7, జనవరి 2012, శనివారం

ఎవ్వరికీ చెప్పకే

ఎవ్వరికీ చెప్పకే.. అంటే నేను ఊరుకుంటానా? చెయ్యవద్దనే పనే చేస్తాను.

చిన్నప్పుడు నుంచి అంతే..అని మా అమ్మ అనేది. చెయ్యవద్దు అంటే ఆ పనే చేస్తావు.. ఎందుకే ? అనేది.

ఆ పని ఎందుకు చేయకూడదో..నువ్వు చెప్పలేదు కదా అమ్మా!.. అందుకే చేస్తే ఏమవుతుందో..తెలుసుకుందామని చేసాను అనేదాన్ని నిర్భయంగా.. అందుకే అసలు నా దగ్గర ఆ మాట రాకుండా జాగ్రత్తపడటం.. వీలయితే ఏ పని అయినా ఎందుకు చేయకూడదో.. వివరించి చెప్పడం చేసేది..మా అమ్మ.

ఎవరు ఏం చెప్పినా  నమ్మకంగా విన్నట్టే ఉంటుంది. కానీ..ఆఖరికి  తను చేయాలనుకున్నదే చేస్తుంది..అని మా అన్నయ్య   నా గురించి నొక్కి వక్కాణించే మాటలు అన్నమాట.

అలా బాల్యం నుండే..నేనో మొండి ఘటం ని.

ఒక సారి ఏం జరిగింది అంటే..  నేను సెవెంత్ క్లాస్స్ చదువుతూ ఉన్నప్పుడు అన్నమాట. మార్చి నెల ఆఖరు రోజులు.  ఒంటి పూట బడులు. ఉదయ్యాన్నే పెరుగన్నం తినేసి కేరేజీ తీసుకు వెళ్ళకుండా.. ఇంటికి వచ్చి.. ఆవురావురుమంటూ.. అమ్మ కలిపి పెడుతున్న  అన్నం ముద్దలుని  గబా గబా  తినేసి..  ఎక్కడ పడితే అక్కడ ఆ పటినే పడి నిద్రపోయే రోజులు.ఈ కాలంతో పోల్చుకుంటే.. చాలా అమాయకమైన కాలం అది.

రోజూ  మైలవరం బడికి రిక్షాలో వెడుతూ.. వెడుతూ..రిక్షాలోనుంచి హటాత్తుగా దూకేసి  వెళ్ళేదారిలో ఉన్న చింత   చెట్లు క్రింద  పడిన  చింతకాయలు ఏరుకుని.. లేదా..రాలిన మామిడి పిందెలు ఏరుకుని.పరిగెత్తుకుంటూ..ఆపకుండా వెళ్ళిపోతున్న రిక్షాని క్యాచ్ చేసి.. అందులో ఎక్కడం.. భలే థ్రిల్లింగ్ రోజులు అవి.

 "మా రిక్షా చిన్న" రిక్షా ఆపమంటే ఆపే వాడే  కాదు.అందుకే.. మేమే   రిక్షా ఎక్కే టప్పుడే   గుస గుసలాడుకుని ఎవరు  ఎక్కడ దిగి ఏమేమి సేకరించుకుని రిక్షా ఎక్కాలో ప్లాన్ చేసుకునేవారం. ఆ ప్లాను ప్రకారం చేసేవాళ్ళం. నేను  రోజూ  అల్లాగే చేస్తున్నాని మా రిక్షాలో ఒక ఇద్దరు..వాళ్ళు ముందు కూర్చునేవారు నా మీద ఉక్రోషంతో..  నేను రిక్షాలోనుంచి దూకి చెట్ల క్రిందకి పరుగులు తీయగానే.. మా చిన్నతో పాటు పెడల్స్ మీద కాళ్ళువేసి రిక్షా త్రొక్కుతూ. స్పీడ్ గా  పరుగులు తీయిన్చేవారు.అయినా నేను లెక్క చేసేదాన్నే కాదు.నాకు కావాల్సినవి నేను సేకరించుకున్నాకే .. వెళ్ళేదాన్ని. రిక్షాని క్యాచ్ చేసి.. గొప్పగా ఓ..లుక్ ఇచ్చేదాన్ని.    లేకుండా ఏరుకుని వచ్చిన కాయా గట్రా వాళ్లకు ఇచ్చేదాన్ని కూడా..

