4, మార్చి 2016, శుక్రవారం

బేగంపేట ప్యాలెస్ ప్రక్కన

చినుకు 2016 మార్చి సంచికలో వచ్చిన నేను వ్రాసిన  కథ


బేగంపేట ప్యాలెస్ ప్రక్కన 

రేపటి ప్రయాణం గురించి తలచుకుంటూ కళ్ళు మూసుకున్నానే కానీ నిద్ర రావడం లేదు . చెప్పలేనంత అలజడి గా ఉంది . "అమ్మా ! నువ్వు నా ప్రక్కన లేకుంటే  రిజల్ట్స్ అన్నీ నెగిటివ్ గానే ఉంటున్నాయి . వీసా స్టాంపింగ్ కి వెళ్ళేటప్పుడు  నువ్వు రా ! " అని బిడ్డ అడిగితే వెళ్ళకుండా ఎలా  ఉండగలను? బాగా  అలిసిపోయి ఉన్నా సరే ఓపిక చేసుకుని వెళ్ళాలి కదా !  ఆలోచనలతోనే ఓ రెండు గంటలు అటు ఇటు దొర్లి మూడున్నరకల్లా లేచి రెడీ అయిపోయి డ్రైవర్ కి కాల్ చేసా. అతను  లిఫ్ట్ చేయలేదు . మరొక సారి ట్రై చేసాను. మళ్ళీ అంతే !

అపుడు సమయం  నాలుగుగంటలవుతుంది. అతను నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేటప్పటికి అరగంటైనా పడుతుంది పది సార్లు కాల్ చేసినా తీయడు. కంగారేసి ప్రతి చిన్నపనికి, పెద్దపనికి కూడా సాయపడే  ప్రకాష్ కి కాల్ చేసి " . "అయ్యా ! ఆ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు .  ఈ రోజు అన్నయ్యకి వీసా ఇంటర్ వ్యూ .  హైదరాబాద్ వెళ్ళాలి కదా! నువ్వు వెళ్లి డ్రైవర్ని నిద్రలేపి  వెంటబెట్టుకుని  తీసుకునిరా !  .    

"అలాగేనమ్మా ! ఇప్పుడే వెళుతున్నాను"  అంటూ ఫోన్ పెట్టేసాడు . అయిదు నిమిషాల్లోనే  ప్రకాష్ నాకు కాల్ చేసి ... "అమ్మా ! నేను హైస్కూల్ దగ్గరలో ఉండి డ్రైవర్ కి  కాల్ చేస్తూనే ఉన్నాను .  నా ఫోన్ కూడా  తీయడం లేదమ్మా ! ఇల్లేమో నాకు తెలియదు, ఎప్పుడు దిగబెట్టడానికి వచ్చినా ఇక్కడే దిగిపోయేవాడు.  ఇప్పుడేం  చేద్దాం మరి ?

అన్నయ్యకి ఇంటర్ వ్యూ పదిన్నరకి .  ఇప్పుడు బయలుదేరినా నాలుగు గంటల సమయం  పడుతుంది.  కనీసం ఒకగంట ముందుగానయినా  అక్కడకి చేరుకోకపొతే ఎలా ? . నువ్వులాగే కాల్ చేస్తూనే ఉండు . ఈలోపు  ఎవరైనా డ్రైవర్ దొరుకుతాడేమో నేను ట్రై చేస్తానంటూనే నాకు తెలిసిన ఆల్టింగ్ కార్ డ్రైవర్స్ కి  కాల్ చేసా. పెళ్ళిళ్ళ సీజన్, వీసాల సీజన్ కాబట్టేమో  ఎవరూ ఖాళీగాలేమని సమాధానమిచ్చారు. ఇంతలోకి కోడలు వచ్చి "ఆంటీ నెయిల్  కట్టర్ కావాలంట " అంది. అసలే టెన్షన్ తో చస్తుంటే గోళ్ళు తీయడానికి వేళాపాళా  లేదా ?  ఇప్పుడు వెతికినా కనబడదు, కనబడినా ఇవ్వను "  కసిరినట్టు  అనేటప్పటికి పాపం... ఆపిల్ల బిక్క  ముఖం వేసుకుని వెళ్ళిపోయింది .  నేను మళ్ళీ డ్రైవర్ కి కాల్ చేయడంలో మునిగిపోయా. 

నా కొడుకొచ్చి "కూల్ గా ఉండమ్మా, ఎందుకంత కంగారుపడతావ్ !" భుజమ్మీద చేయేసి మృదువుగా అన్నాడు. అంతులేని కోపం ముంచుకొచ్చింది వాడి మీద. "నిప్పుల మీద నిలబడికూడా కూల్ గా మాట్లాడటం నావల్ల కాదు" అని విసురుగా వాడి చేయి తీసేసి   "మనమే నాలుగున్నరవరకు కూడా  రెడీ అవము. ఇంకాసేపు...అని మంచాలకి అతుక్కుని పడుకుంటే ఇలాగే ఉంటుంది " అంటూనే  .. వియ్యంకుడి గారికి ఫోన్ చేసి  "అన్నయ్య గారు.. మీ డ్రైవర్ ని పంపండి, లేదా ఎవరో ఒక డ్రైవర్ని అరేంజ్ చేయండి " అన్నాను. అరగంటైనా ఆయన నుండి  సమాధానం రాలేదు. బాధ్యత లేని మనుషులందరూ నాకెక్కడ దొరుకుతారో మనసులో విసుక్కుంటూ మళ్ళీ నేనే కాల్ చేసానాయనకి. 

