19, ఏప్రిల్ 2013, శుక్రవారం

జాబిలి హృదయం







తెల్లవారు ఝామున ఐదు గంటల సమయం

గుంటూరు  పండ్ల మార్కెట్ అంతా కోలాహాలంగా ఉంది ఇతర రాష్ట్రాల నుండి పండ్ల లోడుతో వచ్చిన లారీలు రకరాకాల భాషలతో కలగా పులగంగా కలసిపోయిన హిందీ ఉర్దూ కలిపి మాట్లాడుకుంటున్న షాపుల వాళ్ళు ,దళారీలు  

అక్కడే మరికొన్ని లారీల నుండి సరుకును దిగుమతి చేస్తున్న ముఠా కూలీలు.  దించిన సరుకుకి రేటు నిర్ణయింఛి అటునుంచి ఆటే మినీ లారీల లోకి ఎక్కిస్తున్న చిన్న తరహా వ్యాపారులు.  వేడి వేడి కాఫీ, టీ  అంటూ  తిరిగే కుర్రాళ్ళు 

వాళ్ళందరి మధ్యనా  "మాధవా.. ఓ మాధవా ! ఎక్కడున్నావయ్యా వచ్చినావా! లేదా ? రెండు రోజులనుండి నీ బిడ్డ నీపై దిగులు పెట్టుకున్నాడు. అబ్బా జాన్, అబ్బాజాన్ అంటూ వీధి వాకిలి వైపు చేయి చూపుతున్నాడు. ఇటొచ్చి వీడిని  తీసుకుని సముదాయించు" అంటూ గుట్టగా పోసిన బత్తాయిల పైగా చూపును లోపలి సారించి మాధవ కోసం వెదికింది. తన పిలుపు విని మాధవా రాకుండా ఉంటాడా అన్నట్టు  నమ్మకంగా చూస్తుంది . 

"బాబీ, మాధవన్న ఈ రోజు కూడా సరుకు అన్లోడ్  కి రాలేదు. ఆయన పెద్ద కొడుకు,బావ మరిది వచ్చినారు, ఆళ్ళ నేమైనా కనుక్కోమందువా ? " అడిగాడు 

"వద్దొద్దు  ఆళ్ళని ఆరా తీసే పని నీకెందుకులే, కాస్త ఎండ పడ్డాక నేనే ఓ సారి ఇంటి వైపుకి పోయోస్తాను ఈ లోపు మీ మాధవన్న వస్తే నేను వచ్చి పోయానని చెప్పు మరసి పోకు "  వెళుతూ వెనక్కి తిరిగి  చూసు కుంటూ  చెప్పి పోయింది . . 

"ఏంటి కాజాబీ ! ఇంత పొద్దుటేలనే  మాధవ కోసం వెతుక్కుంటూన్నావ్? రాత్రేళ రాలేదా ఏమిటీ ? " అని పండ్ల బేరం చేసుకునే కాంతమ్మ హాస్యమాడింది 

"రాత్రేళ  నా కొంగున కట్టుకోవడానికి నేను బుద్ధిమాలినదాన్ని అనుకున్నావా? ఆయనకీ ఓ సంసారం ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు  నిత్యం వాళ్ళ మంచి చెడు కనుక్కోడానికైనా ఆయన అక్కడ ఉండొద్దూ." అంటూ 

"రా షాపుకి పోదాం రేటేక్కువ చెప్పానని  నాతావున కొనకుండా పోతున్నావ్. పెట్టి ఒత్తున పడిన కాయలు,నిన్న మిగిలిన కాయలు కొనుక్కుపోయి ఎక్కువ లాభంకి అమ్ముకోవాలని చూస్తావు. నాసి రకం అంట గట్టి రెండోనాడు  యాపారం చేయడం కుదురుద్దా! " అంటూ ముందుకు నడుచుకుంటూ పోయింది 

"ఏం  మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతావు కాజాబీ, మరి అట్టాంటి దానివి ఆ మాధవ వల్లో  ఎట్టా బడ్డావో నాకు ఆశ్చర్యం  " అంది కాంతమ్మ 

"నేను ఆయన వల్ల్లొ పడ్డానో  నా వల్లో ఆయన పడ్డాడో కానీ ఎవరికీ ఎవరు అన్యాయం చేసుకోలేదు అందరూ బాగుండాలనే కదా అనుకుంటున్నాము " అంది   

"అన్యాయం జరిగింది నీకే గదా తల్లీ! ఆయన్ని కట్టుకుని నీ రాత ఏమన్నా మార్చుకున్నావా? ఎనకటికి మాదిరే పొద్దస్థమాను బేరం తప్పటలేదు కదా! అవతల మూడు షాపులున్నై లక్షలకి లక్షలు మిగుల్తున్నాయని చెప్పుకుంటున్నారు " అని రహస్యం చెప్పినట్టు తల వంచి కాజాబీ ముందు వంగి చెప్పింది . 

