5, సెప్టెంబర్ 2012, బుధవారం

హితవాక్కులు నచ్చేనా!?

గురుభ్యోం నమః

గురు పూజోత్సవం .. రోజు మనకి పాఠాల తో బాటు ఎన్నో మంచి విషయాలు నేర్పి మంచి దిశా నిర్దేశం చేసిన  గురువు గారిని వీలయితే కలసి వారికి ధన్యవాదములు తెలిపి  ఆ రోజు కూడా వారు  చెప్పిన మంచి  మాటలు వినాలని  పాటించాలని అందరు అనుకుంటారు.

గురువులు చెప్పిన మాట జవదాటని వాళ్ళు ఉంటారు లక్ష్య పెట్టని వారు ఉంటారు. మధ్యే  మార్గంగా విని ఊరుకునే వారు ఉంటారు.

ఒక శిష్యురాలు ఈ రోజు తన గురువు గారిని భక్తిపూర్వకంగా కలసింది. క్షేమ సమాచారాలు అయిన తర్వాత తన కూతురు చదువు సంగతి చెప్పి .. ఆమెకి తగిన వరుడు ఎవరైనా ఉంటె సూచించమని అడిగింది.

ఆమె కూతురు మెడిసన్    పూర్తి చేసుకుని ఎం .ఎస్  చదవడానికి రెడీగా ఉంది. తల్లిదండ్రులు వరుని వేటలో ఉన్నారు.

తల్లి చెప్పిన మాటలు విని ఆమె గురువుగారు ఒక అతని వివరాలు చెప్పారు. అతను తన ఎం ,డి విద్య పూర్తి చేసుకుని ఒక కార్పోరేట్ హాస్పిటల్లో పని చేస్తున్నాడు. అతనికి బంజారా హిల్స్ కొంత స్థలం ఉంది ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి ఇవ్వగల్గిన   స్థితిమంతుల ఇంటి బిడ్డని వివాహమాడాలని అతని కోరిక. అలా ఇవ్వగల్గితే .. ఆ సంబంధం విషయం చూద్దాం అని చెప్పాడు.

అమ్మో! అంత కట్నం ఇవ్వడం మా వల్ల  కాదు. అయినా మా అమ్మాయి మెడిసన్  చదివింది ఎం .ఎస్ చేయబోతుంది. వృ త్తి రీత్యా  ఇద్దరు ఒకటే అయితే అండర్ సస్టాండింగ్ ఉంటుందని ఆశపడుతున్నాం. ఇవేక్కడ గొంతెమ్మ  కోర్కేలో..!!?

అబ్బాయి మెడిసన్ చదివాడు. ఎం .ఎస్  మీరు చేయించుకోండి అని అడిగే వారు కొందరు.క్లినిక్ పెట్టించి ఇమ్మని కొందరు.

అమ్మాయి చదువుకుంటే చాలు అంటారు.. మళ్ళీ వెనుక ఈ చిట్టాలు అన్నీ ఏకరువు పెడతారు.మేము ఏబై లక్షలు ఖర్చుపెట్టి చదువు చెప్పించాము.పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చులు ఎం ఎస్ చేయించడానికి అయ్యే ఖర్చు భరించగల్గడం ఎంత కష్టం .. అంటూ ఆమె మనసు లో మాటలు వెల్లడించింది.

ఒక ఆలోచన చెబుతాను.. నువ్వు ఏమి అనుకోనంటే ..అని గురువు గారు తన కున్న చనువుతో  అన్నారు.

"చెప్పండి సర్" అని అంది ఆమె.

మీ అమ్మాయి ఇప్పుడు జూనియర్ డాక్టర్ గా చేసింది కదా! ఆమెతో  కలసి  పని చేసిన తోటి జూనియర్ డాక్టర్ లలో
ఒకరిని ఎన్నుకుని  అతనికి ఇచ్చి పెళ్లి చేసేయండి. ఇద్దరు కలసి కష్టపడి ఉన్నత చదువులు చదువుకుంటారు. లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ..గ్రామీణ ప్రాంతాలలో వారి సేవలు అందిస్తారు అని చెప్పారు.

ఆ మాటలకి ఆమె అయిష్టంగా ముఖం పెట్టింది. పల్లెటూర్లలో సాదాసీదాగా ఏ ఇరవై వేల  పై చిలుకు కోసం ఉద్యోగం చేయడం  కోసమా..ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదువు చెప్పించింది.తన కూతురు మంచి హాస్పిటల్ పెట్టుకోవాలని లక్షలు లక్షలు సంపాదిస్తూ.. అందరిలో గొప్పగా, గౌరవంగా ఉండాలనుకుంటే.. గురువు గారు ఏమిటి ఇలా చెపుతున్నారు అనుకుంది.