" ఎవరూ దొరకలేదండీ ! మా డ్రైవర్ కుదరదన్నాడు " చెప్పాడాయన తీరికగా.  ఇంకేం చేద్దాం !? కార్  తీయమ్మా నువ్వే డ్రైవ్  చేద్దువు గాని, లేదా మీ నాన్నగారినైనా లేపు ఆయన తీసుకెళతారు" .

"అమ్మో !  ఈ రోడ్ ల పై  డ్రైవింగ్ నా వల్లకాదమ్మా !  నాన్నగారు కూడా వద్దు . అప్ అండ్ డౌన్ ఆయనవల్ల కూడా కాదు . ఇంకెవరన్నా దొరుకుతారేమో ట్రై చేద్దాం"

నేనెళ్ళి గాఢ నిద్రలో ఉన్న ఆయన్ని లేపితే విసుక్కుంటూ లేచి బయటకొచ్చి విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు  "మీ అమ్మకి వేరే డ్రైవర్ ఎవరూ దొరకనట్టు ఏరి ఏరి పెట్టింది. వాడొట్టి పెడసరం మనిషి. పోయినేడాది భార్య  చేత వార్డ్ మెంబర్ గా పోటీ చేయించాడు కూడా !  పదే పదే  లేబర్ యాక్ట్  అది, ఇది అని మాట్లాడతాడు . ఎవరిపైనో  తనని కులం పేరుతొ తిట్టి  అవమానించాడని ఎట్రాసిటి కేస్ కూడా పెట్టాడంట . అలాంటతన్ని ఎందుకు పెట్టుకున్నారు? అని భయంగా కొందరు   అమ్మో ! పదిహేను వేలా ! మళ్ళీ రోజు వారి బేటాలు కూడానా అని మరి కొందరు ఆశ్చర్య పోయారు. ఆడపెత్తనాలు ఇట్టాగే ఉంటాయి".  ఏదో ఒక ఒంకతో సాధించడమే పనిగా పెట్టుకున్నట్టుగా. అన్నారు

అంతలోనే   ప్రకాష్ కాల్ చేసి "అమ్మా ! పుల్ గా మందేసి పడుకున్నాడంట  చేయగా చేయగా వాళ్ళావిడ పోన్ తీసింది. ఇల్లెక్కడో చెపితే వెళ్ళిలేపాను, నేను నిద్రపోవాలి కదండీ అంటూ బద్దకంగా లేచాడు, బయలేదేరుతున్నాడులే!   నేను వెంటబెట్టుకుని వస్తున్నాను, కంగారు పడకు"  అన్నాక ఊపిరి పీల్చుకున్నా.

డ్రైవర్ వచ్చి మేము కారులో కూర్చునేటప్పటికి అయిదూ నలభై...  వాళ్ళింటికి వెళ్లి ఎక్కించుకురాకుండానే
 ఆలస్యమైపోతుందని  చెల్లి మా ఇంటి దాకా నడచి వచ్చేసింది. కారులో కూర్చుని "నాలుగు గంటలకి బయలదేరాలని చెపితే ఇప్పుడా బయలుదేరడం" అంటూ  డోర్ ని గట్టిగా వేస్తూ తనకోపాన్ని ప్రకటించింది డ్రైవర్ కి అర్ధంకావాలని .

" టైం కి చేరుకుంటాములే  పిన్నీ ! కంగారుపడకు సముదాయించాడు  నా కొడుకు . "

"అవునుమరి మనకి  హైదరాబాద్ రూట్స్ కొట్టిన పిండయ్యే మరి !" వ్యంగం ఆమె గొంతులో . 
ఎనిమిది అయ్యిందంటే  సిటీలో ఒకటే ట్రాఫిక్. ఆలస్యం అవుతుందేమోనని కంగారు. అయినా "ఇంత లేట్ చేసావేమిటి  రాంబాబు " అన్నాను . అతనేమి మాట్లాడలేదు . గంటకి నూట నలభై కిలోమీటర్ల వేగంతో  కారుని నడుపుతుంటే లోపల కూర్చున్న  నలుగురి చూపులు రెప్ప వాల్చ కుండా  భయంభయంగా  రోడ్డు వైపు చూస్తూనే ఉన్నాయి. 