"జనం వెయ్యి సంపాదిస్తే పదివేలు సంపాదించాడని చెప్పుకుంటారు పదివేలు అప్పుంటే లక్షలు అప్పు ఉందని చాటింపేస్తారు జనం సంగతి నాకు తెలియందా ఏమిటి? ఈడు వచ్చిన కొడుకు చదువుసంధ్యలు ఒంటబట్టక గాలికి తిరుగుతున్నాడని వ్యాపారం నేర్చుకుంటాడని  ఒక షాప్, మాధవ  సంపాదించిది అంతా నేనెక్కడ జేరేసుకుపోతానో అని భయంతో  తమ్ముడిని కాపలా బెట్టింది  మా అక్క. ఆయన ఖాళీగా కూకుంటే ఎట్టా ?  ఇంత మందికి పని కావాలంటే అన్ని షాపులు కావద్దా!? పచ్చి సరుకు, వచ్చిన రోజు వస్తాది,పోయిన రోజులు పోతాయి నమ్మి యాపారం చేస్తున్నాం కానీ లక్షలు పోగేయ్యడానికి కాదు "  అని చెప్పింది 

 "కాజాబీ నీ సంగతి కదా నేను అడిగింది  ఆళ్ళ సంగతి ఎందుకు చెబుతావ్? ఆ మాధవ పై ఒక్క మాట పడనియ్యవు  . ఎంతైనా గొప్ప నవాబుల కుటుంబం లో పుట్టినదానివి . ఆ వాసనలు ఎక్కడికి పోతాయి " అంది.

 " ఆ ఏం నవాబు బతుకో ఏమోలే కాంతమ్మా , ఒకూరి రాజు ఇంకోకూరికి వెట్టాడు లెక్క అంట . మా అబ్బాజాన్ చెపుతూ ఉండేవాడు. పూలమ్మిన చోట కట్టేలమ్మలేక ఈ గుంటూరు నీళ్ళు ప్రాప్తం ఉండి ఈడకి వచ్చిపడ్డాం . అబ్బాజాన్ యాపారంలో కాస్త పుంజుకుని ఇల్లు కట్టాడో లేదో మాయదారి గుండెజబ్బు వచ్చి  చచ్చిపోయినాడు. ఎన్నడు గడప దాటని అమ్మి,చోటే బహెన్, అబ్బాజాన్ వైద్యానికి చేసిన అప్పులు తో బజారున పడబోయాం . మీ గుంటూరోళ్ళు వాములుని తినే సోములు ఎన్ని జిత్తులు వేసినారో  మా ఇల్లు కాజేసి మమ్మల్ని నిలవనీడ లేకుండా చేద్దామని. నేను చొరవ జేసి  మగాడిలా మార్కెట్ కి వచ్చి షాపులో కూకుండ బట్టి సరిపోయింది.  ఆ ఇల్లు నిలబడింది  ఇట్టా జనాలు మోసం జేస్తారనే  నేను చదువుకోకపోయినా బహెన్ ని గవర్నమెంట్ నౌకరీ  వచ్చిందాకా చదివిస్తిని  కదా " అని చెప్పింది.

వందల లెక్కన బత్తాయిలు లెక్కబెడుతూనే మంచి మంచి కాయలు  ఏరుకుంటూ  "ఇన్ని తెలిసిన దానివి, తెలివైన దానివి ఆ మాధవని ఎట్టా చేసుకున్నావే " అడిగింది

సమాధానం చెప్పకుండా  షాప్ లో గుమస్తాగా చేస్తున్న మనిషిని పిలుస్తూ    "ఒరె నరసింహా  ఈ పిల్లగాడిని తీసుకుపోయి అమ్మీ కాడ  వొదిలేసి రా. "నూర్" ని బడి కి పంపమని   చెప్పెసిరా, నేను ఈ రోజు ఇంటికి పోయేటట్లు లేదు " అని తన ఒడిలో ఉన్న చంటి పిల్లాడిని అతనికి ఇచ్చి పంపింది .

"మాధవ మంచి మనిషి కాంతమ్మా, అబ్బ జాన్ పోయినప్పుడు అప్పులాళ్ళు చుట్టేసినప్పుడు ఉన్నపళంగా ఆళ్ళు మాత్రం ఏడ నుండి తెచ్చి ఇస్తారు  అని  అందరికి సర్ది చెప్పాడు.  ఆడాళ్ళు , సూరీడు వెలుగు చూడనోళ్ళు ఉన్న ఇల్లొకటి అప్పుల కింద గట్టుకుంటే వాళ్ళేడకుపోయి బతుకారు అని జెప్పి  మాట సాయం చేసాడు. వాళ్ళు కట్టలేకపోతే నేను కడతాను అని హామీ ఇచ్చి పంపాడు. ఆయన మాటలో ఏం మత్తుందో, మంచితనముందో అందరూ సరే  అని తలలూపి పోయారు ఆయనకీ మాట రానిస్తామా చెప్పు.? ఈ మార్కెట్ లో మగాడిలా చెరిగి యాపారం చేసినా . మాధవతో నెలకోసారి అయినా మాట్టాటింది లేదు ఎప్పుడైనా ఎదురు పడితే పలకరింపు నవ్వొకటి నవ్వడమే. అప్పులోల్లకి   బాకీ డబ్బులు కట్టేటప్పుడు ఒకటి అరా మాట మాట్టడటమే ! ఆ పాటి దానికే గాలి కబుర్లు పుట్టాయి."