ఇలా రోజు రిక్షా దూకేసి చెట్ల వెంట   పడుతున్నానని.. మా రిక్షా చిన్న నన్ను మద్యలో..కూర్చేపెట్టి..దిగనీయ కుండా కట్టడి చేసే వాడు...నన్ను అలా బలవంతంగా ఉంచడం నచ్చేది కాదు.

ఒక రోజు నా చూపు.. మా వూరి రోడ్డు నుండి ప్రక్కగా చీలుతూ..ఓ..ఎడ్ల బండి వెళ్ళేంత దారి కనబడింది. ఈ దారి ఎక్కడికి వెళుతుంది..చిన్నా..అడిగాను ఆసక్తిగా..

ఈ  బండ్ల దారి దారి మైలారం  చిన్న చెరువు కట్ట మీదకు వెళుతుంది. ఎనకటి   రోజుల్లో..అందరు ఈ దారి గుండానే వెళ్ళేవారు.ఇప్పుడు రోడ్డు పడినాక అందరు రోడ్డు దారిన  వెళుతున్నారు అని చెప్పాడు.

ఒకసారి అటునుండి వెళదామా..ఆ దారి చూద్దాం . అని .అడిగాను ఉత్సాహంగా.

ఆ డొంక అంత  బాగుండదు..అంతా ముళ్ళే ఉంటాయి..రిక్షా టైర్లు పంచర్ పడతాయి వెళ్ళడం కుదరదు..అన్నాడు.  

మనసులో నిరుత్సాహం. ఏం చేయాలి..?ఒకటే  ఆలోచనలు.

మా క్లాస్స్ లో యేసు కుమారి అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ-నాన్న అన్నలు అందరు మా పొలాల్లో పని చేసే వాళ్ళు. ఆ అమ్మాయి   రోజు..పాపం ఆరు కిలోమీటర్లు నడచి స్కూల్కి  వచ్చేది. వాళ్ళు మా వూరి మొదట్లో ఉన్న హరిజనవాడలో ఉండేవారు. ఆ అమ్మాయి తో నాకు బాగా దోస్తీనే! మళ్లి బయట ఎక్కడ  మాట్లాడేది కాదు. మధ్యానం అన్నం తినే సమయంలో కూడా కలసి కూర్చుని  అన్నం తిందాం రమ్మంటే..వచ్చేది కాదు. వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళు మా ప్రక్కన కూర్చోవద్దని చెప్పే వాళ్ళని  ఆమె  చెప్పేది.

నా తోటి పిల్లలేమో..ఎందుకు ఆ అమ్మాయిని పిలుస్తావు..? వాళ్ళతో..మనం కూర్చోకూడదు. మనం కమ్మవారిమి కదా..అనే వారు. ఎందుకో   ఈ తేడా   నాకు అర్ధమయ్యేది కాదు.

 యేసు కుమారి వాళ్ళ నాన్న మా తాతయ్య,నాన్న వాళ్ళ ముందు..భుజం మీద తుండు తీసి చేతిలో పట్టుకుని.. చెప్పులు చేతిలో పట్టుకుని.. నుంచునే వారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి పని చేయడానికి వస్తే దాహం వేస్తె..నీళ్ళు ఇస్తే.. దోసిలి నోటిదగ్గర పెట్టుకుని..ఆ దోసిలిలో నీళ్ళు పోసుకుని తాగేవారు. అలాగే అన్నం కూడా.. విస్తరాకులోనో.. గుడ్డ ముక్కలోనో పెట్టుకుని..ముద్దలు చేసుకుని ఎడమ చేతిలో పెట్టుకుని తినే వారు. వాళ్ళ ప్రతి పని నాకు ఆశ్చర్యంగా ఉండేది.      

ఇక  ఆ రోజు ఇంటర్వెల్ లో ఆ అమ్మాయిని అడిగాను.. మన రోడ్డు ప్రక్క నుండి  నుండి సారవ వైపు పొలాల్లోనుండి.  ఓ..డొంక దారి ఉందన్టగా నీకు తెలుసా..అని.

