8, డిసెంబర్ 2012, శనివారం

పంటి క్రింది రాయిలా ...

వ్యాపార ప్రకటనలు చూడటం మనకి క్రొత్త ఏమి కాదు.  ప్రపంచంలో ఏ విషయం అయినా వ్యాప్తి చెందటానికి,వస్తువు  ఉనికి చాటి చెప్పుకోవడానికి ప్రకటన చాలా అవసరం. 

అసలు మనకి ఎన్ని వస్తువులు రకరకాల పేర్లుతో మన ముందుకు వస్తున్నాయి అని తెలిపేది ప్రకటనలే కదా! ప్రకటనలని వ్యతిరేకిస్తే ఎలా ..అని నాకు నేనే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

టీ.వి. చూస్తే... అసలు కార్యక్రమం కన్నా నాకు ఈ ప్రకటనలే బాగా నచ్చిన సందర్భాలు ఎక్కువ.  కొన్ని సెకనుల కాలంలో మనకి కనిపించి మయామయ్యే ప్రకటనలలో ఎంత క్రియేటివిటి ఉంటుందో..కదా !

అలాగే  అతిశయోక్తంగా  ఉన్న ప్రకటనలు చూసి చూసి విరక్తి వచ్చి.. రిమోట్ తీసుకుని నేలకి విసిరి కొడదామనుకున్న కోపం ని తమాయించుకుని .. ఛీ ఛీ.. పవర్ కట్ ఉండినా బాగుండును. వెదవ టీ .వి పెట్టకుండా ఉందును అనుకుంటాను.

సరే ..మన తెలుగు దిన,వార పత్రిక,మాస పత్రికలలో కూడా  వ్యాపార ప్రకటనలు ఏమైనా తక్కువా!? అక్కడా..అవే!

నేను చదవటం మొదలెట్టిన దగ్గర నుండి చూస్తున్నాను.. రోజుకు..గంట ఇంగ్లీష్ నేర్చుకోండి,..అనే ప్రకటన ఏమిటో..ఆ ప్రకటన చూసి చూసి ఇంగ్లిష్ నేర్చుకోవడం అంటేనే విరక్తి పుట్టింది అంటే నమ్మండి.

ప్రముఖ దేవాలయాలలో సేవా వివరాలు,రీటా కొబ్బరి నూనె ప్రకటనలు చూసి చూసి మొహం మొత్తి ఉన్నాను. ప్రకటనలు చూసి దేవుడు అక్కడమాత్రమే  ఉన్నాడు అని అనుకున్నఅమాయకత్వం లో నుండి బయట పడి  అక్షరం ద్వారా లభించిన జ్ఞానంతో.. ఎక్కడైనా ఉన్నాడు అని తెలుసుకునేటప్పటికి ..ఓ.. పదేళ్ళు గడచిపోయాయి.
అలాగే రీటా  ఆయిల్ కలపకుండాను  కొబ్బరి నూనె రాసుకోకుండాను కూడా  జుట్టు పెరుగు తాయి  అని తెలుసుకోవడానికి ఇంకొన్ని ఏళ్ళు పట్టింది. 

సరే ప్రకటనలు సర్వ వ్యాప్తి..అనుకుని ప్రకటనలపై కొన చూపుకూడా పడకుండా  గెంతి గెంతి కథలు, కవితలు, పుస్తక విశేషాలు మాత్రమే  చదువుకోవాలని  సమాధాన పడి  మనకి కావాల్సింది మనం తీసుకుని తతిమాది వద్దనుకోవడం అలవాటు చేసుకున్నాను చూడండీ! అది ఎంత గొప్ప విషయం అనుకున్నారు. అసలు అక్కడే మొదలయింది.నాకు జ్ఞానం  రావడం అన్నది. 

 "సముద్రం ముందు మనం నిలుచున్నాం. సముద్రం నుండి గవ్వలు, ఆల్చిప్పలు,మనం వద్దనుకుని విసిరి పారేసిన వస్తువులు, మణులు,మాణిక్యాలు ..లాంటివి ఏవేవో..వస్తూ ఉంటాయి. మనకి కావాల్సింది మనం తీసుకోవడంలోనే విజ్ఞత ఉంటుంది." అన్నగొప్ప విషయం  అర్ధమవడానికి   ఇతోధికంగా సాయం చేసిన ప్రకటనలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను కూడా!