"మీ ఆయన ఆ తురక దాన్ని ఉంచుకున్నాడు  కదా! దాని అప్పులన్నీ ఆయనే తీరుస్తున్నాడట అని ఆ ఇల్లాలికి మోసేసినారు. ఆడాళ్ళు డబ్బులు  పోయినా ఊరుకుంటారు కాని మొగుడు పరాయి  దాని వైపు చూత్తే ఊరుకుంటారా?  మాధవ పెండ్లాం మా ఇంటికి వచ్చి నానా రచ్చ చేసి పోయింది చుట్టు ప్రక్కలోళ్ళ మధ్య తల ఎత్తుకోలేకపోయినాము.

ఉన్నపళంగా బయల్దేరి మార్కెట్ కి వచ్చి మాధవ షాప్ కి  బోయినా,  ఏమయ్యా! నీ ఇల్లాలికి అంత నోటి  దురుసు ఎందుకంట ? నీ మీద అంత అనుమానం ఏంటయ్యా ! సరే నన్ను అంటే అంది మొగుడు అనేటి  గౌరవం,  విలువ తెలియకుండా   అలా రోడ్డున బడి కూయడమేనా? ఏమైనా అనుమానాలు ఉంటె మీరు మీరు కూర్చుని మాట్లాడుకుని సర్దుకోవాలి అట్టా మామీద పడితే ఎట్టా అని తగువు పడ్డ. అతగాడు  ఒక నవ్వు నవ్వి జనం అనుకున్నదే నిజం చేసేద్దామా అని అడిగాడు. నాకు గుండె లటుక్కు మంది. నా మనసులో కూడా ఏ  మూలనో  ఆయనంటే  ఇష్టం ఉండబట్టేమో ఏమి మాటాడ లేకపోయా,  సిగ్గేసి అక్కడి నుండి పారిపోయి వచ్చేసా. తర్వాత మా ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందనిపించింది తప్పో ఒప్పో అనే ఆలోచన లేకుండానే మా మధ్యన  సంబంధం మొదలయ్యింది .

నూర్ కడుపున బడి ఆర్నెల్లు వచ్చిందాకా మా అమ్మీ కి కూడా తెలియదు. జనం అనుకుంటా ఉంటే  ఒట్టి కారు కూతలు  అనుకున్నాకదే ! పెళ్లి జేసుకోవే అంటే బహెన్ షాదీ అయినాకే అని జెప్పి నువ్వు ఇట్టా జేసినావే! నేను నలుగురిలో తలెత్తుకుని ఎట్టా బతకాలే! అని అమ్మీ మొత్తుకుంది  అబ్బాజాన్ ని తల్చుకుని  ఏడ్చింది

నేను దైర్యంగానే ఉన్నా ! మాధవ పెండ్లాం, ఆమె బంధువులు గోల చేసారు కిరాయి మనుషులబెట్టి  నన్ను చంపించబోయారు. అప్పుడు మాధవ కాజాబీ కి ఏమైనా అయితే నేను మీకు దక్కను అని. వాళ్లకి గట్టిగా చెప్పాడు .
షాదీ కాకుండా నేను ఏడూ నెలల కడుపెసుకుని తిరుగుతుంటే అమ్మ మంచానపట్టింది. మాధవ  అమరావతి గుళ్ళోకి పోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఆ సంగతి తెలిసిన  ఆళ్ళ జనం అంతా   గుడి కాడ  కాపేసారు. సంపాయించిన ఆస్తి ని తాత  ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మొత్తాన్ని ఆయన నలుగురు పిల్లల పేరున బలవంతంగా రాయించుకున్నారు. మీరు అడగక ముందే ఆ పని చేద్దామనుకున్నాను. మీరే మీ ఒంకర బుద్దులని బయట  పెట్టుకున్నారు అని జెప్పి ఆయన ఆ ఇంటిని ఒదిలేసి  ఒంటిగా నా ఎదురుగా  నిలబడ్డాడు

నేనేమైనా తక్కువ తిన్నానా?  నిన్ను నేను పెండ్లి చేసుకోవాలంటే నువ్వు ముసల్మాన్ మతం లోకి మారాలి మతం మార్చుకుంటే  పెండి చేసుకుంటా అని చెప్పినా మతం మార్చుకుంటే మూడు సార్లు  షాదీ  చేసుకోవచ్చని   ఉపాయం  చెప్పినా. మారు మాట్టాడకుండా మతం మార్చుకుని నన్ను మా పద్దతిలోనే షాదీ చేసుకున్నాడు. నాకోక విలువని పెంచాడు . ఆ క్షణానే నేను కాజాబీ అన్న సంగతే మర్చిపోయాను మాధవ పెండ్లాన్ని అయ్యాను.   మా ఇంట్లో   రాముడి పటం  కృష్ణుడి  పటం పెట్టి దణ్ణం పెట్టుకున్నాను

షాదీ అయిన రోజునే చెప్పాను మా ఇంట ఒక్క రోజు కూడా నిదర చేయవద్దు . రోజు మీ ఆవిడ,పిల్లలు ఉన్న ఇంటికే  పోవాలని.  నా కండ్లలోకి ఒకసారి చూసి  అలాగే జాబీ ! అన్నాడు నన్ను ఆయన జాబి, జాబిలీ అని పిలిచేవాడు.