 అందుకు ఆ అమ్మాయి  ఓ..ఆ దారి నాకు తెలుసు.. అప్పుడప్పుడు..ఎక్కువ మంది ఉంటే అటువైపు నుండే నడుచుకుంటూ వస్తాం.  ఆదారి యెంత బాగుంటుందో తెలుసా.. మెత్తటి ఇసుక ..దారి అమ్మట అంతా చిట్టి ఈతకాయ చెట్లు... గచ్చకాయల చెట్లు.. గురివింద గింజల చెట్లు.. ఇక మామిడికాయలు కూడా తెగ కోసుకోవచ్చు.. ఎవరు ఉండరు అని చెప్పింది.

అయితే ఆ దారిలో నన్ను తీసుకు వెళతావా..అని అడిగాను.

అమ్మో.. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు.. నేను రానండి..అంది.

ఏం చేయాలబ్బా.. ! ఈ అమ్మాయి రానంటుంది. నాతో  రిక్షాలో వచ్చే ఎవరు రారు. మా అన్నయ్యకి అసలే భయం. అటు వద్దమ్మా.. అంటాడు. పైగా అమ్మతో చెప్పినా చెపుతాడు.. అనుకున్నాను.  ఆలోచిస్తున్నాను.

స్కూల్  వదిలిన తర్వాత.. యేసు కుమారి వచ్చి నాతో చెప్పింది..నేను నిన్ను తీసుకు వెళతాను.. అంది అయితే ఎవరికి చెప్ప కూడదు అని ఒట్టు పెట్టిన్చుకుంది.  సరే రేపు మధ్యానం అటునుండి వెళదాం అని చెప్పాను.

మరి రిక్షాలో వెళ్ళకపోతే ఊరుకోరుగా.అని అడిగింది.

ఎలాగబ్బా.. మళ్ళీ ఆలోచన. రేపు చెపుతానులే..నీకు ఏ సంగతి..అని చెప్పాను.

ఇంటికి వచ్చి ఆ సంగతే ఆలోచించాను. ఒక ఆలోచన తట్టింది. సరే అదే అమలు చేయాలనుకుని గట్టిగా అనేసుకుని.. మెదలకుండా..ఊరుకున్నాను.

తెల్లవారి..స్కూల్ కి వెళ్ళామా.. మధ్యానం అయ్యిందా.. గబా గబా మా రిక్షా చిన్న దగ్గరికి వచ్చి.. "చిన్నా..నేను ఈ పూట రిక్షాలో రావడం లేదు. మా తెలుగు మాస్టారు.. పరీక్షలు దగ్గరకి వస్తున్నాయి అని ప్రేవేట్ క్లాస్స్ తీసుకుంటాను  అన్నారు అని చెప్పాను.

అంతలో..మా అన్నయ్య..అమ్మాయి! నీకు అన్నం ఎలా..ఆకలి అవుతుందిగా అని అడిగాడు. పర్వాలేదు..మా ఫ్రెండ్ తీసుకువస్తానని  వెళ్ళింది..నాలుగు గంటలకి చిన్న మళ్ళీ వస్తాడుగా..అప్పుడు వస్తాను అని చెప్పాను. అందరు నమ్మేశారు. పాపం ..మా అన్నయ్య.. నేను అన్నం తిననేమో అని దిగులు మొహం పెట్టాడు. నాకు వాడి మొహం చూస్తే,,బాధ వేసింది..కానీ ఆ డొంక దారి చూడాలి అన్న కృత నిశ్చయం ముందు.. అది కొట్టుకు   పోయింది.

సరే..ఇక  నేను చెప్పినది నిజం అనుకుని నమ్మేసి..రిక్షా ఎక్కి అందరు వెళ్ళిపోయారు. మళ్లీ స్కూల్ లోపలకి వెళ్లి.. యేసు కుమారి దగ్గరికి వెళ్లి ఇద్దరం కలసి పంపు కొట్టుకుని కడుపు నిండా మంచి నీళ్ళు తాగి.. ఎవరికి  కనబడకుండా.. స్కూల్ నుండి..బ్లాక్ ఆపీస్ క్వార్టర్స్ దారికి వెళ్లి అక్కడి నుండి..శివాలయం మీదగా.. మార్కెట్ దారి..రామాలయం మీదగా.. సాలీల బజారులోనుండి..కోనేటి కట్ట మీదకి  ఎక్కి.. దానికి ఆనుకుని చిన్న చెరువు కట్ట ఎక్కి..ఎలాగోలా  ఆ డొంక దారిలో పడ్డాం..

