7, జూన్ 2012, గురువారం

"పెన్నేటి పాట"

నాకు ఎంతొ పరిచయం ఉన్న "పెన్నమ్మ" రంగని పాదాల చెంత.... పరవళ్ళు త్రొక్కుతూ...

ఓ..పది పన్నెండేళ్ళ పాటు పెన్నమ్మ ప్రక్కన నివశించి ఆ పైర గాలులని,ఆప్పుడప్పు వినిపించే వరద ఉదృతి ని జవిజూచిన అనుభవం నాకుంది.

నేను పెళ్లికూతురిగా నా భర్త వెంట పెన్నని దాటి కొంచెం ముందుకెళ్ళి రైలు దిగాను మళ్ళీ వెనక్కి వచ్చి పెన్నమ్మ ప్రక్కనే నా వైవాహిక జీవితం మొదలెట్టాను.

పెన్న లోని తెల్లని మెత్తని ఇసుక నాకు చాలా అబ్బురంగా తోచేది.

ఎందుకంటే ఇక్కడ కృష్ణ లో ఇసుక గండ్ర ఇసుక కొంచెం గోధుమ వర్ణంలో ఉంటుంది. ఆ గరుకు తాలూకు గండ్ర తనం గుప్పిట లో నుండి జారిపోతుంది.కానీ పెన్న లోని ఇసుక మెత్తగా తెల్లగా చల్లగా ఉంటుంది. మా బీడు భూముల్లో నుంచి పెన్న వొడ్డు కి అలా వ్యాహాళికి వెళ్ళినప్పుడు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు కనిపించే ఏటి దృశ్యం ఒక్క పాయ అయినా ప్రవహించక ఎడారి బయలు అనిపించే దృశ్యాలు ఎన్నో వందల సార్లు చూసిన అనుభవం. ఈ పెన్న ఎప్పుడు పరవళ్ళు త్రోక్కడం చూడగలం? అనుకోకుండా వచ్చే వరదల్లో తప్ప..అనుకునే వాళ్ళం. వరద వచ్చి తగ్గిపోయాక చూస్తే.. అర ఎకరం దాక నదిలో కలిసిన వైనం ని చూసి యేరు మింగేసింది అనుకునేవారం.

సారవంతమైన భూములు లలో నీటి జాడ లేక బీడు నేలలో.. ఏ ఆకు కూరలో పండించుకుని పొట్ట బోసుకునే చిన్న కమత గాళ్ళు, వందల అడుగుల లోతులకు బోర్లు వేసి ఆ నీటి తో సేద్యం చేసే రైతులు ..ఆ రైతుల కుటుంబం లో ఒక కుటుంబం మాది.

పెన్న తీరాన రైతన్నల కడగండ్లు చూసినప్పు డల్లా నాకు పెన్నేటి పాట గుర్తుకు వచ్చేది. నెల్లూరు నుండి వెలువడే జమీన్-రైతు లో నేను మొట్ట మొదటిసారిగా "పెన్నేటి పాట " గురించి చదివాను.

అప్పుడు విద్వాన్ విశ్వం గారు మరణించిన సమయంలో పరిచయం చేస్తూ పెన్నేటి పాట గురించి ఉదాహరించి నట్లు జ్ఞాపకం.

ఇప్పుడు విద్వాన్ విశ్వం ..గారి గురించి మన బ్లాగ్ లోకంలోనూ, విరివిగా పత్రికల్లో ను సమీక్షలు చూస్తున్నాము.

వారి గురించిన సమగ్ర విశ్లేషణ లో.. ఒక గ్రంధం ని కూడా తీసుకుని వచ్చారు.
సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పేరిట రచయితలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌లు సంయుక్తంగా సేకరించి సంకలనం చేసిన పుస్తకమిది.

వారి గురించి సమగ్రంగా నాకు తెలియక ముందు నేను ఒకసారి "పెన్నేటి పాట " గురించి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన "శత వసంత సాహితీ మంజీరాలు " కార్యక్రమం లో విన్నాను.

"పెన్నేటి పాట" గురించి ఆ కార్యక్రమంలో పరిచయం చేసింది.."భూమన్" గారు అని గుర్తు.

