొన్న గురు పూర్ణిమ రోజు అలాగే జరిగింది.  ఆన్ లైన్ లోను ,ముందు రోజు రాత్రి 07:30 గంటలకి ఇచ్చిన టికెట్ లు మొత్తం 1000 టికెట్లకి పైనే ఉన్నాయి. దేవస్థానం వారికి ఆ రోజున వచ్చిన ఆదాయం ఒక్క అభిషేకం టికెట్ల పైన 10 లక్షలు రూపాయలు. ఇక ఉదయం పూట 07:00 నుండి ఇచ్చే అభిషేకం టికెట్ లు  600  రూపాయలవి ఎన్ని ఇచ్చారో... తెలియదు. అడ్వాన్స్ టికెట్ లు 1000 టికెట్ల వరకు ఇచ్చినవారికే మధ్యాహ్నం 03:30 వరకు సమయం సరిపోతుందని అనౌన్స్ చేసారు . 129,130,131 సీరియల్ నంబర్ల  గల మేము 04:45 కి అభిషేకం చేయించుకునే వారు వేచి ఉండే స్థలం కి చేరుకుంటే 11:30 కి స్వామిని అభిషేకించుకునే అనుగ్రహం దక్కింది. ఈలోపు అంతా VIP ల తాకిడి.  ఏం జేస్తాం !? భక్తులు సహనం వహించక తప్పదు కదా !  ఆ రోజున అంతా పక్కా వ్యాపార సంస్కృతి రాజ్యమేలింది అక్కడ. అయినా భగవంతుని కరుణా కటాక్షాలకి లోటు లేదక్కడ .

ఐదారేళ్ళ క్రితం వరకు ధ్వజస్థంభం ని తాకి నమస్కరించుకుని తొలుత నందీశ్వరుని కి మ్రొక్కి ఆయన అనుమతి తీసుకుని ..స్వామి దర్శనానికి వెళ్ళడం  ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు అవేమి లేవు. ఎడమవైపుకు ప్రత్యేక దర్శనం  టికెట్ కొనుక్కున్న వారు వెళ్ళాలి. కుడి వైపు అభిషేకం టికెట్లు కొనుక్కున్న వాళ్ళు వెళ్ళాలి. నేరుగా ఉచిత దర్శనం భక్తుల క్యూ  ఉన్నాయి . ఏ ఒక్కరు నందీశ్వరుని  మొక్కే అవకాశమే లేదు  సంప్రదాయాలు అన్నీ మార్చేసారు.

 ఇక ఆన్లైన్ లో టికెట్ కొనుక్కున్న వారు ఏ మాత్రం ఆలస్యం భరించలేము అన్నట్లు మిగతావారిని త్రోసుకుంటూ లోపలకి జొచ్చుకు వెళ్లాలని ప్రయత్నించడం చూసి వెగటు పుట్టింది. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే! అయినా నియమ నిబందనలు పాటించరు. సీరియల్ నంబర్ ప్రకారం వారి వంతు వచ్చే వరకు ఆగలేరు. పోటీ పడి మరీ ముందుకు తోసుకు వెళ్ళారు. ఇలాంటి వారే వారు ప్రశాంతంగా ఉండరు ,ఎదుటివారిని ప్రశాంతంగా ఉండనీయరు.

వసతి గృహం దొరకబుచ్చుకోవడం నుండి గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడటం, వర్షం ల  మధ్య ఈ సారి మా శ్రీశైల యాత్ర దిగ్విజయంగా ముగిసింది

ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా "శాకంభరీ " ఉత్సవాలు నిర్వహించారు. . ఆలయ ముఖద్వారాన్ని, ముఖ మండపాన్ని, ద్వజస్థంభంని, నందీశ్వరుణ్ని, మల్లికార్జున స్వామీ అంతరాలయం వరకు కాయగూరలతో అలంకరించారు. అలాగే "అమ్మ " వారిని ప్రత్యేకంగా "శాకంభరి" గా అలమ్కృతం గావించారు . అన్ని రకాల కాయగూరలతో ఎంతో శ్రద్దగా అలంకరించిన వారిని మెచ్చుకోకుండా ఉండలేం అంత సర్వాంగ సుందరంగా అలంకరించారు ఒక్క ఫోటో కూడా తీయలేకపోయాను. ఐ ఫోన్ చేతిలో ఉంది కదా అని కెమెరా పట్టుకుని వెళ్ళలేదు.  బస్ ప్రయాణం లోనే మా అమ్మాయి  డాటా కార్డ్ అంతా వాడేయడం,  నా పోన్ లో చార్జింగ్ అయిపోవడం ,  ప్లగ్ పిన్ సెట్ అవక చార్జ్ చేసుకోవడానికి కుదరక పోవడం ,  e రీచార్జ్  కాని 3G కార్డ్  కాని అక్కడ లభ్యం కాకపోవడం వల్ల ఎన్నో పిక్స్ తీయాలన్న  ఆశ నిరాశ అయిపొయింది ప్చ్ !  కానీ ఎలాగోలా రెండు వీడియో క్లిప్పింగ్స్ మాత్రం పట్టుకొచ్చాను..    (ఎవరైనా పోటోస్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ప్రయాణంకి  ముందే  సరి చూసుకుని తీసుకువెళ్ళండి. అక్కడ ఏవి దొరకవు  మరి )