అమ్మయ్య ఎవరి కంటా పడలేదు మనం అనుకుని.. ఆడుతూ.. గంతులు వేస్తూ.. ఆ దారిన రావడం మొదలెట్టాం. మద్యలో..పిందెలు అయినా చిట్టి ఈతకాయలు కోసుకున్నాం. గచ్చ కాయలు ఇంకా పగలలేదు...చాలా సేపు వెదుక్కుని  పాత కాయలు..ఏరుకున్నాం. మామిడి కాయలని  కోసి తిన్నాం..ఇంకా చాలా కాయలు..స్కూల్ బేగ్ లో వేసుకున్నాం. ఇవి ఎక్కడవి అంటే.. ఇంట్లో ఏం చెప్పాలో..ఆలోచించుకున్నాను..   నిజంగా ఆ దారి చాలా బాగుంది. పాపం యేసు కుమారికి కాళ్ళు కాలుతున్నాయి. ఆ అమ్మాయికి చెప్పులు లేవు. కాసేపు నా చెప్పులు వేసుకో..అన్నాను...కానీ..ఆ అమ్మాయి వద్దు అంది.  నాకైతే ఆ అమ్మాయి మీద చాలా స్నేహం పుట్టుకు వచ్చింది. నా కోసం యెంత..ఇబ్బంది పడుతుంది..అనుకున్నాను. ఎప్పటికి ఈ అమ్మాయితో..స్నేహం చేయాలి అనుకున్నాను కూడా..

సగం దూరం వచ్చాక  భయం మొదలైంది. దారిలో.. సమాధులు కనబడ్డాయి.దూరంగా రోడ్డు మీద వెళుతున్న బస్ లు  ,లారీల శబ్దాలు తప్ప ఒక్కరు కూడా మనుషులు కనబడటం లేదు. దాహం వేస్తుంది.. ఎక్కడా నీళ్ళే కనబడలేదు. దారి ప్రక్కనే ఉన్న మూడు ముంతలాకుని కోసి.. చిట్టి ఈత   ఆకులో చుట్టి..  ఇది నమలి.. బుగ్గన పెట్టుకో..మంచి నీళ్ళు అవవు అని చెప్పింది.

 ప్రొద్దున ఎప్పుడో తిన్న అన్నమేమో..ఆకలి మొదలైంది.పైగా అలవాటులేని ఎండ..నడక. ఇక నా పని అయిపొయింది. తూనీగలా క్షణం కూడా కుదురు లేకుండా ఎగిరే నేను నేను నడవలేనంటూ..చతికిల బడ్డాను. ఆ అమ్మాయి నా కోసం కూర్చుంది.

అందుకేనండీ.. నేను వద్దన్నాను అంది. ఏం పరవాలేదులే..పద వెళదాం అని.. నడక   సాగించి..   ఎలా అయితేనేం ఊర్లో పడ్డాం.

ఊరు మొదట్లోనే..మా యేసు కుమారి వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా.. మా ఇంటికి వెళదాం రండి అని పిలిచింది. సరే..అని తనతో..వెళ్లాను.

మేము వెళ్ళేటప్పటికి..యేసు కుమారి వాళ్ళ అమ్మ నులక మంచం మీద పడుకుని ఉంది. నేను యేసు కుమారితో..వెళ్ళడం చూసి..గబుక్కున లేచి నిల్చుంది.

ఏమిటి చిన్న అమ్మాయిగారు..ఇలా వచ్చారు అడిగింది. ఏసుకుమారి డొంక దారిన పడి నడచి వచ్చిన సంగతి చెప్పేసింది.

అమ్మో!.. నోరు ఆరిపోయి పడిపోయి ఉంటే ఇంకేమైనా ఉందా? ఆ దారిన ఎవరు సరిగ్గా రారు కూడా. పొద్దుగూకే ఏలకి..ఏ తోట కాపలా వాళ్ళో వచ్చేదాకా అలాగే  పడి ఉంటే ఇంకేమైనా ఉందా.. అయినా అమ్మాయి గారు అడిగిందని నువ్వు తీసుకువత్తావా..? అని యేసుకుమారిని వాళ్ళమ్మ నాలుగు బాదేసింది.