"రాయలసీమలో కరువు పిలిస్తే పలుకుతుంది ,అనంతపురం జిల్లాలో పిలవకుండానే పలుకుతుంది" అని విద్వాన్ విశ్వం గారు అనేవారట.

పన్నెండేళ్ళ క్రితం " పెన్నేటి పాట" వినడం తోనే ఒళ్ళు పులకరించింది. సమకాలీన పరిస్థితులని సాహిత్యం లో జొప్పించి రచనలు చేయడం ఆ రచనలు చదివి పాఠకులు ని ఆలోచించజేసి చైతన్యంగా ఉన్చాలనుకోవడమే సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని నేను నమ్మడం వల్లనేమో.. "పెన్నేటి పాట " నాకు చాలా బాగా నచ్చింది.

ఎందుకంటే 1953 ప్రాంతంలో రాయలసీమ ప్రజా జీవనం పై కరాల నృత్యం చేసిన కరువు రక్కసిని కల్లు కట్టినట్లు చూపిన కరుణ రసాత్మక కావ్యం "పెన్నేటి పాట"

పెన్నేటి గట్టున జీవించే గ్రామీణుల బాధామయ గాధలు ఈ కావ్యంలో .కఠోర జీవిత వాస్తవాలు "పెన్నేటి పాట"లో కనబడతాయి.

"పెన్నేటి పాట" పద్య గేయ రూపాల సమ్మిశ్రితమైన ప్రజా కావ్యం . ఇది అయిదు సర్గలుగా విభజించబడింది.


ఆచార్య గంగప్ప గారు రాసిన పీఠికలో "ఈ కావ్యం లో ఉన్నది ఏ ఒక్కరి కథ కాదు.రాయలసీమ వాసుల అందరి కథ. రంగడు,రంగమ్మల జీవచాయలు రాయలసీమ వాసుల జీవితాలకి ప్రతీకలు. విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట "రాయలసీమ కన్నీటి పాట,విశ్వం గారి నేమ్మదిలోని మాట.విశ్వం గారి కైత కమ్మని యూట" అని పలికిన పలుకులు ప్రత్యక్షర సత్యాలు...అని చెప్పారు.

ఇక రాళ్ళ పల్లి వారు అయితే ఇలా అన్నారు. నా మిత్రులు విద్వాన్ విశ్వం గారు సీమ సీమ దైన్యం వల్ల కల్గినట్టి నిర్వేదం వల్లనే "పెన్నేటి పాట గా పరిణమించినది.విశ్వం గారిది మానవ హృదయం.ఊహ కన్నా.భావన కన్నా అనుభవమే మూలాదారముగా వెడలిన పరవశ రచన "పెన్నేటి పాట" అని వ్రాయడం జరిగింది.

"పెన్నేటి పాట' కావ్య నేపధ్యం రాయల సీమ. ఒకనాడు రాయల సీమ సర్వ సంపదలతో విలసిల్లినది.సకల కళతో వర్ధిల్లింది. వీధులలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళు అని చెబుతారు చరిత్ర కారులు. అలాంటి వైభవ భూమి అనావృష్టి వల్ల సంపదలు నశించాయి కళలు కళ తప్పాయి. పైరు పచ్చదనాలతో ప్రకాశించాల్సిన పొలాలన్నీ రాళ్ళు రాప్పలుతో నిండి పోయాయి.కరువు రక్కసి నృత్యం చేసింది.ప్రజల జీవితాలు దుర్భరం అయ్యాయి.కాదు దయనీయంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మానవతావాది విశ్వం గారి హృదయం ద్రవీ భవించింది. కలం పట్టారు. సీమ ప్రజల నిజాయితీని,నిండు మనసుని,దండి తన్నాన్ని వర్ణించి అక్కడి వాతావరణం ని,పరిస్థితులని,భాషని కావ్య రూపంలో సాక్షాత్కరింప జేసారు.


రాయలసీమ పూర్వ వైభవం గతం.


కాని నేటి పరిస్థితి..దుస్థితి..కళ్ళముందు కనిపించే నిజం.

ఇప్పటి పెన్నలో నీటి హోరు జోరు రెండు లేవు. ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేసి ఉంది.

చెమటలు కాలువ గట్టే టట్లు పారలతో త్రవ్వి త్రవ్వి తీసినా నీటి చుక్క కనబడని దుస్థితి.