సిటీలోకి ఎంటర్ అవగానే మొబైల్ లో నేవిగేషన్ పెట్టి డైరక్షన్స్ చెపుతూ ఉండగా ఎలాగైతేనేమి తొమ్మిది కన్నా...ముందుగానే బేగంపేట ప్యాలెస్  ఫంక్షన్ హాల్ ప్రక్కనున్న అమెరికన్ కాన్సులేట్ దగ్గరికి చేరుకొని  హమ్మయ్య అంటూ ఊపిరి  పీల్చుకున్నాం. ఎవరూ టిఫిన్ కాదు కదా కాఫీ ఊసు కూడా ఎత్తలేదు . డ్రైవర్ కి డబ్బిచ్చి  టిఫిన్ చేసి రమ్మని పంపి అందరం కలసి  అతని నిర్లక్ష్య ధోరణి గురించి వాపోయాము.
"అయినా అతనికి అంత పొగరేమిటమ్మా  !?" 
"అవును .. రోజు గడవకపోయినా దర్జాకేమి తక్కువలేదు . యజమానన్న గౌరవం లేదు, అతన్ని మనం  ఎంతగా గౌరవిస్తాం!? తాతయ్య కూడా డ్రైవర్ గారు అంటూ గౌరవంగా  పిలుస్తాడు. అతనేమో  మాటకి ముందు నువ్వు నువ్వు అంటాడు, అలా అంటుంటే నాకెంత కోపం వస్తుందో !  అని చెల్లి 
"మనింట్లో రెండు గ్లాస్ ల పద్దతీ లేదు . మనం టిఫిన్ చేస్తున్నప్పుడు  సమయానికతను వస్తే టిఫిన్ పెడతానా ఎంగిలి  ప్లేట్ తీసుకుని వెళ్లి  సింక్ లో పడేస్తాడు . నానమ్మ ఒకటే గొడవ . పని అమ్మాయి ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే  మనమే ఆ ప్లేట్   కడగాలి . అసలు నువ్వెందుకు  టిఫిన్, టీ  ఇచ్చి  అలా తయారు చేస్తావు అని.. ఆమె కాలంలో మనం లేము అప్పుడలా   ఉండేవాళ్ళు గానీ  ఇప్పుడందరూ  సమానమేనని చెప్పి ఆమెని ఒప్పించాలంటే తలప్రాణం తోక మీదకి వస్తుంది' అయినా  ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను "

"గోపీచంద్ గారి డ్రైవర్ రవి రోజూ వచ్చి రాగానే కార్ శుభ్రం చేసుకుంటాడు . పిలవగానే వస్తాడు, ఎంత మర్యాదగా ఉంటాడని. వీడిలాంటి వాడిని ఎక్కడా చూడలేదు" చీదరించుకున్నట్టే అంది చెల్లి 

"అసలు డ్రైవరంటే  ఎంత వినయంగా ఉండాలి . డిక్కి డోర్  తీసుకుని మన సామాను మనమే పెట్టుకోవాలి,  మనమే తీసుకోవాలి.  మనం షాపింగ్కివెళ్లి బయటకోచ్చేసరికి ఇంజన్ ఆన్ చేసి ఎ.సి. వేసుకుని పడుకుని ఉంటాడు. మా డ్రైవర్స్ అలా ఉండరు. ఇతను  వేరేగా ఉన్నాడు" అంది కోడలు.

పోనీలే !  ధరలు మండిపోతున్నాయి అతనడిగినంత ఇస్తే మనకేమి తరిగిపోదులే  అనుకున్నాను ...కానీ ఇంత పొగరుబోతనుకోలేదు.  ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలియదతనికి .  అతనితో నిష్కర్షగా మాట్లాడాలన్న కూడా  భయమే !"మీలాగా మాకు చదువులు ఉన్నాయా !? పొలాలున్నాయా !? ఉద్యోగాలు ఉన్నాయా !" అంటాడు కానీ తన ప్రవర్తన బాగోలేదని తెలుసుకోడు . పిల్లలని  బాగా చదివించాలమ్మా అంటాడని  జీతం డబ్బులు ముందుగా ఇవ్వడంతో పాటు  పిల్లలకి ఫీజ్ కట్టుకోవడానికని అయిదు వేలు అదనంగా కూడా  ఇచ్చాను . అయినా చూడు ఎంత నిర్లక్ష్యమో !  నాక్కూడా కోపం వస్తుంది " 

దగ్గరలోనున్న చుట్టాలింటికి  వెళ్ళొ స్తానని చెల్లి వెళ్ళాక  నేను కొడుకు కోడలు మిగిలాము .  కొడుకు కోడలు ఫైల్ తెరిచి అవసరమైన పత్రాలన్నీ వరుసగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండగా... నేను బయటకి దృష్టి సారించాను . అబ్బో ఎన్ని కార్లో ! ఇక్కడికి సుమారు రోజుకి ఒక వెయ్యి కార్లు రావచ్చేమో  ! ఆ పరిసర ప్రాంతాలన్నీ నేల  ఈనినట్లు  జన సందోహంతో ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు  విమానం ఎక్కబోయే ముందు కారు ఎక్కకపోతే ఎట్లా అన్నట్లు ఆక్కడికందరూ  కారుల్లోనే వస్తున్నారు . .  ఆ పంక్షన్ హాల్ వాళ్ళు  గంటకి వందరూపాయలు పార్కింగ్ చార్జ్ ని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు . చుట్టూ పరికించి చూస్తూ ఇక్కడెక్కడైనా రెస్ట్  రూమ్స్ ఉన్నాయో లేదో ! అన్నాను . "ఉండమ్మా నేను  చూస్తాను"  అని వెళ్ళి అక్కడ ఎక్కడా ఆ సౌకర్యం ఉన్నట్లు కనబడక   గార్డ్ ని అడిగి వచ్చాడు . అతను చూపించిన వైపు వెళ్ళొచ్చి  "అబ్బో ! చాలా దరిద్రంగా ఉన్నాయమ్మా !  నువ్వు వెళ్ళలేవు " అన్నాడు   