కూర్చో అమ్మాయిగారు.. .అని మంచం చూపించి మర్యాద చేసింది. ముందు మంచి నీళ్ళు తాగు.. మంచి నీళ్ళ బావి నీళ్ళే అని ఇచ్చింది. (అప్పుడు ఊరందరికీ..మంచి నీళ్ళ బావి ఒకటే ఉండేది. కొంత మందిని అందులోనుండి నీరు  తోడనిచ్చే వాళ్ళు కాదు. వాళ్లకి..ఎవరన్న తోడి పోసి బిందెలు నింపితే.. ఇంటికి తెచ్చుకునే వారు . వాటిని భద్రంగా తాగేవాళ్ళని తర్వాత తెలిసింది.)

మంచి నీళ్ళు తాగి..కూర్చున్నాను. అమ్మాయి గారు..కాళ్ళు చేతులు కడుక్కోండి..ఒక ముద్ద తిని ఇంటికి  పోవచ్చు...అంది.

సరే ఏమా ఆకలిగా ఉంది..కదా..బుద్దిగా తల ఊపాను.. యేసు కుమారికి  సత్తు గిన్నెలో అన్నం పెటింది..నాకు ఇత్తడి పళ్ళెంలో అన్నం పెట్టింది.ఇత్తడి గ్లాసుతో.. మంచి నీళ్ళు పెట్టింది. ఈ తేడాలు చూస్తున్నాను. యేసు కుమారిని క్రిందనే కూర్చోమని గదమాయించింది వాళ్ళ అమ్మ.  నాకు ఇచ్చిన అన్నం పళ్ళెం వైపు చూసాను..తెల్లగా లేదు.. అయినా ఆకలి అవుతుంది కాబట్టి తలొంచుకుని గబాల్న తినేసాను. ఆకలి తీరింది. ఎండకి  తిరిగి అలసి పోయానేమో..నిద్ర ముంచుకొచ్చేసింది. అలాగే పడుకుని నిద్రపోయాను.

నాకు మెలుకువ  వచ్చే సరికి  ప్రొద్దు గూకుతుంది.నా వంక కంగారుగా చూస్తూ ఉన్న యేసు కుమారి వాళ్ళమ్మ.

అమ్మాయి గారు ప్రొద్దుగూకుతుంది.ఇంటికాడ అమ్మ గారు కంగారు పడతారమ్మా. యేసు వచ్చి ఇంటికాడకి పంపించి వస్తాది.. వెళ్ళండి అమ్మా..అంది.

ఇక పుస్తకాల బేగ్ భుజాన వేసుకుని నేను బయలు దేరాను. నా దగ్గర నుండి బేగ్ తీసుకుని యేసు కుమారికి ఇచ్చింది వాళ్ళమ్మ. అమ్మాయి గారు.. మా ఇంట్లో తిన్నానని ఇంటిదగ్గర చెప్పబాకండి అంది. నేను.. అర్ధం కాక..అలాగే చూసి ఆలోచించుకుంటూ ఇంటికి  వెళ్ళిపోయాను.

అమ్మ నా వెంట వచ్చిన ఏసుకుమారిని చూసి..   ఏంటి..ఈ పిల్ల వచ్చింది..చిన్నా నిన్ను రిక్షాలో ఎక్కించుకుని రాలేదా..అని అడిగింది.

చిన్నా ..రిక్షా నాకు కనబడలేదమ్మా..అందుకే.. వీళ్ళ  వెంట నడచి వచ్చేసా..అని యెంత బాగా అబద్దం చేప్పేసానో!

సరేలే.. వెళ్లి స్నానం చేయి అన్నం తిందువుగాని..అని నాకు చెప్పి.. ఉండవే.. ఇప్పుడే వస్తాను అని చెప్పి ఏసుకుమారికి ఇంట్లో చేసిన  బోలెడన్ని పప్పులు తెచ్చి ఇచ్చింది.

చీకటి పడుతుంది..తొందరాగా వెళ్ళు అని పంపించేసింది. మేము ఇద్దరం కళ్ళతో సంజ్ఞలు చేసి తెగ నవ్వుకున్నాం.