కానీ అప్పుడప్పుడు పంటి క్రింది రాయిలా ఇబ్బంది పెట్టె ప్రకటనలు, అజ్ఞానం ని పెంచి పోషించే  ప్రకటనలు, 10 వేలు నుండి పదికోట్లు సంపాదించండి అనే ప్రకటనలు చూస్తూ ఉన్నప్పుడు.. పాఠకుల జ్ఞానం కన్నా ప్రచురణకర్త ల అజ్ఞానం కనబడుతుంది. 

ఆ..ప్రకటనలు ఎలాటి వంటే.. వైజయంతి మాల ధరించండి..మీకు  ప్రేమలో విజయం లభిస్తుంది. ఒక రూపాయి  పెట్టుబడి తో కోట్లు సంపాదించండి., ఆ దేవాలయంలో పూజ చేయించండి..మీకు పట్టిన దోషాలు నివారణ చేసుకోవచ్చు, యంత్రం వేయించుకోండి.. శుభం జరుగుతుంది.. లాంటి ప్రకటనలు..కనబడుతూ ఉంటాయి. పత్రికల నిర్వహణకి ఆదాయవనరులు సమకూర్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు  సరే వాళ్ళ బాధలు వారివి. కాదనలేం.! ఇక  రంగు రంగుల రాళ్ళు ,రత్నాలు, వజ్రాలు,వైడూర్యం ధరించడం లాంటి  ప్రకటనలు సైంటిఫిక్  రీజన్ లతో ఊదరకోడుతూ మన కళ్ళని,చెవులని,ఆలోచనలని పాడుచేస్తూనే ఉన్నాయి. ఎవరి పిచ్చి వారికి ఆనందం.  
ఎవరి నమ్మకాలు,ఎవరి విశ్వాసాలు వారివి కాదనలేం.

అజ్ఞానం ని  పారద్రోలే అక్షరం చెంత ..ఇలాంటి మానసిక దౌర్భాల్యంని   పెంచే ప్రకటనలు రావడం విచారకరం అనిపిస్తూ ఉంటుంది 

కానీ   మూఢ నమ్మకాలని  ప్రోత్శాహించే ప్రకటనలు వేసేముందు ఎడిటర్స్  ఆలోచిస్తే బావుంటుంది. ఈ ప్రకటనలు..పంటి క్రింది రాయిలా ఉంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు. 

 (ఒక చక్కని మాస పత్రిక అందులో కొన్ని ప్రకటనలు చూసినప్పుడల్లా.. నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ స్పందన.)

4 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

హ్మ్మ్.... ఇవే కాదండీ.. ఒళ్ళు వంచకుండా కొవ్వు కరిగించే మిషన్లూ, మందులూ, మన్నూ మశానం...అని చెప్పిందే చెప్పీ ప్రాణాలు తోడేస్తుంటారు. ఒకానొక టైం లో ఏ టీవీ పెట్టినా ఇవే వస్తాయ్... ;((

అయినా నిజాలో, మూఢనమ్మకాలో వాళ్ళెందుకు పట్టించుకుంటారండీ? మనీ మేటర్స్... ;)

అజ్ఞాత చెప్పారు...

లోకో భిన్నరుచి

చెప్పాలంటే...... చెప్పారు...

alochimpa chese tapaa andi vanaja garu...okappudu cinimaa ki prakatanalu kudaa chudataaniki velledaanni....mari eppudo...ekkada chusinaa ave...:)bagaa rasaru

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్ కుమార్ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

@కష్టే ఫలే మాస్టారూ.. అంతే నండీ..అంతే !

@ మంజు గారు.. ఇప్పుడు వ్యాపార ప్రకటనల నుండి దూరంగా అడవుల్లోకి వెళ్లి బ్రతకాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ.. :)