 పెళ్ళి నాడు నేనన్న మాటని నేనెప్పుడూ మార్చలేదు,  ఆయన  కూడా  నేను గీసిన గీతని జవదాటలేదు ఆరేళ్ళు గడిచాయి ఆయన సంపాదనలో నేను చిల్లి కాణీ  కూడా ఎరగను ఏ పండగకో పిల్లలకి కొత్త బట్టలు తప్ప.   నేను యాపారం చేసుకునే నేను బతుకుతున్నాను, నా చెల్లెలికి షాదీ  చేసాను.

అయినా నాకు సొమ్ము పెట్టేస్తున్నాడని  ఆమె సాధింపులు మనుషులకి  మనసు అక్కర్లేదు, ఆమెకి.సొమ్ము కావాలి నగలు కావాలి, చుట్టపక్కాల  ఇంటికి వెళ్ళినప్పుడు మొగుడు కావాలి,. ఎప్పుడో ఒక రోజు ఆలస్యంగా వెళ్ళినా ఊరుకోదు సాపిచి సాపిచ్చి చెవులు మూస్తదని షాపులో పని చేసే గుమాస్తాలు చెపుతుంటారు. మాధవ ఏ రోజు కూడా ఇంటి దగ్గర ఇట్టా  జరిగిందని చెప్ప నే  చెప్పడు . చాలా గొప్ప మడిసి.  చెపుతూ చెపుతూ ఊపిరి తీసుకోవడానికి ఆగింది

 మా ఇద్దరి మధ్య పదిఏండ్లు   వయసు తేడా ఉంది అట్టాగే మేమిద్దరం మొగుడు పెండ్లాం అన్నమాటే కాని రోజు వదలకుండా  కావిలించుకుని పడుకున్నామా! ఇదిగో ఈ మార్కెట్లోనే కళ్ళ నిండా చూసుకుంటాం కరువు తీరా మాట్లాడుకుంటాం.  ఆయన ముప్పొద్దులా  నమాజ్ కి వెళితే నేను రోజు   దేవుడి పటాల ముందు దీపం  ఎలిగిస్తా    మా మతాలూ ఏరే కాని మేము మనుషులం  ఏరే కాదు అట్టాగే  మా మనసులు ఒకటే ! అంటూ ఆగిపోయింది గొంతులో దుఖం  అడ్డుపడి

కాంతమ్మ జాలిగా చూస్తూ ఉంది . " ఇదిగో మూడు రోజులైంది ఇంటికి వెళ్లి.  మొన్న రాలేదు, నిన్న రాలేదు, ఇయ్యాల రాలేదు. ఆయనని చూడకుంటే నాకు ముద్ద దిగదు.  నీళ్ళుఅయినా  మింగలేను. ఎందుకు రాలేదో గుబులుగా ఉంది. ముదనష్టపు దాన్ని నా కోసమే గదా  ఆయన ఎందరితో మాటలు పడ్డాడు. రోజు ఇంటికాడ గరళం మింగినట్టు ఎన్ని చేదు  విసయాలు మింగుతున్నాడో ! ఎందుకయ్యా అన్నేసి మాటలు పడతావు నన్నొదిలేసి పోలేవా అంటే  ఎన్ని  కష్టాలు అయినా భరిస్తా గాని   నిన్ను నట్టేట్లో ముంచేసి  ఒంటి మనిషిని చేయలేను జాబీ"  అంటాడు ఇక చెప్పలేక, ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది

" కాంతమ్మా ! లెక్క చూసి డబ్బు ఇచ్చేసి సరుకు తీసుకుని ఈడ నుండి బేగీ  పోమ్మా ,అక్కని ఇంకా ఏడిపించకు "చెప్పాడు  నరసింహ .

" కాజాబీ ! మనసు మల్లె పువ్వు లాంటిదమ్మ . నలిగినా వాసన ఎక్కడికి పోద్ది . మీ ఇద్దరు మంచాళ్ళు . మీ బాధలు భగవంతుండు చూస్తూంటాడు తొందరలోనే అన్ని సర్దుకుంటాయి నాలుగునాళ్ళు ఓర్చుకో తల్లీ ! నీకేమన్నా కష్టాలు కొత్తా!?  అంటూ రిక్షాలోకి సరుకు అంతా ఎత్తుకుంది. జాగ్రత్త తల్లి! బిడ్డలున్నారు ఆళ్ళ ముఖం చూసి ఓర్చుకో "  అని చెప్పి వెళ్ళింది.