ఇక ఆ రాత్రికి.. నేను చేసిన గొప్ప  ఎడ్వంచర్ మా అన్నయ్యకి  చెప్పాలి అని ఒక    ప్రక్క, వద్దని ఒక ప్రక్క  మెదడు చెపుతూ ఉంది..ఎందు కంటే..మా అన్నయ్య ప్రతి విషయాన్ని అమ్మకి మోసేస్తాడు. అందుకే అన్నయ్య అంటే  అమ్మకి బోలెడు ప్రేమ కూడాను. ఏమైనా అన్నయ్యకి తెలియనివ్వకూడదు. మరి ఎవరికి చెప్పాలి. ?

 ఆ..తాతయ్యకి.. చెప్పాలి అని  అనుకుని ఆయన ప్రక్కన చేరి పోయి.. పూస గుచ్చినట్లు అన్ని చెప్పేశాను.

అప్పుడు తాతయ్య అన్ని విని..ఇప్పుడు కొంచెం జనం మారుతున్నారు..మా అప్పుడైతే.. ఇంకా చాలా ఇదిగా ఉండేది అని చెప్పి..కులాలు,వృత్తులు,పేద,గొప్ప తేడాలు అన్ని వివరంగా చెప్పారు. (అవన్నీ ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను)అన్నీ చెప్పాక.. వాళ్ళ ఇంట్లో..అన్నం తిన్నానని ఎవరికి చెప్పకే..!అన్నారు.

నేను బుద్దిగా తల ఊపేసి వచ్చి మెల్లగా వచ్చి నానమ్మ ప్రక్కన పడుకుని  నాన్నమ్మకి  చెప్పాను. ఆకలి అయినది తిన్నావు..అన్నానికి ఏం తప్పులే..!అయినా ఆడపిల్లలు అలా తిరగకూడదు.ఈ విషయాలన్నీ ఎవరి చెప్పకు అంది.

అలాగే అని తల ఊపి నేను వెంటనే వెళ్లి మా అమ్మకి చెప్పాను.

అమ్మ  ఏ కళన ఉందొ.. అందరూ మనుషులేలే! ఏమైంది..లే..అంది. అంతలోనే  కానీ ఎవరికి ఈ విషయం గొప్పగా చెప్పకు..అందరికి నచ్చవు అంది.  ఎవరికి  వాళ్ళు ఎవరికి చెప్పకే.! ఎవరికీ చెప్పకే...అంటారు..అసలు ఈ విషయం అంటూ  చెపితే ఏమవుతుందో..ఏమిటో..చూడాలనుకుని..

పోద్దుపోద్దున్నే లేస్తూనే..మా చిన్న నాయనమ్మ దగ్గరికి వెళ్లి ..నాయనమ్మా !నేను ఇలా ఏసుకుమారి వాళ్ళింటికి వెళ్లాను ..అని మొదలు పెట్టగానే..మా అమ్మ గబుక్కున పరిగెత్తుకు వచ్చి నా నోరు మూసేసింది. అప్పటికే నా నోటి నుండి..విషయం వెళ్ళిపోయి ఆమెకి అర్ధం అయి.. ఇక ఒకటే తిట్ల దండకం మొదలెట్టింది.

ఎదవ సంత..ఒక కులం లేదు..గోత్రం లేదు.. యజమాని నౌకరు తేడాలేదు..అంతా భ్రష్టు పట్టిస్తున్నారు.పెద్దవాళ్ళకి చస్తేగా..!? పిల్లలకి రావడానికి. శుద్ధి  శుభ్రం లేని మంద అని ఒకటే..తిట్లు తో..గంటల తరబడి.. తూర్పారబట్టింది అంట. నేను బడికి వెళ్ళిపోయాను కాబట్టి బతికి పోయాను. లేకపొతే ..మా అమ్మ నన్ను  బాగా ఉతికి ఇస్త్రీ చేసేది అనుకున్నాను.

ఇక ఆ తర్వాత మా చిన్న   నాయనమ్మ నన్ను తన దరిదాపులకి రానిచ్చేదికాదు.దూరం దూరం అంటూ..ఒక కర్ర పట్టుకుని.. కొడతానని బెదిరిస్తూ.. ఉండేది. అప్పుడు తెలిసింది  కులాల పట్ల అంతస్తుల పట్ల మా ఇంట్లో వారికి..మా బంధువులకి ఉన్న తేడా..

