8, నవంబర్ 2012, గురువారం

దేహక్రీడలో తెగిన సగం



దేహక్రీడలో తెగిన సగం 

ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై..
మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు..
బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం
పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై..
వసంతం విరిసినప్పుడు  వీడని అమాయకత్వం 

నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు 
నఖశిఖ పర్యంతమూ  చూపులతో
గుచ్చి గుచ్చి తడిమినప్పుడు
లోలోపల భయం, గగుర్పాటు తో 
అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి 
తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం 

కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా
మోహపు పరవశంతో ఉప్పొంగినా 
నలిగిన  మేనుకు  అవే  తరగని
అలంకారమని సగభాగం నిర్ధారించాక


అనంత సృష్టి  రహస్యపుఅంచులు తాకే 

కేళీ విలాసంలో ముఖ్య భూమిక గా  

కామ్య వస్తువుగా..భోగ వస్తువుగా 

మారిన  కుఛ ద్వయాలకి 

అన్నీ గరళమైన  అనుభావాలే ! 


 చిన్ని చిన్నిచేతులతో ..తడిమి  తడిమి ..
ఆకలికి  తడుముకుంటూన్నప్పుడు  
ఆ పాలగుండెలు 
బిడ్డ ఆకలిని తీర్చేఅమృత భాండా లని...
ఆ గుండెలు పరిపూర్ణ  స్త్రీత్వపు చిహ్నాలని
తన్మయత్వం తో..
తెలుసుకున్న క్షణాలు మాత్రం స్వీయానుభవాలు. 

అసహజపు అందాలను ఆబగా చూసే వారికి 
సహజం అసహజమైనా,అసహజం సహజమైనా.. 
ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు  
చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా.. 


అసహజంగా పెరిగిన కణ సముదాయాలని కుతికలోకి.. కోసి.. 
ఓ..సగ భాగాన్ని పనలని పక్కన పడేసినట్లు పడేసాక..
అయ్యో అనే  జాలిచూపులు భరించడం,.  కన్నా 
నువ్విక పనికరావనే..వెలివేతలు..సహించడం కన్నా
ప్రాణం పొతే బాగుండునన్న భావనే అధికం.  


అమ్మ - అమృత భాండం,   స్త్రీ-సౌందర్యం-ఉద్దీపనం  సారూప్యమైనవే !


దేహం నదిలో 
ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులను 
ఆబగా కొలుచుకునే కామచిత్తులకి  
ప్రవాహించినంత మేరా...  పచ్చదనాన్ని  నింపే 
ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు? 

పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై 
విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది.
అంతః చక్షువుతో .సౌందర్యపు ఝడిని కనలేని 
వికృతమైన ఆలోచనల కురుపు  
రాచ పుండు కన్నా భయంకర మైనది.

(టాటా మెడికల్  ఇనిస్ట్యూట్ ఆఫ్ కేన్సర్ (ముంబాయి) లో బ్రెస్ట్ కేన్సర్ విభాగంలో కొంతమంది అనుభవాలు విని విచలితమై వ్రాసుకున్న కవిత ఇది.) 

( "విహంగ " వెబ్ మేగజైన్ లో ప్రచురితమైన కవిత)                                                                                                                                                

11 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

super vanaja gaaroo!...chaalaa baagaa present chesaaru...@sri

అజ్ఞాత చెప్పారు...

వనజగారు, మీరు అట్లకాడ కాల్చి వాతలు పెట్టినా బాగానే ఉంటుంది. అది మీకే చెల్లింది కూడా.

పల్లా కొండల రావు చెప్పారు...



అవును. వికృతమైన ఆలోచనలు మాత్రం భయంకరమైనవే.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ గారు.. స్త్రీల మానసిక సంక్షోభ స్థితుల్లో వ్యక్తీకరించలేని ఆవేదనా భరితమైన స్థితి ఈ కవితగా రూపం దాల్చింది.

మీ..ప్రశంసకి మరి మరీ ధన్యవాదములు.

@కొండలరావు గారు..వికృతమైన ఆలోచనలు రాచపుండు కన్నా భయంకరమైనవి.నిజం. మీ స్పందనకి ధన్యవాదములు.

@కష్టేఫలే మాస్టారు..విషయం గరళమైనా సున్నితంగా చెప్పాలంటారు. మీ వ్యాఖ్య అర్ధం అయింది. ధన్యవాదములు :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఇలాంటి విషయాలను మీరు మాత్రమే చెప్పగలరండీ..
ఇంతకుముందు కూడా చదివాను చాలా బాగుంది..

హితైషి చెప్పారు...

వనజ గారు మీ కవితా హృదయానికి అభివందనం.
రాజీ గారు చెప్పినట్లు.. మీరు మాత్రమే ఇలా వ్రాయగలరు.
కవిత్వం వ్రాయడం కోసం నేను కవిత్వం వ్రాయలేను స్పందించితే తప్ప అని మీరు అనే మాటలు ఇలాంటి కవిత్వం చూసినప్పుడు ఋజువు అవుతాయి.
మీ కవితా సంపుటి, కథా సంకలనం ని ఎప్పుడు మా ముందుకు తెస్తున్నారు ? వైయిట్ చేస్తున్నాం .

చెప్పాలంటే...... చెప్పారు...

chaalaa chakagaa chepparu abhinandanalu

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే .. మంజు గారు మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వైష్ణవి ..మీ కామెంట్ ఇప్పుడే చూసాను. చాలా సార్లు కామెంట్స్ ని నేను బిజీలో ఉండి పట్టించుకోకపోవడంలో ఇలా జరుగుతూ ఉంటుంది.

మీ స్పందనకి ,మీ అభిమానానికి ధన్యవాదములు.

Sujata M చెప్పారు...

అబ్బ ! ఎంత బాగా రాసారండీ. ఈ కవిత కు నా జోహార్లు. చాలా రోజులు బ్లాగులకు దూరంగా వుండటం వల్ల చాలా ఆణిముత్యాల్ని మిస్ అయ్యాను. ఇది జాజిమల్లి లో మీ పరిచయాన్ని అనుసరించి చదివాను. థాంక్స్! నిజంగా చాలా బావుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుజాత గారు గ్రేట్ ఫుల్ థాంక్స్ ఫర్ యూ !