ప్చ్ .. రోజూ ఇన్ని వందల మంది వచ్చి పోయే చోట కనీసం టాయ్లెట్ కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు .  ఉన్న ఒకే ఒక టాయ్లెట్ దుర్గంధం వెదజల్లుతూ వెళ్ళిన వాళ్ళని అవసరాన్ని వాయిదా వేసుకోమన్నట్లు వెనక్కి పంపుతుంది .  ఈ పంక్షన్ హాల్ వాళ్ళు కొన్ని శౌచాలయాలు కట్టి వెళ్ళిన  ఒక్కొక్కళ్ళ   దగ్గరా పది రూపాయలు లెక్కన వసూలు చేసినా కిమ్మనకుండా ఇచ్చేసే  వాళ్ళు . వీళ్ళకి  నెలకి లక్షలకి లక్షలు ఆదాయాలు వచ్చేవి అసలు కన్నా కొసరు ఆదాయమే  బాగుండేది   అనుకున్నాను మనసులో . 


ఎదురుగా  చింత చెట్టు  లేలేత చిగురుతో  శోభగా ఉంది.  దాని కొమ్మ కొమ్మకి రాత్రుళ్ళు  రంగు రంగుల ఎలక్ట్రిక్  దీపాలు వెలిగే  విధంగా వైర్లు తోరణాలుగా వేసి ఉన్నాయి.  చెట్టు  మొదట  చుట్టూరా   కట్టిన చప్టాపై  కూర్చున్న ఓ తల్లి  దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ  చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీసి ముగ్గులేసుకుంటుంది . కాసేపటి తర్వాత ఆమె కూతురొచ్చి సంతోషంతో తల్లి పాదాలకి దణ్ణం పెట్టుకుని కళ్ళ కద్దుకోవడం కనిపించింది .  ఆ తల్లి ముఖంలో అమితమైన  సంతోషం .

చిన్న పాపని ఎత్తుకున్న ఓ తల్లి చేతిలో  ఫైల్స్ పట్టుకుని వక్క చెట్టుని  ఆనుకుని నిలబడి ఉంది.  ప్రక్కనే ఉన్నది ఆమె భర్తనుకుంటా... ఆమెకి ఏదేదో చెపుతూనే ఉన్నాడు .  లెగ్గిన్ - టైట్ టీ  షర్ట్ వేసుకున్న ఓ తెలుగింటి కోడలు "మామయ్య గారు వీసా  స్టాంపింగ్  అయిందండీ ,  ప్రశ్న లేమీ వేయకుండానే అప్ర్రూవ్  చేసేసారు. అంతా దేవుడి దయ. వచ్చేటప్పుడు దిల్ ఖుష్ నగర్  బాబా గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకుని వస్తాను " అని చెపుతుంది . ఒక్క బాబా ఏనా , అంతకు ముందెన్నడూ గుర్తుకురాని  మూడు కోట్లమంది  దేవతలు ఇతర  మతాల  వాళ్లకి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళూ అందరూ  తప్పక గుర్తుకు వస్తారనుకుంటా! నవ్వుకున్నాను.   

ఇంకొక  అమ్మాయికి  వీసా రాలేదనుకుంటా ,   వచ్చి తండ్రిని కావిలించుకుని పెద్దగా ఏడుస్తూ  "సారీ డాడీ ఐ  యామ్ వెరీ వెరీ  సారీ డాడీ!  మీ కలని నేను నేరవేర్చలేకపోయాను . ఈ సారి ముందుగా  mac test కి  వెళ్లి ఇంటర్  వ్యూ  బాగా చేసి డెఫినెట్ గా  వీసా తెచ్చుకుంటాను....ప్రామిస్ డాడీ  నన్ను నమ్మండి " అంటూ వేడుకుంటుంది .

అమెరికా  వెళ్ళాలి,  డాలర్స్ సంపాదించాలనే వేలంవెర్రి కోరిక తల్లి దండ్రులది కాక పిల్లలదా !? అనుకుని నవ్వుకుంటూ నా కొడుకు వంక చూసాను . అయిదేళ్ళనాడు ఆరు నెలలు  పాటు గడ్డం పుచ్చుకుని బ్రతిమలాడి  మరీ అమెరికాకి పంపిన సంగతి గుర్తుకొచ్చిందేమో తనూ నవ్వాడు .