ఇక్కడ ఒక విషయం చెప్పాలి ..  ఆ రెండు రోజులు  ఐ పోన్ వాడగల్గే సౌకర్యం లేనందుకు నేను  బాధపడలేదు. పోన్లే.... ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా రెండు రోజులు ఉండగల్గినందుకు సంతోషం వేసింది.  

చివరిగా ఒక మాట . ప్రశాంతమైన ఆ వాతావరణంలో భగవంతుని సన్నిధిలో గడపాలనుకుని వెళ్ళడం బాగానే ఉంటుంది. కానీ అక్కడ వాతావరణంలో  అంతా వ్యాపార సంస్కృతి యే గోచరించింది. "తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు "  ఇటీవల కేదార్ నాథ్ విలయ తాండవం మన స్మృతిపథం నుండి చెరిగిపోలేదు పుణ్య క్షేత్రాల పవిత్రతని కాపాడుకోవడం ,సర్వం వ్యాపార మయం చేయకుండా ఉంటే బావుంటుంది. భక్తులే కాదు దేవస్థానం వారు కూడా. సర్వం శివమయం స్థానే వ్యాపార మయం అయిపోకుండా ఉంటే చాలా బావుంటుందని అనేక సార్లు అనుకున్నాను.

నిరాడంబరుడు, అభిషేక ప్రియుడు అయిన ఆయనకీ అలంకారాలు,  ఆడంబరాలు బాంక్ లలో కూడబెట్టే దనం సంగతి మరచి పేద-ధనిక తారతమ్యం లేకుండా అందరికి ఆ స్వామీ "స్పర్శదర్శనం '  భాగ్యం ని కలగజేస్తే బావుండును అనిపించింది. ఆ దర్శనం కోసమే .. ఆ స్పర్శ ద్వారా లభించే ఉపసమనం కోసమే నేను పదే పదే స్వామి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తాను. అదండీ విషయం .  ఓం నమఃశివాయ !

.

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఆన్ని ఆలయాలలోనూ‌ వ్యాపారసంస్కృతి రాజ్యం చేస్తోందండీ.
వీఐపీలూ అంటారు గాని వాళ్ళు ఎవరికి వీఐపీలండీ? మనకా దేవుడికా? దేవుడేమనా వాళ్ళని ముందుగా రండి అంటున్నాడా? అందర్నీ‌నెట్టుకుని రండి అంటున్నాడా? మీ రన్నట్లు సంప్రదాయాలకు గాక కనకవర్షానికే విలువనిచ్చే ఆలోచనలు ఆలయపాలక వర్గాలవి! చూసి బాధపడకుండా ఉండటం కష్టం. ఈ‌తమాషా మధ్యన కూడా ఆవేశపడకుండా భక్తిగా దర్శనం చేసుకుని రావటం మంచి పని. అభినందనలు.

జయ చెప్పారు...

కాస్త పాపులర్ అయిన ఏ దేవాలయంలో అయినా ప్రస్తుతం రాజ్యమేలుతున్నవే ఇవన్నీ.బాగా చెప్పారండి. చిలుకూరి దేవాలయంలో ఇంకా ఈ మార్పు చోటు చేసుకోలేదు.

Sharma చెప్పారు...

ఇలా వ్యాపారపరం కావటానికి మూల కారణం , ఆ ఆలయ అధికారులకు ప్రోత్సాహకాలే . అవి లేకుంటే వాళ్ళు మనలాగే ఆలోచిస్తూ మనందరకి సేవ చేసుకునే అవకాశం గాని , దర్శనం చేసుకునే సౌలభంగాని లభించేవి .