కాంతమ్మ వెళ్ళాక కాజాబీ వచ్చి మార్కెట్ బయట ఉన్న చెట్టు క్రింద కూర్చుంది . అక్కడ నుండి చూస్తే మార్కెట్ కి వచ్చీ పోయే వాళ్ళు అందరూ కనబడతా ఉంటారు మాధవ ఇయ్యాలన్నా రాకుండా ఉంటాడా! తను రావాలి  నా కంటి నిండా చూసుకుంటే కాని మనసు నెమ్మది పడదు అనుకుంటుంది మళ్ళీ అంతలోనే ఇంట్లో అక్కేమైనా గొడవ పెట్టుకుందేమో ! మాధవ తనేపు  తొంగి చూడకుంటే తను పేనాలతో  ఉండగలదా? మనసులో మనసులా, శరీరంలో శరీరంలా కలిసిపోయాక ఆయన్ని చూడకుండా ఈ ఎడబాటు ని ఎట్టా తట్టుకునేది ? నా ప్రాణమే నువ్వయ్యా మాధవా ! ఒకసారి వచ్చి కనబడి పోకూడడా ఆణువణువూ ప్రేమ ఉప్పొంగగా మూగగా రోదిస్తూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ కూసుంది. నరసింహ వచ్చి  ఎంత సేపు ఈడ కూసుంటావ్ ! రా అక్కా లోపటికి పోదాం " అనేదాకా వచ్చేదారివైపే చూస్తూ కూర్చుంది . నరసింహ  మరొకసారి పిలిచిన పిలుపుతో  ఈ లోకంలో పడి  నెమ్మదిగా లేచి షాప్ లోకి పోయి కూర్చుంది

మరునాడు కాంతమ్మ తెల్లవారుఝామున మార్కెట్ కి వచ్చేసరికి గేటు లోనే ఆమెకి కబురు అందించారు .
కాజాబీ చచ్చిపోయింది  అని." అయ్యో ! బిడ్డా  ఎంత పని చేసావే !"అనుకుంటూ కాంతమ్మ కూలబడింది ఆమెకి కాసిని నీళ్ళు తాపించి కూర్చో బెట్టారు

" అయ్యా, నేను ఆ బిడ్డని చూడాలి  వాళ్ళ ఇంటికి తీసుకుని పోండి "  అని అడిగింది . "వాళ్ళ ఇంటికాడ శవం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు పోయారు  కాజాబీ అక్కడే చచ్చిపోయింది " చెప్పారు .

కాంతమ్మ హాస్పిటల్ కి వెళ్ళింది ఒళ్లంతా కాలిపోయి గుర్తు పట్టడానికి వీలు కాకుండా ఉన్న కాజబీ శవాన్ని చూసి పెద్ద పెట్టున ఏడ్చింది ." ఏం జరిగి ఉంటాదో ? నిన్నే కదా నేనన్ని మాటలు చెప్పి పోయాను  ఇంతలోనే మిత్తవ మింగి పోవాలా  " అని ఏడుస్తూ  అక్కడే ఉన్న నరసింహని   చూసి " ఏం  జరిగింది  నరసింహా"  అని అడిగింది .

నరసింహ చెప్పాడు  "మాధవ బావ కోసం మధ్యానం దాకా  ఎదురు చూసి ఇక ఆగలేక  ఆ ఇంటికి వెళ్ళింది . బావ పంచలోనే ఉయ్యాల  బల్లపై పడుకుని ఉండాడు. అక్కని చూసి లేచి కూర్చుని "నువ్వెందుకు వచ్చావు జాబీ " అని అడిగాడు

"నిన్ను చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడైనా ఉండానా ! రాయ్యా ! మార్కెట్ కి పోదాం " అని అక్క మాధవ బావ చెయ్యి పట్టుకుంది

అంతలో ఆయన భార్య వచ్చి  " ఆయన రాకపోయినా విడిచి పెట్టవా ?  నా కాపురానికి శనిలా దాపురించావ్, ఏం మందు పెట్టావో, ఏం  చేసినా నీయేపు చూడకుండా కట్టడి చేయలేకపోతున్నాం ఒంటి నిట్టాడిలా పాతుకుపోయావు కదే ! ఏళ్ళ తరబడి చూస్తూ ఊరుకుండి  పోయాం ఇక నీ ఆటలు సాగనీయం,  ఆయన ఇక మార్కెట్ వైపుకే రాడు.  నాగపూర్ లో ఆఫీస్ పెట్టాలి,  ఆయన అక్కడే ఉంటాడు నీ దారి నువ్వు చూసుకో లేదా ఇంకొకడిని తగులుకో " అని నానా మాటలంది.  మాధవ బావ కోపంగా  ఆమెపై చేయి ఎత్తాడు.  అక్క ఆ  చెయ్యట్టుకుని కొట్టకుండా  ఆపింది. ఆ చేయి పట్టుకునే  బావని బయటకి తీసుకు రాబోతుంటే "నువ్వు ఆ తురక దాని ఎమ్మట వెళితే నీ నలుగురు పిల్లలు చచ్చినంత ఒట్టే ! " అంది ఆమె .

అంతే ! మాధవ బావ చెయ్యి వదిలేసి అక్క  తిరిగి చూడకుండా  మార్కెట్ కి  వచ్చేసింది.