"అమెరికా అంటే భూతల స్వర్గమని  అక్కడ ఏ పనైనా చేసి డాలర్స్ సంపాదించి హాయిగా బ్రతికేయోచ్చు అని భ్రమలలో ఉంటున్నారు  ఆ గడ్డ మీద కాలు పెట్టాక కానీ తెలియదు సంపాదించడం ఎంత కష్టమో !  గ్యాస్ స్టేషన్ లో జాబ్ దొరుకుతుందా,మాల్ లోనో మోటెల్ లోనో జాబ్ దొరుకుతుందా ... అని వెతకడం మొదలెడతారు. ఓ పి టి  బేన్ చేస్తే  చాలామంది ఇంటి ముఖం పట్టక తప్పదు  అది తెలియకుండా చీమలు దారి వేసి నట్లు అమెరికా దారి పడుతున్నారు . వీళ్ళందరినీ చూస్తుంటే  జాలేస్తుందమ్మా ! .అన్నాడు నా కొడుకు 

ఇలా వచ్చేపోయే వాళ్ళని చూస్తూ మనసులో  ఉన్న గుబులుని  చిరునవ్వు మాటున మాటేసి  ఒక గంట సమయం గడిపేసాము . అబ్బాయికిచ్చిన రిపోర్టింగ్ టైం కన్నా ఓ పదినిమిషాలు ముందే క్యూ లైన్ దగ్గరకి చేరుకున్నాం .  సెక్యూరిటి గార్డ్ ఇంకా టైం ఉంది  దూరంగా వెళ్లి  వెయిట్ చేయండి అంటూ తోలేసాడు . నాకైతే  ఇంగ్లీష్ నేర్చిన తెలుగు కాపలా కుక్క ఆపరిసర ప్రాంతాలలో ఏ వీధి కుక్కలు  ఉండకూదదంటూ కర్ర పట్టుకుని మరీ తరుముతున్నట్టు అనిపించింది .  ఆ చురచుర మనే ఎండలో కాసేపు చెమటలు  క్రక్కాక  పదిన్నరకి వెళ్ళే వాళ్ళని పిలిచాడు . నా కోడలు పట్టిన చెమటని తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పింది . నేనేమో వెన్నునిమిరి దైర్యంగా, కాన్ఫిడెంట్ గా ఉండు. స్టాంపింగ్ అవుతుందిలే అన్నాను. 

నా కొడుకు క్యూ లైన్ లోకి వెళ్ళాక  ఇంకోసారి వీధి కుక్కలని తరిమినట్లు తరిమించుకోకుండా మేమే కార్ పార్కింగ్ చేసిన స్థలానికి వస్తూ గోడ ప్రక్కకి నిలబడి   అక్కడ ఓపెన్ హాల్ లో  అనేక లైన్లలో ఇనుప కుర్చీలలో  కూర్చున్న వాళ్ళని ఆసక్తిగా చూస్తున్నాను   . పది పన్నెండు లైన్స్ ఉన్నాయి ఒక్కో లైన్ కి అయిదుగురో ఆరుగురో ఉన్నారు . వాళ్ళ ముందు నాలుగు పలకల ప్లాస్టిక్ ట్రే . అందులో వాళ్ళ జాతకాలని చూపించే  పత్రాలు ఉన్నాయి.  గొర్రెల మందలా  ఎలా పడితే అలా పరిగిత్తే  మన పౌరులు అక్కడ  క్రమశిక్షణ తో నడుచుకునే చీమల్లా నిశ్శబ్దంగా  రెండు చేతులతో పదిలంగా ఆ ట్రే ని పట్టుకుని   ఒక లైన్ తర్వాత మరొకలైన్ లోపలికి  వెళుతున్నారు, వస్తున్నారు. నాకైతే ఆ ట్రే  అలా పట్టుకుని వెళ్ళే వాళ్ళని చూస్తే అమెరికా దేశంలో అడుక్కు తినడానికి పర్మిషన్ ఇమ్మని అడుక్కున్నట్లు ఉంది .

గోడ కివతల ప్రక్కకూడా నిలబడి చూడ్డానికి వీల్లేదంటూ మరో ఇంగ్లీష్ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళండి వెళ్ళండి అంటూ తోలేసాడు . నేను, కోడలు వచ్చి కార్లో  వెనుక ఒకరు ముందు ఒకరు కూర్చున్నాం  ప్రక్క ప్రక్కన కూర్చోవడానికి వీలు లేకుండా కార్ డ్రైవర్ తన సీట్ ని కంపర్ట్ గా వెనక్కి వంచి పడుకుని నిద్ర పోతున్నాడు.  

పది నిమిషాలకి ఒకసారి బయటకెళ్ళి  గోడపై నుండి  కాన్సులేట్  లోపలకి  చూస్తూ మా అబ్బాయి ఇటువైపు  చూసినప్పుడల్లా  తనకి దైర్యం చెపుతూ థంబ్  చూపిస్తుంది కోడలు.    నేను పైకి బింకంగా ఉన్నా లోలోపల భయపడుతున్నాను. ఒకవేళ  స్టాంపింగ్ అవకపోతే !?  ఆ ఊహే భయంకరంగా తోచింది . అమ్మో ! పెళ్ళికి చేసిన  లక్షల అప్పులు లక్షణంగా నా తల చుట్టూ గిరగిరా తిరుగుతూ వడ్డీ ఇవ్వండీ , అసలెప్పుడూ అనడుగుతున్నట్టు అనిపించింది . దేవుడా దేవుడా ! మల్లన్నా ! ఎప్పుడూ..  నువ్వే నాకు అండ . నన్ను ఎవరి దగ్గర తల ఒంచి నిలబడేటట్లు చేయలేదు . ఇప్పుడు కూడా తలెత్తుకుని గర్విస్తూ జీవించేటట్లు  చేయి అంటూ మనసులో  వేడుకుంటూనే ఉన్నాను .