నాకైతే..ఉక్రోషం ముంచుకొచ్చి..మరి జాన్ సుదర్శనం ని ఎందుకమ్మా కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారు.వాళ్ళది హరిజనవాదేకడా.. యేసు కుమారి వాళ్ళకి చుట్టాలే కదా..! జాన్ సుదర్శనం   ప్రెసిడెంట్ అనా..లేక వాళ్ళ పిల్లలు అందరు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ..అమెరికా లాంటి దేశంలో ఉన్నారనా.?.అని అడిగేదాన్ని.

మా ఇళ్ళల్లో.. బలిపీఠం  సినిమా గురించి, మనుషులు మారాలి సినిమా గురించి బాగా వాదనలు జరిగేవి.మా అమ్మ పుస్తకాలు చదవడం,సినిమాలు చూడటం ,రేడియో వినడం మూలంగా చాలా విషయాలు.. బాగా వాదించేది.

నేను ఏసుకుమారితో  స్నేహంగా ఉండటం నేర్చుకున్నాను. అమ్మ పెట్టిన అప్పచ్చులు దాచుకుని మరీ ఆ అమ్మాయికి పెట్టేదాన్ని. తర్వాత పరీక్షలు   అయిపోయి సెలవలు ఇచ్చారు.

ఇక తర్వాత నేను ఎప్పుడు ఏసుకుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.ఏడవ తరగతి అయిపోయాక ఆ అమ్మాయి కనబడలేదు. ఆ అమ్మాయికి  పెళ్ళైపోయింది అని చెప్పారు.  తర్వాత ఆ అమ్మాయి నాకు ఎప్పుడు కనబడలేదు కూడా.. తరవాత మా వూరిలో చాలా మార్పులు వచ్చినా .. మా చిన్న నాయనమ్మ మాత్రం మారలేదు. ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ.. ఒకకర్ర పట్టుకుని అందరిని దూరంగా జరగమని చూపుతూ..దారివెంట నడిచేది.

ఇప్పటికి నాకు..మా వూరి రోడ్డు..సారవ పొలాలు ప్రక్కన డొంక దారి  గుర్తుకువస్తే..ఏసుకుమారి,ఎవరికి చెప్పకే.విషయం  గుర్తుకు వస్తుంది..అప్రయత్నంగా..నవ్వు వచ్చేస్తుంది.

ఇక మా  ఇంట్లో  అయితే..నాకు . ఏది .చెప్పకూడదో ..ఎందుకు చెప్పాలో..  ఎందుకు చెప్ప కూడదో..అర్ధం కాక తలలు పట్టుకునేవారు.

అమ్మ అయితే..అసలు ఏం చెప్పేది కాదు. ముఖ్యంగా చేయవద్దని. అలా చెపితే.. చెయ్యవద్దనే పనే చేసేదాన్ని.

అందుకే.. ఏ పని అయినా చేయవద్దు అని చెప్పడం కన్నా.. చేస్తే..ఎలాటి ఇబ్బందులు పడతామో..చెప్పడం మొదలెట్టేసి.. నన్ను జ్ఞానవంతురాలిగా..పెంచే పని చేస్తుండేది అమ్మ.

 ఇలాటి విషయాలు..నా జ్ఞాపకాల   దొంతరలో..చాలా  ఉన్నాయి. అవి ఇంకోసారి వ్రాస్తాను.
  

4 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

మీరు బ్లాగులో ఒక్క టపా కూడా రాయకండి..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మా అమ్మ చెప్పే మా నాయనమ్మ వాళ్ళింట్లో ఆచారాలు గుర్తుకు వచ్చాయండీ
మీ జ్ఞాపకాలు చదువుతుంటే
నాది కూడా జ్యోతిర్మయి గారి మాటే :)

అజ్ఞాత చెప్పారు...

Good adventure of that age

Shabbu చెప్పారు...

సారీ ,,,,
పూర్తిగా చదవలేక పోయాను,,, చాలా పెద్దగా ఉండి స్టోరి, అక్కడక్కడా చదివా,,,,,,,