" బేరం చూసుకో నరసింహ"  అంటూ ఇంటికెల్లిపోయింది.  పోద్దుగూకేటప్పటికి  వంట ఇంట్లోకి పోయి ఒంటిపై  కిరసనాయిల్ పోసుకుని ఆగ్గి  అంటించుకుందట.   ఒళ్ళంతా కాలిపోయిన అక్కని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక మాధవ బావ వచ్చాడు ఆయనని చూసాకే ప్రాణం వదిలింది. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ జరిగింది  చెప్పాడు

"అయ్యో బిడ్డా ! ఎంత పని చేస్తివి ! నీ బిడ్డలకి ఇప్పుడు దిక్కెవరన్నది ఆలోచించలేకపోయావే " అంటూ కాంతమ్మ ఏడుస్తూ కూర్చుంది

హాస్పిటల్ వాళ్ళు  మాధవతో సంతకాలు పెట్టించుకుని  కాజాబి శవాన్ని  ఇచ్చారు . కాజాబీ శవాన్ని  ఇంటికి తీసుకు వచ్చారు. ఆమె తల్లి, చెల్లి దుఃఖాన్ని ఎవరు ఆపలేక పోతున్నారు. ఆ రోజు  మార్కెట్ జనం అంతా కాజాబీ ఇంటి ముందే ఉన్నారు.  మాట కొంచెం కఠినం కాని మనసు బంగారం ఏదో వాళ్ళ ఇద్దరికీ జనాల నోళ్ళలో పడి నానాలని  ఉంది కాబట్టి అలా జరిగిపోయింది. ఎప్పుడూ ఆ ఇంటి ఆమెకి ద్రోహం చేయాలని చూడలేదు అన్ని హంగులు అమర్చి పెట్టినా , ఆస్తులన్నీ రాయించుకున్నా కూడా ఇంకా ఏదో ఇచ్చేస్తున్నాడని అతనిని  దూరం చేయబోయారు, ఆమెకి కాజాబీ బిడ్డల ఉసురు తప్పకుండా తగుల్తుంది అని  మాధవ భార్యని శపించారు .

మాధవ పిల్లలిద్దరినీ ఒళ్ళో కూర్చో బెట్టుకుని  మౌనంగా కన్నీరు కారుస్తూనే ఉన్నాడు  కాజాబీ పుట్టినప్పటి నుండి ఆచరించిన వాళ్ళ మత సంప్రదాయం ప్రకారంగానే ఖననం చేసారు. అక్కడి నుండి ఇంటికి వచ్చి బిడ్డలని కాజాబీ అమ్మీ చేతిలో ఉంచి గోడకి వ్రేలాడ దీసిన ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు.   కాజాబీ అతను కలసి దిగిన ఫోటో  అది.

"జాబీ ! నువ్వు ఉన్నప్పుడే కాదు నువ్వు లేకుండా పోయాక కూడా నేను ఈ ఇంటిలో నిదర చేయడం లేదు ఆ ఇంటికే  వెళుతున్నాను నీకు ఇచ్చిన మాటని ఈ మాధవ ఎప్పుడూ దాటడు" అని చెప్పి  తల ఒంచుకుని వెళ్ళిపోయాడు. అది చూసిన కాజాబి అమ్మ చెల్లి మరింత ఏడ్చారు .

 తెల్లావారుతూనే కాజాబీ ఇంటికి వచ్చాడు మాధవ.  అక్కడ ఏమేమి  జరగాలో చూసుకుంటున్నాడు.  మతాచారం ప్రకారం  చేయాల్సిన విధులు అన్నీ ఏ లోటు లేకుండా చేయించడం చేస్తున్నాడు కానీ ఒక్కరితో కూడా మనసు విప్పి మాట్లాడ లేదు.ఎవరు ఏం  చెప్పినా మీ ఇష్టం, ఆలాగే చేద్దాం అంటూ ఉండేవాడు. మార్కెట్ జనం, తెలిసున్నవాళ్ళుపిల్లలని తన కూడా తీసుకు వెళతాడా లేదా అని ఎదురు చూస్తున్నారు.

కాంతమ్మ అయితే ముఖం మీదే అడిగేసింది  "మాధవా !  పిల్లలని ఏం  చేస్తావు  నువ్వే భాద్యత తీసుకోవాలి వాళ్లకి అన్యాయం చేయకు " అని హెచ్చరించింది  .

అలా నలబైరోజుల కార్యక్రమం  అయ్యేదాకా  మాధవ ప్రతి రోజు  కాజాబీ ఇంటికి వచ్చి వెళుతూనే ఉన్నాడు . నలబయ్యోనాడు అన్ని కార్యక్రమాలు అయిపోయి   అందరూ వెళ్ళిపోయాక బిడ్డ లిద్దరికీ తన చేతితో అన్నం తినిపించాడు . ఆ చేత్తో తను రెండు ముద్దలు తిన్నాడు. అలాగే కాజాబీ ఫొటోనే చూస్తూ జాబీ ! నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదూ నేను మాత్రం ఉంటాననుకున్నావా? అనుకుంటూ వరండాలో ఉన్న స్తంబానికి జారగిలబడ్డాడు. కాసేపటికి నరసింహ వచ్చి బావా! నీ కోసం మీ బామ్మర్ది వచ్చాడంటూ పిలిచాడు.  ఎంతకీ పలకని అతనిని కదిల్చి చూస్తే  చలనం లేదు.  అతని ప్రాణాలు ఎప్పుడో తన జాబీ ని వెదుక్కుంటూ వెదుక్కుంటూ వెళ్ళిపోయాయి .