కాసేపటికి  చుట్టాలింటికి  వెళ్ళిన నా చెల్లెలు వచ్చేసింది.   ఇద్దరూ  అన్యమనస్కంగానే ఏదేదో మాట్లాడుకుంటున్నాము.  కాసేపటికి నా కొడుకు, కోడలు వచ్చేసారు . వాళ్ళ ముఖంలో రిజల్ట్ ఏమిటో తెలుసుకోవాలని కంగారుగా వెతికాను . నా చెల్లెలు .. "చిన్నీ  స్టాంపింగ్  అయిందా? " లేదా అని అడగడం కూడా ఇష్టం లేదాయే !  "లేదు పిన్నీ" అన్నాడు నా కొడుకు.  నిరాశని తట్టుకుంటూ నా కొడుకుకి దైర్యాన్ని నూరిపోయ్యాలిప్పుడు అనుకుంటూ  డోర్  తీసుకుని బయటకి వచ్చాను .  "అంతా ఒట్టిదే !  నేను నమ్మను .. నీ పాస్పోర్ట్  ఏది చూపించు" అని అడిగింది చెల్లి  . "రెండు రోజుల తర్వాత వస్తుందిలే " అని నవ్వుతూ చెప్పాడు .

"మల్లన్నా  ! నా నమ్మకం ఎప్పుడు వమ్ము కానీయవు . నీకు శతకోటి దణ్ణాలు తండ్రీ ... అని మనసులో అనుకుంటూ  సంతోషంతో  బిడ్డని దగ్గరికి తీసుకున్నాను . మనకి అనుకూలంగా ఫలితం వస్తే దేవుడు కరుణించాడని వ్యతిరేక ఫలితాలు ఇస్తే విధిరాత ఇలాగే ఉందని సరిపెట్టుకుంటానికి తయారుగా ఉన్నానేమో ! అని నాకు నేనే మొట్టికాయ వేసుకున్నాను   

ఏది ఏమైనా  నిమిషాలలో మన తలరాతలని మార్చేసే అమెరికా కాన్సులేట్ పట్ల నాకు నిరసన  భావం కల్గింది .ప్రతి నిత్యం వేలమంది ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అమెరికా వెళ్ళకపోతే జీవితమే లేదనుకుంటున్న నా లాంటి తల్లిదండ్రుల పట్ల ఏవగింపు కల్గింది .     ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన వందల  మంది యువకులు  సారాన్ని పిండుకుని దేశాన్ని ఒదిలేసి వెళుతున్నట్లు  అనిపించింది .  చేసిన అప్పులు తీరిపోగానే అమెరికాని వదిలేసి రమ్మని  నా కొడుక్కి గట్టిగా చెప్పాలి అనుకున్నాను . మళ్ళీ అంతలోనే స్వరం మార్చేసి ..  నిజంగా నేనలా చెప్పగలనా ! వాడు రాగలడా ! ప్రసవ వైరాగ్యం లాంటిదే  ఇది కూడా ! అనుకున్నాను .

తిరుగు ప్రయాణం ముచ్చట్లతో  ఆనందంగా సాగుతుంది . మధ్య మధ్యలో నా కొడుకు నాలుగైదుసార్లు  డ్రైవర్ని వేగం తగ్గించి నడపమని. హెచ్చరిస్తూనే ఉన్నాడు   అయినా యజమాని మాటని ఖాతరు చేయకుండా  కారుని  130/140 కిలో మీటర్ల వేగంతో  నడుపుతూనే  తీసుకువచ్చాడు . నేనైతే ప్రయాణం పొడవునా  డ్రైవర్ నిర్లక్ష్య ధోరణికి రగిలిపోతూనే ఉన్నాను.

సెవెన్స్ దగ్గర  టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు అతని గురించి మా మధ్య  మళ్ళీ మాటలు మొదలయ్యాయి  .  "అమ్మా !  అర్జంట్ గా  ఈ డ్రైవర్ని మార్చేయి .  వాడికి  అసలు మన మాటంటే లెక్కలేదు  యజమాని మాటని లక్ష్య పెట్టని వాళ్ళతో  పని చేయించుకోలేము.  చెప్పినా వినకుండా ఇంత మంది ప్రాణాలని రిస్క్ లో పెడుతున్నాడు వాడు"   అన్నాడు కోపంగా . 
 ఏమండీ రాంబాబుగారు  అని గౌరవంగా పిలిచే నా కొడుకు  డ్రైవర్ని  వాడు అని అనడంలో  నాకాశ్చర్యమేమీ కలుగలేదు . ఎక్కడైనా  మనిషి  ప్రవర్తన వల్లే  గౌరవం తగ్గిపోతుందని అర్ధం చేకున్నదాన్నయినా  అప్పటికి మాత్రం  నా కొడుకుని వారిస్తూ  . 
"ఉష్ ...  అతను వింటున్నాడు ఊరుకో ! . అయినా  ఈ రెండు రోజులేగా, మీరు వెళ్ళగానే ఇక తన అవసరం లేదని మాన్పించేసి వేరే డ్రైవర్ని పెట్టుకుందాం " అన్నా రహస్యంగా .  