ఆమె ఆలోచనలు గమనించి ..గురువు గారు ఇలా చెప్పారు.

వైద్య వృత్తి  దైవంతో సమానం .. ఇప్పుడంతా వ్యాపారమయం అయిపొయింది. కొంత మంది అయినా సేవాభావంతో.. పేద ప్రజలకి అందుబాటులో లేకుంటే .. సంపాదించిన జ్ఞానానికి, మంచికి,మానవత్వానికి విలువ ఎక్కడ? పైసా మే   పరమాత్మగా బ్రతకడం లో ఆనందం లభిస్తుందా!? చెప్పమ్మా..  అన్నారు.

మీరు చెప్పిన విషయం ఆలోచిస్తాం అంటూ ఆమె సెలవు తీసుకుంది.

పిల్లల ఆలోచనలు గమనించి పెద్దలు కాస్త మంచి మాటలు చెప్పడం మాట అటుంచి.. తల్లిదండ్రులే విపరీతమైన ఆశలు పెట్టుకుంటే .. ఏం చేయగలం.? అనుకున్నారు గురువు గారు

సంపాదన కోసం కాకుంటే,సౌకర్యవంతంగా బ్రతకాలనే ఆశలతో కాకుంటే.. చదివిన చదువుతో.. సమాజానికి హితం కూడా కలగాలని ఎవరు ఆశిస్తున్నారు .. ? మీ పిచ్చి కాకపొతే.. మీ ఆలోచన ఎవరికైనా నచ్చుతుందా?  మీ శిష్యులే కదా అని ఇలా ఉచిత  సలహాలు ఇవ్వకండి  అంటూ  లోకంపోకడ బాగా తెలిసిన గురువుగారి భార్య సున్నితంగా చెప్పింది.

ఇదంతా విన్న నేను అనుకున్నాను. పిల్లలని(నేను నాతొ పాటు మరికొందరు ) మనం ఎందుకు ఇలా తయారయ్యేటట్లు పెంచుతున్నాం? అది సరి అయిన పెంపకమేనా.. అని.

గురువులని పూజించడమే కాదు గురువులు  చెప్పిన మంచి  మాటల గురించి ఆలోచించాలి. 
అప్పుడే ఈ గురుపూజోత్సవంకి అర్ధం అనిపించింది.

  

4 కామెంట్‌లు:

కాయల నాగేంద్ర చెప్పారు...

"గురువులని పూజించడమే కాదు గురువులు చెప్పిన మంచి మాటల గురించి ఆలోచించాలి" నిజమేనండి... గురువులు భోదించిన అక్షర సత్యాలను ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకుంటే ఈ సమాజంలో చాలా మార్పులొస్తాయి.

Meraj Fathima చెప్పారు...

వనజా, మీ పోస్ట్ ఇప్పుడే చూసాను, మీరు చెప్పినది నిజమే ,
తల్లితండ్రులే ఎక్కువ గొంతెమ్మ కోరికలతో పిల్లల భవిషత్ ఆలోచిస్తున్నారు.
గురువుల ఆలోచనలలో లౌక్యం ఉండదు నీతి ఉంటుంది. ఇప్పటి ఆలోచనలు మారాయి ఎంత పెట్టుబడి పెట్టాం ఎంత రాబట్టుకోగలం అనేది ఆలోచిస్తున్నారు.
బాగుంది మంచి టపా. పిల్లలున్న ప్రతిఒక్కరూ ఆలోచించాలి. మరో మారు మీ శైలికి ప్రశంస డియర్.

జలతారు వెన్నెల చెప్పారు...

మీ పోస్ట్ అలోచింపచేసింది వనజ గారు. నిజమే ఈ నాడు వైద్య వ్రుత్తిని అభ్యసిస్తున్న పిల్లల తల్లితండ్రులు చాలా మంది అలోచనలు ఇలాగే ఉన్నాయి.స్వానుభవాలు చాలానే ఉన్నాయి నాకు. ఒక పోస్ట్ రాయాలనుకుంటున్నాను ఎప్పటినుంచో! ధన్యవాదాలు మీకు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారు...

"గురువులని పూజించడమే కాదు గురువులు చెప్పిన మంచి మాటల గురించి ఆలోచించాలి"

నిజమేనండీ సలహాలు అందరివీ తీసుకుని,తమకు నచ్చినవి మాత్రమే చేసే వాళ్ళు చాలామందే వుంటారు..

లోకం పోకడ గురించి మంచి విషయాలు చెప్పారు..!