కొన్ని మానసిక  బంధాలు అంతే! ఎవరు విడదీయలేనివి, అక్కని వెదుక్కుంటూ  బావ కూడా వెళ్ళిపోయాడు అని ఏడుస్తున్నాడు నరసింహ.

  (చిత్రం : శివ ఆర్ట్స్ .. కానూరు, విజయవాడ ) 

23 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

Touching story వనజ గారు. కొన్ని బంధాలంతే!This stiry sure will hant me for some time. Great work!

Sharma చెప్పారు...


కొన్ని మానసిక సంబంధాలు గత జన్మల వాసనలు , అవి అలా కొనసాగుతూనే ఉంటాయి.
వాటిని ఆప ఎవ్వరి తరమూ కాదు . చక్కగా వ్రాశారు .

అజ్ఞాత చెప్పారు...

మింగుడు పడలా

మురళి చెప్పారు...

మంచి ప్రయత్నం వనజగారూ.. ఆపకుండా చదివించారు సాంతం... రాస్తూ ఉండండి...

సామాన్య చెప్పారు...

katha baagundi. kaanee aa modati bhaarya pravarthana motham thappe andaamaa ?naakenduko ee rendu bhaaryala,bharthala kathalni gurinchi ye vaipu maatlaadaalannaa kashtamgaa vuntundi . yento ee maanava sambandhaalu ani !

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి కథ రాసారు వనజ గారు! లోకులేన్ని అనుకున్నా, బంధానికి కట్టుబడి... వారి ప్రేమ పవిత్ర మైనదని నిరుపించుకున్నారు. మంచివారి జీవితాలు ఇలాగే ముగుస్తూ ఉంటాయి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు.. కథ బావుంది అంటే నేను వ్రాసిన విధానం కి అనుకుంటాను . ఇక కథ లోని విషయం సంగతికి వస్తే వివాహితుడు /వివాహితురాలు జీవితంలోకి మూడవ వ్యక్తి ప్రవేశం ఎవరికైనా బాధాకరమే! కానీ చాలా సార్లు పదే పదే ఇలా జరుగుతూనే ఉంటాయి సచ్చీలురైన,సహృదయులైన వారి జీవితాలలో కూడా వారి వారి ప్రమేయం లేకుండా ఆకర్షణ లకి లోనయి తప్పనిసరి బంధంలో మునిగిపోతారు ఎవరి బాధ గురించి తక్కువ చేయడానికి రచయితకి వీలుకాదు .కాని ఎవరినో ఒకరిని తక్కువ చేయాలి కాబట్టి "జాబిలి " అలా రూపుదిద్దుకుంది కానీ ఒక్క విషయం బిడ్డలపై కన్నా ఆమెకి మాధవ పైనే ప్రెమ. అందుకే అలా జీవితాన్ని ముగించుకుంది

మీ స్పందనకి నాకు విలువైనది ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు మీ లోతుగా మీ స్పందన ఉంటుందని ఆశించాను :) ఇదీ విలువైనదే అనుకోండి :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు. అవునండి కొన్ని బంధాలు మానసికమైనవే ! అందుకే ఆ కథ అలా ముగిసింది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలె మాస్టారూ .. మీ స్పందనకి ధన్యవాదములు ఈ ఒక్క ముక్క చాలు కథ పై మీ అభిప్రాయం చెప్పడానికి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళీ గారు .. మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది .ధన్యవాదములు . వ్రాసే ప్రయత్నాన్ని మమ్మురం చేసానండీ! ఈ వ్యాపకం నాకు ఇష్టంగా ఉంది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు .. మీ అభిప్రాయానికి,కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు . వైవాహిక జీవితంలో భార్య భర్త బంధం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని భ్రమ పడకూదదండి ఏమైనా జరగా వచ్చు . ఎవరిపై ఎవరికీ ప్రేమ కల్గునొ.. అది ఎంత తీవ్రమో ఎవరు చెప్పగలరు చెప్పండి ? అందుకే ఈ కథ ఇలా ముగిసింది . థాంక్ యు సో మచ్ అందే!

Karthik చెప్పారు...

chaalaa baavundi-:)

lalithag చెప్పారు...