" ఏమన్నా అంటే   సడన్ గా ఎక్కడ మానేస్తాడో మళ్ళీ అవసరానికి ఎవరైనా దొరుకుతారో లేదోనని అతనిని  భరించాల్సి వస్తుందేమో ! అవును కదూ అత్తయ్యా "...  కోడలు ప్రశ్న  .

కాదన్నట్టు తల అడ్డంగా ఊపి మారడానికి అతనికి అవకాశం ఇవ్వాలి . అతని నిర్లక్ష్యం మనకి బాధ కల్గినా ఒర్చుకోవడమెందుకంటే  మన సామాజిక వర్గం పైన, ధనవంతులపైన  మనలాంటి వారి పైన అతనికి అంతులేని ద్వేషం ఉంది కష్టపడకుండానే మనకన్నీ ఆయాచితంగా వచ్చేస్తున్నయన్న ఫీలింగ్ లో ఉన్నాడతను . గతంలో కన్నా మన ఆస్తులు కరిగిపోయాయని మళ్ళీ కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నామని  తెలియక కాదు. వాళ్లకి లేనిదేదో   మన దగ్గర ఉందని ఉక్రోషం, మనం అతని  వృత్తి పై ఆధారపడ్డామనే చులకన భావంతోనే అలా చేస్తున్నాడనిపిస్తుంది నాకు.  మనలో అందరూ అతను ద్వేషించినట్లుగాను  ఉండరు. అతని అపోహ అది . అలాగే  అతనిని మనం తక్కువగానూ  చూడటం లేదని అతనికి అర్ధం అయ్యే విధంగా ఉందామని ట్రై చేస్తున్నాను....అన్నాను సాలోచనగా . 

అవునన్నట్లుగా తలూపి "ఏదేమైనా తను   చేసే పనిని ప్రేమించడం లేదతను , బాధ్యతనేది  ఏ కోశానా లేదు,  ప్రవర్తన మారకపోతే ఎక్కడా నిలబడలేడన్నది  మాత్రం నిజం. అసలు వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకమ్మా?  నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకో ! అన్నాడు నా కొడుకు .
"ఇతరులపై ఆధారపడటం ఎప్పటికైనా మంచిది కాదని నాకు తెలుసు కానీ మనవల్ల ఇంకొకరికి ఉపాధి దొరుకుతుందని  అంతే"
"మీ అమ్మ ఈ మధ్య మార్క్సిజం బాగా చదివి అర్ధం చేసుకుంటున్నట్లుంది  . నువ్వు సంపాదించి పంపిందంతా దాన ధర్మం చేసేస్తుంది జాగ్రత్త  చిన్నీ ! అంటూ  నవ్వుతూ హెచ్చరించింది .

నువ్వు ఏమైనా  చెప్పమ్మా ! ఇతనిలాంటి వారిని  చాలామందిని చూసాను.   అక్కడ కూడా  ఇలాగే ఉన్నారు. అయిదేళ్ళ నుండి చూస్తున్నాను కదా !  అవకాశం వచ్చినా, ఊత ఇచ్చినా పైకి రాలేరు వాళ్ళలో సోమరితనం, నిర్లక్ష్యం. అకారణమైన ద్వేషం కనబడతాయి. కొంచమైనా బ్రతుకు పట్ల భయం ఉండదు, జవాబుదారిగా ఉండరు  చికాకుగా చెప్పాడు

"బ్రతకడానికి వాళ్ళకి   ఉన్న ధీమా అలాంటిది   ఈ యజమాని కాకపొతే ఇంకో యజమాని అన్న నిర్లక్ష్యం.  ఎలాగోలా బ్రతకపోతామా అన్న  విశ్వాసం .  అతనిలా  కాకపొతే ఇంకెలాగైనా బతికేస్తాడు . మనకి మాత్రం అలా బతకలేమా అన్న ధీమా లేకపోయిందెందుకు ?  ఎం ఎస్ చదివిన నువ్వు  ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా అనుమతి కోసం వెంపర్లాడలేదూ ?   ఏ జామ్ నగర్ కో,  పూనే కో   వెళ్ళినా నెలకి  లక్ష కి పైగా  సంపాదిస్తావు  ! అయినా వీసా అప్రోవ్డ్ అవుతుందా లేదా అని  ఎంత టెన్షన్ పడ్డాము  ?  అంది చెల్లి

"ఎందుకంటే  పెద్ద  ఇల్లు, ఈ కార్లు , హోదా అన్ని మర్చిపోయి మనం  సాధారణంగా బ్రతకలేము ! .మనకి ఈస్థటిక్ సెన్స్  ఏ కోశానా లేకపోయినా సౌకర్యవంతంగా బతకడానికి మాత్రం ఎక్కువ డబ్బు కావాలి   జీవితం పట్ల ఆసక్తి అనురక్తి కన్నా  గొప్ప  హోదా కోసం, ఆపై విలాసవంతంగా  బ్రతకడం కోసం బ్రతుకుతున్న వాళ్ళమీ మనం .  మనవి భద్రమయ జీవితాలనుకుంటాము కానీ  నిత్యం అభద్రతతో బ్రతుకుతున్నది  మనలాంటి వాళ్ళమేనని  నీకు తెలియడంలేదా ?! . 