కుండపోత వర్షాలు కురిస్తే వచ్చిన నీరంతా.. ఎండి ఎండి పోయిన ఇసుక లోకి ఇంకిపోతుంది. పెన్నా గట్టుకు సమీపం లో ఉన్న ప్రాంతంలో చిన్ని గాని ఉరితీత,సీతి గాని కారాగార వాసం,ఎంకి వైధవ్యం,ఎరుకలసాని శారీరక బాధ ,చలమన్న పాట్లు అక్కడ అడుగు వేసి అడుగు తీస్తే గుండెల్ని బద్దలు చేసే సంఘటనలు ని గుర్తుకు తెస్తాయని కవి వర్ణిస్తారు.

ఎన్నో ప్రాణులని మింగినా పెన్న నీరు కమ్మగా ఉంటుంది పెన్న నీటిని దోసిలి పట్టి ఒక్క సార్టి నోటిలో పోసుకుని పుక్కిలిస్తే చాలు జన్మకు సార్ధకత ఏర్పడుతుంది స్వచ్చత ప్రాప్తిస్తుంది .పెన్నా నీరు గగుర్పాటు కలిగిస్తుంది.మోసాలని తొలగిస్తుంది ఖండిత వాడిని చేస్తుంది కండలేక ఎండిపోయి బెండుగా మారిన నిజాయితీ ధర్మ దీక్షల్ని పండిస్తుంది ..అని పెన్న గొప్పదనాన్ని వర్ణించిన కవి..


అంతా మంచి పెన్న ఎందుకు ఎండిపోయింది ? ఇంతమందిని కన్నతల్లిలా కాపాడే పెన్న ఎందుకు ఎండిపోయింది?వంటలతో చింతించి ఆరి పోయిందో ,తన సంతతి కోసం మికిలి చింతించి మికిలి దుఖించడం వల్ల పెన్న నీరు ఇంకిపోయిందో అర్ధం కావడం లేదు.

పెన్నా నది నుంచి ప్రవహించే కాలువల్లోని ప్రతి నీటి బొట్టులోను రాయలసీమ రైతుల నెత్తుటి ఛాయలు ప్రతిబింబించి విషాదం కల్గిస్తాయి.
రైతులు రెక్కలు ముక్కలు చేసుకున్నా తగిన ఫలితాన్ని పొందలేక పోతున్నారనే కఠోర సత్యాన్ని మనం విస్మరించకూడదు.

నేటికి అదే పరిస్థితులు. అదే పెన్న తీరు.

విద్వాన్ విశ్వం రాయలసీమ కరువు రక్కసి ప్రతాపానికి గురైన తీరును ,పెన్నా నది ఎండి పోయిన రీతిని "పెన్నేటి పాట"ను కోటి గొంతుకల కిన్నెర మీటుకుంటూ,కోటి గుండెల కంజరి కొట్టు కుంటూ హృదయాన్ని ద్రవింపజేసేరీతిలో వినిపించారు.
(కిన్నెర అంటే వీణ లాంటి వాద్యం,కంజరి అంటే డప్పులాంటి వాద్యం )

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం .."పెన్నేటి పాట " ని తప్పక చదివి తీరాల్సిందే.!
.
విద్వాన్ విశ్వం గారి రచనలు ఒకనాడు,విరికన్నె ,పాపం,రాతలు-గీతాలు,పెన్నేటి పాట, నా హృదయం వంటి లఘు కావ్యాలు రచించారు.కాదంబరి ,కిరాతార్జునీయం,దశకుమార చరిత్ర ,మేఘ సందేశం మొదలైన రచనలని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు.అలాగే గోర్కి,చెహోవ్,తుర్గిన్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ద పొందిన రచయితల కదలని తెలుగులోకి అనువదించారు.

స్పష్టమైన రాజకీయ సామాజిక అవగాహన ఉన్న విద్వాన్ విశ్వం వివిధ పత్రికలో సంపాదకులుగా ఉంటూ
"అవి-ఇవి" , "తెలుపు-నలుపు" "మాణిక్యవీణ"వంటి శీర్షికలని నిర్వహించారు.