సామాన్య గారి వ్యాఖ్య, దానికి మీ జవాబు, ఇంకొన్ని మీ సమాధానాలు కలిపి మొత్తానికి నేను చెప్పదల్చుకున్న దానికి మాటలనిచ్చాయి. ఇటువంటి విషయం పై ఇప్పటికి కొంత స్పష్టత వచ్చింది నాకు. ముందు, వారు "చాలా మంచి" వారై ఉండవచ్చు. 'ఐనా' ఆకర్షణకి లోబడ్డారు. వారు మానవ మాత్రులే అని ఎలా ఒప్పుకోవలసి వస్తుందో అక్కడే ఇటువంటి 'ప్రేమా అసాధారణమో అమూల్యమో కాదు అని కూడా ఒప్పుకోవాలి. భార్య పాత్రకి బాధ కలగడం సహజం, తప్పు లేని విషయం. జాబిలి, భార్యా, ఆమె వైపు వారి గురించి వాళ్ళు ఓర్వలేకపోయార్న్నట్లు మాట్లాడడం తనని సమర్థించుకోవడం, అంటే అను చేసినది ఒకరికి బాధ కలిగించే విషయమే అని ఒప్పుకోవడమే అవుతుంది, పైకి ఇంకోలా కనిపించినా. మేఘ సందేశం కానివ్వండి, జాబిలి కానివ్వండి, తన్‌హయీ కానివ్వండి, నేను చెప్పదల్చుకున్నది ఇదేననుకుంటాను. మాధవ, జాబిలుల ప్రేమని 'పవిత్రం', లేదా నిజమైన ప్రేమ ఇలా వర్ణించి దానిని ఒక మెట్టు పైన ఉంచవలసిన అవసం లేదు. అలా నిజ జీవితంలో అవుతుందని ఒప్పుకోవాలంటారా, ఒప్పుకోక ఏం చేస్తాం, అలా జరుగుతుంటే. కానీ పెళ్ళి చేసుకున్నందుకు భర్తనుంచైనా, భార్యనుంచైనా ఒక commitment expect చెయ్యడం తప్పు కాదు, పెళ్ళికి కట్టుబడి పెంచుకునే ప్రేమ తక్కువ, ఇలా 'అనుకోకుండా' కలిగే ప్రేమ ఎక్కువ కాదు. ఇంతకంటే ఎక్కువ చెప్తే నేను చెప్పదల్చుకున్నది విపరీతమయ్యి వికటించే ప్రమాదముంది. అందుకని ఆపేస్తున్నాను. ఇప్పటికైనా ఇది చెప్తున్నది నా మనసులో నాకు ఇటువంటి విషయంలో సామాన్య గారు చెప్పిన దానికి కొంచెం అటూ ఇటూగా సమానమైన ఒక సంఘర్షణ, ఇటువంటి విషయాల పై నేను ఎటు నిలబడతాను అని తెలుసుకోవాలనే కుతూహలం పై నాకు ఒకింత స్పష్టత కలిగినట్లనిపించి ఆ ఆలోచనని ఇలా record చేసుకుంటున్నాను.
అన్నీ చెప్పాక వనజ గారూ, మీ కథనం మాత్రం చాలా బాగుంది, పాఠకులలో కరుణ రసాన్ని కలిగించేలా ఉంది. నేను హర్షించలేని విషయం కానీ మీరు కథ చెప్పిన తీరు మాత్రం అభినందనీయం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

lalithag గారు మీ స్పందనకి ధన్యవాదములు . జాబి ,మాధవ ప్రేమ గొప్పదని నేను చెప్పడం కాదండి జరిగిన విషయాల ద్వారా మానని ఇంప్రెస్స్ చేసే విషయం అది

వివాహితుడు పెళ్లి పాతికేళ్ళ తర్వాత కూడా ప్రేమలో పడటం "ఓల్గా " మానవి " నుండి ఇంకా అంతకు ముందు నుంచి ఉంది . నాకు ఆ విషయం నచ్చదు . కానీ నచ్చనివి జరగకుండా ఆపడానికి మనకి అవకాశం ఉంటుందా? ఉంటె అది ఎంత శాతం అన్నది ఆలోచించాల్సిన విషయం .

"జాబిలీ హృదయం " ఒక కథ అది అంతే! నేను జాబాలిని సపోర్ట్ చేస్తూ వ్రాయలేదు ఆమె గరించి ఆమె మాత్రమే చెప్పింది. ఇలాంటి ప్రేమలు,ఇలాంటి పాత్రలు కూడా ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశ్యం

మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎగసే అలలు .. గారు థాంక్ యు సో మచ్

హితైషి చెప్పారు...

కథ ని చాలా చక్కగా వ్రాసారు . కళ్ళ ముందు కదిలి వెళ్ళిపోయింది. చాలా సేపు ఆలోచిస్తూ ఉంది పోయాను. మాధవ -జాబిలీ ల బంధం సామాజికంగా సవ్యం కాకపోవచ్చు ఇలాంటి వారు ఉంటారని చెప్పడం మాత్రం మానవ జీవితాల్లో మరొక పార్శాన్ని చూపించారు అనిపించింది కథ నాకు బాగా నచ్చింది అభినందనలు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వైష్ణవి.... కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు . మనచుట్టూ అనేకానేక మాధవ - జాబి లు ఉన్నారు . అందరూ వీరిలా ఉండకపోవచ్చు ఇక్కడ తప్పొప్పుల సంగతి చెప్పడం లేదు . జాబీ ని దృష్టిగా పెట్టుకుని కథ నడిచింది . కథ నచ్చినందుకు మరో మారు ధన్యవాదములు

జ్యోతిర్మయి చెప్పారు...

కథనం చక్కగా వుంది వనజ గారు. ఆపకుండా చదివించారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు

సంభాషణలు "కోట్స్" లో లేకపోవడం ని నేను గమనించలేదండీ . ఇప్పుడు సరిచేసుకుంటాను . థాంక్ యు సో మచ్

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Excellent!

శశి కళ చెప్పారు...

kadha chala bagundhi.all the best