డ్రైవర్  నిర్లక్ష్యానికి మా అభద్రతాభావానికి  రెండిటికి మధ్య ఉన్న అర్ధంకాని విషయమేమిటో  బోధపడినా బోధపడకపోయినా 
"అవునమ్మా !  ఈ రోజు ఆవిషయమే  బేగంపేట ప్యాలెస్  ప్రక్కన బాగా  అర్ధమయింది ." నా భుజం పై తల ఆనించి కొంత దిగులుగా అన్నాడు . .  

పార్కింగ్ ప్లేస్ లో కార్ దిగి లిఫ్ట్ కోసం వెయిట్  చేస్తున్నాం . కార్  కీస్ తీసుకొచ్చి  నా చేతిలో పెట్టేసి వెళ్ళడానికి రెడీ అయ్యాడు  డ్రైవర్  .  " పై దాకా వచ్చి  కీస్ పెట్టి వెళ్ళోద్దా ! ఇక్కడే  నీకిస్తాడు ఏమిటీ .. అని మా చెల్లి  నా వైపు చూసింది   కంఠశోష  వచ్చేటట్టు ఇందాకంత   చెప్పావ్ కానీ  అతనిని మార్చడం నీ వల్ల కాదు అన్నట్లు  . 

నేను నా  మొహమాటాన్ని కొంచెం   ప్రక్కన బెట్టి 'రాంబాబు లోపల వాటర్ బాటిల్స్ , బేగ్స్ ఉండి పోయాయి. అవి తీసుకొచ్చి  పైన ఇచ్చి వెళ్ళు " అని కీస్ అతనికి ఇచ్చేసి లిఫ్ట్ లోకి వెళ్లిపోయాను . అప్పటికి కానీ   నా మనసు శాంతించలేదు.  అది తాత్కాలిమేనని తెలుసు .

(పత్రికలో వచ్చిన కథ ఇక్కడి వరకూ ) అసలు కథ కొనసాగింపు .....

మా వెనుకనే డ్రైవర్ వచ్చాడు . తెచ్చిన బేగ్,వాటర్ బాటిల్స్ క్రిందపెట్టి కార్ కీ నా చేతికి ఇస్తూ  "నేను రేపటి నుండి రానండీ ,మానేస్తున్నా" అన్నాడు.
"సరే రాంబాబు " అన్నా ఏమీ ఆలోచించకుండానే వాద ప్రతివాదనలేమీ లేకుండానే .
అతను లిఫ్ట్ లోకి వెళ్ళిన చప్పుడు తర్వాత "ఏం జరిగింది? ఎందుకా పొగరబోతు ముండా కొడుకు మానేస్తానంటున్నాడు ?" అడిగింది అత్తగారు.
"నానమ్మా! ఎందుకలా నోరు పారేసుకుంటావ్, మర్యాదగా మాట్లాడొచ్చు కదా ! విసుక్కున్నాడు నా కొడుకు.
వెళ్ళి పోయాడనుకున్న డ్రైవర్ వెనక్కి వచ్చి "లెక్క చూడండి "
"నువ్వే బాకీ ఉన్నావ్ కదా !" డైరీ తీసి లెక్కంతా స్లిప్ పై వ్రాసి ఇచ్చా.
తెల్లారిందో లేదో ... పాల పేకెట్స్ వేసే కుర్రాడు "మీ డ్రైవర్ బ్రాందీలో ఎండ్రిన్ కలిపి తాగేసాడంట బ్రతకడం కష్టం " అంటున్నారనే వార్త మోసుకొచ్చాడు.
ముద్దుగా ఉన్న పిల్లలు, పద్దతిగా ఉన్న అతని భార్య గుర్తుకు వచ్చి "అయ్యో ! వాళ్ళ సంగతి ఏమవ్వుద్దో ననైనా ఆలోచించవద్దీ మూర్ఖుడు " కోపంగా అన్నా.
అతనికెప్పుడూ ఇతరులతో గొడవేనండీ. కులం పేరుతో తిట్టారని కేసులు పెడతాడు. ఇప్పుడెవరికి చుట్టుకుంటుందో ?
పాలబ్బాయి  మాటలతో భయం నన్ను కొండ చిలువలా చుట్టేసి   ప్రత్యక్ష ప్రసారాలలో రకరకాల కథనాల రీళ్ళు కళ్ళముందు గిర్రున తిరగసాగాయి.  మల్లన్నా ! అతనికేమి కాకూడదు. అతను భార్యా,పిల్లలు సంతోషంగా ఉండాలి చేతులు జోడించి కనబడని దేవుడిని వేడుకున్నాను.
(ఈ కథ 2015 ఆగస్ట్ లో చినుకు పత్రిక కి పంపబడింది )


1 కామెంట్‌:

Saraswathi Durbha చెప్పారు...

కధ చాలా బాగుంది.