ఆ సాహితీ విరూపాక్షుడిని అద్దంలో కొంచెమైనా చూపించే సాహసం చేయడం కూడా చాలా ఇష్టంగా తోచింది.

ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్ళు ,కాలక్షేపం కోసం సినిమాలకి వెళ్ళే వారు..అందులో కొంత సమయాన్ని ,కొంత ధనాన్ని వెచ్చించి "పెన్నేటి పాట" లాంటి గేయకావ్యాన్ని కొని చదవడం వల్ల సాహిత్యంలో ..సృజించిన వాస్తవ పరిస్థితులని సాహిత్య ప్రయోజనాన్ని అర్ధం చేసుకోగల్గుతారు అని అనుకుంటాను.

పెన్నా ప్రక్కనే ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా అక్కడి పరిస్థితులు చూసినా నాకు "పెన్నేటి పాట" గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత హృదయవిదారక కరుణ రసాత్మక కావ్యం .."పెన్నేటి పాట "

ఇక "పెన్నేటి పాట" లో విద్వాన్ విశ్వం గారు వర్ణించినట్లు కాకపోయినా మనోహరంగా ఉండే నేను చూసిన పెన్నమ్మ నిండు పరవళ్ళని చూడాలంటే కడప జిల్లాలో చెన్నూరు దగ్గర చూడాలి. రెండు కొండల నడుమ ఒదిగి ప్రవహించే సోమశిల ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. జొన్నవాడ కామాక్షి తాయి పాదాలను తడుపుతూ రంగ నాయకుడికి తన గల గలతో నిత్యం సేవిస్తూ.. ముందుకు కదులుతూ ఊటుకూరు వద్ద సాగరుని ఒడిలో కలుస్తుంది.


పెన్నమ్మతో ఉన్న అనుబంధం,"పెన్నేటి పాట " కావ్యం పట్ల ఉన్న ఆసక్తి,సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం గారి సమగ్ర పరిచయ గ్రంధం గురించి పరిచయాలు చూడటం వల్ల విషయం ని ఇక్కడ పంచుకునే విధంగా ప్రేరేపించింది.
నేను "పెన్నేటిపాట" గురించి పైన ఉదహరించిన భాగాలు..ఆచార్య నాగార్జున యూనివెర్సిటీ డిగ్రీ విద్యార్ధుల పాఠ్య భాగంలో నుండి సేకరించడం జరిగింది.
తప్పక "పెన్నేటి పాట" ని విద్వాన్ విశ్వం గారి గురించి "సాహితీ విరూపాక్షుడు" తప్పక చదవండి.

11 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

విద్వాన్ విశ్వం పుస్తకం ఇక్కడ నుండి పొందవచ్చు. http://kinige.com/kbook.php?id=681

Kottapali చెప్పారు...

బావుంది

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

వనజ గారూ ,
రచనకు సామాజిక ప్రయోజనమే పరమ ప్రయోజనం . ఆకోవలోనిదే విశ్వం గారి పెన్నేటి పాట .
ఎదీ పెన్న ఎదీ పెన్న ఎదీ పినాకినీ
ఇదే పెన్న ఇదే పెన్న నిదానించి నడు
విదారించు నెదన్ వట్టి యెడారి తమ్ముడూ .... ఇలా గేయాలతో పద్యాలతో రాయలసీమ ప్రజా జీవనం తో మమేకమై సాగిన అద్భుత కావ్యాన్ని పరిచయం చేసిన మీ సామాజిక దృక్పథంతో కూడిన సాహిత్యాభిలాషకు జోహారులు .
మాది కూడా పెన్నకు సామీప్య జీవనం .....
చిన్నప్పుడు కుల్లూరున
నున్నప్పుడు పెన్నకేగి యుల్లాసముగా
పన్నుగ స్నానాలు సలిపి
తిన్నగ నొక బిందె నీళ్ళు తెచ్చెడి వాడిన్ .
----- సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

oremuna గారు విలువైన సమాచారం అందించారు . ధన్యవాదములు
@నారాయణస్వామి గారు ధన్యవాదములు.
@వెంకట రాజారావు లక్కకుల గారు. చాలా సంతోషం.పెన్నేటి పాట నచ్చినందుకు ధన్యవాదములు.
పెన్నా తీరం జ్ఞాపకాలు చాలా ఆనందం కల్గించాయి అనుకుంటున్నాను.:)
.

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

సాహితీవేత్త విద్వాన్ విశ్వం గారి గురించి తెలిపినందుకు, పెన్నమ్మ తీరాన(తాడిపత్రి) పెరిగిన నాకు మళ్ళీ మీ టపా ద్వారా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు వనజా గారు!

Best Wishes,
Suresh Peddaraju

రవి చెప్పారు...

పెన్నేటి పాట press academy archives లో భారతి 1950 కి ముందు సంచికలలో దొరుకుతుంది. ఆ తరువాత తెలంగాణా రచయితల సంఘం వాళ్ళు పుస్తకంగా ముద్రించారు.

మా అనంతపురం ఊరు బయట పెన్నపై ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జినే పుస్తకం అట్టపైన వేశారు. పెన్నేటిపాట కరవుసీమదైనా కూడా అందులో వినిపించే ఆర్తి, దంపతుల అనురాగం విశ్వజనీనమైనవి. విశ్వం గారి కవిత ఒక అమృతధార.

మీరు పెన్నను చూడదల్చుకుంటే వర్షాకాలంలో పెన్నహోబిళం నరసింహస్వామి దేవాలయం దగ్గర చూడండి. అనంతపురం పట్టణం నుండి ఒక గంట ప్రయాణం.

మా పెన్న నీరు కూడానూ మహారుచికరమైనవి. రాళ్ళపల్లి, విశ్వం, పుట్టపర్తి ఇత్యాదుల కవితలకు మల్లేనే.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ మీ పెన్నేటి పాట పరిచయం చదివాక తప్పక ఈ పుస్తకం చదవాలని వుంది. ధన్యవాదాలు.

జలతారు వెన్నెల చెప్పారు...

చాలా బాగుందండి వనజ గారు. ఆలశ్యం గా చదివాను

అజ్ఞాత చెప్పారు...

మీకు వీలైతే నెల్లూరు,విజయవాడ నగరాల గురించి,ప్రజల గురించి ఒక టపా రాయండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నిరంతరం వసంతం గారు.. సురేష్ గారు.. పెన్నేటి పాట నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.
ఎంత గొప్ప రచన అండీ! అందుకే ఏదో కొంచెం చెప్పే ప్రయత్నం చేసాను అంతే!
@ రవి గారు. మీ వాఖ్యకి .చాలా సంతోషం అండీ!అనంతపురం లో కూడా ఓ..నాలుగు సార్లు ప్రయాణం లో పెన్నమ్మని చూసాను.కానీ చీకటి లో..
"పెన్నేటి పాట " పుస్తకం కోసం ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.
@ జ్యోతిర్మయి గారు.. చాలా సంతోషం. ధన్యవాదములు.
@జలతారు వెన్నెల గారు..థాంక్ యు వేరి మచ్!
@ శ్రీనివాస్ గారు. పుట్టినిల్లు-మెట్టినిల్లు ..గురించి భలే అడిగారు కదండీ! వ్రాస్తాను కాని.. కొందరికి కోపం వస్తే నేను ఏం చేసేది?
రెండు పడవల మీద కాలు వెయ్యలేను కదండీ ..:)
నా బ్లాగ్ లో మీ వ్యాఖ్య చాలా కాలం తర్వాత. సంతోషం కల్గించింది. థాంక్ యు!

mmkodihalli చెప్పారు...

మీ వ్యాసం బాగుంది. అయితే ఒక వివరణ. మీ వ్యాసంలో పేర్కొన్నట్టు విద్వాన్ విశ్వంగారు సినిమా పాటలు వ్రాయలేదు. ఆ విశ్వంగారు వేరే. ఆయన అసలు పేరు కొంపెల్ల విశ్వం. జ్యోతిర్మయి కొంపెల్ల విశ్వంగారి భార్య పేరు. జ్యోతిర్మయి తొలి తెలుగు సినీ గేయ రచయిత్రి అని కొందరి అభిప్రాయం. అయితే ఆ విషయంలో కొంత వివాదం ఉంది. ఆ పాటలను కొంపెల్ల విశ్వంగారే వ్రాశారని అంటారు.